మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Monday, 22 December 2014

నాలోకి నేనే


బద్దకాన్ని అద్దెకితీసుకున్న తొలిపొద్దులో 
ప్రత్యూష పవనానివై చల్లగా వాలిపోతూ 
రవి కిరణానివై వెచ్చని లేపనం పూస్తుంటే 
నిన్నటి పచ్చి గాయాలని రాల్చుకుంటున్నా... 

మోడై పోయానని నిన్న బద్దలై పోయిన ఆ గాలి తరంగాలకి
ఆకుపచ్చని ఊపిరి పోసి మలయ మారుతాన్ని అఘ్రాణిస్తూ
నిత్య వాసంతానివై నువ్వు నాపై శ్వాసిస్తుంటే 
నీ వెనకే నడుస్తూ నాలోకి నేనింకిపోయా...

జాబిల్లివై వెన్నెలగింతలు పెడుతూ 
తన్మయత్వమై తనువునద్దుకుంటుంటే
నిన్ను నాకు బహుమతి చేసుకుంటూ 
రాత్రంతా మత్తిల్లుతూనే ఉన్నా....

జత తనువుల ఆలింగనంలో కరిగిపోతూ.
ఒంటరితనానికి ఏకాంతపు శిక్ష వేసి 
ఏకాత్మగా మారిన నువ్వూ...నేనూ...
మనలో ఎవరు ఎవరమో కనిపెట్టు చూద్దాం...!

Thursday, 18 December 2014

ఏయ్… అంతరాత్మా…!

ఏయ్…

అంతరాత్మా…!

అందరూ నన్ను నన్నుగా చూపించే అద్దం నువ్వే  అంటూ  ఉంటారు?  నిజమే కాబోలు అనుకున్నా....

తరచి తరచి చూస్తుంటే అసలు నువ్వు నన్ను నన్నుగా  చూడగలుగుతున్నావా అన్న సందేహం వచ్చేస్తుంది…!

అసలు నాలోపల నువ్వు నిజంగా పనిచేస్తున్నవా? మసక బారి పోయి రేఖా మాత్రపు చిత్త భ్రమలనే నా నిజమైన భావాలుగా చూపిస్తున్నావా?

రెండోదే నిజం కదూ….

అందరికీ అర్థం అయ్యేలానే నన్ను చూపిస్తున్నావనుకుంటూ ఉంటాను. కానీ ఎవరికీ అర్ధంకాని శేష ప్రశ్నలా నన్ను మార్చేస్తున్నావని తెలుసుకున్నాను. నేను చేసే ప్రతి పనీలో నాకు సంతోషం ఉంటుంది అనిపించేలా చేస్తావ్. కానీ ఆ సంతోషాలేవీ మనసుని స్పర్శించవే? ఆ కాసేపటి ఆనందం నాలో చూడటం కోసం నన్ను మాయల్లోకి నెట్టేస్తున్నావా?

మదిలో శాశ్వతముద్రలేసే నిజమైన ఆనందాల వైపుగా నా ఆలోచనలు ఎందుకు మళ్ళించవూ?  తాత్కాలిక ఆనందాల మాయా ప్రపంచంలోకి నన్ను ఒంపేస్తూ నువ్వు బాపుకునేదేమిటి?

ఎంతగా చదువుదామని చూస్తానో నిన్ను… చదివినప్పుడల్లా భలే అర్ధం అయినట్లే ఉంటావ్… కానీ నువ్వో అర్ధం కానీ బ్రహ్మ పదార్ధానివని   మళ్ళీ తరువాత ఎప్పుడో తెలుసుకుంటూ ఉంటా…!

కానీ ఏమి లాభం  మళ్ళీ మళ్ళీ  నీతోనే  సంభాషిస్తా…!

అంతకన్నా ఏమి చెయ్యగలను మరి నా గురించి నువ్వే  అన్నీ చూసుకోగలవ్ అని అనుకుని ఏ స్నేహాన్ని వరించని  పుట్టుకనయ్యా…!  ఎవరి లోచనాలతో వారు నన్ను తెగ చదివేసుకుని కొత్త కొత్తగా అర్ధం చేసుకుంటుంటే  ఒక్క  మనిషిని ఇన్ని రకాలుగా అర్ధం  చేసుకోవచ్చు అన్న సంగతే బహు వింతగా అనిపిస్తుంది.  

ఇన్ని రకాల అర్ధాలు పుడుతున్నాయంటే నన్ను నేను సరిగ్గా ఆవిష్కరించుకునేలా  నువ్వు  చెయ్యలేదు అనే  కదా....

అసలు వారికి ఏమి అర్ధం అవుతుందో  తర్వాత సంగతి… నేనెంటో నాకే అర్ధం కానంత  మాయాజాలాన్ని  నా చుట్టూ పరిచేసావ్ కదా…

అప్పుడప్పుడూ నవ్విస్తావ్…  ఎందుకు నవ్వానో తరువాత నాకే అయోమయం…
ఇంకోసారి ఏడిపిస్తావ్… నువ్వుండీ నేను ఎందుకు ఏడవాలి అన్నది నాకెప్పుడూ  అంతు చిక్కని ప్రశ్నే…?
అవసరం లేనప్పుడు కోపం…! జనాలందరూ దూరం…
మోసమని తెలిసినా  జాలి…!  తరువాత జాలి చూపటానికి మిగలని హితులు...
సమస్య  పుడుతుందంటే  తలుపు తట్టే భయం… భీరువుగా నా మీద నాకే అసహ్యం...
అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నేనున్నాననే ధైర్యం.... అవసరపడనంత ధీరోదాత్తతతో ఎనలేని స్థైర్యం…   

ఎక్కడ ఏది అవసరమో అది మనసుకి తట్టనివ్వకుండా నువ్వాడే అంతరాంతపు మాయాటలో  నన్నో సమిధలా వాడుకుంటున్న నీ శక్తిని ఎంత తెగిడినా తక్కువే కదూ….

నాలో నీడగా ఒదిగిన నా తోడువనుకున్నా ఇన్నాళ్ళూ…  
మనసుని అతలాకుతలం చేసే చీడవని మనిషి ఆలోచనల్ని తుడిపేస్తున్న పీడవని తెలిసీ ఏమీ చెయ్యలేని నిస్సహాయతలో కూరుకుపోయా… అంతగా నన్ను లోబరుచుకున్నావ్ మరి…

అంతరంగ ప్రక్షాళన జరిగితే చాలు కదా బహిరంగం బ్రహ్మాండం అవ్వటానికి?  

అందుకోసం ముందుగా ప్రక్షాళన చెయ్యల్సింది నిన్నే కదా… ఇంతగా మకిలి పట్టేసిన నిన్ను శుభ్రం  చెయ్యాలంటే  ఏమి చెయ్యాలో?

నిజమే… నువ్వు బాగు చెయ్యలేనంతగా  మకిలి పట్టేసావ్…

నువ్వు మసి బారిన అద్దానివి… నీకు ఏ చదువులూ రావు… మనసుకీ మనిషికీ అంతరాలు పెంచే కలహాలు తప్ప…!

నిన్ను సమాధి చేస్తే కానీ నన్ను నేనుగా లోకానికి పరిచయం చేసుకోలేనేమో....!

నా ప్రతి ఆర్ద్రతా తన స్థాయిలో తాను బయటకి రావాలంటే  అనుభూతులకి నువ్వేసిన కవచాలు  బద్దలు కొట్టాలి…

నీ ఆటలకి తోలుబొమ్మ అవుతూ…
పదుగురు మాటలకీ కేంద్రబిందువవుతూ…
అవమానాలలో తడచిపోతూ
పాపం బహిరంగమెప్పుడూ పిచ్చిదే...  

నా లోపలి  మనిషీ  బయటి మనిషీ ఒక్కటిగా మహోన్నత మానవీయతకు తావవ్వాలి…

అదే నా కోరిక… అందుకోసం  అపార్ధపు వలువలు కట్టుకున్న నిన్ను త్వరగా పాతరెయ్యబోతున్నా…

ఇక నుండి నేను నేనే...

ఇట్లు…

నేను

బాల్యం ఉండిపోతుంది

ఎంత బాల్యం కురిసిందో ఇక్కడ
మీరు తాగగలరా? 
నేను తాగినంత పసితనాన్ని...! 

ఎన్నికేరింతలున్నాయో అక్కడ
మీరు కురియగలరా?
నేను కురిసినన్ని నవ్వులు...!

ఎంత భయం పాకుతుందో ఇక్కడ
మీరు ఆడుకోగలరా?
నేను ఆటవస్తువుగా ఆడుకునే దీనితో...!ఎన్ని మట్టి తావులున్నాయో అక్కడ
మీరు పడుకోగలరా?
నేను పరవశిస్తూ మత్తిల్లి పడుకునే ఆ పడకలో...!

కావాలంటారుగా గడచిపోయిన బాల్యాన్ని
పెద్దరికపు తెరలో మీరుకప్పేసిన
పసితనాన్ని బయటకు తియ్యండి

కాసేపు ఈ బతుకుని ఆపేసి
అక్కడ జీవించి చూడండి
మళ్ళీ మళ్ళీ బాల్యం మీ చెంతనే ఉండదూ...!

Wednesday, 17 December 2014

రాల్చుకున్న పసితనం

ఎదిగే కొద్దీ నేను రాల్చుకున్న 
పసితనం మొత్తం జలపాతంలా 
తడి తడిగా నిన్ను చుట్టేస్తూ 
ఆ లేత పెదవంచుల నుండి గొంతు తడుపుతూ

నీ గుండె తాకుతున్న
నిన్నటి నా స్వచ్ఛత
ఏ పెద్దరికపు ఉల్కాపాతాల్లో ఆవిరయ్యిందో

వయసుతో వచ్చే కొంగ్రొత్త ధృక్పధాల సడిలో
ఎంత బాల్యం కారిపోయిందో
పెద్దరికం కోసం కలగంటూ
నిన్నటి నిజంలో ఒదిగి ఉన్న నా బాల్యం
ఒక కలగా నేటి రెప్పల తెరలపై
కదలాడుతున్న దృశ్యం
మన:ఫలకాన్ని శాశ్వతంగా అస్పష్టం చేసేసింది

నీతో శైశవ గీతి పాడుతూ
నా దురాలోచనలపై ధర్మాగ్రహాన్ని
భీబత్సంగా కురిపించేటంత
గొప్పదీ ప్రకృతి
అందుకే ఎప్పటికీ పసితనమే కారేంత
తియ్యందనాల బాల్యపు స్వచ్ఛతని
మరెన్నటికీ ఇంకిపోనంతగా తాగేసేయ్ కన్నా...Thursday, 11 December 2014

నివేదన

రేయంతా కవ్వింతల నిదురలో కాపురముంచుతావు
పొద్దున్నే ఒక వెచ్చని స్పర్శ కావాలనుకుంటానా 
వేడి తాకిడివై వచ్చేస్తావ్ నన్ను కరిగించటానికి 
మాయచేస్తావో , మంత్రమేస్తావో 
ఆవిరయ్యినా ఆత్మగా నీ చుట్టే పరిభ్రమిస్తుంటా 
నీపై పోరాటంతో కాదు... ఆరాటం ఎక్కువై

నీ అమృత స్పర్శతో పునీతమవ్వాలనే ఒకే ఒక్క ఆశతో
నీ సాన్నిహిత్యం కోసమే నేను తపన పడుతుంటే 
నువ్వేమో నన్నే ఏమారుస్తుంటావ్
అయినా కోపం రాదులే... తాపం తప్ప... 
ప్రియమైన వాళ్ళపై శత్రుత్వమూ ప్రేమగానే వర్షిస్తుందేమో 

నీ స్పర్శతోనే ఆవిరయ్యే నేను 
నీవు జ్వలిస్తే ఏమవుతానో కదా...
అదృశ్య రూపంగానూ మనలేనేమో కదూ 
అయినా సరే మరో సారి పుట్టేస్తాలే
నీ ప్రజ్వలనాన్ని చూడటానికి... 
నీ వెలుగుల్లో ఆవిరవ్వటానికి 
రూపు మారిన నా బహిరంగాన్ని 
ఆ జ్వలనపు సెగలలో స్నానించటానికి...

దానికి పగలు రేయి కావాలనకు 
సెగలోనే సౌఖ్యముందని, మరగటంలోనే రూపముందని 
నమ్మిన నీ మరో ఆకృతిగా నన్ను మిగల్చలేవా 
తుషారాన్నై నిన్ను మరింత కదిలించనా 
కిరణానివై నన్ను కాసింత వెలిగించవా 
నీ స్పర్శ సోకని మంచుబిందువునై మౌనవించా 
మరలిపొమ్మనకు ... మిగిలిపొమ్మనకు 
                                                       

Sunday, 7 December 2014

హేమంత స్పర్శ - 2

నా  జీవన హేమంతమా….

కాలానికి అలుపు తెలియదు నా  మనసుకి పరుగు తెలియదు. పరిగెడుతున్న ఆ కాలంతో పని లేకుండా నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నిలబెట్టేసింది నన్ను నా మనసు...

అసలే హేమంతమాయే... తెల్లగా మంచు కంబళి కప్పుకున్న నులి వెచ్చని ప్రకృతితో పాటుగా నడవటం నాకెంత ఇష్టమో తెలుసా? 

ఎందుకంటావా? 

ప్రతి నీ తలపూ గోరువెచ్చగా తాకుతూ  నన్ను నీ మాయలోకి లాగేసుకునే సుప్రభాత లోగిలిలా అనిపించే మధుర క్షణాల సవ్వడిని అనుభూతించే పరవశాల వేదిక కదా అది. 

పుప్పొడి రేణువుల్లా కురుస్తున్న నీ ఊహల జతులలో తాళం వేస్తూ తలపుల నెగళ్లు అంటించుకుని వెచ్చగా సేద తీరటం ఎంత మంచి అనుభూతో మాటల్లో చెప్పటం చాలా కష్టం అనుకుంటా... 

ప్రకృతి పరచిన మంచుతెర మాటు నుండి అకస్మాత్తుగా నీ పాదాల అలికిడి వినవస్తే అటుగా నడచిన నాపై... నీ అడుగు తాకిన ఆ మట్టిముద్రలో ఒదిగిన ధూళి మంచి గంధపు పొడిలా పరిమళాలు విసిరేసింది. 

రాత్రంతా రాలిన హిమం గడ్డిపూలని వెండి సుమాల్లా భ్రమింప చేస్తుంటే సాంబ్రాణి  ధూపంలా  రాలుతున్న మంచు తుంపరలు మట్టిబాటకి వేసిన రజత వర్ణంపై నగ్న పాదాలతో నువ్వు నడుస్తూ వెళుతున్న చప్పుడులో  నా గమనపు మార్గాన్ని ఆలకిస్తున్నాను.

నీ నిశ్శబ్దాల గిలిగింతల్ని అక్కడ కుమ్మరించి పోయావనుకుంటా నా పెదవులపై నీరాజనాలు పలికిస్తున్నాయి. నీ నవ్వుల వ్యాకరణాలని అద్దుకొచ్చిన శీతల సమీరం  నా గుండెల్లో కురిపించే తుషార బిందువుల్లో తడసి ముద్దవుతూ పచ్చని గరిక మీద నువ్వేసిన పాద చిత్రాలని అనుసరిస్తూ అలుపూ సొలుపూ లేకుండా ఒక జీవితాన్ని నడవగలను. 

నువ్వేసిన అడుగుల అడుగున నేల ఎంత పులకించిందో ఏమో  నీ అడుగుల్లో నేను అడుగు వేసినప్పుడల్లా  నీ  స్పర్శని నా అరి పాదాలకి  వెన్నలా  అద్దుతుంది . 

నిజమే నిన్ను అనుసరించటం అంటే నాకెంత ఇష్టమో … ఏ కష్టమూ లేకుండా  నీ  దారిలో  నే  గమనిస్తూ  వచ్చేయనూ నువ్వే గమ్యంగా… 

అసలంటూ చెప్పాలంటే నాకు నీలో పూర్తిగా ఇంకిపోవాలని ఉంది… నా ప్రతి శ్వాసని  నీ ఊపిరితో  ఊసులాడుతూ రమ్మని చెప్పాలని ఉంది. 

నువ్వే  గమ్యంగా నేను నడుస్తూ ఉన్నప్పుడల్లా నీ మాటలే నా మనసులో ప్రతి ధ్వనిస్తూ ఉంటాయ్… నీ మాటల వెనుక ప్రతి అర్ధాన్ని తరచి తరచి చూసుకుంటూ ఉంటాను… 

నీ 

సురేష్