మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Tuesday, 22 September 2015

ఆర్ద్రత

‘మనం’గా మారలేని నువ్వూ నేనుల లోకంలో
నువ్వొక నేనుగా
నేనొక నువ్వుగా
ఉచ్చ్వాస, నిశ్వాస లోలకాల
నిశ్శబ్దపు తూగుటుయ్యాలలో
వేణువునంటిన ఊపిరంతా
ప్రత్యూషరావమై ఉషస్సుకి
సొగసులద్దే వేళ
రాయిలో కూడా కదలికలు సాధ్యమే
గుండె ఆర్ద్రత సూటిగా గుచ్చుకుంటూ

మనసు కుదుళ్ళు సరి చెయ్యాలే కాని
నీటి చెలమలే నడచి రావూ
ఎడారి దేహాన్ని దాహించటానికి
కన్నీళ్ళ ఉలి చప్పుడుతో
పాషాణం బీటలు వారే నిజాలు
ఎవరు నమ్మకపోతేనేం
మనోతటాకపు చప్పుడే చెబుతుంది
అలలు అలలుగా నిజాన్ని అలజడిస్తూ...

- 22.09.15


Monday, 21 September 2015

తడుస్తున్న నిజం


1. 
భోగలాలస కుతూహలపు వరదల్లో 
నాగరికపు ఇంద్రజాలపు భ్రమల్లో 
నిశీధిని నిశ్చింతగా కప్పుకున్న లోకం 
రాత్రంతా చీకట్లో తడిసిన నిజాన్ని 
కప్పి ఉంచటంలో కొత్తేముంది 

2.
నిద్రిస్తున్న నిజాల (నీడల) బరువును మోయలేక  
రాత్రి సొమ్మసిల్లిన వేళ
వేకువకు  అబద్ధాన్ని ఆడంబరంగా 
పరిచయం చేసే జాణతనం నృత్యం చేస్తున్న 
లోకం పోకడలో 
కంటి చివర వేళ్ళాడుతున్న చుక్క 
మౌనంగా సూర్యుడికి చేసుకుంటుందో విన్నపం 
వెచ్చగా జ్వలిస్తూ తనని ఆవిరి చేసెయ్యమని 
తనలో రగిలే నిజాల సెగకన్నా ఆ జ్వలనమే నయమంటూ

3. 
భూమి పొరలపై విరిగి పడుతున్న వాస్తవాలలో 
కొన్ని స్థూపాలుగా పిక్కటిల్లుతాయ్  
మరి కొన్ని చరిత్రకందని 
శిధిలాలుగా మైదానాల కింద కప్పడి పోతుంటాయ్

4.
దుస్తుల వర్ణాలే వర్గాలైన నిరర్ధక యుద్ధ క్షేత్రంలో 
కొన్ని మృత్యువులకే విలువొచ్చి 
కవిత్వపు రహదారుల్లో ప్రయాణం చేస్తుంటాయ్ 
మరి కొన్ని మాత్రం ఏ అక్షర హక్కులూ లేక
కొన్ని వార్తలుగా మిగిలిపోతుంటాయ్

5.
అన్నిటికీ మూలమైన అసలైన వర్గం మాత్రం 
రేయింబవళ్ళ తేడా తెలీక స్వేదాన్ని చిందించుతూ
జీవితాన్నలా పాతగానే 
ఆకలి కడుపులోకి... కన్నీళ్ళుగా...  
ప్రవహింపజేసుకుంటూ ఉంటుంది 

- 21.09.2015 


Thursday, 17 September 2015

కొన్ని పరవశాలు - 1తొలకరి స్వాగతాలతో 
వాన తోరణాలు కడుతుంటే 
ఆకుపచ్చని పతకమైన పైరు 
పొలానికి అలంకారమయ్యాక
రైతింట ఆకలొకటి చిధ్రమయ్యింది 
తడికళ్ళకి   స్వప్నతాంబూలాలనందిస్తూ

**** 

అమ్మవడిలో చోటుకోసం 
చిన్ని పాదాలతో 
దిగంతాలలో చిందులేసే 
సూర్యచంద్రుల పోటీల్లో 
పగలంతా నాది 
రేయంతా నీది 
గిల్లికజ్జాలు మనవి 

***

అక్షతలుగా జల్లుకోను 
చుక్కలనే కోసుకుంటూ 
రాతిరికి వీడుకోలిస్తూ 
పచ్చికనంతా నింపుకుని 
పరవశాన్ని ఒంపుకుని 
నువ్వు వేకువగా నడిచొస్తుంటే 
ఊపిరి చప్పుడు చేసే 
శ్వాసల థిల్లానా 
నాదా 
మరి ప్రకృతిదా...?Tuesday, 15 September 2015

లిఖితం

మోహపు వానలు ముంచుకొస్తే 
వెన్నెల వాగులు పొంగిపోతే
ప్రయాసలన్నీ దేహాలవి
అనుభూతులన్నీ హృదయాలవి

ఆలోచనలన్నీమృగ్యమైన వేళ
ఆద్యంతరహితమై సాగుతున్నచోట
కొంగ్రొత్త ఒప్పందపు లిఖితాల్లో 
రాసుకుందాం 
నన్ను నీవు 
నిన్ను నేను


Monday, 14 September 2015

కొన్ని అక్షరాలు - 4

‘ఏడవగలిగినంత దుఃఖం...
నవ్వగలిగినంత సంతోషం’

అంతకు మించి మనిషి దేన్నీ తట్టుకోలేడు కదా...

మనిషి ఫీలింగ్స్ కీ ఒక సాచురేషన్ ఉంటుంది అన్నది అర్ధం అవుతుంది కదూ. ఏది ఎక్కువైనా   మనిషి సోలిపోవటం సహజాతి సహజం.  అదే లేకపోతే మనిషి జీవితమెప్పుడూ చిత్ర వధే. 

అందుకే అనిపిస్తుంది... ఈ సృష్టి ఎప్పుడూ ఒక అద్భుత రహస్యమే అని...

***

రాత్రి...
ఎన్నిచీకట్ల భాండాగారమో... 
అంతకన్నా ఎక్కువ ఆశల సమాహారం...

ఎన్నిచీకట్లు తాగిన రాత్రి అయినా ఒక వేకువతో  వీడ్కోలు చెప్పటం ఎంత సహజమో... రేపొచ్చే పగలుని చూపిస్తూ ఒక ఆశావాదంలోకి నడిపించటం  అంతే సహజంగా చేసేస్తుంది  ధైర్యం. 

రాత్రి కురిసేది విశ్రాంతి కోసమే... నేటి బతుకు విశ్లేషణతో ముగించిన రాత్రి... రేపటి వెచ్చటి వెన్నెల్లో  నిన్ను విజేతగా నిలబెట్టదూ...

Sunday, 13 September 2015

శూన్యం

అసలంటూ లేని ఆకాశపు అంచునుండి 
శూన్యమొక అలగా 
గుండె తీరాన్ని తడుముతుంటే 
స్తబ్ధతేదో  పుట్టింది 
నిర్వేదాన్ని నవరత్నాలుగా  రాల్చుతూ 
శూన్యం నవ్వించే నవ్వు 
భలే చిత్రం కదూ 

అన్ని శబ్దాలనీ మింగేసిన నిశ్శబ్దానికీ 
ముసురు పట్టిన మనసుకీ 
ప్రతిధ్వనినంటూ పలకరిస్తున్న 
కాటుకంతటి చీకటి బరువు
దిగంతాల తులాభారంలో 
మొగ్గుగా తూగేలా ఉంది 

కారణమేంటో తెలియని అయోమయంలో 
నన్ను దోషిని చేస్తూ
మిథ్యకి ముసుగేసుకున్న మనసు
దేహంలోకి  ఇంకిపోయినట్లు
ఎందుకిలా 
అప్పుడప్పుడూ ఓ ఒంటరితనం స్పర్శిస్తుంది?

- 13.09.2015


Saturday, 12 September 2015

సీతాకోక చిలుక

ఏయ్… చిలుకా…

ఏమిటీ కొత్త పిలుపూ అనుకోకు... ముందుగా నీకు చెప్పలేదుగా 

పిలుపులకి పలుకని మైకంలో నన్ను నెట్టేసాక నాలోని పలుకువే నువ్వయ్యాక నేనెలా పిలిస్తేనేం నువ్వెలా పిలిస్తేనేం?  

జత ఊపిర్లూ ఏకమయిన వేళ 
వెన్నెల చినుకులు గిలిగింతలు పెడుతుంటే 
దేహాల నర్తనల్లో  మల్లెల పొగరంతా కమిలిపోతుంటే 
లేలేత తమలపాకుల పక్క  చెదిరిపోతూ 
ఎగసి పడే శ్వాసలకి 
ప్రేమొక ఇంధనమై ప్రజ్వలించదూ…

మన నిశ్వాసలే ప్రకృతి పీల్చే ఏకాంతపు గాలిగా లోకాన్ని కలియతిరుగుతుంటే ఊపిరి తోటలన్నీ అలలు అలలుగా కాపుకొస్తున్నాయ్. హరిత పత్రాల చిలక నవ్వులలో రాలిపడ్డ వసంతపు మువ్వలని పెదవులపై పలికిస్తూ అయిదున్నరడుగుల మల్లెపువ్వువై నువ్వు నరాల నెగడుని పరిమళిస్తుంటే కలిగే ఆనందం కన్నా స్వాంత సరోజాలపై నువ్వు లిఖించే చెలిమి సుగంధమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. 

నిశబ్ద శబ్దంలో తెరలు తెరలుగా వినవస్తున్న అంతరంగశృతులని ఒకే రాగంగా పలికిస్తూ ప్రపంచానికి అంతు పట్టని ప్రహేళికలమవ్వనీ... మనది కాని లోకమంటూ కానరాని చోట చెలిమినే చిరునామా చేసుకుని విస్తరించేద్దాం. 

ఒకే తల్లిదనం...ఒకే  తండ్రితనం… లోకమంతా విస్తరిస్తే ప్రపంచమంతా ఒకే స్వార్ధమై అవిశ్రాంతపు ఆనందం మొదలైన చోట పరిమళించే కుసుమాలుగా శాశ్వతమైతే మనమున్నంత సేపూ కాలపు ప్రతి మెతుకు మీదా  మన పేరే రాసుంటుందని పందెం వేద్దాం… కాలాన్ని మనమే కట్టేసుకున్నాంగా మరి. 

నువ్వూ నేనూ...  జీవితం పొడుగూతా పయనమై సాగుతున్న దేవ సుమాలం కదూ… అనుమానం ఎందుకుట?  నిన్ను నేను... నన్ను నీవు ఆఘ్రాణించినప్పుడల్లా మనకి తెలియటం లేదూ… ఒకరికొకరం మైకం కమ్మే పరిమళాలమని… 

నిజంరా మనం ఎప్పటి కప్పుడు కొత్తగా అల్లుకుపోయే అతి దగ్గరితనాలం… జంట అనంతాలం…

పుట్టినప్పుడు నా  కళ్ళల్లో మొదలైన కాలం నీ సన్నిధిలో ఆదమరచి నిదరోతుందని నీకు తెలియని సంగతా ఏంటి? 

నా మదికందని నీ ఎదభావాలంటూ ఏమీ ఉండవు కానీ నువ్వు చెప్తుంటే అలలు అలలుగా కదలాడే నీ అధర థిల్లానా అలా అలా చూడాలనిపించదూ…

అప్పుడప్పుడూ మనసులు  మౌనవిస్తాయి చూడూ… అ క్షణంలో మన మధ్యన వెలసిన యవనిక, కొన్ని అపరిచితాల్ని పరిచయం చేస్తున్నప్పుడు భలే మురిసిపోయి ఉంటుందేమో మన మధ్య తన ఉనికి శాశ్వతమని. ఎంత పిచ్చిదో కదూ…? 

అసలు మనం మౌనవించేదే ఒకరిలో ఒకరం లయించటానికి అని దానికెప్పుడూ అర్ధం కాదు. ప్రతి నిశ్శబ్దంలో ప్రేమ పాతర ఒకటి పెక్కుటిల్లి మనల్ని మరింతగా తనలో మమేకం చేసుకుంటుంది. 

ఎక్కడెక్కడి సందిగ్ధాలూ జీవితాన్ని అయోమయం చేస్తున్న చోట మౌనాలు కొన్ని పేలాలి… మాటలు కొన్ని కలవాలి. 

గొంగళి పురుగై బతుకు ఈడ్చటం నేర్చుకుంటేనే జీవితం సీతాకోకచిలుకై లోకాన్ని పలకరిస్తుంది. 

ప్రతి కష్టాన్ని ఇష్టంగా మార్చగలిగే మహత్తరమంత్రమై ప్రేమ ఉన్నప్పుడు ఏ బతుకులోనూ చేజారిన స్వప్నాలుండవు

లోకంలో కన్నీటి చూర్ణాల తడి స్పర్శలుండవు

ఆపై లోకమంతా స్ఫూర్తివంతమైన రంగురంగుల సీతాకోక చిలుకలే…!   

నీ

గోరింకThursday, 10 September 2015

భావ క్షతాలు


గుండె గుప్పిళ్ళలో దాచుకున్న రహస్యాలన్నీ 
ఆకు చివర్లలో  చినుకుల్లా ఊగిసలాడుతుంటే నేం  
వైరి దేహాల అణువణువులో  ఇంకిన బహిర్గతాలమయ్యాక 
ఒకరు ధ్వనిస్తుంటే  మరొకరం ప్రతిధ్వనిగా  మారే 
అనువాదాలమై 
ఒంటరితనాలని దిగంతాల్లోకి నెట్టేసిన 
ఏకాంతపు కావడిలో 
ఏడు జన్మాలు దాటినా 
ఇప్పుడే పరిచయమైనంత  కొత్తదనం 
నిన్ను నేనూ  నన్ను నువ్వూ  
తాజాగా  శ్వాసిస్తుంటే

నీడలు విశ్రాంతి తీసుకునే పొద్దులో 
కలలనడక మొదలైన సరిహద్దులో 
చెక్కిలిని రమిస్తూ 
వెచ్చగా తడిమిన ఆనందం 
కాసేపలా  ఒకరికొకరిని వీస్తూ 
గుండెల్లో కాస్తంత ప్రాణాన్ని పోస్తూ 

భావ క్షతాల  తీపి గాయలలో 
దేహాలని నర్తించుకున్నప్పుడల్లా 
అరచేతులే  వెన్నల  పడవలై 
చీకటి తీరాలని  తరిమేసిన  జ్ఞాపకాలు 
మోహరించిన గమ్మత్తులో 
ఒకరికొకరం స్వాధీనమవుతున్న నిరీక్షణలం 

- 10.09.15

Wednesday, 9 September 2015

పరిచయం

నిన్నటి  వెన్నెల పత్రాల్లో 
ఒద్దికగా ఒదిగిన వసంతం 
మరల మరల తడిమే క్షణం 
మరలి వెళ్లిపోతుంది మరో లోకానికి 

ఒక్క మోడువారిన చెట్టూ మిగలని చోట 
తనెక్కడ కాలూనాలో కానరాని తావులో 
నిన్న తలదాచుకున్న పకృతి ఛత్రాలు జ్ఞప్తికొస్తుంటే 
ఇప్పుడు మిగిలిందిక మృత్యుఛాయేననుకుంటూ 
స్వచ్ఛందంగా లోకం నుండి  నిష్క్రమణ చేస్తున్న 
ఆకుపచ్చని జీవాన్ని చూస్తూ 
మట్టి చెమ్మగిల్లింది 
సంద్రాన్ని మొత్తంగా తనపై కప్పుకుంటూ 
దిగంతాలన్నిటికీ
మనిషినొక హంతకుడిగా పరిచయం చేస్తూ 

- 08.09.15


రూపాంతరం

మెత్తని పచ్చిక ఒకటి 
నడకకి ఊతమిస్తున్న చోట
బింబం జాడలేని ప్రతిబింబమైన 
నీ నీడ మార్గమై పరచుకుంది 
నన్ను దారి తప్పనీకుండా 

లోలోన నిప్పుకణికలా  రాజుకుంది 
గుండెలో  సద్దుమణిగిన చీకటి 
నువ్విక ఎదురవ్వవన్న నిజాన్ని  
కురుస్తున్న కళ్ళ వాకిళ్ళని
ఆత్మీయంగా కౌగలించుకుంటూ 

నిన్న రాసుకున్న అక్షరాలకి 
కాస్తంత చెమ్మ అద్దుతూ 
నిన్ను ఖాళీ చేసుకుందామనుకున్నప్పుడు 
నిశ్శబ్దపు పరదాలని ముడివేస్తూ 
నేను మృగ్యమవుతున్న సవ్వడి 

అప్పుడెప్పుడో మడతేసిన తిమిరపు దుప్పటిని
విప్పి కప్పుకుంటున్న మనసు 
ఒక్క మాటా మాట్లాడటంలేదు 
కనుల అంచులనుండి నానార్ధాలనీ 
లిఖిస్తున్న అశ్రువుగా రూపాంతరం చెందుతూ

- 09.09.15 

Wednesday, 2 September 2015

నిండైన ఖాళీతనం

వ్యక్తిత్వంలేని అస్తిత్వంలో
తాము కోల్పోయిన జీవితంలో
నన్ను పోతపోయటానికి
సిద్ధమవుతున్న కొత్త కొత్త ప్రణాళికలు
ఇంకా మొదలవ్వని బతుకుకు వేస్తున్న సంకెళ్ళై
పంజరానికి అంటుగట్టే అమాయక కుట్రగా  
అక్కడ ఎవరో నన్ను లిఖిస్తున్న చప్పుడు


నన్ను కనుగొనే అవకాశం నాకు మిగల్చనిచోట  
ఎవరో నిర్దేశించిన గమ్యాల వైపు నడక మొదలెట్టటం
గాలివానలో దీపంగా నిలవాలనుకోవటమే  
నేను కళ్ళు తెరవాల్సిన చోట
వారు సిద్ధం చేసే వెలుగులే
నన్ను శాశ్వత తిమిరంలో కప్పెట్టేస్తే
ఓ నిండైన ఖాళీతనంగా ముగిసిపోతానేమో


నావైన జాడలు మిగల్చకుండా
ఎవరి కలల ఎంగిలిగానో కొనసాగుతూ  
వెళ్ళిపోవటం కన్నా
ఈ ఉమ్మనీటి సంద్రంలో
రూపుదిద్దుకోని  పిండంగానే రాలిపోవాలని ఉంది  


అలా కుదరదంటారూ…
కొత్త కలలకీ…
కొత్తగా వేసే అడుగులకీ చోటివ్వండి మరిTuesday, 1 September 2015

ఆమె... ఎప్పుడూ ఒక పునీతే

కన్నీరింకిన వేసవొకటి కనుదోయిపై పరచుకున్నప్పుడు  
మబ్బుల్ని ముసుగేసుకుంటున్న మనసులు 
పొడి పొడిగా రాళ్ళ వాసన వీస్తుంటే 
బీటలు వారిన గుండెకి పెద్దగా  తపనలంటూ ఏమీ ఉండవు 
పాత కలల్ని నిర్దాక్ష్యణ్యంగా వెక్కిరించటంతప్ప 

నిన్నటి స్మృతులని అదిమి పెడుతున్న 
తడి తడి కన్నీటి గడ్డలన్నీ 
కరిగి ప్రవహించిన ముద్రలెన్నో  
దేహాన్ని పచ్చిగా పరిచేసుకుంటున్నాయి 
ఆకలి లెక్కల తకరారులో కాలం తడబడుతుంటే 

హృదయమొక నెగడై మండుతున్నా 
బతుకొక ఉనికిగా ఊపిరి తీసుకోవాలని 
పువ్వులు కమిలేంత నటనొకటి  
ఉత్సాహమై  పట్టెమంచంపై నర్తిస్తుంది 
లోలోన గుండె ఎక్కిళ్ళు పెడుతుంటే 

మళ్ళీ తియ్యలేని తాళం వేసిన మనసుని
అంతఃచక్షువులతో తాకే ఊపిరొకటి 
నిశ్శబ్దంగా తడుముతూ 
గుండెని గాఢంగా హత్తుకున్న ధైర్యమై 
ఒకరొచ్చే వేళకై  కాలం కౌగిలింతలో నిరీక్షణగా
ఆర్ద్రంగా కరిగిపోతూ... 
ఆమె... ఎప్పుడూ ఒక పునీతే