1.
నీలో మరింత నువ్వు ఉన్నావన్న
నిజం
నీకింకా పరిచయమవ్వలేదు
నువ్వు కోరుకుంటున్న మెలకువ
నువ్వు కోరుకోవాల్సిన గొప్ప మజిలీ
…. నువ్వు
ఒక నిశ్శబ్దం నిన్ను
ఆవరించినప్పుడు
మొత్తంగా నిన్ను చదివి చూడు
లోపలంతా ఒకే ఒక్క వాక్యం ప్రణవిస్తూ
ఉంటుంది
ఈ జీవితం
నీకందించిన గొప్ప బహుమతి …
'నువ్వు'
అంటూ!
2.
ఊపిరిలోని రహస్యాన్ని దేన్నో
వేణువు స్వర పరుస్తున్నట్లు
అనిపిస్తుందనుకుంటా!
రేయింబవళ్ళ లెక్కలన్నిటినీ
నిశ్శబ్దం చేసుకుంటూ
తనని తాను
నిశ్శేషం చేసుకుందామన్నట్లు
శ్వాసని ఉగ్గబెట్టుకుని వింటుంది
కాలం
3.
ఎప్పటికీ ముగియని యుద్ధంలో
క్షతగాత్రుల దేహాల మాటున
నన్ను నేను దాచుకోవటం
మీరెన్నడూ తెలుసుకోలేరు…
4.
ప్రపంచాన్నేలే నా స్నేహితులారా , సోదరులారా !
జ్ఞాపకాలన్నీ మెత్తగా
విప్పుకుందాం రండి
ఇన్నేళ్ళ గుండె చెమరింతల్ని
మన నవ్వులతో తుడిపేద్దాం రండి
పాతికేళ్ళ జీవిత పోరాటాల అలసటని
అంబరానికి విసిరేస్తూ సేదతీరుదాం
రండి
మీరు వచ్చే యంత్రశకటాల చప్పుడు
కంటే
మీకోసం ఎదురు చూసే నా గుండె
సవ్వడే
ఎక్కువ శబ్దం చేస్తుంది...
అది వింటూ వచ్చేయండి మరి.....
5.
నీ ఇంటి గోడ పక్కగా ఉన్న చెట్టు
ఒకటి
తన కొమ్మలని
పక్కింటిలోకి వాల్చుతుంది
ప్రకృతికి
తనదీ పరాయిదీ అంటూ
భేధభావం లేదన్న పాఠాన్ని
నేర్పుతూ