మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Monday, 31 August 2015

కొన్ని అక్షరాలు - 3

నిజమే...
ప్రపంచమంతా ఎన్నో అందాలు... అవి తెచ్చే ఆనందాలే...
ఐతేనేం 
ఒక్క సూర్యోదయం లేకుంటే లోకమంతా అంధకారమే...
దూరపు కొండలు నునుపో కాదో తరువాత 
కళ్ళ ముందరకొచ్చిన తన వెలుగుని కట్టేసుకో...

*** 

అంతులేనంత కాంతి ఉంది బయట...
ఇంకా నువ్వు రెప్ప తెరవలేదంతే...!

***

శూన్యానికి వ్యాకరణం నేర్పుతున్నా...
ముగియని నా నిరీక్షణల సాక్షిగా...!

***

జాతి వర్ణాలతోనే వేరు విస్తరట 
నెత్తుటి రంగుని మార్చెయ్యగలరా మరి...?

*** 

కొంచెం పసితనాన్ని తాగవూ....
బాల్యమిక ఇంకిపోనంత స్వచ్ఛంగా ...!

*** 

Wednesday, 26 August 2015

కొన్ని అక్షరాలు - 2


ఎండని వెన్నెలించడానికి చంద్రుడున్నాడు...
నా గుండెని శీతలీకరించడానికి నువ్వు రావూ...!

***

లే పచ్చిక బయళ్ళలో నీ పాదాలకు 
హేమంతపు హారతి పడుతున్న సుప్రభాతమే 
నా మౌనం మొదలెట్టిన సారంగీ నాదం...

***

కంటికి కనబడేది మూడొంతుల సముద్రమే 
అసలంటూ... మొత్తం మట్టి కుదుళ్ళేగా...
సంద్రం నేను
మట్టి నువ్వు

కొన్ని అక్షరాలు - 1


అభిప్రాయం మారటానికి పెద్ద కారణం ఏమీ అవసరం లేదు...
తన సమస్య నీకొస్తే చాలు...!

***

ప్రసాదాలు నైవేద్యాలూ దేవుడేదో తినేస్తాడని కాదు… 
ఆత్మాభిమానంతో ఆకలిని చంపుకునేవారు కొందరుంటారని...!

***

ఏమీ పర్లేదు… స్వార్ధపరుడిగానే ఉండు…
కాకుంటే స్వార్ధాన్ని విస్తృతం చేసేయ్…
‘నా’ నుండి ‘మన’ వరకూ

***

తరతరాలుగా అబద్ధానిదే అగ్రాసనం...
నాలుగు రంగుల ఝండా మువ్వన్నెలుగా చలామణి అవుతూ...!

***

ఆకలైతే చాలు అదృష్టమే అనుకునే వాడొకడు
కలలోకీ మెతుకు చేరని మాయేమిటో తెలియని వాడింకొకడు...
ఎంత చిత్రమీ ప్రపంచం 
బహు విచిత్రమీ మాయాజాలం

****


Sunday, 23 August 2015

మెతుకు


జీవితాన్ని అనువదించుకున్నాక
ఆకలి జన్మాల అలజడిని అధిగమిస్తూ 
ముందుకు నడవలేకున్నాను 
తనని దాటొచ్చిన దూరమంతా 
కంటికో కథగా నన్ను అక్కడే నిలువరిస్తుంటే 

ఆకలి కళ్ళు మూసేస్తున్నామనుకుంటున్న భ్రమలో 
అన్నాన్ని కలగనే జీవితాలు కొన్ని 
మళ్ళీ రెప్పవిప్పలేని అలసటలో రాలిపోతుంటే 
ఆకలిని గెలవలేని మనిషి చరిత్ర
శిధిలమవ్వాలి మనసు మనసులో 

మానవత్వమే సైన్యమైన చోట 
గోరుముద్దలే ఆయుధాలైన వేళ
ఓటమొందిన నిన్ను 
ధూళి పట్టిన యుద్ధభూమిలో కప్పెట్టేసాక 
మోగే విజయశంఖారావం 
నిన్ను యుగాలకవతలకి  విసిరే తొలి క్షణాలలో 
నేనూ ఉండాలన్న స్వార్ధంలో 
కొన్ని బతుకులనైనా 
లోకానికి కూడాలనిపించటంలో 
నేనెవరికెలా కనిపించినా నాకు లెక్కలేదు 

గొప్పతనాల అవగాహనలో 
పాత సాంకేతికాలన్నీ చిధ్రమైతే
ధరణంతా  రుద్రభూముల అస్తిత్వం అరుదైన 
దివ్యత్వపు ఊపిరే శ్వాసిస్తుందన్న నిజానికి 
చేయూత నివ్వాలని ఉంది ఒక్క మెతుకుగా మారి

Friday, 21 August 2015

నిశ్శబ్దపు దేహాన్నై

నువ్వొచ్చే వరకూ వేచి ఉంటా
క్షణాలన్నిటినీ నీ ధ్యాసలో వ్యయం చేస్తూ
వ్యర్ధఛాయలన్నిటినీ దూరంగా వెళ్ళగొడుతూ
నువ్వొచ్చిన రోజున
మనసొక దూదిపింజలా తేలటం నాకు తెలియాలి
నీలో ఒక ఆశ్చర్యం కళ్ళు విప్పేలా

నీకో రహస్యం చెప్పనా 
నేనంటూ మోసగించబడనిది ఒక్క నీ దగ్గర మాత్రమే 
ప్రతి ఒంటరి క్షణమూ నిన్నే ధ్యానిస్తున్న నాకు తెలుసు 
నువ్వంటే నాకెంత ప్రాణమో 
నువ్వు నన్ను అల్లుకుపోతున్న ఆ క్షణాలలో 
నా తావంతా ఓ నిశ్శబ్దపు దేహాన్ని తొడుక్కుని ఉండాలి 
ఎక్కడెక్కడి చీకటినీ నువ్వు విప్పుతూ పోతుంటే 
నువ్వు విప్పే ఆ ప్రతి రహస్యాన్ని రసానుభూతించాలని ఉంది 

ఉదయంలోకి దూకి మునిగిపోయిన రాత్రిలా 
నాలోకి మాత్రమే  లీనమయ్యే ఓ మార్మికతవు నువ్వు 
తిమిరమెప్పుడూ దీర్ఘప్రయాణం కాదని 
పరిమళమద్దుకున్న కాంతిప్రసూనాల మార్గమేస్తూ
నువ్వొస్తావని మాత్రమే తెలుసు నాకు 
ఇక మిగిలినదంతా నువ్వైన రహస్యమే 

నిన్ను నువ్వు ఆవిష్కరించుకునే  క్రమంలో 
స్నేహంగానో 
ప్రేమగానో 
మరణంగానో  
మరి నాలో 
నువ్వెలా మురుస్తావో వేచి చూడాలి…

- 16.08.15 

తడి నీడలు

వనాలు దాచుకునే పువ్వులని 
నువ్వు దోచుకున్నప్పుడల్లా  
నీ కుంతలాలే సంకెళ్ళై 
నన్ను నీకు కట్టేస్తున్న శిక్షకై 
యుగాల తపమొనరించవచ్చు 
ఎన్ని జన్మల ప్రయాణమైనా చెయ్యవచ్చు 

మట్టి పుప్పొడిగా నువ్వొక్కసారి సోకగానే 
ఎడదలో మేట వేసిన ఎడారిధూపమంతా 
రెక్కలు తొడుక్కుని ఆవిరయ్యింది 
గుండె పచ్చిక మీద నీ పాదస్పర్శ తాకగానే 
నిద్రకమ్మేసిన నా చిరునామా ఒక్కటి 
మెలకువ తెచ్చుకుంది 

అన్ని శబ్దాలనీ మింగేసిన నిశ్శబ్దమొకటి 
బద్ధకమెక్కిన అలలా నన్ను మింగుతున్న చోట 
నువ్వొక  ప్రాణాధారగా నృత్యం చేస్తుంటే 
నాలో నిద్ర మేల్కొన్న నీ గాలి 
నిశ్వాసగా ఒక శూన్యాన్ని వదిలించింది 
నన్నొక దీర్ఘప్రయాణంగా మారుస్తూ

నీటి కుచ్చెళ్లలో మొదలైన పాటలో 
సాగిపోవటానికి నువ్వొచ్చి
నీరెండరాగంగా నన్నూ తోడ్కొనివెళుతుంటే 
ఇక 
నా తడి నీడలన్నిటికీ 
నిండు విరామమే… నిత్య శిశిరమే

Thursday, 20 August 2015

మధుర భక్ష్యం

కాంతి శబ్దాలు చేస్తున్న నక్షత్రాల సడి
నిశ్శబ్దాన్ని వెచ్చగా శృతి చేస్తుంటే
ఓ నిరాకారం నన్ను చుట్టేస్తూ
సుదీర్ఘ శ్వాసగా  నిన్ను నాలోకి లీనం చేస్తుంటే
నిశీధాన్ని నిషేధిస్తున్న మౌనం
ఎన్ని గుసగుసలు పోతుందో తెలుసామరి

హృదయ వీధుల నిండా
మనవైన క్షణాలు నిండి పోయి
మనోలోకాన్ని చుట్టేస్తుంటే
ప్రతి క్షణానికీ కిరీటం తొడిగి
నా స్మృతుల సింహాసనంపై కూర్చో బెడుతుంటే
నేను రాజుని కానిదెప్పుడట

అలసటొకటి పెనవేసుకున్నప్పుడల్లా
నా ఏకాంతాన్ని
స్వంతం చేసుకుంటూ నువ్వొస్తుంటే
మన ఆత్మాలింగన దర్శనంతో
కొత్తబాట పట్టిందనుకుంటా
అనాధగా మారిన ఆ అలుపు

నిన్ను స్వార్ధం చేసుకున్న మొదటి క్షణం గుర్తొచ్చినప్పుడల్లా
నా భౌతికాంతరాలు వేరువడిన సవ్వడి జ్ఞప్తికొస్తూ
ఒకే భౌతికంగా మారే గుణం తనకులేదని
దేహంపై ఓ చిరుద్వేషం మొదలవుతున్నప్పుడు
మనసు నన్ను చిరునవ్విస్తుంది
మధుర భక్ష్యంగా నిన్ను రమిస్తూ


Monday, 17 August 2015

మొలకలా…

అడవి స్పర్శ కోసం అర్రులు చాస్తూ 
నెర్రెలిచ్చిన గోడ మధ్య 
చిగురించిన రావి మొలకలా 
నిన్ను నాలో పాదు చేసుకున్నా 
గుండెపునాదుల్లోకి చొచ్చుకుపోయేలా  

అలసిన మనసుని కడుక్కోవాలనిపించినప్పుడల్లా
ఒంటరి క్షణాల మకిలిని మాయం చేస్తూ 
నువ్వొక ఆహ్లాదమై కురిసిపోయేలా 
ప్రతి తలపూ నువ్వయ్యే పరుసువేదిని
నా అంతరాంతరాలలో తాపడం చేసుకున్నా 

జన్మగా నన్ను వ్యక్త పరచుకున్నా
పథికుడినై నే నడిచేది నీతోనే 
ఎడతెగని దాహబాధతో 
అమరంగా మత్తిల్లుతూ 
అహరహం నిన్ను తాగుతూనే ఉన్నా 

మన ఏకాంతాల విశాలత్వంలో
లోతైన నిశ్శబ్దాల నడుమ 
తేట మెరుపుల వెలుగులో 
అవిశ్రాంతంగా నిన్ను చదువుతూ 
నన్ను నేను తేజోమయం చేసుకుంటున్నా 

తడి చూపులతో నేనొచ్చినప్పుడు
ఇష్టంగా నువ్విచ్చినదేదీ తరిగిపోదు 
మరింతగా నీలో పెరగటం తప్ప 
తీరాలు… లోతులు… హద్దులూ  దాటేసిన
నా  అనంతానివి నువ్వుSunday, 16 August 2015

ఆకలిని దాటేస్తే...

రోజూ కడుపులో చీకటి సంతకం చేసే ఈ ఆకలొకటి
నన్ను విస్మరిస్తే  బాగుండు
కాలుతున్న కడుపున పుట్టిన
బలహీనత ఒక్కటి చిధ్రమై
బతుకిక నన్ను భయపెట్టకుండా
కొత్త ధైర్యాలు నాలో వికసిస్తాయి

నిన్నటిదాకా వెదురుముక్కనైతేనేం
ఇప్పుడిక
నా జీవితమొక పరిమళధూపమై
స్వేఛ్చావీచికలని లోకంలో నింపేస్తూ
జీవన వేణువుగా మారుతుంది

డొక్కల్ని కుదిపేసిన
ఆకలి వరదలని దాటి వచ్చాక
లోకాన్ని నేర్చుకునే కొత్తశిశువునై
కళ్ళ నాట్యాల్లో అలసటని
పరుల కష్టాలకి అద్దేస్తా

నక్షత్రాల నవ్వుల రేయి ప్రాంగణంలో
నేనొక వెలుగునై కాపు కాస్తుంటే
భరోసా కమ్మేసిన లోకానికి
నిద్రలేమి తెలియదులే

వృధావ్యయ క్షణాలన్నిటినీ
కార్చిచ్చునై కాల్చేస్తూ
జీవితాన్ని అధిరోహిస్తూ
ప్రతి ప్రభాతంలో
సంపూర్ణ సుప్రభాతంగా వెలుగులీనుతా

గాయాల్ని ముద్దాడిన వాడిని కదా
గేయంగా మారటం ఎంతసేపులే….!Saturday, 15 August 2015

మనిషి

అప్పుడొకడుండేవాడు
మట్టిలో అమీబాగా పుట్టాడొకనాడు 
అన్నవస్త్రాలతో ఎదిగి 
నాగరికపు ప్రయాణంలో 
గమ్యమేమిటో తెలియని 
అయోమయపు గమనంలో
అత్యాశల వలయ భ్రమణంలో 
గాలికి రంగులు వేసి 
నీటిలో విషమే నింపి 
నేలపై కాంక్రీట్ పోసి
అంతరిక్షాన చెత్తను వేసి  
తను చేరిన ఆఖరి గమ్యం
ఎవరినీ చూడనివ్వక 
తానూ చూడలేని 
కబోధిగా మాయమయ్యాడు 

వాడిని వాడు 
మనిషి అని పిలుచుకునే వాడట 

Thursday, 13 August 2015

లెక్క

నా మొదటి శ్వాసలో 
మొదలైన పయనమొక్కటి 
నీ చివరి అడుగులో లీనమయ్యింది 
ఊపిర్ల లెక్కలన్నీ సరి చేసుకుని.....! 

Wednesday, 12 August 2015

నువ్వు...


మన పరిచయ క్షణంలోనే 
నా ఉనికిని చెరిపేసిన ఉప్పెనవయ్యావు 
గడ్డ కట్టిన విద్యుత్తువై 
యుగాల మెరుపుల ఝరిగా నాలో కురుస్తూ 

నిను చుట్టిన గాలి నన్ను వ్యాపిస్తుంటే 
శూన్యమొక ప్రణవనాదమైంది...
ఊహల ఊపిర్లుగా 
నీ పలుకుల పరికంపనతో మత్తిల్లుతూ

కుంకుమ బొట్టే కుందనమవుతూ 
అరుణరాగమై నువ్వు కంపిస్తుంటే
లాలిత్యపు లావా పెల్లుబికినట్లుంది
రసఘనీభవింపుగా నిన్ను శిల్పిస్తూ

శత తంత్రుల వీణవై నువ్వు నాలో శ్వాసిస్తుంటే
నరాల్లో రక్తపు పొర్లింతలు కేరింతలై 
నువ్వొక అనుభూతిగా మారిన వేళ
విశ్వమొక అణువయ్యింది

నువ్వు పల్చబడిన చోట
నేనొక నీరవ నిశ్శబ్దమైనప్పుడు 
గుండెల్లో గుప్తంగా ఒదిగున్నసింధువు...
రాల్చుతుందో కన్నీటి బిందువు...!


Sunday, 9 August 2015

ఆకు పచ్చని ఉప్పెన

శూన్యం పరమై తానొక వరమై రాగానే 
అనుక్షణం తన  కళ్ళ నడవాలో నడుస్తూ
ప్రతి నిమిషం తన గొంతు శబ్దంలో మోగుతూ
అను క్షణం తన గుండె నాదానికి శృతినవుతూ 
లోకమంతా తన  కాలి పట్టీల జతగా తిరుగుతూ 
తన  ప్రతి తలపులో తమకంగా తడుస్తూంటే ....

నేను రాల్చుకుంటున్న ఒంటరితనం 
మొత్తానికి తన ఏకాంతం అద్దుతూ  
జీవితం మళ్ళీ చిగురించింది... 
ఆకు పచ్చని ఉప్పెనౌతూ...! 


The Prophet - ఇదొక విస్తృత జీవన వికాస సూత్రం

ఏ బంధమైనా జీవితాన్ని చిగురింప చేసేలా ఉండాలి కానీ బంధనంగా మారి బతుకుల్ని చిధ్రం చేసుకునేలా ఉండకూడదు. ఒకరికొకరు బలహీనంగా మారకుండా బలంగా మారాలంటే స్వంత అస్తిత్వాన్ని కాపాడుకునే  వ్యక్తిత్వం ఉండాలి.   

“వైవాహిక బంధంలో... ఒకరికోసం ఒకరుగా కలసి ఉండాలి  ఎవరి వ్యక్తిత్వం వాళ్ళు నిలుపుకుంటూ… ఒకరినొకరు ప్రేమించుకోవాలి . కానీ ఆ ప్రేమ అనేది ఏ మాత్రమూ బంధనంగా మార కూడదు.  ఒకరికొకరు హృదయాల్ని ఇచ్చి పుచ్చుకోవాలి  కానీ వాటిని తమ గుప్పెట్లలో  బంధించకూడదు. “

పిల్లలంటే తమ స్వంత ఆస్తి అనుకునే తల్లి దండ్రులు తమ కలల్ని వారి మీద రుద్ది ఆ లేత జీవితాలకి స్వంత వ్యక్తిత్వం లేకుండా చెయ్యటం మన సమాజంలో నిత్య జీవన చిత్రంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. అసలు పిల్లలని మనం ఎలా పెంచాలన్నది ఇక్కడ ఎలా చెప్పారో టూకీగా మీరూ చదవండి

“పిల్లలకి పంచాల్సింది మన ప్రేమనే… ఆలోచనల్ని కాదు… వారి ఆలోచనలు వారికి ఉంటాయ్.  పసి దేహాలకి గేహాలు నిర్మించటం మన భాధ్యత కానీ వారి మనసులపై పంజరాలు కప్పకూడదు. మనం విల్లుగా ఉండి పిల్లలని  అస్త్రాలుగా సంధించాలి వారి భవిత వైపు. లక్ష్యాన్ని ఛేదించిన బాణమే  కాదు  విల్లు కూడా గుర్తింపబడుతుంది ”

స్నేహం విలువ తెలిసిన వాడితో జీవితమే స్నేహం చేస్తుంది కదూ.  అలాంటి స్నేహాన్ని ఎలా చూసుకోవాలి ఎంత గౌరవం ఇవ్వాలి. అసలెలా స్నేహం చెయ్యాలి అన్నది ఎలా చెప్పబడిందో చూడండి

“ స్నేహితుడంటే... నీ అవసరాలకి సమాధానమే...  పర్వతాన్ని ఎక్కినప్పుడు కన్నా మైదానం నుండి చూసినప్పుడే దాని గొప్పతనం కనిపించినట్లే, చెలిమి ఎడబాటులోనే తన విలువ తెలుస్తుంది. స్నేహం అనేది ఆత్మీయతా పునాదుల్ని మరింత పటిష్ట పరిచేలా ఉండాలి తప్ప వేరొక దానికై  కాదు. ప్రతి క్షణానికి అమరత్వం  జీవం అద్దటానికేగానీ  కాలాన్ని చంపే కాలక్షేపానికి కాదు స్నేహం… “   

జీవితం ఏ ఒక్క దానికో అనుకూలంగా ఉండదు. దానికి అన్ని అనుభవాలు సమానంగా ఉంటూనే ఉంటాయ్. కాకపోతే తక్కెడ మొగ్గు అటూ ఇటూ మారుతూ ఉంటుంది అంతే.

“ సుఖ దుఃఖాలు రెండూ ఎప్పుడూ కలిసే వస్తాయి. ఒకటి మీ సహపంక్తి భోజనానికి కూర్చుంటే రెండవది మీ శయ్యపై నిద్రిస్తూ ఉంటుంది. “  

ఇలా రాస్తూ పోతే పుస్తకం మొత్తం రాసెయ్యాలి అనిపిస్తుంది.  ఇవన్నీ ఒక వచన కావ్యం లో చెప్పబడిన కొన్ని ప్రవచనాలు మాత్రమే…  

అసలు మనిషి  
ఎలా నడవాలి?
ఎలా మెలగాలి?
ఎలా పెరగాలి ?
ఎలా బతకాలి?

అన్ని ప్రశ్నలకీ ఒక చక్కని సమాధానం Kahlil Gibran విరచితమైన ‘ The Prophet’

అత్యంత క్లిష్టమైన మానవ సంబంధాలని ఎంత సరళంగా మలచుకోవచ్చో తెలిపే అద్భుతమైన పుస్తకం ఇది. మనిషి తన జీవన శిల్పాన్ని సజీవంగా చెక్కుకునే అక్షరాల ఉలి ఈ రచన.

“ ప్రేమ, పెళ్లి, పిల్లలు, దాతృత్వం, తినటం & త్రాగటం, పని, సుఖ దుఃఖాలు, ఇళ్ళు, దుస్తులు, క్రయ విక్రయాలు, నేరమూ శిక్ష, చట్టాలు, స్వాతంత్ర్యం, వివేకం & ఉద్రేకం, పని, ఆత్మ వివేచన, బోధన, స్నేహం, సంభాషణ, కాలం, మంచీ చెడు, ప్రార్ధన, ఆనందం, అందం, మతం & మరణం…”  ఇలా జీవితంలో మనల్ని పలకరించే ప్రతి అంశం గురించి తెలుపుతూ మనిషి తన జీవితాన్ని ఎంత ఆనందకరంగా మార్చుకోవచ్చో క్లుప్తంగా... సూటిగా… మనసుకు నాటుకునేలా సాగిన ఈ రచనని ఒక్క సారి చదివితే  మనకి మనం  కొత్తగా పరిచయం అవుతాం అనుకోవటంలో ఎలాంటి సందేహమూ లేదు.

వివిధ పత్రికల్లో చిన్నప్పటి నుండి మనం చదివిన వ్యాసాలని గుర్తుకు తెచ్చుకుంటే,  పై అంశాల గురించి ఎవరు రాసినా  ఆ రచన  మీద ‘ The Prophet ‘  ప్రభావం  ఎంతో కొంత ఉండే ఉంటుందని మనకి అనిపిస్తుంది.

Kahlil Gibran లెబనాన్ కి చెందిన కవి, తాత్త్వికుడు, చిత్రకారుడు. నలభై ఎనిమిదేళ్ళు జీవించాడు. ఖలీల్ ఈ పుస్తకాన్ని  ముందు అరబిక్ భాషలో రాసి దాన్ని తనే ఆంగ్లంలోకి అనువదించాడు.  ఆయన ప్రతి రచనలోనూ అనేక అంశాల మీద కొంగొత్త తాత్విక సత్యాలు కనిపిస్తూనే ఉంటాయి. తన  రచనలన్నిట్లో తలమానికమైనది ఈ ‘ ది ప్రాఫెట్ ’  అనే పుస్తకం.  40 కి పైగా భాషల్లో కోటి ప్రతులకి పైగా అమ్ముడు పోయిన ఈ రచన కవితాత్వకమైన వచనంలో సాగుతుంది.

అల్ ముస్తఫా  అనే వ్యక్తి  ఆర్పలీజ్ అనే పట్టణాన్ని వదిలే వెళ్ళే సందర్భంగా పుర ప్రజలు అడిగే వివిధ ప్రశ్నలకి సమాధానంగా చెప్పిన ప్రవచనాల సమాహారమే ఈ పుస్తకం.

ఒక్క సారి ఈ పుస్తకాన్ని చదివితే మన ఆలోచనా పరిధి విస్తృతమవుతుంది. జీవితం పట్ల మన దృక్పధం మారుతుంది. జీవితం సరికొత్తగా పరిమళాలు వెదజల్లటం కన్నా మనకు ఇంకేం కావాలి.

నాగరికపు యాంత్రిక జీవనంలో మనిషి తనను తాను బందీ చేసుకున్న సంకెళ్ళు తెంచుకునే ప్రయత్నానికి నాందీ ఈ పుస్తక పఠనం అని నా అభిప్రాయం. వీలైతే మీరూ చదివి మీ అభిప్రాయం చెప్పండి


Friday, 7 August 2015

దృక్పథం


ప్రేమని  ఇవ్వటమంటూ వస్తే 
అంతకు రెట్టింపుగా 
తాను గుండెను చుట్టుకు పోతుందని 
తెలుసుకున్నాక 
ఒక్క ఆత్మీయ స్పర్శతో 
ఆవిరి అయిపోయాయి
కంటి నుండి కురిసిన 
ఒంటరి క్షణాలన్నీ

నవ్వులు కన్నీళ్ళ ముసుగులుగా
కన్నీళ్లు నవ్వులకి తొడుగులుగా 
పరస్పరం తారుమారు అవుతున్న 
ప్రాణ మిత్రులే అన్న నిజం 
నన్ను తాకినప్పుడే 
కొత్తగా శ్వాసించటం మొదలు పెట్టా 
అంతరాత్మల తీరాలని ముడివేసే  
అంతెరుగని ప్రేమైక అలగా…!


ఎడారి

ఎదగని నిన్ను ఎరిగిన దానికై
కొత్త వెతుకులాట మొదలెట్టాలి 
వింతలెన్నో బయటపడుతున్నచోట
నీకు నువ్వు ఆశ్చర్యం అవుతుండాలి 

గుండె కడలిగా మారదూ
ఎరి(ది)గిన దారొకటి ఎడారిగా కనిపిస్తే  
మనసు మైదానం బీడు వారదూ
శూన్యమొకటి వరదైతే

అప్పుడప్పుడూ గుండె వర్షించాలి 
నరాలకి అంటిన రాతి పొరలని కరిగించే అంతగా... 
అప్పుడప్పుడూ ఎడారిగా  మారాలి 
నీలో ఉన్న ఒయాసిస్ వెలికి రావటానికై 

నీకు నువ్వు ఎడారైన క్షణం 
ఎదురవ్వగా లేనిది
నీకు నువ్వే ఒయాసిస్సువై 
సేద తీర్చుకోలేవూ 

శూన్యం శూన్యమవ్వదూ
నీకు నువ్వు వరంగా మారితే...  
ఊపిరొకటి ఉప్పెనవ్వదూ
నువ్వొక నిజమై నడిచొస్తే

Saturday, 1 August 2015

ప్రవాహం

ఆమె నుదుటి కుంకుమ ఎక్కడో రాలిపడుతుంటే
వెన్నెల ఎర్రగా కురిసే రాత్రి 
ప్రకృతి కళ్ళలో తడిగా కదలాడుతుంది 

తన గుండెల్లో మరుగుతున్న 
కన్నీటి లావాల  సెగ చుట్టేస్తుంటే
ఆకాశం  కరిగే వేళ ఒకటి వస్తుంది 

గాలి కొండలు మొరాయిస్తూ
ఊపిరిని నిలువరించే సమయమొచ్చేలా ఉంది
రంగులెన్నిటినో తనలోకి జొప్పిస్తుంటే 

మనసు మైదానాలన్నీ మిథ్య అయిన తావులో  
తన కలలన్నిటికీ భాష్యం రాస్తే
మనిషంటే కొత్త నిర్వచనం పుడుతుందేమో

ఒక పసి పాదమై మొదలెట్టిన నడక
తడబాటు సరి అవ్వని జీవితంలో 
అడుగడుగునా ఓ యుద్ధగాయమే 

యుగయుగాల జీవనమంతా 
ఒక్క క్షణంలో శూన్యంలోకి ఆవిరౌతూ 
మొదలయ్యేలా ఉంది ఓ అనంత నిశ్శబ్దం