లోకాన్ని గోరువెచ్చగా మేలుకొలుపుతూ
ఈ ఉదయారుణపు స్పర్శ
పసి పాప నవ్వులాంటి తారలని
వేలాడదీసుకుంటున్న ఆ రేయి
ఏ జ్ఞాపకాలనో మోసుకుంటూ
బద్ధకంగా ముసురుకుంటున్న
ఒక ఆకు మెత్తని గాలి
వజ్రాలే ద్రవరూపమెత్తి నీటి దర్పణమై
ఆకాశాన్ని ఇముడ్చుకుంటూ సాగిపోతున్నట్లున్న
ఆ ప్రవాహ గానం
సృష్టి విధానాన్ని నినదిస్తూ
జంతు జాల పయనం
అంతా ఒక సవ్వడి…
ప్రకృతే తనకై శబ్దించుకుంటున్న
అనంత ప్రణవపు ఉరవడి
నీకు తెలియని నీ అహపు రహస్యమది
ఇదంతా ఇలా ఉంది కాబట్టే
నువ్విలా ఉన్నావ్
ఇవేమీ లేకుండా…
నీకోసమంటూ ఒక్క పలకరింపూ
మృగ్యమైన చోట
నీకు నువ్వు దొరకటమన్నది
సమాధానమిక పుట్టని ప్రశ్న











