అవును…
నువ్వన్నట్లుగా
ఆదీ నువ్వే… అంతమూ నువ్వే కావచ్చు
ఆదికీ అంతానికి మధ్యన నేను ఉన్నాను
దారి ఉండనీ లేకపోనీ
నా అడుగులు ఈ నేలనే ముద్దాడుతున్నాయి
నీకు నేను తెలియక పోవచ్చు
కానీ నా ఉనికి నాకు అందుతూనే ఉంది
నా ఊపిరి సాగినంత మేరా
నా ఉనికి వ్యాపితమయ్యే ఉంది
నువ్వనుకున్నట్లుగానే
నాకు ఏమీ తెలియక పోవచ్చు
నువ్వు ఎక్కిన ఎత్తులు నాకు అందక పోవచ్చు
నువ్వు చూసిన లోతులు నాకు తెలియకపోవచ్చు
నువ్వెళ్ళగలిగే ఏ చోటికీ నేను వెళ్ళలేక పోవచ్చు
అయితేనేం…
నా ఏమీ తెలియనితనమే
కనిపించిన ప్రతి దాన్నీ శోధిస్తూ
నాలో ప్రశ్నలు పుట్టిస్తుంది
ఒక ముగింపు లేని వాక్యంలోకి నిన్ను లాగుతూ
నీ అస్తిత్వపు ఉనికికే ముప్పుటిల్లేలా











