మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Friday, 31 March 2017

ఆకు దాచిన చినుకు

నాకు తెలుసు నువ్వు అలసిపోయావని
ఇప్పుడు ఇదే మార్గం
రా మరి…
ఒక నిశ్శబ్దం ఆక్రమించుకున్న ఈ తోటలో  
ఆత్మైక్యమై సేద తీర


ఏటి కడుపులో దాగున్న పాటలా
ఒక మౌనపు అలజడిని హత్తుకుంటూ
దాచుకోలేనంత దగ్గరితనముందిక్కడ  
ఏకాంతపు వ్యాకరణాన్ని  
కంటి మెరుపులుగా రాయగలిగే  
హృదయ లేఖినీ ఉంది


వెలుతురుని తాగిన చెట్టు కొమ్మపై
ఆకు దొన్నెలా మారి దాచుకున్న
ఒక గోరు వెచ్చని చినుకులో  
లేచివురాకు మెత్తని వెన్నెల కాంతి
ప్రతిఫలిస్తున్న తేజస్సు మీదుగా
గాలి రాసుకొస్తుందే  ఒక చిరు పరవశం
నిన్ను పరిమళించడమే తనకు వచ్చు


ఆకాశపు అందాన్ని
నీలంగా తాగేస్తున్న సంద్రపు అంశగా
ఒక పువ్వులో నుండి నీలోకి ప్రవహిస్తుందే అనుభూతి
హృదయాన్ని తాకడం దానికి తెలుసు
దివారాత్రాల ప్రతి స్వరమూ
నీ ఊపిరి స్పర్శకై విరహపడుతున్న
ప్రణయస్వామ్యంలో
రెక్కలు విప్పుకుంటూ ఎగిరిపోతుందీ అలసట
కంటి రెప్పలకి తేనె చెమరింతలని పరిచయిస్తూThursday, 30 March 2017

మరీచిక

రాత్రి పగలుగా మారుతున్న చిరు శబ్దంలో
వళ్లు విరుచుకుంటున్న మైదానం
విరహపడిన దాఖలాలు చూసి
పడమటన మాయమైన పాత సూర్యుళ్ళందరూ  
ఒక్కటై వెలుగుతున్న చిత్రంపై
వాలుదామనుకుంటుందో ఆశల పక్షి...
విరగకాసిన వెలుగుని ఆబగా చూస్తే
మిగిలేది శాశ్వతాంధకారమని తెలియక !


నీటి భారం పట్టని నల్ల మబ్బుల్లా
బంధమనుకున్న బంధుత్వాలన్నీ
నీడల ఉయ్యాలలై
మరీచికా సోయగాలని భ్రమ పెడుతుంటే
యే స్వల్పత్వాన్ని ఎరుగని
అనంత అంధకారమొకటి మరింతగా చిక్కబడుతుంది


కోరికలన్నీ మాలిమై నేలని ఆప్తంగా హత్తుకుంటే
గాలి వాటున సోమరిగా
వళ్లు విరుచుకుంటూ వస్తున్న రంగుల గానమొకటి
కొండ శిఖరాన మెరిసే నిప్పు బంతిని తాకి
మెరుగు పెట్టుకున్న కిరణ ధారల వెంట ప్రవహిస్తూ  
ప్రతి మది చుట్టూ వెచ్చని చరణమై చుట్టుకున్నప్పుడు
అంతఃహృదయపు ఒడలంతా పులకింతై
పృథవి నవ్వుగా ప్రతిధ్వనిస్తుంది
తమని తాము వెలుగించుకునే మిణుగురు దీపాలని
ప్రతి అంధకారంపై వెదజల్లుతూ...!Tuesday, 28 March 2017

భృత్యుడు

మరణమెప్పుడో రాయబడే ఉంది
అందుకేనేమో
ఏ విపత్తులూ మనసుని బంధించలేకుండా ఉన్నాయి

రానీ మృత్యువుని
నేనెరుగని మృత్యువా అది
పుట్టిన క్షణం నుండీ నాతోనడుస్తున్న ఏకైక నేస్తం తాను  
తనకు తెలిసిందల్లా శరీరాన్ని శాశ్వత నిద్రలోకి జోకొట్టడమే
అవును...దేహాన్ని మాత్రమేగొని పోగలదు తను
కాలం నుండి నన్ను తరమటం తన సాధ్యమా
నన్ను నేను తెలుసుకున్నంత సేపూ తను నా భృత్యుడు

నిజం…
అసలైన నడక తెలిసాక
ఆనందమంటే పది క్షణాలు పెదవులపై మెరిసే నవ్వూ కాదు
విజయమంటే శ్రమలో కష్టం చూడని గెలుపు కాదు
మృత్యువంటే దేహం నిర్జీవమైన చావూ కాదు
అహరహం ప్రకృతిని సేవించే స్వేఛ్చా ఏలిక
అన్న తత్త్వం నేర్చుకున్న జీవితం
ఇప్పుడు జరామరణాల లెక్కల్ని దాటేసి
గుండె నిండా నవ్వుని నింపుకుంది
కాలం పొడుగూతా నన్ను రాసేస్తుంది


Wednesday, 22 March 2017

యంత్రుడివే !
ఒకే చిరునామా రాసుకున్న చోట
వలస వాదం వినిపిస్తుందంటే...
కొత్త కంచెకు
నేలను సన్నద్ధం చేసారన్న మాటేలే


ఎవరి కళ్ళనో అద్దెకు తెచ్చుకున్నప్పుడల్లా
కనిపించేదంతా కల్పనా చాతుర్యమే
ఒకానొక అనామక నీడగా
నిన్ను నువ్వు మసక బార్చుకున్నతనమే


చెమట చుక్కల లెక్కలకు
యంత్ర పరికరాలని పర్యాయంగా చేసుకున్నాక  
నువ్వొక యంత్రమై పోయావన్న సంగతి
నీదాకా రాలేదేమో కానీ
లోకానికి మాత్రం ఇప్పుడు నువ్వొక యంత్రుడివే


ఈ సారి నిద్రకు ముందు నిన్ను నువ్వు చూసుకో
ఏ కలల నావలెక్కో భ్రమల తీరాలు చేరుతుంటే
బతుకు తెరచాప ఒకటి
నిన్ను బలవంతంగా వెనక్కి మళ్ళించినప్పుడు
నీవేమిటో నీకు గుర్తుకురావాలిగా

Tuesday, 21 March 2017

ఒకే నాణెంపై...

జీవితం ఎప్పుడూ ఇంతే కదూ
ఒకే నాణెంపై చెక్కబడిన
రెండు పార్శ్వాలుగా
చెల్లిపోతూ !


ఒక సగం నేను...
ఒక సగం నువ్వు...
అహరహం
అర్థనారీశ్వర తత్వమై ఒక వైపు


మరో సగపు నేను…
ఇంకో సగపు నువ్వు…
అహరహం
అహం ఒక అంతరమై  మరో వైపు


మనిషిగా నేను…
మనసుగా నువ్వు !
బొమ్మా బొరుసులమేలే
నన్ను చెరిపితే నువ్వూ చెల్లవ్.