మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Thursday, 5 December 2013

నా బాల్యం


అమ్మ వడిలో వికసించిన మొగ్గలు మీరైతే 
కుప్ప తొట్టెలో కుసుమించిన పుష్పం నేను 

మీ ముద్దుచేష్టలతో మీవారు మురిసిపోతే 
ఏ తోడూ లేక బేల చూపులతో నేనవసి పోయా 

గోరుముద్దలు వద్దంటూ నువ్వు మారాము చేస్తుంటే 
ఆకలిబాధ తాళలేక వీధి పంపు నీళ్ళు తాగా 

బడి దారిలో పుస్తకాల సంచీ మీరు మోస్తుంటే 
బతుకు బడిలో మట్టి తట్టలు నేను మోసా


బామ్మ చెప్పే పేదరాసి పెద్దమ్మ కధలు మీరు వింటే 
బరువులు మోసి బొబ్బలెక్కిన అరచేతులని ఊదుకున్నా

తిరునాళ్ళకెళ్ళి రంగుల రాట్నం లో మీరు తిరిగితే 
సున్నం గానుగ చక్రం చుట్టూ నేను తిరిగా 

పిల్ల కాలువలో మీరు ఈతకొడుతున్నప్పుడు
పంటకాలువలో నేను ఏతమేసి నీరు తోడా

కోతికొమ్మచ్చి... కోలాటాలు మీరాడుతుంటే 
కొడవలి పట్టి కోతకోయనూ చేనుకెళ్లా 

మీ మధురస్మృతుల అందమైన బాల్యం మళ్ళీ మీక్కావాలి
జీవితంతో పోటీలో మీరు అలసిపోతున్నారు కాబట్టి 

అందమైన గతంలేని నా బాల్యమంటే నాకిష్టం 
జీవితం తో పోరాడటం నాకు నేర్పింది కాబట్టి...

Tuesday, 3 December 2013

నా హృదయపు దారుల్లోనడచి నడచి చూడు 
నా హృదయపు దారుల్లో
దారంతా నీ తలపుల చిత్తరువులే 

తరచి తరచి చూడు 
నా కనుపాపల అద్దాల్లో 
ఎప్పుడూ కనిపించేది నీరూపమే 

తడిమి తడిమి చూడు
నా మది భాండాగారంలో 
నీ జ్ఞాపకాల సువర్ణ నిధులే 

తడచి తడచి చూడు 
నా ఊహల సెలయేటిలో 
నీ నవ్వుల గలగలలే 

మనసు రెప్పలు తెరచి చూడు 
నా హృదయ రాగాల్లో
నీ నామమే ధ్వనిస్తుంది 

                                                                 ... సురేష్ రావి