Wednesday, 27 February 2013

వెన్నెల కుసుమం - 3


గ్రీష్మ ఋతువులో వేడి తాకిడికి మండిపోతున్న అభాగ్యునికి తొలకరి జల్లులు పన్నీటి జల్లుల్లా సేదతీర్చినట్లు నీవు నా దరి చేరి స్వాంతన కలిగిస్తావని నా ఆశ.
కోనసీమలో గోదారి గట్టున కొబ్బరి తోటల్లో  వెన్నెల రాత్రుల్లో నీవు నేను కలసి ఎన్నో ఎన్నెన్నో ఊసులాడాలని సంధ్యా సమయాన సాగరతీరంలో సాగరుని ధాటికి అరగిన రాళ్ళమీద మనమిద్దరం కూర్చుని ఉండగా గాలికి రేగే నీ ముంగురులను సవరిస్తూ సముద్రపు అలల తాకిడికి తడసిన నీ   పసిడి పాదాలను నా పెదవులతో స్పృశిస్తూ పచ్చని ప్రకృతిలో నీ వడిలో తల పెట్టుకుని పడుకుని నీ మోమును పలుకరించాలని ఎన్నో కోరికలు, ఎన్నెన్నో ఆశలు  --- అవన్నీ తీరేనా ...   
చల్లని సాయంత్రాన పిల్ల గాలుల పరిమళాలతో నీవు నేను చెప్పుకున్న ఊసులన్నీ విన్న చిలకా గోరింకలు వాటి సఖులైన మిగిలిన పక్షులకు చెప్పేనా...
చిరుగాలుల సవ్వడిలో ప్రేమ పక్షుల కిలకిలరావాలలో మన ప్రేమ రాగం వినిపించాలి.
పాలసంద్రం నుండి ఉద్భవించిన అమృతధారలో నీ శరీరాన్ని మెరుగు పెట్టినారా అన్నట్టున్న నీ శరీరఛాయను, సుధలు కురుస్తున్న నీ లేలేత చెక్కిళ్ళను చూసిన వెన్నెల రాజు సిగ్గు పడి తాను మబ్బుతెరల చాటుకు తప్పుకుంటున్నాడు.
ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చటి చెట్లు, తీగల్లా అల్లుకుపోయిన లతలు ఉన్నచోట పిల్లగాలి తెమ్మెరలు వీస్తున్నప్పుడు పులకించే వనసీమలలో  సెలయేటి గలగలలు వింటూ నీవు నేను ఆ సెలయేటిలో జలకాలాడి వంటి తడి ఆరమునుపే మన ప్రణయ కేళీ విలాసాలు పూలతలతో అల్లిన మంచెపై జరగాలి ప్రియతమా...

అప్పుడు నీవు వనకన్యకలా.... అభినవ శకుంతలలా.... ఆకులు, పూలతలే ఆభరణాలుగా నన్ను చేరి నా హృదయపీఠం కదిలించాలి.
నీ వడిలో నా తల పెట్టుకుని నీ కళ్ళల్లో నా కళ్ళు పెట్టి చూస్తూ విరహతాపంతో భారంగా వణుకుతున్న నీ అధరాలలోని సుధలను నా పెదవులతో గ్రోలాలి.
చెలి చెంత లేకున్న చెలికాడు వ్యధ చెప్పుకునేదెవ్వరికి. చెలి ఛాయ చూసినా చాలు కదా చెలుడు చింతనుండి తేరుకుని తనకై ఆశగా ఎదురు చూడటానికి.

0 comments:

Post a Comment