మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Friday, 12 September 2014

నిశ్శబ్ద ఘర్షణ

నాకు బయటకు నడవాలని ఉంది 
నాతో నేను ఘర్షించని రోజులో నుండి
నన్ను నేను వెలివేసుకుంటున్నా
నేనెన్నడూ చూడని నిశ్శబ్దంలోకి

మాట మౌనంతో సంఘర్షించే వేళ
నిశ్శబ్దంతో శబ్దం చెయ్యాలని ఉంది 
నీ జవాబు నీకు కావాల్సిన చోట 
నా శబ్దాన్ని నిశ్శబ్దం చేసి వచ్చేస్తున్నా

అంతరాత్మతో స్వేచ్ఛగా భాషించిన
ఏ ఒక్క క్షణమూ గుర్తుకు రాని అశక్తతతో
మనసు మీద ఓ ముసుగేసేసి
కాలాన్ని దొర్లించేస్తున్న గడియారాన్నయ్యా

లోపల తన్నుకొచ్చే ఏ భావాన్ని
బయటకి వ్యక్త పరచలేని అభావంతో
అసలెప్పుడైనా నాతో నేను స్వచ్ఛంగా ఉన్నానా?
మీతో మనసారా నవ్వానా...?

ఈ నా దేహాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఆయువు
చివరి క్షణాల్లోకొచ్చినప్పుడైనా
పెదవంచున ఒంపుకుంటున్న
నవ్వుల రంగుల్ని తుడిపేసి
నా అంతరంగ భావాలని దృశ్యంగా చూపుతూ
మాట్లాడాలని ఉంది మీతో
మీ నవ్వుల గాఢతా చూడాలిగా
అవి వెలిసే రంగులో... మురిసే ప్రకృతో...!

- సురేష్ రావి 11/09/2014

Tuesday, 9 September 2014

హేమంత స్పర్శ

ఏయ్ ఇది నీకే...

నాకు నేనే రాసుకుంటున్నా నాలో నీకు చేరవెయ్యాలని...

నీకేం హాయిగా ఎల్లలు లేని నా మనో సామ్రాజ్యానికి మహారాణివై కూర్చున్నావ్... ప్రపంచమనే పంజరంలో నన్ను అనాధలా వదిలేసి...!

కళ్ళు తెరచి లోకాన్ని చూస్తున్నంత సేపు నిద్రే ఆవరించుకున్నట్లుగా  ఉంటుంది...

కళ్ళు మూసేసి నిన్ను చూడటం మొదలు పెడతానా... క్షణాలన్నీ కరిగిపోతూ నీ నవ్వుల్లో నన్ను లయం చేస్తూ స్వర్గాన్ని పరిచయం చేస్తాయ్...!

పొద్దు పొడుస్తుంది లేవమని అంటూ ఉంటారెవరో... 
చెవులకి తాకే ఆ శబ్దాన్ని మనసుకి తాక నిస్తానా?
ఎంత పొద్దెక్కినా లేవాలని అనిపించక
నా కళ్ళ వాకిళ్ళలో నువ్వేసే సంక్రాంతి ముగ్గులు చూస్తూ
మనసు దోసిళ్ళతో నువ్విసిరే చేమంతుల హేమంతంలో తడుస్తూ
వెచ్చనైన నీ గుస గుసలకి  ఊ కొడుతూ
మన్మథుడు మరచిపోయి విడచి వెళ్ళిన బాణాల్లాంటి నీ చూపుల్లో చిక్కుకుపోతూ
నవ్వుతుంటే వెన్నల తునకల్లా మెరిసిపోతున్న నీ పలువరసని చూస్తూ
అలాగే... ఆ అలౌకిక స్థితిలోనే ఉండిపోతూ ఉంటాను.

నిజం చెప్పు... నిన్ను నాలోకి ఒంపేసుకున్నాక అక్కడి నుండి బయటకు రావాలనిపించిందా...? అనిపించ లేదు కదూ... నాకు తెలుసు మరి.... విశాలమైన ప్రేమ లోకం నుండి మురికితో నిండిపోయిన బావి లాంటి బాహ్య ప్రపంచంలోకి రావటానికి నీకు మనస్కరించదని.

నువ్వు లేని నా క్షణాలన్నిటినీ ఎప్పటికప్పుడు పార వేస్తూ కేవలం మనవైన క్షణాలలోనే జీవించే నాకు... రెప్పల మాటున దాగిన  మన ప్రతీ క్షణాన్ని అక్షరాల్లో పొదిగేసి.... ప్రతి ఉదయాన  మౌనవీక్షణలతో  ఓ సాధారణ పాఠకుడిగా వాటిని చదివేయ్యలని ఓ వింత కోరిక... బహుశా పగటి పంజరపు బతుకుని కాసేపు మరిచి పోవటానికే అలా అనిపిస్తుందకుంటా...

అందరూ అంటూ ఉంటారు జ్ఞాపకాల్లో ఒంపేసుకున్నాం... నింపేసుకున్నాం... తడిమేస్తున్నాం   అని...
నాకైతే అసలు ఆ ఆలోచనే రాదేం? అసలు జ్ఞాపకాల్లోకి ఎందుకు జారాలి నువ్వు? మళ్ళీ ఎప్పుడో ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తు చేసుకోవటానికా...?

ఊహుఁ... నాకెందుకో అలా అసలు ఇష్టం లేదు నా ప్రతి చర్యా నువ్వే అయినప్పుడు నా ప్రతి మాటా నువ్వే అయినప్పుడు నా ప్రతి అక్షరం  నువ్వే అయినప్పుడు అసలెందుకు నిన్ను జ్ఞాపకాల్లోకి ఒంపాలి... జీవిత పర్యంతం నీ తోడుగానే సాగుతాను నేను ఆ నమ్మకం నాకుంది. మరి నీకు లేదూ ఆ నమ్మకం? ఎందుకు ఉండదు? ఉండే ఉంటుంది... ఎందుకంటే నా మీద నాకున్న నమ్మకాని కన్నా నీకే ఎక్కువ నమ్మకం కదా...

క్షణం... నిమిషం... గంట...రోజు...వారం...నెల...సంవత్సరం... కాలాన్ని కొలత కొలవగలనేమో కానీ... మరి నీ తలపులని... నువ్వు నాలో కలిగించే స్పందనల్ని... నువ్వు నాలో కలిగించే ప్రేమని ఏ కొలతల్లో ఇమడ్చ గలను? ఊహుఁ... సాధ్యమేనా... కాదు కదూ...

అదిగో... ఆ గోడకి  వేళ్ళాడే ఆ గడియారాన్ని చూడు... పనీ పాటా లేనట్లు పరిగెత్తేస్తుంది. ఆ గడియారంలో ముళ్లన్నీ తీసివేస్తే కాలం ఆగిపోతుందీ అంటే గడియారాని శూన్యం చేసేసి నీ నా క్షణాలన్నిటినీ అమరం చేసెయ్యనూ...!

కొందరెందుకో కన్నీటి సాంద్రతతోనే జీవితాన్ని కొలుస్తూ ఉంటారు. నేనొక్కటి చెప్పనా... కన్నీటి తడే కాదు కన్నీటి చప్పుడుని నీ దరి చేరనివ్వకుండా చూడటానికే ప్రయత్నిస్తాను. కలత పెట్టే ఏ తలపునీ నిను తాకనివ్వను. అసలు కలవరం అంటే ఏమిటో నీ కలలోకి రాకుండా చూసుకుంటా...

ఏయ్... ఇవన్నీ రాజకీయ నాయకుల వాగ్దానాల్లా అనిపిస్తున్నాయా... నువ్వు చెప్పవ్ కానీ అనిపించే ఉంటాయిలే... అయినా వాళ్ళకీ నాకూ పోలిక ఏముంది చెప్పు... వాళ్లకి ఎంత సమాజం ముందుందో... మాయ కబుర్లు చెప్తేనే పబ్బం గడుస్తుంది.

కానీ నేను... అసలు నిన్ను చూస్తేనే మనసు మత్తులోకి జారిపోతుందే... ఇక శుష్క వాగ్దానాలు చెయ్యగలనా...
ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే కాసిన్ని ఆలోచనలని రాజేద్దాం అనుకుంటానా... చటుక్కున వచ్చేస్తావ్ అక్కడికి నేనున్నానంటూ... ఇక మరో ఆలోచనే నను దరిజేరనివ్వకుండా.... ఎక్కడ కాపుగాసి ఉంటావో ఏమో మరి...

అయినా నీకు తెలుసు కదూ ఎప్పుడు ఎక్కడికి ఎలా రావాలో... మనసుని ఎలా స్పృశించాలో...!

ఎందుకంటే నువ్వెప్పుడూ నాలోనే ఉండే హేమంతపు స్పర్శవి...!

నీ

...సురేష్ 

వెన్నెల కుసుమం - 23 (ఇది ఎన్నడూ ముగియని ప్రణయ లేఖ)


హనీ... 

ఎంతటి సౌందర్యం నీ నయనాలది... ఇలలో ఎప్పుడూ చూడనంత నయన సౌందర్యం. 
నల్లని నీ కనుబొమ్మలు అర్జునుని విల్లు గాండీవంలా వంపు తిరిగి ఉన్నాయి. 
మన్మధుని చేతిలోని చెరుకుదంటు విల్లులా నా గుండె వైపే ఎక్కుపెట్టినట్లు ఉన్నాయి. అందాల నీ నయనాలు నా గుండెల్లో ఏదో అలజడి రేపాయి. నీ కను రెప్పల మధ్యనే నా హృదయాన్ని బందీ చేసావు కదా...

నీ మనసులోనికి నేను చేరటానికి నువ్వు తెరచి ఉంచిన ద్వారబంధాల్లా ఉన్నాయి నీ కను రెప్పలు. టపటపా కొట్టుకుంటున్న నీ కను రెప్పల మధ్యన నా హృదయం నెమ్మదిగా నీ మనసులోన స్థానం కోసం ప్రయత్నిస్తుంది.

మానస సరోవరం లో ఈదులాడుతున్న రెండు అందమైన బుల్లి మీనాలని తీసుకుని వచ్చి నీ కనురెప్పల కింద ఉంచినట్లు ఉన్నాయి.... నిజమేనా చెలి... బ్రహ్మ మహా మాయదారి కదా అలా చేసినా చేసి ఉంటాడు. 

మూసి ఉంచిన నీ కనురెప్పల వెనక నా రూపం ఎప్పుడూ అలా నిలిచిపోవాలని.... నీ కనుపాపలే నీ మనసులో చేరటానికి సింహ ద్వారాలుగా నన్ను ఆహ్వానిస్తున్నాయి. 
అందమైన కలువ రేకుల్ని నీ కను రెప్పలుగా అతికించాడేమో ఆ బ్రహ్మ... ఎంతైనా ఆయన ప్రియ పుత్రికవు కదా మరి. 

నీ నయనాల నుండి కురుస్తున్న కాంతి నీలి వెన్నెల కిరణాల వెలుగులు విరజిమ్ముతూ నన్ను సంతోష సాగరంలో తడిపేస్తుంది. 

తెల్లని నీ కనుపాపల మధ్య నల్లని నీ కనుగుడ్లు పాల సముద్రం మధ్యలో ఆదిశేషువుపై పవళించిన శ్రీ మహా విష్ణువు లా ఉన్నాయి ప్రియా...

నీ కళ్ళు రువ్వే చిలిపి నవ్వులు నా గుండెకు వేసేస్తున్నాయి వలపు బంధాలు. నీ కళ్ళల్లో పలికే భావనలు నా హృదయంలో వెలిగే మణి దీపికలు. 

నీ నీలాల నయనాల్లో ప్రతి ఫలించే నీ ప్రేమానురక్తి నీ కళ్ళు చిందించి నవ్వుల్లో వ్యక్తమవుతూనే ఉంది. నీ కళ్ళే నీ మనసు పలికే భావ వీచికల ప్రతిరూపాలు. 
నక్షత్రాల మెరుపుని నీ కనురెప్పల మాటున దాచుకున్నావ్ కదా ప్రియా. నీ మనసు పరవళ్ళని ప్రతి ఫలిస్తున్న నీ నయనాల వెలుగులే నా హృదిలో చేస్తున్నాయి వలపు గాయాలని. 

వెన్నెల దీపికలయిన నీ నీలాల నయనాలు ఎల్లప్పుడూ పన్నీరు తప్ప కన్నీరు కార్చకూడదని నా కోరిక. నీ కళ్ళలోని వెలుగులతో తమ మెరుపులని మెరుగు దిద్దుకోవాలనుకుంటున్నాయనుకుంటా ఆ నింగిలోని తారకలు ఆశగా నీకేసి చూస్తున్నాయి. 

ఇలలోన నిన్ను మించిన నయన సౌందర్యవతి ఎక్కడ ఉంది? 

నీ 

... రేష్ 

Saturday, 6 September 2014

వెన్నెల కుసుమం - 22 (ఇది ఎన్నడూ ముగియని ప్రణయ లేఖ)


ఏయ్ హనీ...

ప్రాణానికి ప్రాణం గా నిన్ను ప్రేమిస్తున్న నాకు నీ నుదురెందుకో ఎప్పుడూ ఓ ప్రేమద్వారంలానే కనిపిస్తుంది.

విశాలమైన నీ పాలభాగం పాల సముద్రపు ఛాయతోనే పోటీ పడుతూ మల్లెల వర్ణాన్నే వెక్కిరిస్తున్నట్లు ఉంది. విశాలమైన నీ నుదుటిపై సన్నగా కనిపించే ఆ గీతలు బ్రహ్మ రాసిన రాతలేమో కదూ...

నీ నుదుటిని ముద్దాడటానికి ముంగురులు పోటీ పడుతున్నప్పుడు అలవోకగా అలా అలా వాటిని సరి చేస్తున్నట్లు నీ నుదురుని తాకినప్పుడు నాలో వచ్చే ప్రకంపనలు వర్ణించ గలిగే శక్తి నాకున్నదా?

పున్నమి రోజున కురిసే వెండివెన్నెల కాంతిలా ధవళ వర్ణాలు వెదజల్లుతూ నీ పాల భాగపు కాంతి నా కళ్ళల్లో ప్రతి ఫలిస్తుంటే నీకేమనిపిస్తుంది? ఆ కంటి వెలుగుల కిరణానాలన్నీ నీ పాలభాగపు పరావర్తనాలే అని నీకు అర్ధం కాలేదూ...

నీ నుదుటున ఉన్న సింధూరం అరుణోదయాన వికసిస్తున్న సూర్యునిలా ఉంది. అలా చూస్తుంటే సూర్యోదయం నీ నుదిటి మీదే అవుతూ ఉందా అన్నంత అద్భుత భావన. 

ఆ కుంకుమ వెలుగులో నా మనసులోని సకల మలినాలు తొలిగి పోవాలని ఓ చిన్ని ఆశ... నిజమేరా... తెల్లని నీ నుదుటిపై ఎర్రెర్రని కుంకుమ బొట్టుని చూస్తుంటే ఎలాంటి వాడికైనా తప్పు చెయ్యాలనే ఆలోచనే రానివ్వని దేవతా మూర్తిలానే కనిపిస్తావు...

అల పాపిట ఒక సుతారం గా ఒక ముద్దు కాస్త కిందుగా నుదుటిపై ఒక ముద్దు... ఇంతకన్నా నా ఆత్మీయతని ఎలా తెలుప గలను? నీ పాల భాగాన పట్టిన చిరు చెమట పాలసంద్రపు అమృత బిందువులంతా మధురంగా ఉంది... నా పెదవులదెంత అదృష్టమో కదా ఆ రుచిని గ్రోలినందుకు...

పిల్లగాలి తెమ్మెరల ధాటికి ముంగురులు నీ నుదుటిపై నాట్యం చేస్తున్న దృశ్యం చూసి నీ వడిలో తల పెట్టుకుని పడుకుని ఆ ముంగురులని సవరిస్తూ నీతో ఎన్నో ఊసులాడాలని నా భావాలన్నీ నీతో చెప్పాలని ఉంది.

నా మనసు అల్లుతున్న కవితా పరంపరలో నీ పాల భాగపు పసిడి సొగసులు కూడా పైడి పదాలేగా...

బ్రహ్మ రాతకి పుటగా వాడుకునేది మన నుదురులేగా...

మన ప్రేమ ఫలించేది లేనిది లిఖించి ఉన్న రెండు ప్రేమ పుటలలో ఒకటి నీ పాల భాగమే కదా... రెండవది నా నుదుటిన ఉంది. అయినా బ్రహ్మ ఏమి రాయగలడు...? మహా అయితే భౌతికంగా మీరెన్నటికీ ఒక్కటి కాలేరు అని... కానీ మన అంతరంగాలు ఒక్కటి కాకుండా చెయ్యటం ఆ బ్రహ్మ వల్లనైనా అవుతుందా?

ఎప్పటికీ

నీ

..రేష్