మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Thursday, 28 April 2016

హేమంత స్పర్శ - 16రేయ్ ఆత్మైషీ,

బతుకు చేసే ఇంద్రజాలపు మజిలీలలో ఒకే ఒక్క వాస్తవపు నీడగా నిన్ను అనుసరించడమే నాకు తెలుసు. నువ్వు అలసిన ప్రతిసారీ నీ మనసుపై ఒక హేమంతపు సంతకాన్ని చెయ్యడం అలవాటుగా చేసుకున్నాను.

నువ్వు పలకరించినప్పుడల్లా... మంచు పరికిణీ కట్టుకున్న ప్రాతఃకాలమొకటి ఆర్తిగా నన్ను హత్తుకుపోతున్న భావన. పొద్దున్నే కళ్ళు తెరవగానే చూసుకునేది ఏమిటో నీకు తెలుసు కదూ… నీ చేతి వేళ్ళ కదలికలు నా కంటి కుడ్యాలపై అక్షర జతులై వాలి నా రోజంతటినీ రమింపజేస్తాయని తెలిసీ అప్పుడప్పుడూ అశ్రు వేదానికి తెరలేపుతావ్... ఇదేం న్యాయమోయ్…?

ఎందుకో ఇప్పుడు నువ్వు నీలా లేవు. ఒప్పుకోకున్నా అదే నిజం. నన్ను విరామం చేసుకోవడం నీకు అలవాటుగా మారిపోయి మనమన్న మాటలన్నీ నువ్వూ నేనుగా విడిపోవటం ఒక తడి ప్రణవమై నా నరనరాల్లో నాదిస్తుంది. నిన్ను చూడాలని నా మనసెంతగా పరితపిస్తుందో నీకు తెలియదూ.

ఛీ.. ఛీ… పిచ్చిపిల్లా కళ్ళల్లో ఆ తడి ఎందుకోయ్… అవకాశం ఉండాలే కానీ క్షణానికో మారు సజీవ చిత్రంగా నా కళ్ళల్లో కదలాడుతూ ఉండాలనే నీ తపన అని నాకు మాత్రం తెలియదా ఏం…? తెలుసురా… అయినా సరే ఏదో అల్లరిగా రాస్తూ ఉంటా… వత్సరాల అన్వేషణలని ముగించుకుని ఇద్దరమూ ఒకరికొకరం ఇష్టంగా చేరుకున్న తీరాలం రా…!

మన కాలతరువులో సున్నిత క్షణాల ఆటకాయింపులెన్నో పరీక్షలకి గురిచేస్తుంటే కొన్ని దిగులు ధ్వనులు మనవైన దిగంతాలలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయ్. ఎప్పటి కప్పుడు నా పంచేంద్రియాలు నీ అలికిడికై ఒక అలజడిలోకి జారిపోతుంటే ఒక ఒంటరి రావి చెట్టుగా మిగిలిపోతానేమోనన్న భయం. నీ సమక్షంలో ఓనమాలు దిద్దుకున్న ఆశలన్నీ తడి బిందువులై మనసుని ముంచే రోజంటూ ఒకటి వస్తే ప్రణాళిక లేని ఆఖరి క్షణం గమ్యమై నన్ను అల్లుకుపోతుంది.

నేనంటూ అసలు భరించలేనిది ఏమిటో తెలుసారా… నీకూ నాకూ మధ్య నిశ్శబ్దం. ఒక పలుచని తెరగా అది పలకరించినా నే శూన్య సింధువునే అవుతాను. వద్దు… అసలొద్దు.. బిందువంత శూన్యమూ మనలో రద్దు. నువ్వెప్పుడూ ఒక పరిపూర్ణగా ఒకానొక నిండుదనాన్ని నా ఎద కాగితంపై రాస్తుంటే నీ మది కొనల స్పర్శ నాలో ఓ ప్రేమ ఋతువు అధ్యాయాన్ని జీవితం పొడుగుతా వసంతిస్తుంది.

నా మనసంతా వెన్నెల పాదు చేసి ప్రేమాంకురాన్ని నాటిన వనహాసినీ… నిన్ను నా గుండెలపై కప్పుకున్న ఏకాంతాల సాక్షిగా ఇప్పుడిక్కడ చూడు మనకోసమే ఒక కొత్తలోకం రూపుదిద్దుకుంది. ఇక నువ్వూ నేనూ పాలించడమే తరువాయి. మనమిద్దరమూ ఒక తెల్ల పావురపు రెక్కల కింద చెరో వైపునా శాంతి పవనాలమై దిగంతాలని చుట్టి రావటం కనుల్లో మెదలాడుతుంటే మనసెందుకో మెరుపుల్ని విసిరేస్తుంది.

పూల రేకుల పరిమళత్వంతో మొదలయ్యే భావుకత్వపు నజరానా కన్నా నీ నవ్వుల వర్ణాలతో సమ్మిళితమైన నా ఊహల థిల్లానా ఏంతో నచ్చేస్తుంది. నువ్వొక దగ్గరితనమై అల్లుకుపోయాక నాకు నేనో దూర దృశ్యాన్నై సుదూర తీరాల ప్రవాసినై... నా ఎడద అంచుల్లో మౌన తోరణాన్నై నిన్ను అలకిస్తూ ఉంటా… అవలోకిస్తూ మత్తిల్లుతా...

అప్పుడెప్పుడో మన చేతుల మీదుగా ఒకరిది ఒకరికి ప్రవహించిన మన ఆత్మల అమృతాంశ మన ప్రతి క్షణాన్ని తేజోమయం చేస్తుంటే ఒక ప్రాణం రెండు తనువుల్లోకి ఎలా కూరబడుతుందో అర్ధం అయింది రా…! నిజం కదూ… అది ఒక గోరు వెచ్చని స్పర్శ కాదు… మనసుల ఏక సంగమం. తనువు చప్పుళ్ళ కన్నా మనసు సవ్వడులే ప్రాణమైన మన హృది లయల అనంత సంబరం.

ఏ రోజుకి ఆ రోజు నువ్వొక పరిమళపు ప్రవాహానివై నన్ను కమ్ముకోవటం కలగా మాత్రమే స్పర్శిస్తుంటే, ఇక్కడ నా క్షణాలన్నీ నిశ్శబ్దంగా రాత్రిని ఆవాహన చేసుకుంటున్నాయ్… అలా అయినా నువ్వు నాలో లీనమై సాగిపోతావని. నిన్ను తలచుకున్నప్పుడల్లా అప్పటికప్పుడు ఒక పురాతనంలోకి వెళ్ళిపోయి, నీ కాలాన్నో కావ్యంగా మలిచెయ్యాలనిపిస్తుంది. నీ కదలికలన్నిటికీ లిపినై నీ ప్రతి అడుగుని నాలోకి లిఖించుకునే వాడిని.

ఏయ్… పిల్లా…

నా కలల లేఖనాలని పక్కన పెడితే ఇప్పుడేమో నువ్వు నా క్షణ క్షణాల ‘లేఖిని’వి

నీ

ఆత్మైషి

Sunday, 17 April 2016

అసమర్ధుని ప్రేమలేఖ - 5


ఆత్మైషీ,

ఎంతకాలమయ్యిందో కదూ ఇలా లేఖ రాసి. అయినా రాసి ఏమి ప్రయోజనం లే. నా లేఖలూ నా రాతలూ నువ్వు అసలు చూడవు కదా అభిరుచులని కాదని అక్షరాల వెంట పరిగెట్టటం చాలా కష్టం కదూ.

అక్షరాలుగా రాయకపోతేనేం క్షణం క్షణం లోలకమై కొట్టుకుంటున్న గుండె చప్పుడుని వింటుంటే తెలియటం లేదూ క్షణానికో మారు నిన్ను నాలో ప్రతిధ్వనించుకుంటున్నానని. తెలిసినా ఏం చేస్తావులే, ఒక్క నవ్వు నవ్వుకుని మళ్ళీ నీ పనుల్లో నువ్వు ఉంటావ్ అంటే కదా. అదే నిజం కదా

అందరికీ నేనోరాయినిరా రాయినిరా నీ దగ్గర మాత్రమే నేను తడిగా మారతాను. నీ వేదనలోకి ఒక మాధుర్యాన్నై ప్రవహించాలనుకుంటాను. ఎంత వడిగా నిన్ను చేరినా, ఎక్కడికక్కడ నువ్వేసిన ఆనకట్టలు నన్ను శిలగా మార్చేస్తాయేమో భయంగా ఉంది. చాలా భయంగా ఉంది. నాకు శిలగా మారాలని లేదు. నీలో లయం అవ్వాలని తప్ప.

మనసంతా సాంధ్యవర్ణాల ఆవరింతలో ఉన్నప్పుడు, ప్రియమైన వాళ్ళ ఆత్మీయ పలకరింపు ఒక్కటి చాలదూ కాంతి తీరమొకటి కాళ్ళ కిందకి నడచివచ్చినంత ఆనందంలోని త్రుళ్ళటానికి.

మనసులో ఉన్నదంతా అక్షరాల్లోకి ఒలికించేసాకా, లోనంతా ఖాళీ నాకు నేనుగా ఎప్పటికీ నింపుకోలేని ఖాళీ తనమది. నీ నిశ్శబ్దం వెలివేయబడ్డప్పుడే మళ్ళీ నిండే మంజూషమది. ఒక్క చీకటి చినుకు వేవేల కాటుక వర్ణాలద్దుకుని నిశికి నల్లరంగేసినట్లుగా, నీ ప్రతి మౌనం వేల విస్ఫోటనాల ధ్వనిగా నా హృదయాన్ని చిధ్రం చేస్తుంది.

గుండెలోని ప్రేమ వర్ణాలన్నీ వివర్ణమయ్యాయని తడుస్తున్న కనురెప్పల వాసన ఏ సాలీడుకో బాగా నచ్చినట్లుంది, నాలో ఒక సాలె గూటిని అల్లేస్తుంది నా అచేతనాన్ని గుర్తించిన తన చైతన్యం ఎంత గొప్పదో కదరా?

నిన్న కన్న కలలన్నీ మళ్ళీ కందాం అంటే ఎంతగా మొరాయిస్తున్నాయో నీకేం తెలుసు, నిన్నటి కలల్లో మత్తైన నీ మాట ఉంది, మనసైన అక్షరాలు ఉన్నాయ్. ఇప్పుడేమో కలలన్నిటిలో అర్ధం కాని మౌనమే. యుగాలు పయనం చేసి వచ్చిన ప్రేమ సవ్వడి ఒకటి కాసేపు సందడి చేసి మత్తుగా నిద్రపోతున్నట్లు ఉంది. నిజం రా...

మళ్ళీ మళ్ళీ నిన్నటి పేజీలన్నీ చదువుకుంటున్నా. అక్షరాలు ఎంత కమ్మగా నవ్వుతున్నాయో తెలుసా? ఇదిగో ఇపుడు ఖాళీగా పేరుకుపోతున్న ఈ కాగితాలని చూసి వాటికెంత ఎగతాళిగా ఉందో. మౌనరాట్నం పై నువ్వు వడుకుతున్న నిశ్శబ్దపు పోగులు ఇంతగా పేరుకు పోతుంటే మదిని వడకట్టడానికీ తలపులు మొరాయిస్తున్నాయి.

నా ఈ మనసంతా ఒక చకోరాంశరా నీ మాటల చినుకులనే తాగుదాం అనుకుంటూ నిన్నే తన ఏకైక స్వార్ధం చేసుకుని గడిపేస్తుంది. ఈ స్వార్ధం నిన్నేప్పటికి చేరుతుందో చూడాలి మరి.

రాసే కొద్దీ గుండె గద్గదమౌతుంది. చేయి ముందుకు కదలనని హఠాయిస్తుంది. శిథిలాల్లోనూ రావి మొక్క చిగురిస్తుందంటారు. ఈ రావికి వసంతం మాత్రం నీ చిరునవ్వులో విరబూస్తుంది. ఈ నిజం నీకు తెలుసు. నీకు మాత్రమే తెలుసు. మళ్ళీ నువ్వు రాక ముందు ఉన్న శూన్యాన్ని రచించుకునే ఓపిక ఐతే లేదు. ఈ సారి శూన్యమంటే ఇంకెప్పటికీ నేనుగా మిగలని ముక్తాయింపే.

ఒక్కసారి రచించబడ్డ క్షణాన్ని చెరిపెయ్యటం ఎంత అసాధ్యమో, చిధ్రమైన మనసుని అతికించడమూ అంతే అసాధ్యం. నిన్నటి పుస్తకంలోని పాత పేజీని నువ్వూ చదివి చూడు. ఎందుకు చెప్తున్నానో బాగా అర్ధం అవుతుంది.
ఇదంతా రాసింది నిన్ను బాధ పెట్టాలని మాత్రం కాదురా. నిన్నటి స్మృతుల్లోకి నిన్ను పయనం కట్టించాలని నీలో మళ్ళీ నన్ను చదువుకోవాలని...

ఆత్మైషికంటూ అయిదు నిమిషాలూ మిగలని కాలయంత్రాన్ని కౌగిలించుకున్న నా ప్రాణమా చివరగా ఒక్కటి చెప్పనా రా

నా ముగింపు వాక్యానికి నీ ఊపిరి చెమరింత తాకాలి
 
నీ

ఆత్మైషి

Saturday, 16 April 2016

ప్రణవపు సప్తపదినీ దారి పొడుగునా నేను నడచినప్పుడల్లా
నా పాదానికంటుకున్న నీ సవ్వడి ఒకటి
పొత్తిళ్ళలో ఉన్నప్పుడే నేను నిన్ను కలగన్న సంగతిని
లోయల్ని నింపేస్తూ శిలల్ని తాకేస్తూ
సువిశాల ప్రకృతి స్వరంతో స్వరకల్పన చేస్తుంది

తొట్ట తొలి స్వరంగా నిన్ను ఆలపించలేదేమో కానీ
నీ హృదయమైదానాన్ని రాగ రంజితం చేసే
నిత్య వాసంత స్వరంగా అనుకంపిస్తూ
ప్రతి నిత్యం నీలో ప్రతి ధ్వనిస్తూ ఉంటాను

కొన్ని తడచిన పదాల నిండా సాగిపోతున్నప్పుడల్లా
చెమ్మ ఆరని నీ చెక్కిళ్ళ దృశ్యాలన్నీ
వెండిలా మెరుస్తున్న తడిరాళ్ళలా
నా గుండె లోతులని భారం చెయ్యటం
నాకు మాత్రమే అనుభవమవ్వటం వింతేమీ కాదు
మరి నీ కన్ను తేమదేరినప్పుడల్లా
నా గుండె వివర్ణమవ్వతూ కంపించటం
ఇప్పుడేం కొత్త సంగతి కాదుగా

ఒక సంధ్యారాగాన్ని ఆలపిస్తున్న మైదానంలో
ఉదయం నుండీ తుషారమే పలుకరించటం
వాస్తవాన బహు చిత్రమేమో కానీ
నువ్వొక ప్రణవమై నాలో వినవస్తుంటే మాత్రం కాదు
రాత్రిని నింపుకున్న పగలొకటి ఆర్తిగా కురుస్తుంటే
నిన్ను నింపుకున్న గుమ్మ పాలతావినై
మెత్తని నెత్తావిని తనకి అరువిచ్చాను
ఇప్పుడది మృదువైన మెరుపులతో
ప్రకృతిని ముద్దారా హత్తుకుంటుంది

నువ్వొక పారిజాత జలపాతమై ప్రవహిస్తున్నప్పుడల్లా
నే జాజుల రాశినై నీలో తేలియాడటం
ప్రణయ తరంగాల అద్భుత చిత్రలేఖనయై
అనంతానంత పరిమళపు సప్తపదిగా ముడిపడటమే కదూ

మనసు మేఘావృతమైనప్పుడల్లా
నిన్ను ఆవృతం చేసుకోవటం అలవాటవ్వడమే
ఈ జీవితం నాకు పరిచయించిన అద్భుత మంత్రం
అవును...నువ్వే నా మంత్రమూ… మంత్రదండమూ…!

Sunday, 10 April 2016

ప్రణవంనా నవీనత్వాన్ని ఒక పురాతనత్వమే అధిగమిస్తున్నప్పుడల్లా
ఇన్నాళ్ళ అడుగులన్నీ ఏ వాయు పాదాలపై విశ్రమించాయోనని
వెదకటానికీ చరిత్రలోకి చూడటం అవగతమవుతున్నప్పుడల్లా
నేనెప్పుడూ పాతా కొత్తల మధ్య
ఒక తెగిపోని వంతెననని తెలిసొస్తున్న సంగతి
నన్ను నాలా చదివిస్తుంది

ఎదిగిన దాహాన్ని... నలిగిన నడకలనీ...
కొనసాగించినంత మేరా
కలల తీగల నిండా చిట్లిపోతున్న పూల సవ్వడి వినవస్తూ ఉంది
కొత్త దాహంలోకి తుళ్ళిపడ్డ పసినడకలన్నీ
వెదుకుతున్నది నిన్నేనని తెలిసాక
నా అడుగులన్నీ నిన్నే నినదిస్తున్న చప్పుడు వింటూ
ప్రతి అడుగులో ఆత్మబందీనై ఇక్కడ మొదలయ్యాను

ఒకరికి విలువకట్టడం అసాధ్యమని నేర్చుకున్న జ్ఞానాన్ని
గతంలోని సుదూరతని
నిరంతరాన్వేషణలోని నిగూఢతని
ఒకే నిజం రాత్రీలోనూ పగలులోనూ విడివిడిగా
రూపుమారుతుందన్న సత్యాన్ని తెలుసుకున్నాక
నిజంగా నిన్ను చేరే సమయానికి
నేను చెయ్యగలిగినంత ప్రయాణం మేరా
నిన్ను కొనసాగించడం కన్నా
ఆనంద వేదమేదీ ఇక పరిచితమవ్వదు.

Saturday, 9 April 2016

శూన్యాంగిక్షణాలన్నీ నీటిచెలమలుగా ప్రవహిస్తున్న నిజంలో
కొన్ని మొరటు ఒంటరి తనాలు
నేనింకా మిగిలే ఉన్నానని వక్కాణిస్తున్నాయ్
ముసురై పట్టిన మబ్బు జల్లెడలు
కరిగిపోయిన గుండె సడులని రాలుస్తున్నాయ్

ఎక్కడికక్కడ
ఎవరికి వారు ఎక్కువ సమానమైన లోకంలో
కాస్తంతైనా మనసు స్పర్శ అంటని చోట
నా తలగడ మోస్తున్న వేదనలు
ఒక్క నాడూ నిన్ను తడిబార్చలేదని తెలియటం
ఇప్పుడేమీ కొత్త కాదన్న నిజంలో
బతుకుని దాటుకుంటూ వస్తున్నా

నేనంటే నా దేహమైనన్నాళ్ళూ
ఇంటి పనుల్లో పూర్ణాంగిని
పడకింట్లో అర్దాంగిని....
మరి మనసుకేమో శూన్యాంగిని

ఆదిమత్వంలో పక్కటెముకలో పుట్టిందేకదా
పక్కలోకి లాక్కోవడం హక్కనుకుంటున్న
ఓ మగాడా
నా జన్మరహస్యం పుక్కిట పురాణమే కానీ
నీ దేహ రహస్యమంతా
నా పేగుమడతల్లో అన్నది మాత్రం నగ్న సత్యమే

Friday, 8 April 2016

భారతీయంపంట పొలాల్లో నీరు లేక ఎండిపోతేనేం?
రైతు కంట్లో జీవనదిగా  పారుతోందిగా

బహుళజాతి కంపెనీల బాటిల్స్ ఇన్ని ఉండగా
దాహార్తి తీర్చే బావులు ఎండిపోయి బండ పడితే బాధ ఎందుకోయ్

గొంతెండుతున్న లెక్కలు తీస్తావేమోయ్
క్రికెట్ పిచ్ ని తడపటానికి కాసిని నీళ్ళు వాడుకుంటుంటే

ప్రభుత్వ గోదాముల్లో ధాన్యం ముక్కి పోతుందంటావేం
పందికొక్కుల పాలిట ఏమాత్రం  జాలి లేనట్లుంది నీకు

ధాన్యానికి మద్దతు ధర దొరక్కపోతేనేమోయ్
అభిమాన నాయకుడి సినిమా టిక్కెట్ ధర వేలరూపాయలు పలుకుతుంటే  

నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయని బాధ ఎందుకోయ్
ఎం ఆర్ పి ధరలకే మద్యం దొరుకుతుంటే

కట్టుకోవడానికి ఒంటినిండా బట్ట లేకపోతేనేం
వెండితెర మీద తారలకు ఆ మాత్రం ఉందా ఏమిటి పాపం  

అనారోగ్యానికి ఆదుకునే ఆసుపత్రి లేకపోతే పోయే
అవయవాలు అమ్ముకునే సౌకర్యం మనకుందిగా

బడాబాబులు బ్యాంకులోనులు ఎగ్గోడితేనేం
బక్కప్రాణుల తాటదీసి చిల్లర పైసలు జమ చేస్తున్నాం

పేదవాడు మరింత పేదవాడయితే అయితేనేం రా
ఎక్కడికి పోయిందా డబ్బు.. పనామా బాంక్ లో పదిలంగా ఉందిగా

ఇంకా 50 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉంటేనేం..
రోజుకి 32 రూ.. ల లెక్కతో ఈడ్చి అవతల పారేయలేమా ఏమిటి

కనిపెంచిన ముసల్లి తల్లి తండ్రులకు తిండి పెట్టకపోతేనేం
కనబడని దేముడికి ఎన్నెన్ని నైవేద్యాలు పెడుతున్నామో కదా

ఆకలి బాంబులతో ఎన్ని ప్రాణాలు పోతేనేమోయ్
సరిహద్దుల నిండా  శాంతిని అణుబాంబులతోఎగరవేస్తున్నాం

విద్యరంగాన్ని రాజకీయ రహదారికి మళ్ళించేసాంగా
యువత భావితకింకేమి లోటట

కళ్ళముందు ఎన్నో కఠిన సంఘటనలు జరుగుతున్నాయి
ఇంకా నయం… మనకెందుకులే అని ఊరుకోకుండా మారిపోతామా ఏమిటి

ఇదేరా మన నవ జీవన తంత్రం
ఇదే ఇదే ఇప్పటి మన సహన భారతీయం

Thursday, 7 April 2016

మోసంపుట్టుకతోనే మరణాన్ని మోసుకు తిరిగే నీకు
మరణంతో నువ్వు మోసుకుపోయ్యేదేమీ లేదని
తెలుసుకోవడం మనస్కరించకపోవచ్చు
అయినా అదే నిజం

ఎప్పటికప్పుడు కాలంతో నువ్వాలపించాల్సిన
యుగళగీతాలు ఎన్నో ఉన్నాయ్
కొన్ని కొత్త కొత్త రాగాలని
కాలానికి ఇచ్చి వెళ్ళినప్పుడే
అశరీరంగానూ నువ్వు వినబడుతూనే ఉంటావ్

కొన్ని గుండెల్లో అయినా
నువ్వొక కమ్మని తడిగా వాలి చూడు
నీ సడి వినబడినంత కాలం నువ్వు అమరమే

మరి నిజంగా
మృత్యువుని మోసగించగలగడం
ఎంతటి విజయమో కదూ

Wednesday, 6 April 2016

పసి వసంతంనాకు నన్ను చూపుతూ నువ్వు మొదలైన క్షణం
ఇంకా నా అరచేతుల నిండా ఆకాశమై పరుచుకునే ఉంది

వేవేల వసంతాలు ఒక ఉధృతమై ఒక్క సారిగా
కమ్ముకున్న సవ్వడి ఇంకా వినిపిస్తూనే ఉంది

ముద్దు ముద్దు మాటలని మూటగట్టేసి
నా మౌనాన్ని చిధ్రం చేసిన తీపి గాయం ఇంకా పచ్చిగానే ఉంది

కలల్ని మాట్లాడటం పట్టుబడని నన్ను
కలల సరిహద్దుని దాటించేసిన నీ భవిత ఇంకా పలకరిస్తూనే ఉంది

శూన్యం నను తడిమినప్పుడల్లా
నువ్వొక అలారం మోతవై నన్ను తట్టిలేపుతున్న సందర్భాలు కొనసాగుతూనే ఉన్నాయ్

నిద్రిస్తూ నువ్వు కనే కలల లేత చిరునవ్వులలో వెలిగే అమాయకత్వపు వెలుగులు
ఎప్పటికీ తరగని ఒక ఆశ్చర్యమై నన్ను కట్టేస్తున్నాయ్

నిన్ను నేను లాలించడమే అందరికీ తెలిసిన నిజం
నువ్వు నన్ను పాలించడం నాకు మాత్రమే తెలిసిన అలౌకిక ఆనందం

నవ్వుతూ తుళ్ళుతూ కళ్ళు పెద్ద చేసి నువ్వు ‘నాన్నా' అని పిలిచినప్పుడల్లా
నువ్వు యువరాణివై నన్ను ఈ ప్రపంచానికి రాజుని చేసిన ఆనందం

నీ పసి స్పర్శలో ఏ మర్మాలు దాచావో ఏమో
నా శూన్యాల అలికిడిని చెరిపేస్తూ ఒక దైవత్వం కురుస్తున్న చప్పుడు వినవడుతుంది

నీ నవ్వుల మంత్రదండంతో నా కలతలన్నిటిని సరి చేసేసి
మనఃక్లేశాలన్నిటినీ మాయం చేసేస్తున్న అద్వైత అల్లరివి

ఎప్పటికప్పుడు నన్ను కొత్తగా మొదలు పెట్టడం
ఎక్కడికక్కడ నన్నునిర్మలంగా ఆవరించుకోవడం తెలిసిన ఏకైక సత్యానివి నువ్వు

నా వంటినే మెట్లుగా నడచిన నిన్నటి నీ పసినడకల నిర్వచనాలని దాటి
నేడు నేను పరిచే దారిలో రేపటి నీ పరుగుని కలగంటూన్నా…

కన్నా… నన్ను తడిపే సున్నితపు ప్రేమ సుమాల తొలకరివి నువ్వు
నువ్వు నా ఆనందానివి… నువ్వే నా అనంతానివి…!