మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Showing posts with label Social. Show all posts
Showing posts with label Social. Show all posts

Sunday, 17 September 2017

అమృతమంటే...

వెలసిపోయిన కాగితాలను
చూసిన కథలున్నాయి గానీ
వెలసిపోయిన అక్షరాల
చరిత్ర ఎక్కడా కనపడలేదు.

మనసుకి చేరిన అక్షరాలు
చరిత్రలో కొనసాగటానికి
ఏ శాసనాలూ… కాగితాలూ
అవసరం లేదు

అప్పటికే అవి

తమ విలువని
ఉన్నతంగా రాసేసుకున్నాయి మరి

అందుకే అనిపిస్తుంది
అక్షరమంటే అమృతమని
నేటి అమృతమంటే అక్షరమని

Monday, 11 September 2017

నాలుగు రంగుల ఝండా

మనకెప్పుడూ అబద్దమంటేనే ఎక్కువ ఇష్టం . ఇదే అసలైన నిజం.

మూడు రంగుల జండా ముచ్చటైన జండా అంటూ పెద్దగా కనిపించే రంగులనే నిజం అంటూ మనల్ని మనం మభ్య పరచుకుంటూ నాలుగవ రంగైన నీలాన్ని మనం ఎప్పుడూ బయటకు తీయలేదు. ఝండాలో నాలుగు రంగులు ఉండటం అబద్ధమా? మరెందుకు మనం గుర్తించం?

ఎందుకంటే మనం అబద్ధాలని నమ్మటానికి అలవాటు పడ్డాం. అంతేనా అవే అబద్దాలని నిజాలని ప్రచారం చెయ్యటం లో సిద్ధహస్తులయ్యాం. ఎక్కడన్నా ఒక గొంతు నిజాన్ని మాట్లాడటం మొదలు పెట్టిందా… తన మీద అన్ని రకాలుగా దాడి చేసేస్తాం.  

ఇన్నాళ్ళుగా అబద్ధంగా కొనసాగుతున్న ఒక నిజాన్ని మాట్లాడటానికి చాలా ధైర్యం కావాలి. కళ్ళకి కనిపించే ఒక నిజాన్ని మనం గుర్తించలేకపోతున్నామంటేనే అర్థమవుతుంది… ఎడతెగని ప్రచారం అబద్ధం చాటున నిజాన్ని ఎలా సమాధి చెయ్యగలదో !

చూద్దాం ఇంకెన్ని తరాల తరువాత నాలుగు రంగుల ఝండా నలు చెరగులా ఎగిరే ఝండా అని అంటారో...


Monday, 8 May 2017

మన రాతలకి మనమే...

మనమొక వార్తగా మారాలంటే ఈ రోజు ప్రధానవార్తని మన హస్తగతం చేసుకోవాలి. అభినందనో… విమర్శో అతి తీవ్రంగా ఉండాలి. అది వ్యక్తిత్వ సరిహద్దుల్ని దాటిపోవాలి.

ఇదే కదా నేటి సమాజ పోకడ.

ఈ సమాజంలో భాగస్వాములుగా ప్రతి విషయం మీద ఎంతో కొంత విషయ పరిజ్ఞానం ఉండాలి. మన అభిప్రాయాలని మనం వెలిబుచ్చే హక్కు మనకు ఉంది. అవును నిజమే. మనకి హక్కులున్నాయ్. ఉండాలి కూడా. మన రాతలకి మనమే సంపాదకులం . అలాంటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే లేనిపోని అసమానతలకి దారి తీసిన వారిమే అవుతాం. ఉన్న సమస్యలకి తో కొత్త సమస్యలు సృష్టించిన వారిమే అవుతాం.

నేటి తాజా వార్త కోసం  లేని కోడిగుడ్డు మీద ఈకలు ఉన్నట్లుగా కొందరు… వాటిని పీకటానికి సిద్ధంగా మరికొందరు.  అందుకోసం ప్రపంచంలోని ప్రతి సమస్య మీద మనకు  సంపూర్ణ అవగాహన ఉన్నట్లుగానే నటించేస్తూ ఉండాలి. లేదంటే మన మేథావితనం పలచబడిపోతుంది.

నిజానికి ప్రతి  వార్తాసంస్థ నుండి వచ్చేది  ఏదో ఒక పక్షం తీసుకుని వండి వార్చే వార్తలే… వాళ్ళ దృక్కోణం నుండి వాళ్ళు చేసే వాఖ్యానాలే మనం రాసే చాలా రాతలకి ఇన్ పుట్స్. సౌర్స్ లోనే లేని నిజాయితీ,  వాటి మీద   మనమెంత నిజాయితీగా మన వ్యాఖ్యానం సిద్ధం చేసినా విలువ సంతరించుకుంటుందా?  

సమర్ధింపో… విమర్శో విషయమేదైనా సరే ఆవు వ్యాసంలా..;  ఆ విషయంలోకి మనకి నచ్చిన వాడినో/ నచ్చని వాడినో తీసుకుని రావాల్సిందే. లేదంటే చెప్పాలనుకున్నది సరిగ్గా పండినట్లుగా అనిపించదు.

పనిగట్టుకుని చేసే పొగడ్త అయినా విమర్శ అయినా అది మనకి తెలియకుండానే యథార్థవాదానికి చాలా దూరంగా జరిగిపోతూ ఉంటుంది. మనుషుల్ని వ్యక్తిగత పొరపొచ్చాల వైపు నడపటం తప్ప వీటి వలన ఉపయోగం ఏమీ ఉండదు. నిజానికి ఏ విషయం పైన అయినా సమీక్ష జరగాలి. ఆ సమీక్ష లోనే ఆ విషయంలోని బలాలు, బలహీనతలు చెప్పబడాలి. అప్పుడే పొగడ్త… విమర్శ రెండూ ఒకే చోట ఇమిడి ఒక ఆరోగ్యవంతమైన చర్చకు దారితీస్తుంది. లేదంటే మనకి తెలియకుండానే (తెలిసి కూడాను) కొత్త వివాదాలకి దారి తీస్తుంది.

మనసులో నమ్మక పోయినా, మనకి ఇష్టం లేని వాడు చెప్పేవన్నీ పస లేని వని, మనకిష్టమైన వారు చెప్పేవన్నీ చాలా చక్కనివని ఒక ప్రచారంలోకి దిగిపోతున్నాం.  మనం నమ్మినదాన్ని నమ్మని వాడిని మనకి అయిష్టుడిగా, సమర్ధించిన వాడిని ఆప్తుడిగా మార్చుకుంటున్నాం.

బాధాకరమైన విషయం ఏమిటంటే…

ఇలాంటి వాటికే ఒక అనుచరగణం తయారవుతుంది. చాలా చోట్ల ఏ విషయంలోనూ లోతుపాతులు అసలు తెలియకుండానే ఏదో ఒక పక్షం లో చేరిపోయి అప్పుడప్పుడే రాజుకుంటున్న నిప్పును మరింత ఎగదోస్తూ ఉంటారు.  ఎవరి పక్షం ఎవరో తేల్చేది కులమో, మతమో, ప్రాంతమో, వర్గమో… మనం నమ్మే రాజకీయ పక్షమో తప్ప మనం నమ్మే సిద్ధాంత భావజాలం కాదు.

ఇన్నాళ్ళుగా నేర్చుకున్న విజ్ఞానమంతా పక్కకుపోయి, అప్రధానమైన  విషయాలకోసం ఒక రణరంగాన్నే సిద్ధం చేసుకుంటున్నాం. పిచ్చి పిచ్చి విషయాల మీద మనం చేసుకునే వాగ్యుద్ధంలో మనం కోల్పోయేది మాత్రం మనమంటూ మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేని విలువ కట్టలేని సమయమే.

సిద్ధాంత వైరుధ్యాల మీద చర్చ జరగాలి కానీ వ్యక్తిగత లోపాల మీద కాదు. ఎప్పుడైతే చర్చ వ్యక్తిగతమవుతుందో, రెండు సిద్ధాంత వైరుధ్యాల  గురించిన్ చర్చలో బయటకి వచ్చే ఎన్నో అమూల్యమైన వ్యక్తీకరణలు మృగ్యమవుతాయ్.


చివరకి చూసుకుంటే వ్యక్తిగత వైషమ్యాలు కొనసాగుతూ ఉంటాయ్. కొనసాగుతూనే ఉంటాయ్.


Sunday, 23 April 2017

బుగ్గ కార్లకే కాదు…

గుడికెళ్ళినా బడికెళ్ళినా వేడుకైనా వేదికైనా ప్రముఖులంటూ మెహార్బానీ  చేస్తూ… సామాన్యుడి సమయాలకి ఎదురుచూపుల కళ్ళెమేసే రాచ బానిసల కార్యశీలతలో మాన్యుడు సామాన్యుడిలో కలిసేదెక్కడ?

భుజాల మీద చేతువేసి తట్టగానే జీవితమే ధన్యమయ్యిందనుకునే అమాయక జీవాలకి,  

ఉరుకుల పరుగుల జీవన యానంలో మనిషి మనిషియొక్క ప్రతి క్షణానికీ విలువ ఉందని తెలిసీ , ప్రముఖుల కోసమంటూ  రహదారులని దిగ్బంధం చేసే అధికారం రోడ్డంతా పరిగెడుతూనే ఉంది. అడుగు పెట్టిన ప్రతి చోటా VIPలంటూ ప్రత్యేక హోదా ఇచ్చేస్తుంటే మా సమయాలకి విలువెక్కడ?

కార్ల మీద బుగ్గలు తీసెయ్యగానే సామాన్యులు మాన్యులైపోతారా ఏం. మాకు మీరనే VIPహోదా వద్దులే ఆర్యా! మనిషన్న హోదా మిగిల్చితే చాలు.

ప్రజాస్వామ్య దేశంలో బుగ్గ కార్లకే కాదు… ‘బుగ్గ’ మనస్తత్వాలకీ మంగళం పాడి చూపించండి  

Saturday, 13 June 2015

మానసికశక్తి

ఎవరి వృత్తాలలో / పరిధులలో వాళ్ళు బతుకుతున్నప్పుడు ఎలాంటి సమస్యా ఉండదు కానీ పక్కవాడి పరిధుల్లోకి వెళ్లి కెలికితే అన్నీసమస్యలే. మానసికశక్తితో ఎన్నో రుగ్మతలు నయం అవుతాయని సైన్స్ పరంగానే ప్రూవ్ అయ్యింది. దేవుడున్నాడనో / లేడనో నమ్మకాన్ని ఒకరికొకరు గేలిచేసుకోవటంవల్ల ఆ నమ్మకం ఇచ్చే మానసికశక్తి దూరమై సమాజానికి చెరుపు తప్ప మంచి చెయ్యదు.

Thursday, 22 August 2013

నేను మనిషి గా మారితే?

నేనునా కుటుంబంనా స్నేహితులునా చుట్టాలు నా కులం నా జాతి నా మతంనా భాష నా వీధినా ఊరునా మండలం నా తాలూకానా జిల్లానా ప్రాంతంనా రాష్ట్రం 

ఇవన్నీ దాటాకే వస్తుంది కదా మనలో... ‘నా దేశం’ అనే భావన. 


నా దేశం అన్న భావన నే జాతీయ వాదం అంటారే... అలాంటి జాతీయ భావం రావటానికి మనం ఇన్ని ‘నా’ లను దాటాల్సి వస్తుంది కదా... అసలు వీటన్నిటికన్నా ముందు నేను ‘మనిషిని’ అన్న విషయం ఎందుకు మర్చిపోతున్నాం? ఎన్ని జాతీయ వాదాలు ఒక్క మానవతా వాది ముందు నిలబడ గలవు?


ప్రతి వాడు పక్క వాడి నుండి ప్రమాదం పొంచి ఉందనుకునే అంత ప్రమాదకరమైన పరిస్తితుల్లో, తన నీడనే తను నమ్మ లేక శత్రువేమో అనుకునేంత కల్లోలం లో ప్రపంచం నిండి పోయి ఉంది. 



అసలు మనిషిని మనిషిగా చూసే మానవతావాదం ఈ విశ్వమంతా వ్యాపిస్తే ఈ ప్రాంతీయవాదాలు, జాతీయ వాదాలు నిలబడగలవా?

Saturday, 4 September 2010

నాయకుల అనారోగ్యాలకూ ప్రజావసరాలు బలి అవ్వాలా?




ప్రజల అవసరాల కోసం ప్రారంభిస్తున్న కొత్త రైళ్ళకి ఏ అనారోగ్యం లేకుండానే (పట్టాలు ఎక్కకుండానే) విశ్రాంతి నిచ్చేసారు రైల్వే శాఖ వారు.

రైలు పట్టాలు ఎక్కాలంటే కావాల్సింది ప్రయాణికులూ మరియు సిబ్బందీ, కానీ రైల్వే వారికి ముఖ్యమంత్రి కావాలట.

కొత్త రైలు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రే కావాలని వారు అనుకుంటే, రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా వేరే రైలు వెయ్యాల్సింది. అంతేకానీ ఒకరోజు ముందు రేపటి ట్రైన్ రద్దు అయ్యింది డబ్బులు తిరిగి ఇస్తాం అంటే ప్రయాణికుల పట్ల వీరికి ఉన్న బాధ్యత బాగా అర్ధం అవుతుంది.

సామాన్య ప్రజల అవసరాల కన్నా అధికారంలో ఉన్న నాయకుల మెప్పుదలే ముఖ్యం అన్నట్లు వారు చేసిన పని.

ఓ మనిషి అనారోగ్యానికి వేలమంది ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి?

మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆరోగ్యం గా ఉంటారో అప్పుడే ప్రారంభిస్తారా ఏమిటి ఈ రైళ్ళు? నాయకుల అనారోగ్యాలకూ ప్రజావసరాలు బలి అవ్వాలా.

(news courtesy: ఈనాడు)

Friday, 3 September 2010

శ్రీధర్ కార్టూన్ లో తప్పేంటి?




ఈ రోజు ఈనాడు పేపర్లో  ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మీద కార్టూనిస్ట్ శ్రీధర్ వేసిన కార్టూన్ కొంతమందికి అభ్యంతరకరంగా అనిపించిందట. ఆ కార్టూన్ ఒక వయోవృద్ధుడి అనారోగ్యం మీద వేసిన కార్టూన్ అని వారి భావన.

రోశయ్య గారు వయో వృద్దులు మాత్రమే అయి ఉంటే శ్రీధర్ ఆ కార్టూన్ వేస్తే అభ్యంతరకరం ఏమో కానీ రాష్ట్రాన్ని నడిపించాల్సిన ముఖ్యమంత్రి తరచూ అనారోగ్యం బారిన పడుతున్నప్పుడు ఆ కార్టూన్ లో అభ్యంతరం ఏముంది.

అది ముఖ్యమంత్రి అనారోగ్యం మీద వేసిన కార్టూన్ గా మాత్రమే నాకు అర్ధం అయ్యింది కానీ ఒక వృద్ధుడిని అపహాస్యం చేసిన కుసంస్కారం అందులో నాకు కనిపించలేదు.

దశాబ్దాల తరువాత ఒక మంచి ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు, తమ పార్టీ మహానాయకుడు గతించి ఏడాది గతించిన సందర్భంగా అంజలి ఘటించటానికి సహకరించని ఆరోగ్యం మన ముఖ్యమంత్రి ది.

పెద్దవాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకోవటం చాలా అవసరమే కానీ అది అనుక్షణం ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పదవుల్లో కూర్చోబెట్టి మాత్రం కాదు.

మామూలు ఉద్యోగులు 58/60 సంవత్సరాల వయసు దాటితే ప్రభుత్వానికి పనికి రారు కానీ 75/80 సంవత్సరాలు దాటిన, నిలబడితే కూర్చోలేని, కూర్చుంటే నిలబడలేని వృద్ధనాయకులు మాత్రం బాగా పనిచెయ్యగలరట. రాజకీయ నాయకులకు వాళ్ళు చనిపోయినప్పుడు కానీ రిటైర్మెంట్ రాదు.

అయినా రాజకీయాల్లో యాభై ఏళ్ల వాళ్ళని యువ నాయకులుగా భావించే మన దేశం లో 90 ఏళ్లు వచ్చినా అది పెద్ద వయసు అనిపించదు కదా.... ఏమంటారు?

మీ

స్నేహితుడు



Sunday, 22 August 2010

తెలుగు తల్లి అంటే ఉలుకు ఎందుకు?


ఎప్పుడు చూసినా టి. ఆర్. యస్ అధ్యక్షులు తెలుగు తల్లి అంటే మండి పడుతూ ఉంటారు. అది ఎందుకో నా మట్టి బుర్రకు ఎప్పుడూ అంతుపట్టదు.

తెలుగు తల్లి అనేది తెలుగు భాషకు మాతృస్తానం ఇచ్చి తెలుగు ప్రజలందరూ గౌరవించు కోవటం అనుకుంటున్నాను. తెలంగాణలో ఉండాల్సింది తెలుగు తల్లి కాదు తెలంగాణా తల్లి అనటం ఏమిటో దానికి తెలంగాణా మేధావులు వంతపాడటం ఏమిటో నాకు అర్ధం కావటం లేదు. తెలంగాణా కావాలనుకునే వారి ఆకాంక్ష ను నేను తప్పు పట్టటం లేదు. తెలంగాణా, కోస్తాంధ్ర, రాయల సీమ అనేవి త్రిలింగ దేశం లోని వివిధ ప్రాంతాలకు ప్రతిరూపం గా చెప్పుకునే పేర్లు. కానీ తెలుగు అనేది ఈ మూడు ప్రాంతాల ప్రజలు మాట్లాడుకునే భాష. మాండలికాలు, యాసలు వేరు అయినంత మాత్రాన మాతృభాష మారదుగా.

తెలుగు తల్లి అనేది తెలుగు ప్రజలందరికి తల్లే కదా? తెలంగాణా లోని భాష తెలుగు కాదా? ఆంధ్ర తల్లి అనో సీమ తల్లి అనో అని ఎవరన్నా అంటే అప్పుడు తెలంగాణా తల్లి అనే వాదన తీసుకు రావటం లో అర్ధం ఉంటుంది.

భాషకు మాతృస్తానం ఇచ్చి నప్పుడు ఏ ప్రాంతం వారు అయినా దాన్ని వ్యతిరేకించటం అర్ధ రహితం. తెలంగాణా కావాలనుకునే ఆకాంక్ష కోసం తెలుగు భాషను చిన్నబుచ్చ వద్దు.

మీ

స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Tuesday, 2 February 2010

ఓ లక్ష్మణ రావు గారూ



ఓ పసితనం మాడిన వేళ, ఓ పితృ హృదయం ఆగిన వేళ యావత్ ప్రపంచం దృష్టీ అక్కడే ఉంది. కసాయి వెధవలు కిరాయి కోసం చేసిన ఘాతుకాన్ని అందరూ ఖండించటం నిజం గా హర్షణీయం.

కానీ వీళ్ళ కుటుంబ వ్యవహారాలతో ఏ సంబంధం లేని ఓ పేద డ్రైవర్ హత్య మాత్రం ఏ ఒక్కరి కంటికీ ఆనక పోవటం (ప్రధాన మీడియా తో సహా) అంటే బాధాకరం. నా వరకూ నాకు ఎవరి హత్య అయినా ఒక్కటే. కారు డ్రైవర్ లక్ష్మణ రావు, చిన్నారి తల్లి వైష్ణవి ల హత్యలతో ప్రత్యక్షం గా, వైష్ణవి తండ్రి ప్రభాకర్ చావుకి పరోక్షం గా సంబంధం ఉన్న నరరూపరాక్షసులు అందరినీ బహిరంగంగా ఒక్కొక్క అవయవాన్ని రంపాలతో కోసి చంపాలి.

కిడ్నాప్ కి గురైన రోజున (చనిపోయిన వార్త తెలిసేంత వరకూ) నాగ వైష్ణవి పేరు గానీ, ఆమె తండ్రి ప్రభాకర్ పేరు గానీ తెలియని వారే లేరు. కానీ తనకు సంబంధం లేని గొడవల్లో తొలి సమిధగా మారిన కారు డ్రైవర్ లక్ష్మణ రావు పేరు ఎంత మందికి తెలుసు. చావుకి పేదైనా గొప్ప అయినా ఒక్కటే. ఓ పేద కుటుంబంలో సంపాదించే వ్యక్తి పోతే ఆ కుటుంబానికి ఆలంబనే ఉండదు. తన కోసం మనమేమీ చెయ్యలేకపోయినా అశ్రువొక్కటి ధారపోద్దాం.

ఓ లక్ష్మణ రావు గారూ, అందుకోండి మీ ఆత్మశాంతి కోసం నా అశ్రు నివాళి.

మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Friday, 8 January 2010

హలో... బ్లాగ్ స్నేహితులూ... తస్మాత్ జాగ్రత్త ...




ఏదో దిక్కు మాలిన వెబ్ సైట్ ఓ ఊహా జనిత కధనాన్ని ప్రచురిస్తే తమ తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మీడియా ముసుగులో ఏదో సినిమాకథ లాంటి ఆ కధనాన్ని జనాల మీదకు వదిలాయి మన తెలుగు వార్తా సంస్థలు. ఎప్పుడే గొడవ చేద్దామా మన దురద తీర్చుకుందామా అని కాచుకుని కూర్చునే రాజకీయ రోమియోలు, వాళ్ళ అనుచరులు రాత్రి కి రాత్రి అరాచకం సృష్టించేసారు. రాబోవు పరిణామాలు ఆలోచించకుండా తమ టి.ఆర్.పి రేటింగ్స్ కోసం ప్రసారం చేసిన కథనమో, మరి కొందరు అంటున్నట్లు రాజకీయ కుట్రలో భాగమో  మనకు తెలియదు కానీ మన బ్లాగు సోదరులు చాలా మంది కూడా ఆ కథనం ప్రభావంలో పడి పోయి నేను అప్పుడే చెప్పాను అలా జరిగి ఉండవచ్చు అని, ఇలా జరిగి ఉండవచ్చు అని మళ్ళీ బ్లాగేశారు.

కానీ బ్లాగ్ స్నేహితులూ... తస్మాత్ జాగ్రత్త....

మీరు రాసే మీ ఊహాజనిత కధనాలు ఏ ఛానల్ వాడికో తెగ నచ్చేసి వాటిమీద ఏ వెర్రి వెంగళప్పతోనో చర్చ పెట్టేసి ఓ మూడు నాలుగు గంటల పాటు చర్చ పెట్టేసినా పెట్టేస్తారు పలానా బ్లాగ్ లో ఇలా అంటున్నారు అని. ఇలాంటి కథనాల కోసమే కాసుక్కూచ్చునే బాచ్ తెగులునాట ఏ మూల కెళ్ళినా రెడీ గా ఉంటారని ప్రత్యేకం గా మళ్ళీ చెప్పాలా నిన్న రాత్రి జరిగిన దాన్ని చూసాక.

బ్లాగ్ పాపులారిటీ ఏమో గాని ఆనక పోలీసుకేసులూ గట్రా మన నెత్తి మీదే. ఆ రష్యా వాడైతే మన వాళ్లకి వెంటనే దొరక్క పోవచ్చు కానీ మనమైతే వీళ్ళ చేతులకి చిక్కటం క్షణాల్లో పని.

ఇక నుండి ఇలా జరిగి ఉండవచ్చు అలా జరిగి ఉండవచ్చు అని మనం చెప్పాలన్నా మీడియా దెబ్బ కి మన జాగ్రత్త లో మనం ఉండాలి. కాబట్ట్టి బ్లాగ్ స్నేహితులూ... తస్మాత్ జాగ్రత్త.....

మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Thursday, 7 January 2010

మనం మనుషులమా గొర్రెల మందల్లో గొర్రెలమా?



దాదాపు గత రెండు నెలలు గా మన రాష్త్రం లో జరుగుతున్న పరిణామాలు, వాటి పై కొంతమంది జనం స్పందిస్తున్న తీరు చూస్తుంటే పై అనుమానం రాక మానటం లేదు.

ఏమిటీ గత కొంత కాలం గా మనకీ మంట?.

తెలుగుజాతికి ఏదో పీడ పట్టినట్లు మనలో మనమే కొట్టుకోవడం.

పాకిస్తాన్ ఇండియా సైనికుల్లా, కాలికి కత్తి కట్టిన పందెంకోళ్ళలాగా రెండువర్గాలుగా మనం విడిపోయి కొట్టుకొంటుంటే ఏదో రిఫరీ లా ఆ అరవ చిదంబరం గారు ఉన్నట్లు ఉన్నారు.

జై తెలంగాణా అన్న నాయకుల సంబంధీకులు కానీ, జై సమైఖ్యాంధ్ర అనే నాయకుల బంధుగణం లో కానీ ఎవరైనా ఆత్మాహుతి చేసుకున్నారా.? సామాన్య జనం తప్ప. వాళ్ళు జై అని మాత్రమే అంటారు... తమ రాజకీయ పునాదులు ఆ నినాదాల్లో తవ్వుకుని ఉంటారు కాబట్టి! కానీ మనం మాత్రం గొర్రెల మందల్లా జై జై అంటూ ఆత్మార్పణం చేసుకుంటూ ఉంటాం. ఆ ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తుల కుటుంబాలు పడే క్షోభని ఈ రాజకీయ నాయకులు, విద్యాలయాల్లో చదువులు చెప్పటం మాని ఉద్యమాలు ఎలా చెయ్యాలో చెప్పే అధ్యాపకులు తీర్చగలరా?

మన ఆస్తులు మనమే నాశనం చేసుకుని మనం బాపుకున్నదేమిటి. బస్సు చార్జీల మోత తప్ప. రవాణా చార్జీల పెంపు ఒక్కటి చాలు మనలాంటి సామాన్యుల జీవితాలని అస్తవ్యస్తం చెయ్యటానికి. ఎందుకంటే మనం ఉపయోగించే ప్రతి వస్తువు ఖరీదులోనూ రవాణ చార్జీ మిళితం అయి ఉంటుంది కాబట్టి.

ఈ రోజున ప్రభుత్వాన్ని మనం గట్టిగా నిలదీయగలిగే నైతికత మనలో ఉందా.? ప్రభుత్వ ఆస్తి అంతే పౌరుల ఆస్తే కదా. మన ఆస్తి మనమే నాశనం చేసుకుని ప్రభుత్వాన్ని ఏమని అడగగలం.

ఉద్యమాల ముసుగులో అరాచక శక్తులకు ఊతం ఇవ్వడం తప్ప ఇంతవరకూ ఎవరికి అయినా ఒరిగింది ఏమిటి.? గొర్రెల మందల్లో గొర్రెల్లా ముందున్న వాడిని అనుసరించి మన జీవితాలని నాశనం చేసుకోవటం తప్ప?

మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Friday, 18 September 2009

వెయ్యి కోట్ల డీల్సూ... మర్డర్ల మాటలు


అయ్యా.... రోశయ్య గారూ ....

ముఖ్యమంత్రి గారి ఫోన్ టాపింగ్ చేస్తున్నారంటే నేనేమన్నా వెయ్యి కోట్ల డీల్సూ.. హత్యల గురించి మాట్లాడతానా.... నేను ఊళ్ళో వర్షాలు ఎలాపడుతున్నాయి. మన వాళ్లందరూ బాగున్నారా? అనే మాట్లాడతాను కాబట్టి నా ఫోన్ టాపింగ్ చేసినా నాకేం బాధ లేదంటారా...

అసలు ఒక అధికారంలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా అవి. బుద్ధీ జ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి ఎవరన్నా అలా అంటారా....

వెయ్యి కోట్ల డీల్సూ... మర్డర్ల మాటలు ఫోనుల్లో మాట్లాడుకునే రోజులా ఇవి...

అయినా ఇక్కడి సమస్య మీరేమి డీల్స్ మాట్లాడుతున్నారో అని కాదు. ముఖ్యమంత్రిగారి ఫోన్ నే టాపింగ్ చేస్తున్నారే అని.

స్కాం లు చేసి ఇరుక్కున్నా మీ లాంటి రాజకీయ నాయకులు బయటకి రాగలరు. కాబట్టి మీలాంటి వాళ్లకి టాపింగ్ లో లెక్క కాదు కానీ... సామాన్యుల దృష్టి లో ముఖ్యమంత్రి స్తాయి ఎంత దిగజారుతుంది.

ప్రభుత్వాధినేత కనుసన్నల్లో మెలగవలసిన అధికారవర్గం & మంత్రివర్గం షాడో ప్రభుత్వాధినేత ఇంటిదగ్గర పెంపుడు కుక్కల్లా, అతను ఆడించినట్లల్లా ఆడి ముఖ్యమంత్రిని ఖాతరు చేయకుండా తన పైకే నిఘా వేస్తే ఇక తమకు నచ్చని వ్యక్తుల విషయం లో వాళ్ళు ఎంత దూరమైనా పోగలరు కదా?

45 ఏళ్ల రాజ కీయ జీవితం మీకు నేర్పిన సంస్కారం ఇదేనా...?

మీ మాజీ నేత రాజీవ్ గాంధీ మీద నిఘా వేసారని ఆరోపణతో ఒక ప్రభుత్వాన్నే కూలదోసిన ఘనత గల పార్టీ తమరిది. మరి ముఖ్యమంత్రి ఫోన్ మీద నిఘా అంతే చిన్న విషయం అయిపోయిందా?

మీ

స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Thursday, 17 September 2009

మంత్రదండం బయటకి తీసి ఖజానాని నింపి వెయ్యవయ్యా....


తట్టాబుట్టా సర్దుకుని ఇక రాజకీయాలు చాలు... శాసనసభలో నాగం జనార్ధన రెడ్డి తో వేగలెక చస్తున్నాను అంటే నీలాంటి మాటకారి మాయలోడు లేకపోతే ప్రతిపక్షాలతో వేగటం చాలా కష్టం అని మీకు క్రీడాప్రాంగణంలాంటి శాసన మండలిలలో కి పంపారు మీ నేత వై.ఎస్. నక్క తోకను తొక్కితే అదృష్టం పట్టినట్లు, వై.ఎస్ పోయి నిన్ను అందలాన్ని ఎక్కేట్టు చేసారు. అది బాగానే ఉంది.

నిన్నటి వరకూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బెమ్మాండం అని వై.ఎస్సూ నువ్వూ తోడు దొంగల్లా ఒకే మాట వల్లే వేస్తుంటే నిజమే కామోసూ... రిసెషన్ టైం లో కూడా మన ఆంధ్ర ప్రజానీకానికి మీలాంటి అమాత్యులు దొరకటం మా పూర్వజన్మల పుణ్యమేమో అనుకున్నాం.

కానీ ఇదేన్దయ్యా.... ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులన్నీ ఆపెయ్యటం. ఇది దేనికి సూచన?

మాటల మరాఠీ గాడివైన నువ్వు మాత్రం యథాప్రకారం ఆర్ధిక క్రమశిక్షణ కోసం అలా చేస్తున్నాం అంటూ ఏదేదో చెపుతున్నావు. కానీ లోపాయికారీ వార్తల ప్రకారం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ బిల్లులు చెల్లిస్తే తరువాతి జమా ఖర్చుల కోసం ఓవర్ డ్రాఫ్ట్స్ కోసం పరుగులు పెట్టాలి అంటున్నారు.

అంతే కాక మీ మానిఫెస్టోలో చెప్పిన 9 గంటల ఉచిత విద్యుత్ & రేషన్ బియ్యం కోటా పెంపు వాయిదా అన్నట్లు వార్తలు వస్తున్నాయి. రేషన్ కార్డుల ఏరివేత తరువాత కోటా గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నారట. మరి ఎన్నికల ముందు కూడా మీ జమానానే కదా ఉంది. అప్పుడు తెలియలేదా బోగస్ రేషన్ కార్డుల సంగతి. ఏదో సంతర్పణలాగా మరీ పంచిపెట్టారు కదా తెల్ల కార్డులు. అప్పుడవి మీ వోట్ల కార్డులన్న మాట.

ఇప్పుడు ఖజానా ఖాళీ అయ్యేసరికి మీకు బోగస్ కార్డుల విషయం అర్జంటుగా (మీ వై.ఎస్. గారు భువి పై తిరుగాడుతున్నప్పుడే) గుర్తుకు వచ్చింది. ఏమి మాయలయ్యా మీవి?.

దొంగలెక్కలతో (రాజకీయ నాయకులు కాబట్టి మీ దొంగ లెక్కలన్నీ అసెంబ్లీ లో సవాళ్ళతో సరి. అదే వ్యాపారవేత్త లైతే జైలు ఊచలు లెక్కపెట్టిస్తారు) తిమ్మిని బొమ్మిని చెయ్యటం ఇంకా ఎన్నాళ్ళు?

ఇకనైనా ఊసరవెల్లిలాగా రంగులు మార్చటం ఆపేసి జనాలని ఇంకా భ్రమ పెట్టకుండా వాస్తవం లోకి రండయ్యా రోశయ్యా...

13 బడ్జెట్ లు ప్రవేశ పెట్టిన ఆర్ధిక మంత్రవేత్తవి. నీ మంత్రదండం బయటకి తీసి ఖజానాని నింపి వెయ్యవయ్యా...

రోశయ్య గారిలోని 'రోషయ్య' ని బయటకు తెండి.

(మీతో మాట్లాడాల్సిన విషయాలు ఇంకాసిని ఉన్నాయి. అవి రేపు చెప్తాలే..)

మీ
స్నేహితుడు
(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Tuesday, 15 September 2009

వీరాధి వీరుడా స్టారాధి స్టారుడా.... డిపాజిట్ ఏదయ్యా?



సినీ వినీలాకాశంలో అగ్రతారల్లో ఒక తారగా ఓ వెలుగు వెలిగిన  మెగాస్టారుడా అచ్చిరాని రాజకీయాలు నీకెందుకయ్యా...?

మళ్ళీ నీ మార్కు వ్యంగ్య భరిత డైలాగులతో సినిమాలు తీసుకుంటే ఉపయోగం ఉంటుందేమో ఆలోచించవయ్యా....

ఝెండా పీకేద్దాం అనగానే ఉగ్రనరసిహుడిలా ఆవేశ పడితే, రామోజీరావు గారు ఝెండా పీకేద్దాం అనే వార్తాకథనం ప్రచురించి ఒక విధంగా మీకు మంచే చేసారనుకున్నా. ఇంకేముంది చాలెంజ్ సినిమాలోలా మీ సత్తా టెక్కలి ఉప ఎన్నికలనుండి చూపించటం మొదలెట్టేస్తారు అనుకున్నా.

సానుభూతి వల్ల మీరు (మీ పార్టీ అభ్యర్ధి) గెలవలేరు కానీ మంచి పోటీ ఇస్తారనుకున్నా. కానీ జనాలకి మీ మీద ఎంత నమ్మకముందో చూడండి. ఆరు నెలల్లో మీ ఓటర్లను సగం తగ్గించేసింది.

మీరు అన్నారు సానుభూతి వల్లే కాంగ్రెస్ గెలిచింది అని. అది నిజమే అనుకుందాం మరి తెలుగుదేశానికి ఏం సానుభూతి ఉండి కాంగ్రెస్ తో పోటాపోటీగా రాగలిగింది? అంటే ఇప్పటికి కూడా ప్రజలకి ప్రత్యామ్న్యాయం గా తెలుగుదేశాన్నే భావిస్తున్నారన్న మాట.



అంటే ప్రతిపక్ష పాత్ర మీకంటే వారు బాగా పోషిస్తున్నారనే కదా అర్థం. మీరు ప్రతిపక్ష పాత్ర సరిగ్గా నిర్వర్తిస్తుంటే జనాలు మిమ్మల్ని కూడా ఇంకా గోదా లోనే ఉంచేవారు.

ఆటలో విజయం కోసం చూసే ఆటగాడి కంటే, ఒక జట్టు కి అనుకూలంగా నిర్ణయాలు వెలువరించే అంపైర్ ని జనాలు మీలో చూసారు కాబట్టే మీకు పడాల్సిన ఓట్లు కూడా ఆ జట్టు ఖాతాలోకే వేసేసారు జనాలు. మీరు వచ్చింది మార్పు కోసం అన్నారు. సినిమాలలో మీకున్న అభిమానుల్ని మీ వోటర్లు గా మార్చుకోలేని మీరు మా జీవితాల్లో ఏం మార్పు తీసుకువస్తారు.

జనాలు మీ నుండి ఆశించింది మార్పుని. ముందు ఆ మార్పుని మీలో, మీ బావమరిదిలో, మీ నాయకుల్లో & మీ పార్టీ పునాది రాళ్ళల్లో తీసుకు రండి.

కాంగ్రెస్ లో ఎవర్ని ముఖ్యమంత్రి ని చెయ్యాలో మీ శాసన సభ్యురాలి కి ఎందుకండీ?

అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. కానీ రాజకీయ పార్టీలో పార్టీ అభిప్రాయమే బయట పడాలి కానీ ఎవరికీ వారు తమ తమ వ్యక్తి గత అభిప్రాయాలని ఇష్టం వచ్చినట్లు పబ్లిక్ లో చెప్పుకుంటూ పోతే ఏది మీ పార్టీ అభిప్రాయమో ఏది వ్యక్తిగత అభిప్రాయమో చెప్పటానికి మీ పార్టీ తరపున ఒక ప్రతినిధిని పెట్టాల్సి రావచ్చు చూసుకోండి మాస్టారూ...

లేదంటే ఈ వ్యక్తిగత అభిప్రాయాలతో మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కి తోక పార్టీలా మారటానికి ఎక్కువ సమయం పట్టదు.


మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Monday, 14 September 2009

కాంగ్రెస్ దేవుడు వై.ఎస్ పాలన అంత బాగుంటే...

పై లోకాల్లో ఉన్న కాంగ్రెస్ తాజాదేవుడు వై.ఎస్. ఆశీస్సులు, ఆయన గారిపై వెల్లువెత్తుతున్న సానుభూతి ఇవన్నీ కలపి మిగిలిన పార్టీలు అసలు ఖాతాలు ఓపెన్ చేస్తాయా అనిపించింది టెక్కలి ఉప ఎన్నికల్లో. కానీ ఫలితాలు చూస్తే అంత సానుభూతిలోనూ 7 వేల చిల్లర ఆధిక్యం మాత్రమే వచ్చింది. అదీ ప్రతిపక్ష నాయకులెవరూ ప్రచారం చెయ్యకుండా... వాళ్ళు కూడా పూర్తి ప్రచారం చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదో మరి?

నిజంగా రాష్ట్రమంతా వై.ఎస్ మేనియా తో ఊగిపోతుంటే, రెండు సానుభూతులూ (వై.ఎస్ & రేవతీ పతి) కలిస్తే ఎంత భారీ ఆధిక్యం రావాలి పాలక పక్షానికి. ఎన్నో వందలమంది చావులని తన ఎకౌంటు లో వేసుకుని వెళ్ళిన కాంగ్రెస్ దేవుడు వై.ఎస్. గారి పరిపాలన అంత సుభిక్షంగా ఉంటే ఈ పరిస్థితి ఎందుకో పాలక పక్షానికి.



మన భారతీయులు పోయినాళ్ళంతా మంచివాళ్ళే అని ఎలాంటివాడు చనిపోయినా తన గురించి మంచిమాటలే చెప్పుకుంటాం. అంత మాత్రాన తను చేసిన పనులన్నీ మంచివి అయిపోవు.

ఒక MLA చస్తే ఆయన గారి భార్యామణి లేదంటే సుపుత్రుడో తనూ లేకపోతే సోదరుడో.... వీళ్ళు తప్ప మరో నాయకుడు దొరకనంత దౌర్భాగ్య స్తితి లో ఉన్నాయా మన రాజకీయ పార్టీలు.

ఈ రోజు వచ్చిన ఫలితం చూస్తే అర్ధమవుతుంది వై.ఎస్.ఆర్ మరణించకుండా ఉండి ఉంటే వచ్చే రిజల్ట్ ఏమిటో....

ఆయన ఈ లోకం నుండే నిష్క్రమించాడు. ఆయనను పెంచి పెద్ద చేసిన పార్టీ లో ఎంతో మంది నాయకులు ఉన్నారు. కానీ వై.ఎస్. గారి అనుచరుల దృష్టిలో ఆ నాయకులెవరికీ ఆయన గారి ఆశయాలను నెరవేర్చే సామర్ధ్యం లేదట ఆయన గారి సుపుత్రుల వారికి తప్ప. ఇదేమన్నా రాచరికమా? తండ్రి పోగానే పదవి కట్ట బెట్టటానికి? ఇంకెందుకు 125 ఏళ్ల చరిత్ర కల పార్టీ మాది అని చంకలు గుద్ది చెప్పుకోవటం తీసుకు వెళ్లి తుంగలో తొక్కుకోక.

ఒక నాయకుడు చస్తే ఆయన గారి ఆశయాలని నెరవేర్చే సామర్ధ్యం లేని నాయకులు కానరాని పార్టీ అయిపోయిందా కాంగ్రెస్, వై.ఎస్. వందిమాగధుల దృష్టిలో ? పొద్దున్న లేస్తే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆత్మహత్య చేసుకున్న వారి చిట్టా పద్దుల పేపర్ ఒకటి. ఒక్క పనికి వచ్చే న్యూస్ కనపడటం లేదు వారికి జగన్ ముఖ్యమంత్రి కావాలనే తపన తప్ప.

యధా రాజకీయులు తధా వార్తా పత్రికలూ.

ఇదీ నేటి భారతం


మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Friday, 11 September 2009

మన పాలక పార్టీ పేరు కాంగ్రెస్సా లేక కాంగ్రెస్ (ఐ) నా ?



ఇప్పుడు మన రాష్ట్రం లో & దేశం లో పరిపాలన సాగిస్తున్న పార్టీ కాంగ్రెస్సా లేక ఇందిరా కాంగ్రెస్సా (కాంగ్రెస్ (ఐ)).

ఎందుకంటే, ప్రస్తుతం 125 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకుంటున్న ప్రస్తుత కాంగ్రెస్ నా చిన్నప్పుడు ఎక్కడ చూసినా కాంగ్రెస్ (ఐ) అనే పిలవబడేది. దానితో పాటు ఇంకా కాంగ్రెస్ (జే) & కాంగ్రెస్ (ఎస్) అని కూడా ఉండేవి.

కానీ ప్రస్తుతం కాంగ్రెస్ (ఐ) అనే పదమే వినపడటం లేదు.

కాంగ్రెస్ (ఐ) మళ్ళీ కాంగ్రెస్ గా మారిపోయిందా? మారితే ఎప్పుడు మారింది?

ఎవరికైనా తెలిస్తే చెప్ప గలరు.



మీ
స్నేహితుడు


Thursday, 10 September 2009

సోనియా జీ..... మాకున్న అర్హత 30 ఏళ్ల నెహ్రూ కుటుంబ విధేయత & ఓ కర పత్రిక



జగన్ ని ముఖ్యమంత్రి ని చెయ్యటానికి ఆయన గారి పత్రిక ఎంత కంకణం కట్టుకుందోఈ రోజు పేపర్  యాడ్ ని చూస్తేనే అర్ధం అవుతుంది.

2014 లో రాహుల్ గాంధీ ని ప్రధాని చెయ్యాలనే వై.ఎస్ గారి కలని పదే పదే (దాదాపు ప్రతి రోజూ పేపర్ లో టీవీ లో ఇదే భజన) ప్రస్తావించటం దారా రాష్ట్రం లో తమను మించిన విధేయులు వారికెవరూ దొరకరని చెప్పకనే చెప్పేవాళ్ళు. ఈ రోజు దాన్ని పబ్లిక్ గా చెప్పుకున్నారు.

"2014 నాటికి రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని... ప్రజలు తప్పకుండా పట్టం కడతారు " ఈ మాటలన్న వై.ఎస్. ధీమా వెనక ఉన్నది రాహుల్ పై అభిమానమే కాదు ఆ కుటుంబం పై ఉన్న మూడు దశాబ్దాల విధేయత.

అసలు నాకర్ధం కానిది ఈ కాంగ్రెస్ వాళ్ళకి నెహ్రూ గారి వారసుల మీద ఉన్న విధేయత జాతి పిత గాంధీ గారి వారసుల మీద ఏ నాడూ ఉండదు ఎందుకని.?

ఆయన వారసులు ఏ అత్యున్నత పదవుల్లోనూ లేరు కాబట్టి.

రాజ్యాంగ పరం గా అత్యున్నత పదవుల్లో ఉన్న వారికి విధేయులై ఉంటే తమకూ ఓ పరగణా కు ఆధిపత్యం వహించే అవకాసం ఉంటుంది కాబట్టి.

ప్రజలకు కావాల్సింది నెహ్రూ గారి కుటుంబం మీద విధేయత ఉన్న వాళ్ళు కాదు. ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద విధేయత ఉన్న వాళ్ళు కావాలి.

మా తాతలు నేతులు తాగారూ మా మూతులు వాసన చూడండీ అన్నట్టు గాంధీ దగ్గర నుండి వై.ఎస్. వరకూ ప్రజల మీద ఉన్న విధేయత ఉన్నంత మాత్రాన ఆ విధేయత మాకూ ఉంది అంటే కుదురుతుందా...

కొన్నాళ్ల పాటు దాన్ని నిరూపించుకుంటే వారసత్వం దానికదే వస్తుంది.



మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)