మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Friday, 30 September 2016

పిల్లంగోవికొన్ని గాలులూ కొన్ని వానలూ నిండిపోయిన గుండె చెలమల్లో కాసిని క్షణాలని వెలిగించుకుందామనుకున్నప్పుడల్లా అరచేతుల్ని సిద్ధం చేసేస్తావు ఏవో గుసగుసలు ముందస్తు సూచనలని పంపినట్లుగా అఖండ జలరాశి చుట్టూ తీరమే నగిషీ అవ్వనీ సరైన త్రోవకి మాత్రం దీపమందిరమే దిక్సూచి మరి… ఎదురుగా ఎంత బ్రతుకుంటేనేం నువ్వొక పిల్లంగోవిగా మారకపోతే నా జీవ శ్వాస వేణుగానమవ్వదుగా ఇంకేమీ అక్కరలేదు ప్రతి ఏకాంతంలో నువ్వుండటం తప్ప మనపై సన్నగా కరుగుతున్న మంచు ఒక నులి వెచ్చని విద్యుత్తుని వెన్నలా మనసులపై రాస్తుంటే దూరాల ధ్వని మొత్తం నిశ్శబ్దమైపోతుంది లోలోన ఒక బృందగానాన్ని ఆడంబరం చేస్తూ

Thursday, 29 September 2016

దూరమెంత దగ్గరో
కలగన్నంత సేపూ ఏ అసంబద్ధమూ
అబద్దమనిపించని
స్వప్న వ్యాకరణముంది చూశావూ
ఒక మాయా జాలమై
పువ్వు చాటున మాటేసిన కంటకంలా
మనసుపై తేమ రొద చేస్తూ
నా సర్వస్వాన్నీ నీలాల మడి లోకి విసిరేస్తుంది

నీ శ్వాసల లిఖితాలన్నీ కరిగి
గాలి లాలిత్యం చెరిగి పోతున్న వేళలో
హృదయాంతరాళాలన్నీ చెమ్మగా మారుతున్న
ఆర్ద్ర జ్వాలని ఒడిసిపట్టుకున్న
నా గుండె చప్పుడులో
ఒక ప్రళయం ధ్వనించటం
ప్రకృతి ఏకత్వంలోకి నడకని రాయడమే

మత్తిల్లిన గరికలు రాసుకున్న
నీలం గడ్డిపూల వరుసల సాక్షిగా
ప్రేమారా స్పృశించే
పచ్చిక లాంటి అనునయం
అనుభవంలోకి రానప్పుడు
ఒక దగ్గరితనానికే తెలుస్తుంది
దూరమెంత దగ్గరగా వచ్చేసిందోనని


Wednesday, 28 September 2016

చీకట్లో చిగురేసిన నెలవంకఅమావాస్య చీకటంటే చిరాకు పడటంలో అర్థం ఉందనుకుంటున్నావు నువ్వు చీకట్లో చిగురేసిన నెలవంక నిండు చంద్రుడై వెన్నెల కురుస్తున్న రాత్రిలోకి నడచి చూడు చీకటి సిగ ఉంటేనే జాబిల్లి పువ్వు విరుస్తుందన్న వివేకమొకటి మదిని తాకుతుంది పువ్వెనుక ముళ్ళుని చూసి సంకోచిస్తున్నావు నువ్వు ముల్లు గుచ్చుకున్నప్పుడు నొప్పనిపిస్తేనేం గులాబీ చేతికి అందిన అనుభూతికై ఎన్ని ముళ్ళ గాయాలనైనా ఆస్వాదించవచ్చనుకోవటం లేదూ జీవితాన్నీ అలానే చూద్దాం రా కష్టమొకటి తాకకపోతే జీవితానికి విలువ కట్టుకోవటం ఎంత కష్టమో తరచి చూడు నువ్వు దాటిన ప్రతి బాటనీ కష్టాన్ని చిలికితే వచ్చిన సుఖం ఇచ్చే ఆనందమెంత అందమో కదా

దుమ్ముదుమ్ము బాగా కమ్మేసినట్లుంది ఈ లోకాన్ని మతం దుమ్ము కులం దుమ్ము ప్రాంతం దుమ్ము జాతి దుమ్ము ఏదో ఒక్క దుమ్ము మీద పడని దేహం కోసం దాహించటం కుండీలలో మట్టినింపుకుని విత్తు ఎప్పుడు రాలుతుందా అని ఎదురు చూడటం లాంటిదే ప్రపంచం పుట్టి చాన్నాళ్ళయ్యింది ఆకాశం కొత్త విత్తులు విసిరేసే అవకాశమూ మృగ్యమయ్యింది విత్తు నాటాల్సింది నువ్వే దుమ్ము దులుపుకోవాల్సిందీ నువ్వే ఎందుకంటే ఇన్నాళ్ళుగా ఒక్క నిజమైతే మరచిపోయాం కొత్త అడవి పుట్టాలంటే మనమే విత్తులమై వానని హత్తుకోవాలని ఎంత దుమ్మైతేనేం మనని మనం దులుపుకోవడం మన చేతుల్లోనేనని


Tuesday, 27 September 2016

మనఃకంపంకొన్ని కొన్ని మనఃకంపాల వేళలని
ఒకరిలోకి ఒకరం ఒంపుకున్నప్పుడు కదా తెలిసింది
నిన్న పెదవుల చివర నుండి రాలిన నవ్వులన్నీ
గుండె గూటిలో ఒదిగిన తేమ నెగడులని
మనమేమో
తెర తియ్యాల్సిన అవసరం లేని రంగస్థలాలమని

అయినా తప్పెవరిదీ కాదులే
పుట్టిన చోటే నాటకరంగమై కొనసాగుతున్న వేళ
మన నటనలు సచేతనమై
ఒక్క శూన్యం ఆదరంగా అరుదెంచేస్తుంటే
శరణార్థులమై ఎదురేగిన అస్తిత్వాలమయ్యాక

అంతా తానయ్యాక అనంతమయ్యే అచేతనానికి
తానే చేతనమయ్యే వింత నిశ్శబ్దాన్ని ఆఘ్రాణిస్తూ
పులి మేకా జూదాన్ని ఆడుకుంటున్నట్లుగా
మనసుకింకా అతుకుపడని శూన్యం
ఇంకా నిర్వేదాన్ని పూర్తిగా ఒలకలేదు
నీలాల అలజడిని చిద్విలాసంగా చూస్తూ

నిండు ఖాళీల శిఖరాల పాదముద్రల్లో
కొండలని కూర్చోబెట్టుకున్న సాయంత్రపు
పైరగాలిని పీల్చుకున్న ఆకాశం కరిగిపోయి
నక్షత్రాలు నిలిచిపోయిన ఆ కాసేపూ
నిద్ర అలికిడి దూరమై
కళ్ళల్లో ఎదిగిపోతున్న రాత్రికి
నేనొక కరిగిపోని మోహం
నువ్వొక ఎదురుచూడని దాహం

Monday, 26 September 2016

వెతుకులాటవెతుక్కో మిత్రమా వెతుక్కో
గడియ పడిన ఘడియలంటూ లేని
ఉదయంలో నుండి సాయత్రంలోకి
నిన్నలో నుండి రేపటిలోకి నడుస్తూ వెదుక్కో

పారేసుకున్నది దొరుకుతుందేమోనన్న
ఒక్క వెతుకులాటలో
దొరికే ప్రతిదీ ఒక ఆణిముత్యమే

నీకోసమే
చరిత్ర దాచిన సత్యాలు
వర్తమానం రాస్తున్న పాఠాలు
భవిష్యత్తు దాపెట్టిన రహస్యాలు
ఒక్కొక్కటిగా బయలు పడుతూనే ఉంటాయ్

వెతుకు నిద్రలో
మృత్యువు గోచరమవుతుంది

వెతుకు వేకువలో
రెప్పల అలికిడినద్దుకున్న పుట్టుక నడిచొస్తుంది

వెతుకు నీలో
ఒక కొత్త నువ్వు పరిచయమవుతావు

నిరంతరమవ్వాలి నీ వెతుకులాట
తరం తరం సాగాలి త్రవ్వులాట
మనసు పరిచే మెరుపుల బాటలో
మనిషినొక నిథిగా కనుగొన్న చోట


చదును చేసుకోగుండె తప్పిపోయినట్లుంది బతుకునుండి
ఒక సవ్వడి లయ తప్పింది
విప్పబడాల్సిన రెప్పలు
కన్నీళ్ళని కప్పేస్తూ అచేతనమైనప్పుడు
కలల్ని కప్పుకుంటూ నిద్రలేచిన జీవితం
ఆబగా వెలిగించుకుంటుందొక అంధకారాన్ని

చీకటంతే
చటుక్కున అంటుకుంటుంది
భ్రమల చమురుకు కొరత లేనంత వరకూ
తిమిరపు తీరంపై
పాద ముద్రలు కొనసాగుతూనే ఉంటాయ్

మెరుపు శాశ్వతమవ్వాల్సిన తావులో
మిణుగురులని చూసి మురిసిపోయే
యదార్థాల విస్మృతిలో
స్మృతికొచ్చే ప్రతీదీ కంటకమై
మనసుని మూర్ఖంగా గుచ్చేస్తుంటాయ్

విరిగిపడుతున్న కలల భారంతో
మనకి మనం బరువైన చోట
కళ్ళకి ఒక గుప్పెడు నిద్రని
బహుమతినివ్వటానికి
మనల్ని మనం
చదును చేసుకోవటం మొదలు పెట్టాల్సిందే
Sunday, 25 September 2016

ఆదివారంఆదివారం ఎప్పుడూ ఇంతే
నింపాదిగా నిద్ర లేపుతుంది
బద్ధకం వళ్లు విరుచుకునేలోగా
మధ్యాహ్నం ఆవురావురుమంటుంది
సాయంత్రం చేసే సందడిని
దగ్గరుండి చూద్దామనేమో
రాత్రి వడివడిగా వచ్చేస్తుంది
నిద్రపరదాలని మోసుకుంటూ
కళ్ళపై హడావిడిగా వాలిపోతూ

ఎప్పుడూ ఇంతే
నా ఆదివారానికి గంటలు కుదించబడుతున్నాయ్
ఆరువారాల కుట్రలో
ఆదివారం రెక్కలు కత్తిరించబడుతున్నాయ్

ఏయ్.. ఆదివారమా
ఒక్కసారి పూర్తిగా నీలోకి తప్పిపోవాలని ఉంది
మరి నన్ను దాచెయ్యవూ !!


Saturday, 24 September 2016

నాన్నని చదువుతూనే...మెట్ల దగ్గరే ఎదురవుతుందో ఆహ్లాదం
కుబుసుంలా అంటి పెట్టుకున్న అలసటని
ఒక్క నవ్వుతో వలిచేస్తూ
నాపై పసి గారాల వలవేస్తూ

వెంటవచ్చిన తేమ పాదాల్ని వలసపంపిస్తూ
తేనె గమకాల ఆలాపనలా తనని అనుసరిస్తూ
ఇక వెనక్కి తిరగాలనిపించదు

నాదైన నిశ్శబ్దానికి ఉరివేస్తూ
అలలు అలలుగా తడిమే
గాలిని చప్పరిస్తూ
ఒకరి చప్పుడులో ఒకరం
రోజుని వెచ్చబెట్టుకుంటూ
సేదతీరుస్తున్నప్పుడు
మెత్తగా అడుగుతుంది తాను

‘నాన్నా!
నువ్వు నడక నేర్చుకున్న అడుగుల్ని
దగ్గరినుండీ చూడాలని పిస్తుంది
నువ్వు నవ్విన ప్రతి నవ్వునీ
మొదటినుండీ వినాలనిపిస్తుంది
ఎలానో చెప్పవూ..!’ అంటూ

ఎంతైనా ఆడపిల్ల కదా
సరాసరి నాన్న గుండెని చదువుతూనే
ఎదుగుతుందనుకుంటా !

Friday, 23 September 2016

ప్రకరణంనీలోని ఔన్నత్యాల జాడ తెలిసే వరకూ
ఒక జీవన విధ్వంసం
పరాచకాలాడుతూనే ఉంటుందక్కడ
నీ రోజుకి తానింకా మకుటధారినేనని

నీకు నువ్వు ఒక్క సుషుప్త గుహగా
కొనసాగుతున్న అతి నిశ్శబ్ద గాఢ నిద్రలో
చీకటొక ప్రగాఢ ప్రకరణంగా
రాయబడ్డ చోట
నిర్వ్యాపకంగా ఉందనిపించే
ప్రశాంత వాక్యమొక్కటి మళ్ళీ మళ్ళీ
కళ్ళకి గాలమేస్తుంటే తెలిసింది
మనమంటూ వెతకం కానీ
సమస్యతో పాటుగానే సమాధానమూ
ఛాయలా వెన్నంటి ఉంటుందని

నీలం చీరపై తెల్లపూల వరసలా
కదం తొక్కుతున్న నక్షత్రకేళి చుట్టూ
ఎంత శూన్యం కప్పబడి ఉంటేనేం
దిగంతాలను దాటుకుంటూ వచ్చి
నీ కళ్ళని వెలుగై చుట్టుకోవడమే
విశ్వం రాసిన ధనాత్మక కవిత్వమనిపించటం లేదూ

ఓరిమి కొనసాగింపుతో
ఓటమి నిష్క్రమించడం
గాయాల లేపనంగా
గెలుపు అరుదెంచడం
పరిచయించే పాఠమొక్కటే

నువ్వున్నచోటే
నీ నీడ ఉంటుందని
ఋణాత్మకమున్న చోటే
ధనాత్మకపు మోహరింపన్నది
ప్రకృతి రాసిన వ్యూహాత్మకపు నమ్మకమని