మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Friday, 17 June 2022

ముగిసిపోదామా? కథని మార్చి రాద్దామా?

 



ఇది ఎలా ముగుస్తుంది?

ఏమో… తెలియదు… తెలుసుకోవాలనీ లేదు. అది ఆటైనా… కథైనా… జీవితమైనా... ముగింపు తెలిసాక  మనల్ని కొత్త కొత్తగా నడిపించే తపన ఎక్కడ మిగిలి ఉంటుంది?

ముగింపు తెలియని ఒక పరిచయం… ముందు ముందు ఎన్ని కొత్త బాటలని పరిచయం చేస్తుందో… మన ముగింపుకే తొలి అడుగుని ముద్రిస్తుందో కదూ !  

మనకు తెలియని ముగింపుకి ఎన్నెన్ని కథనాలో… ఏ కథనంలో మన ముగింపు ఇముడుతుందో అన్న ఆలోచన మాత్రం ఎప్పటికీ ముగియదు. 

ముగింపుని అలా వదిలేసినంత కాలం నువ్వో కొనసాగింపువే…  

సముద్రం మీద దూరంగా కనిపిస్తున్న ఓడ ఇంకాసేపటికి మన కళ్ళకి కనిపించనంత మాత్రాన అది లేదని కాదు. తన ఉనికి ముగిసి పోయిందనీ కాదు. తన ప్రయాణంలో మరో చోటకి… మరో కంటికి దగ్గరగా వెళుతూ ఉందనే. 

ఈ క్షణంలో ఇది ముగిసిపోయింది అనుకుంటే… మరో చోట మరోలా మొదలవుతుంది. మరో రూపంలో ఇదే చోటకి మరల మరల వస్తూ ఉంటుంది. ముగింపులని మనం అనుకునేవన్నీ రూపు మార్చుకున్న కొనసాగింపులే. 

అయితేనేం… మనిషంటేనే పట్టువదలని విక్రమార్కుడు కదా… 

అందుకేనేమో మనిషి కథ ముగింపుకి తానే పథక రచన చేస్తున్నాడు. 

మరి ముగిసిపోదామా? 

కథని మార్చి రాద్దామా? 

మనిషి కథ ముగింపులేని వాక్యమవ్వాలీ అంటే తను చివరంటూ లేని నిస్వార్థమవ్వాలి.  


Tuesday, 14 June 2022

అగణితపు...

 



దేనికోసమో తెలియని నిరీక్షణలో 

నిశ్శబ్దంగా నేనున్నప్పుడు 

ఆ నిశ్శబ్దంలోకి చొచ్చుకు వచ్చేసే 

మృదువైన పలకరింపుతో

అగణితమైన సారూప్యతల

నేస్తపు స్పర్శలా  

నను తాకింది తను 


మనఃస్వరమేళనమేదో 

దివ్యానంద భరితమైన అనుభూతిని 

పునఃసృష్టి చేస్తుంటే 

తనకి వశమైపోవడం 

నాకు పరవశమై 

నన్ను నేను కోల్పోవడం 

కనికట్టేమీ కాదు 


అవతలి తీరాలనుండి 

తీసుకు వచ్చిన కథల్ని 

సముద్రం మీద సంగీతంగా 

సాధన చేస్తున్న అలల అలికిడిని 

కుతూహలంగా వింటున్న పాదాలని 

తడి తడిగా హత్తుకుపోతున్న తీరం లోని  

మౌన ప్రకంపనాలన్నిట్లో 

ప్రతిధ్వనిస్తున్న వాయులీనం తను 


ఎక్కడెక్కడినుండో 

ఏరుకొచ్చిన శబ్దాలకి 

కాలాల కలల నుండి 

పోగు చేసిన వర్ణాలద్దిన

పదమండపం  తను


తను …  

ప్రకృతి అస్తిత్వపు 

శాశ్వత సంతకం  

… కవిత్వం


Saturday, 11 June 2022

ఊపిరి కొలత

 



ఇదిగో…

నీ  హృదయం నుండి జారుతున్న ఈ చిన్ని ఉప్పు నీటి చినుకుని చూడు… ఈ అనంతానంత విశ్వపు రచనలో…  నీలో రేగిన కల్లోలాన్ని ఋజువు పరుస్తూ చెక్కిలి మీద తేమరాతని రాస్తూ సాగుతున్న ఈ నీటి అక్షరపు ఊపిరి యొక్క ఉనికి  ఎవరికని చేరుతుంది. ఎవరికో ఎందుకు… అసలు మళ్ళీ నీకు దొరుకుతుందా తన ఉనికి? 

ఎందుకు దొరకదు ? 

చెక్కిలి మీద ఆవిరైన ఆ తడి బిందువు ఎన్ని కోట్ల కోట్ల ఆర్ద్రతా కణాలుగా మారి ఈ లోకం మీద తన ఉనికిని పరచుకుంటూ వెళుతుందో  కదా!  ఏ చిన్ని హృదయం మీదకో  చేరిన ఒక అణువంత రేణువు చాలు… నిన్ను ఒక  రచనగా మలచటానికి.  నీ  ఉనికిని విశ్వమంతటికీ పరిచయించటానికి. 

నిజానికి,  ఆదీ అంతమూ తెలియని ఈ విశ్వంలో  నువ్వెంత ?  నీ ఉనికెంత ? 

నిజంగా తరచి చూస్తే ఈ ప్రపంచం… ఒక మాయా మోహనం. తన ఉనికినే… తన కొలతనే… తానెప్పుడూ గుప్పెట విప్పదు  మరి. ఇది నిజంగా నిజం… 

ఎలా అంటారా?  

ఈ ప్రపంచం చాలా పెద్దది. చాలా అంటే చాలా… ఒక్క సారి తప్పిపోతే మనకి మనం  దొరకనంత… ఈ ప్రపంచం చాలా చిన్నది… చాలా అంటే చాలా… కోట్లకోట్ల నక్షత్రాల ఆచూకీ మన కంటి చూపుకి  అందేంత… 

ఇంతకూ ప్రపంచం పెద్దదా…  చిన్నదా… ?  ఏమో ఎవరికి తెలుసు ? ఎప్పటి మనఃస్థితికి ఏమని అనిపిస్తుందో… నిజం చెప్పాలి అంటే ప్రపంచం చిన్న్దదో పెద్దదో కాదు… నువ్వు  ప్రపంచాన్ని చూసిన క్షణపు కొలత అది. 

ఆ క్షణం లో మిగిలిన అన్ని సమయాలూ… పరిమాణాలూ… గడ్డ కట్టుకు పోయి ఉంటాయి. అసలవి నీ  దగ్గరకు రావు కూడా ! 

ప్రపంచానికి నువ్వు పెద్దగా తెలియాలంటే… అసలు నువ్వెంత పెద్దనో నీకు తెలియాలి. నీకు నువ్వే చిక్కనప్పుడు ప్రపంచానికి నువ్వెక్కడ తగులుతావ్… అందుకే నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకుంటూ ఒక స్వఛ్చతా దీపంలా నువ్వు ప్రజ్వరిల్లాలి. దానికోసం నీకు నువ్వే ఇంధనంగా మారాలి. 

ఈ ప్రపంచపు పాంచ భౌతిక స్వరూపంలో ఒక రేణువంతనే నువ్వుండనీ… తన ఆత్మానుగత స్వరం నుండి నువ్వు వినిపిస్తే… ఇక నువ్వూ… ప్రపంచమూ…  ఏది ఎవరు?

ప్రతి సామాన్యతలో ఒక అసామాన్యత ఒదిగి ఉంటుంది. నీకు నువ్వుగా  తనని  ఎప్పుడు తెలుసుకుంటావా అని వేచి చూస్తుంది తప్ప తనకి తానుకు అది బయట పడదు.  

మరి నీకు నువ్వు తెలియాలంటే…?

అంత సులభమా… నిన్ను నువ్వు చదవాలి… అహరహం అకుంఠిత దీక్షతో.  అంతా కొత్తగా ఉండవచ్చు… మరంతే కదా! నీకు నువ్వు పరిచయం అవ్వటం ఇప్పుడే కదా ! అలానే ఉంటుంది.  అయినా సరే… ఇక ఆగమన్నా ఆగవు.  

అదంతే మరి! 

వేవేల కావ్యాలు … వేదాలు… ఉపనిషత్తులు… ఇతిహాసాలు… పేరేదేతైనేం   వాటిన్నిటి సారం నువ్వే… అవన్నీ చెప్పేది నీ గురించే… నీలో నువ్వెంతగా వ్యాపితమయి ఉన్నావో తెలిసి వచ్చే కొద్దీ బహిరంగపు ఆసక్తులన్నీ అనాసక్తులై నీకు నువ్వే ఒక నిరంతర ఆసక్తిగా కొనసాగుతూనే ఉంటావు.