మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Tuesday, 27 August 2013

ఎచ్చట చూసినా నీవే

చందమామ చందనాలు పంచుతున్న వేళలో
తొలి వెన్నెల కిరణం నా హృదయం చేరెనే
మల్లె మొగ్గ మరువపు రెమ్మ జతకట్టిన వేళలో
తొలి పరిమళం  నా మనసుకు తాకెనే

నా కన్నుల కాంతుల్లో తొలి వెలుగు నీవులే
నా ఆశల పందిరిలో తోలి అడుగు నీదిలే
నా ఆధరాల దరహాసం తుదికంటా నీవేలే
నా హృదయాన మధుమాసం నీ తోడుగానే
నా ఎదలోని మంత్రం నీ నామధ్యానం
నా దరిరారు ఎవరూ నీ సన్నిధి లోన
నిడురన్నది నను చేరనంటున్నది
రెప్పవాల్చితే నీ రూపు కరుగుతుందని
మరచి పోయానులే నాకంటూ ఓ  మనసుందని
తెలుసుకున్నానులే అది నీకు జతగా చేరిందని

నా భావనలో నీవు నేను ఒకటై అంబర వీధిలో తేలియాడగా
నా తలపులలో నీ రూపే  నిండి తొలిప్రేమనే జనియింపగా
కలలో నైనా ఎడబాటెరుగక  నిన్ను తలుస్తూ
నా మనసుతో  నీ ఊహలే  ఊసులాడుతుండగా
నా వడిలో నీ వలపులనే బంధించగా
ఉదయం మొదలు సాయం సంధ్య వరకూ

ఎచ్చట చూసినా నీవే ఇంకేవీ కానరావే

Monday, 26 August 2013

ఉంటా తుదికంటా నీ ఊపిరిగా

ఎదలో పలికే అనురాగమా
మదిలో విరిసే అనుబంధమా
హృదయ వీణనే మీటిన సంగీతమా
ప్రేమయే గీతమై పలికిన ప్రాణమా

నీ సిగలో పువ్వును నేనై
నీ నుదుటన కుంకుమ నేనై
నీ ముక్కుకు పుడకను నేనై
నీ చెవి లోలాకులు నేనై
ఎప్పుడూ నీతో ఉండనా
నా ప్రాణం నీదై నిలుపనా
నీ పెదవుల భావము నేనై
నీ చెక్కిలి కాంతిని నేనై
నీ కంఠ హారము నేనై
నీ మందహాసపు మత్తును నేనై
ఎప్పుడూ నీ మోమున నిలువనా
నీ శ్వాసగా నేనే ఉండనా

నే చేతికి గాజులు నేనై
నీ కాలికి అందేను నేనై
నీ పాదపు ధూళిని నేనై
నీ తనువూ తపనను నేనై
క్షణక్షణమూ నీవై ఉండనా
కలకాలం నీ గుండెల్లో కొలువుండనా
నీ హృదయపు తంత్రిని నేనై
నీ మది పాటకు పల్లవి నేనై
నీ ఎద గూటిలో స్వరమును నేనై
నీ గజ్జెల సవ్వడి నేనై
ఉంటా తుదికంటా నీ ఊపిరిగా 

Friday, 23 August 2013

ప్రేమ గీతిక

ఓ ప్రియతమా నా ప్రాణమా
చిరుసిగ్గులా సింగారమా 
వరూధినీ వయ్యారమా 
మల్లెల మాలలోని మరువమా
ఎద ఆశల శృంగారమా
మది నవ్వుల మకరందమా

ఆలకింపుమా చెలీ నా ప్రేమ సందేశం
వినిపించనా సఖీ నా ప్రేమ సంగీతం
నీ కోసం తపించే నన్ను కాదనవని
నే రాసా మన కోసం ప్రేమ స్తోత్రం
అది కావాలి మన జీవితాల్లో సుప్రభాతము
కాబోయే ప్రేమికులకి కావాలి మన ప్రేమ ఆదర్శము
ఏనాడు రానివ్వను మన ప్రేమకు అపజయం
రాబోయే కాలంలో మన కధే ఓ ప్రేమ గ్రంధం
చరిత గా చెపుతారు మన ప్రేమకావ్యం
ఎడబాటు లేకుండా వేస్తున్నా నీకు ప్రేమ బంధం

ఎన్నెన్ని జన్మాలకైనా నీవు నా దానివే కావాలని
జన్మ జన్మాలలో నీవు నేను తోడూ నీడగా ఉండాలని
కలలెన్నో కంటున్నా ఇది కధ కాదని చెపుతున్నా
తారకలే దిగివచ్చినా మన జంట విడరాదని
అప్సర లే వరించినా నా హృది నిండిన రూపం నీదని
వేలమార్లు చెపుతున్నా... నా ఊపిరి నీవేనంటున్నా
మనసైనా నీ కోసం నా ప్రాణమైన అర్పిస్తా
సొగసైన నీ జతగా శాశ్వతంగా నేనుంటా
నిను తలుస్తూ నే రాస్తున్నా ఈ ప్రేమ గీతిక
అది కావాలి మన జీవితాల్లో ప్రణయ దీపిక 

Thursday, 22 August 2013

నేను మనిషి గా మారితే?

నేనునా కుటుంబంనా స్నేహితులునా చుట్టాలు నా కులం నా జాతి నా మతంనా భాష నా వీధినా ఊరునా మండలం నా తాలూకానా జిల్లానా ప్రాంతంనా రాష్ట్రం 

ఇవన్నీ దాటాకే వస్తుంది కదా మనలో... ‘నా దేశం’ అనే భావన. 


నా దేశం అన్న భావన నే జాతీయ వాదం అంటారే... అలాంటి జాతీయ భావం రావటానికి మనం ఇన్ని ‘నా’ లను దాటాల్సి వస్తుంది కదా... అసలు వీటన్నిటికన్నా ముందు నేను ‘మనిషిని’ అన్న విషయం ఎందుకు మర్చిపోతున్నాం? ఎన్ని జాతీయ వాదాలు ఒక్క మానవతా వాది ముందు నిలబడ గలవు?


ప్రతి వాడు పక్క వాడి నుండి ప్రమాదం పొంచి ఉందనుకునే అంత ప్రమాదకరమైన పరిస్తితుల్లో, తన నీడనే తను నమ్మ లేక శత్రువేమో అనుకునేంత కల్లోలం లో ప్రపంచం నిండి పోయి ఉంది. అసలు మనిషిని మనిషిగా చూసే మానవతావాదం ఈ విశ్వమంతా వ్యాపిస్తే ఈ ప్రాంతీయవాదాలు, జాతీయ వాదాలు నిలబడగలవా?

Sunday, 18 August 2013

అసమర్ధుని ప్రేమ లేఖలు - 3

ప్రియా...


ఊహలకి రూపం లేదు. అదే ఉంటే ఈ భువి పై వెలసిన ప్రేమ దేవతవి నీవే అయి ఉండేదానివి. తలపులకి మరణం లేదు. తలపులకి మరణం ఉండి ఉంటే నీ తలపులు లేని క్షణాన నేను జీవించి వ్యర్ధం. 

నీ సన్నిధిన స్నేహితుడినై తిరుగాడిన గతమంతా నేడు స్వగతమై అనుక్షణం పలకరిస్తూ ఉంది. స్నేహితుడు స్థాయి నుండి సహచరుడు స్థాయికి ఎదగలేని నా అసమర్ధతను చూసి నన్ను నేనే కించ పరచుకుంటున్నాను.

నీ సాన్నిహిత్యం లోని నా గతమంతా పున్నమి వెలుగే. నీవు లేని నా బతుకంతా అంధకార బంధురమే. ఈ అంధకారం పోవాలంటే మరో జన్మ లోనే సాధ్యం కదా... దాని కోసం నా ఊపిరి ఆగిపోవాలి. మరుజన్మలో నైనా నా ప్రేమని వెల్లడించగలిగే ధైర్యం నాకు కలగాలి. అదే కదా నా ఆశ నా శ్వాస. 


Friday, 16 August 2013

సందె చుక్క వెలిగే వేళలో

చిట్టి బిందె చంకన పెట్టి
మూరెడు మల్లెలు తల్లో చుట్టి
కాలి అందెలు సవ్వడి చేయగా
వెన్నెల ఝామున వెండి బొమ్మలా ఏటి కెలుతుంటే
గుప్పెడు మనసున వలపులు రేగి
గుండెల్లో... నా గుండెల్లో మోగాయి కళ్యాణ రాగాలు
కాబోయే... కాబోయే మా పెళ్ళికవి సన్నాయి మేళాలు

పండువెన్నెల వెలుగుల్లో వెండి బొమ్మ తన రూపం
ప్రేమకాంతి చిగురించే ప్రణయ దీపమే తన నయనం
కోనసీమ గుండెల్లో గోదారి పరవళ్ళు తన కురులు
అరవిరసిన మల్లియలే తన నవ్వుల సిరులు
సందె చుక్క వెలిగే వేళలో దివ్యరాగం తానులే

ఉదయించే ప్రతికిరణం తనకోసమే వెదికేను
ఆ నీలాకాశం లో నిండుగ జాబిలి తానేలే
ఆ తళుకుల తారకలే తన చెలికత్తెలులే
దాచాడు ఆ బ్రహ్మ పసిడి నిక్షేపాలు తన చెక్కిళ్ళలోనే

తన కంటి నీరు నా గుండె కార్చు
తన చిరునవ్వుతోనే నా మనసున వెలుగు
నా కంటిపాపల్లోని తన రూపం
నాలోని ప్రేమకి రక్షణ కవచం
చీకటే దరి చేరదు నా తోడు తానుండగా
జాబిలికన్నా చల్లనిది తన వడి
మమతలు నిండిన చక్కని గుడి తన హృది
రెప్పపాటు క్షణమైనా తానులేక నాకు బతుకు లేదులే
చిన్ననాటి కలలో కూడా నా రాణి తానేలే
క్షణమైనా ఆగని నా హృదయానికి ఊపిరి నాలోని తన రూపమే 

Thursday, 15 August 2013

చెలి జ్ఞాపకం

ఏ మనసు నన్ను తలచిందో ఏమో
నా హృదయం పొలమారి పోతుంది
చెలి జ్ఞాపకం నా మదిని కమ్మిందో లేదో
నిదురన్నది నా దరి రాకున్నది
ఏమైందో ఏమో నా మదిలోన
తన తలపులతోనే తెల్లవారిపోతున్నది
మౌనమే తన భాషగా  ప్రేమయే తన  బాసగా
ముద్ర వేసింది నా హృదిలో

చిన్న నాటి ఆటల్లోన నా జంట తానని
మరపురాక ముందే మరులుగొంది నా మది
అపుడాడిన దాగుడు మూతలు మరువలేదో ఏమో
తన చిరునామా చెప్పక కలల్లోనే కవ్విస్తుంది
కనులు రెండూ నిదుర మరచి
వెదకుతున్నాయి తనకోసమే
నా చెలి జాడెక్కడో
ఇంతవరకూ ఈ జాగేమిటో

లేతవయసులో ఏటి వడ్డున కట్టిన
ఇసుకమేడలోన దాగిఉందా?
చిన్నప్పుడు చందమామలో  మేము చదివిన 
జానపదగాధల్లోని అదృశ్య రూపం తనకు ఉందా?
తొక్కుడు బిళ్ళ ఆడపిల్లల ఆట
నీకెందుకురా మాతో జత
అంటూ నన్ను ఆటపట్టించిన నేస్తాల
చిరునవ్వులలో తాను ఒదిగి పోయిందా?

Monday, 12 August 2013

వెన్నెల కుసుమం - 8

పిడికితంత నా హృదయం అంతా నిండి పోయిన నీ మీద ప్రేమని విశాలమైన ప్రేమ మందిరం లో ఎటు చూసినా మన ప్రేమ చిహ్నమే కనిపించే లాంటి అద్దాల గదిలో  ఎవ్వరూ తాకలేకుండా ఉండే పంజరం లోని చిలకలా కాకుండా కళ్యాణ వీణని మోగించే రెక్కలు వచ్చిన విహంగం లా స్వేచ్చగా ఉంచి దానికి రక్షణ గా పిల్లగాలి తెమ్మెరలనూ, గులాబీ రేకులని మరియు చందన సుకుమార లేపనాలని ఉంచి తరతరాలకూ మాయకుండా చెయ్యాలని ఉంది.

భవిష్యత్తరాల వారు ఈ అపురూపమైన ప్రేమ మందిరాన్ని గురించిన విశేషాలని ప్రేమికుల పాఠ్యాంశాల్లో చదువుకుని మన ప్రేమని ఒక అపురూపమైన ప్రేమ కధగా భావించి విఫలమైన ప్రేమ కధల సరసన కాకుండా విజయవంతమైన ప్రేమ కధా సంపుటాలలో మొదటి సంపుటి గా మన కధనే  ముద్రిస్తే... ఓహ్... ఆ ఆలోచనే అద్భుతం కదూ...

మాయదారి మనస్సు కదా... దానికేం దాని పాటి కది ఎన్నెన్నో కలలు  కంటూ ఉంటుంది.  అవన్నీ నిజం గా తీరినప్పుడు కలిగే ఆనందం నిజం గా అనిర్వచనీయం కదూ...

ఓ ప్రియా... సఖీ... చెలీ... హనీ... పిలుపేదైతేనేమి? నీ సడి చెయ్యని తలపులని నే తలచలేను. నీవు లేని వలపులు వల్లకాడే కదా నా మదికి? నీ ఊహలలోనే  తేలియాడే నా  ప్రతి క్షణం  నీకే అంకితం.

ఓ సఖీ... నిన్ను గురించిన ఊహల్లో ఉయ్యాల లూగుతూ అనుక్షణం నీతో నే ఉండాలని ఉంది. నీ కన్నా నాకు దగ్గర వారెవరున్నారు ప్రియా? నీ ప్రమేయం లేని నా జీవిత గమనాన్ని ఊహించ గలగటం నా మనసుకి సాధ్యమా?

ఎవరూ తోడులేక ఒంటరినై చీకటి గుయ్యారం లో తిరుగాడే నాకు నీ నయనాల కాంతుల వెలుగులలో  కనిపించిన మార్గం సప్త రధారూడుడై తిరుగాడే ఆ సూర్య భగవానుడి కిరణాల వెలుగుల లో నైనా కనిపిస్తుందా?

Friday, 9 August 2013

నా కళ్ళ లోగిళ్ళలో నిలిచింది నీ రూపు సంక్రాంతి ముగ్గులా...

         నా కళ్ళ లోగిళ్ళలో నిలిచింది నీ రూపు సంక్రాంతి ముగ్గులా
         నీ గుండె వాకిళ్ళలో పరచాను నా ప్రేమ పూల పాన్పులా
         నా ఎదలో నీ రూపం చేసింది తొలి సంతకం 
         ఇక ఏ జన్మకు చెరగని ప్రేమకు అది శ్రీకారం               

         నిన్నా లేదు మొన్నా లేదు నా గుండెలో ఈ అలజడి
         అంతకు ముందు ఎపుడూ లేదు నాలో ఈ ప్రేమ సవ్వడి
         కలనైనా ఎరుగనే ఇంతటి అందం ఇలనుందని
         ఏ క్షణాన చూశానో నిన్ను, క్షణమాగక నా మనసు నిన్ను చేరెనే
         తొలిచూపుతోనే వలచానో ఏమో, నీ తలపులతో నా మది నిండెలే
         నా కనులకు లేదే విశ్రాంతి నీ కలల తాకిడితో
         అలుపెరుగని నా మనసంతా నీ ఊహల ఉరవడియే
         ఏ వరములు పొందినానో నాకై నీవొచ్చినావు.
         ఏమి పుణ్యం చేసినానో నీ ప్రేమ నాకిచ్చినావు
         మండిపోయే నా హృదయంలో వెన్నెల పీఠం వేశావే
         కలలో ఇలలో ఎన్నడు చూడని సౌందర్యం 
        నా కన్నుల ముందర నింపావే                               

         కాళిదాసు ఊహల్లో, రవివర్మ కుంచెలో ఎనలేని అందం చూసి
         ఇంతటి సౌందర్యం ఇల లేదని ఇక రాదని అనుకున్నా
         కనులముందు నిన్ను చూసి కళ్ళు రెండు తేలవేసి
         నా అభిప్రాయం మార్చుకున్నా, ఈ అద్భుతం తిలకిస్తున్నా
         బ్రహ్మకే మరుపొచ్చిందేమో లేకుంటే భువిపైకి నిన్ను పంపుతాడా
         దేవేంద్రుడే చూసి వుంటే నీకోసం కుటిలయుక్తులు పన్నడా
         త్రేతాయుగమున నీవు పుట్టివుంటే శ్రీరాముడే నీ పతిదాసుడు అయ్యేనేమో
         ద్వాపరయుగమున నీవుండివుంటే శ్రీకృష్ణుడు రాధాకృష్ణుడయ్యేవాడా
         మన్మధుడే నిను చూసి ఉంటే రతి తలపులు తలచేవాడా
         ఏమి మాయ చేసినావో నా సర్వం నీవైనావు     

Thursday, 8 August 2013

హృదయ ఆలయం

నా హృదయాన నిర్మించానో ఆలయం
అందులో ప్రతిష్ఠించా నీ రూపం
ఇక నీవు నన్ను వీడి పోకుండా      

నా హృదయాన్ని చీల్చి చూస్తే తెలుస్తోంది నీకు నా మనసు
నీ నామ ధ్యానమే నా మనసంతా 
నా ఊహల్లో నే రాజు నీవు రాణివై గగనమంతా విహరించగా
మదినిడా నీ తలపులే తారాడగా
ఎద అంతా నీ రూపమే నిండి పోగా 
నా వలపుల రధసారధి నీవే 
నా తలపుల ప్రియనెచ్చెలి నీవే 
నా కంటి దీపం నీవైన వేళ 
చిగురంత మైకం కమ్మింది ఎదలో
నా చిన్ని హృదయం నీదైన వేళ 
ఓ మౌనరాగం పుట్టింది నాలో                          

గాలి నిన్ను తాకిందా నే కలవరపడతాను
నీవు నన్ను కాదంటే ఈ బ్రతుకే వద్దంటాను 
ఏడేడు జన్మల్లో నే నిన్నారాధిస్తాను 
కష్ట సుఖాలలో నీ తోడుగా నేనుంటా   
ఆకాశ హర్మ్యాన నీవుంటే 
భూమాత వడిలోన నేనుంటిని
కలువబాల చంద్రునికై ఎదురు చూస్తున్నట్లు 
నా జీవితంలో నీ రాకకై నేనెదురు చూస్తున్నాను  

Wednesday, 7 August 2013

గెలుపు

ఆహ్వానించు ఆహ్వానించు గెలుపైనా ఓటమైనా
పరిశ్రమించు పరాక్రమించి చావైనా బ్రతుకైనా
క్షణపు ఓటమే మరు క్షణపు గెలుపేమో
నిమిషపు గెలుపే జీవితాన మలుపేమో

ఓటమి గెలుపులతో అదృష్టం దోబూచులాట
తరువాత ఏమిటని మనసు ఊగిసలాట 
ఓటమైతే క్రుంగిపోకు తుది వరకు పోరాడు
గెలుపైతే పొంగిపోకు మరో గెలుపుకి అడుగులిడు
ఎందుకురా ప్రతి క్షణం ఓటమి భయం
అనుక్షణం భయమైతే బ్రతుకే భారం
నీకుంటే స్థైర్యం నీదేలే ప్రతి విజయం
లేదంటే ధైర్యం గెలుపన్నది దూరం

జననం కన్నా గొప్ప వరమా గెలుపు
మరణం కన్నా భయంకరమా ఓటమి
ఓటమి అయితే అన్న భయమే ఇక వృధా
గెలుపైనా ఓటమైనా ఎందుకు నీకు వ్యధ

గెలుపే పరమైతే ప్రతిక్షణం దరహాసం
ఓటమే లేకుంటే తెలిసేనా గెలుపు సుఖం
ఓటమికి ఓటమి తప్పదులే నీవెంటే ఇక విజయం
ఉన్నదా మరి ఆఖరి గెలుపు కన్నా సంబరం