మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Thursday, 28 July 2016

విశ్వం పుట్టుక


ఇప్పుడు ప్రపంచాన్ని చూసే కిటికీని మూసేశాను
ఇక చూడటానికి బయట ఏమీ కనపడదు
లోనంతా గాఢాంధకారం
వేరే దారిలేదిక
నన్ను నేను దీపంగా వెలిగించుకోక తప్పదు
నాలోని నేపథ్యమంతా రాత్రినే సంపూర్ణ కాలంగా
ఆవాహన చేసుకున్న తిమిర మంజూషమే
నేనిప్పుడు చీకటి మినహా ఇంకేమీ లేని ఒంటరి దీవిని
వెలిగించుకోవటానికి ఇక్కడ అగ్గిపుల్ల లేదు
నిప్పురవ్వ పుట్టించే చెకుముకి రాళ్ళూ లేవు

చెయ్యగలిగిందేమీ కనిపించ లేదు
చీకటిని చదువుకోవటం తప్ప
చదివే కొద్దీ తెలిసింది
అలవాటు పడ్డాక
చీకటిలోనూ కళ్ళకి వెలుగే గోచరమవుతుందని
ఆ వెలుగులో
శూన్యాన్ని అశూన్యం చేస్తూ ఒక ప్రణవం
దాని వెంబడే సన్నని వెలుగు రేఖల స్పర్శ
కాంతి ప్రవాహపు చిరు సవ్వడి
నక్షత్ర మండలాల భ్రమణం…
……………………………….
అనంత నిశ్శబ్దం నుండి
విశ్వం పుట్టుక అనుభూతి అయ్యింది

అప్పుడే తెలిసింది
చీకటంటే జ్ఞానాన్ని కప్పేసిన అహపు వెలుగని
మనిషంటే విశ్వాన్ని నింపుకున్న మనఃదేహమని
ఒక మూసివేతలో మరింత వెలికితీత దాగుందని


Tuesday, 19 July 2016

నైసర్గికంజీవితపు జమాఖర్చుల పద్దులు చూసునప్పుడల్లా
కొన్నిగుర్తులలా తడితడిగా తడుముతూ ఉంటాయ్

తెరలు తెరలుగా విషాదాన్ని బయట వేస్తూ
ధ్వజస్తంభమెక్కిన పతాకలా
చీకటి పూలని రాలుస్తూనే ఉన్న నవ్వొకటి
దీపాన్ని రెపరెపలాడిస్తుంది
ఆశా నిరాశల పార్శ్వాలని ఎత్తి చూపుతూ

పాపిటలో ఒదిగిన సింధూరమంత పవిత్రంగా
ఒక కన్నీటి సెలపాట గుండెని తడిపేస్తుంటే
కరుడుగట్టిన మౌనాన్ని ఛేదించటం ఎంత కష్టమో
తెలుపుతూ కనపడని సంకెలలు కొన్ని...
జీవితాన్నే బందీచేస్తాయ్

అనాది ఋతువులన్నీ అతలాకుతలమై
ఎండుటాకులే శిథిలసాక్ష్యాలుగా
శిశిరమొక్కటే చిద్విలాసం చేస్తుంటే
చెలిమి పంతాలేసుకున్న చెమరింతలు
చెక్కిళ్ళపై తెగిపడుతుంటాయ్

అద్దంలో కుడి ఎడమలుగా తారుమారైన ప్రతిబింబాలని
నిజాలుగా భ్రమిస్తూ
అంతరంగపు సంతోషాల నైసర్గికాలని విస్మరిస్తూ
వాక్యాంతాలన్నీ ప్రశ్నార్థకాలని అలంకరించుకుని
బతుకు పొడుగూతా కొనసాగుతూనే ఉంటాయ్

మరిప్పుడీ తడి క్షేత్రంపై
విజయానికి నువ్వొక నిర్వచనం కావాలంటే
తిమిరాంగణాల సరిహద్దులో
మొదలెట్టిచూడిక రణం
ఓడితే వీరమరణం గెలిస్తే కన్నీటి దమనం
ఇక కాలపు గమనమంతా వసంతవనపు సరిహద్దు రేఖపైనే

Sunday, 17 July 2016

నిప్పుకణికఎంతటి సముద్రమూ
ఒక్క చుక్కతోనే మొదలై ఉంటుందన్న
సత్యాన్ని అలవాటుగా పక్కకి నెట్టేసి
జ్ఞానాల లెక్కల తర్కాలలో
మేథావులంతా తకరారు అవుతుంటే
దేన్నీ చివరికంటూ చూసిన
ఆనవాలేదీ దొరకని లోకాన
ఎటుతవ్వినా
ఎడతెగని సిద్ధాంతాల
మంజూషాలే బయల్పడుతున్నాయ్

ఇటు చూస్తే, తీరాలు మాయమైపోయి
లంగరు వేయడానికి నేల తగలక
తెరచాపని ఏమిచేసుకోవాలో
చేరాల్సిన గమనమేదో
అంతుతెలియని నావికుడిగా
మనిషి ఒక ఒంటరి అంకెలా
మారిపోయిన ఘడియలు
కొనసాగుతూనే ఉన్నాయ్

ఇప్పుడు గొంతు విప్పి చూడు
కోట్ల గొంతుకలు మౌనంగా ఉన్నప్పుడు
గొంతు విప్పి చూడు
నీ శబ్దం
ప్రతి ధ్వనిస్తూనే ఉంటుంది అప్రతిహతంగా
అగ్ని ధనుస్సువైతేనే
నిప్పుకణికని సంధించవచ్చన్న నిజంగా నువ్వు మారటం
ఒక కొత్త జననాన్ని పరిచయం చెయ్యటమే


Tuesday, 12 July 2016

వచనం


నాతో నిప్పులని మింగించావ్
మంచుశరాలని నాపై సంధింపచేశావ్
ఏ ఒక్క క్షణమూ
నా ఎదుట తిన్నని దారి లేకుండా చేశావ్
శిక్షలేకుండా శిక్షణ రాణించదని అర్ధమయ్యేలా చేశావ్

ఒక గీతవై లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నావ్
నువ్వొక యుద్ధతంత్రానివై
నన్ను విరుచుకుపడమంటున్నావ్
నన్ను యోధుణ్ణి చెయ్యటానికే
నువ్వు రణరంగాన్ని రచించావని తెలుసు నాకు

పాంచజన్యాల శంఖారావాలేమీ వినిపించని
సుతిమెత్తని నాగరిక యుద్ధక్షేత్రంలో
ప్రపంచాన్ని యథాతథంగా ఆమోదించడానికి
నన్ను సన్నద్ధం చెయ్యటం కోసమే
నువ్విదంతా చేశావని తెలుసు

అయినా కానీ,
నాతో నువ్వున్నావన్న ఒక్క ధైర్యం ముందు
ఎన్నెన్ని యుద్ధాలు అసలే పాటి?
ఎవరికోసం ఎవరూ ఒక్క దీపమూ వెలిగించని
తిమిరార్ణవంలో నన్నే దీపంగా మలచుకున్న
ఆత్మశక్తినిచ్చిన అనంత వచనానివి నువ్వు

Thursday, 7 July 2016

నలుసే


హేతువుకందనివన్నీ మిథ్యలని తలవటం
లోకానికిప్పుడు అలవాటు కావచ్చేమో కానీ
అల్ప మేథస్సుతో
అఖిలాండాన్నీ గుప్పిట పట్టాననుకోవడం
ఎప్పటికీ వాస్తవమనిపించే ఒక చిత్తభ్రమే
ఇప్పటికి చేధించిన రహస్యం అణువు
ఇంకా అంతుపట్టని మర్మం ఆకాశం
నిజమే కదా…
రేపుకున్న సందేహాల వలయాన్ని దాటడానికే
జీవిత వలయం విలవిలలాడుతుంటే
మరి అనంతానంత కాలపు కొలతలో
నా నిడివీ… నీ నిడివీ ఎంతని?
నలుసే బ్రహ్మాండమనిపించేటంతే కదా

Sunday, 3 July 2016

వెన్నెల పత్రంఅంతు తెలియని శూన్యంలో
ఆవిరిగా మారిపోబోతున్నప్పుడు
ఖాళీ పాత్ర అనుకున్నది కాస్తా
పూర్ణకుంభమై నిండుగా నవ్వుతుంటే

వెన్నెల పత్రాల విస్తళ్ళలో
నీ మందహాసాల పంచభక్ష్యాలు
నా ఆకలిని హత్య చేస్తున్నప్పుడు
నాలోని దీనత్వాన్ని నిర్వీర్యం చేస్తూ
నీలో దివ్యత్వం అక్షయమవుతుంటే

నిశీధి వేసిన కారాగారపు గోడలన్నీ బద్ధలై
వెలుగాక్షతలని రాల్చిన సవ్వడితో
మరో తొలకరి మధురంగా తడుముతుంటే

ప్రేమవాసన ఎంత మైమరపుగా కమ్ముకుంటుందో
నిరాకారపు కాలానికే కాదు
ఊహాఖండాలని దాటివచ్చిన నీ ఊపిరి పరదాలని
శ్వాసగా కప్పుకున్న నా హృదయ క్షేత్రానికీ తెలుసు

గరళాలని గుక్కపెట్టుకున్న గతమంతా
అమృతాన్ని ఆరగిస్తున్న వర్తమానంగా
పలకరిస్తున్న పలుకొక్కటి చాలదూ
నువ్వు నా జీవితానికో పరిపూర్ణం అనటానికి…