Friday, 18 January 2019
Thursday, 10 January 2019
అతికించబడ్డ చీకట్లో....
ఆరుబయలు పచ్చిక మీద
వెన్ను వాల్చి
ఆకాశాన్ని వెలిగిస్తున్న నక్షత్రాలకి
ఒక చిన్న కబురు పంపుదామని చూస్తే
బయటున్న చీకటంతా
కళ్ళల్లో మేటవేసుకుని ఉంది
ఆకాశాన ఆ నక్షత్రాలని ఊడ్చి వేస్తూ
ఇప్పుడు బయటేమో ఒకటే కాంతి వాన
కాంతి జల్లు ఎక్కువయిందనుకుంటా
ప్రకృతి వర్ణం తెలుపు చీకటిని కప్పేసుకుంది
అయినా పర్లేదులే….
పడకగది పైకప్పుకి
అతికించబడ్డ చీకట్లో
దాచిపెట్టుకున్నాం గా
కాగితపు నక్షత్రాల నవ్వులని
మరి గర్వంగా తల ఎగరేద్దాం
Tuesday, 8 January 2019
వ్యాకరణం
చీకటిని పులుముకోవటం
ఎంత తేలికో అర్థమయ్యింది.
నక్షత్రాలు నవ్వుతా యేమోనని
ఆరుబయట మంచం వాల్చడానికి
సిగ్గుపడుతున్న మనిషిని చూసాక
***
అందం కోసమంటూ
ఇంటి ముందున్న
పచ్చని చెట్టుని నరికి
మోడైన చెట్టుగా
నగిషీలు పట్టడం చూసాకే తెలిసింది
ఎడారులనీ పండిస్తారని!!***
మనిషి తనకన్నా
మట్టికే ఎక్కువ విలువని కట్టాడని తెలిసింది
తన విలువ పెంచుకోవటం కోసం
మట్టిలోని రాళ్లని
మెడలో హారంగా వేళ్ళాడదీసుకుంటుంటే!
***
పరాయి కలలని
పహారా కాసే
బేహారులున్నారని అర్థమయ్యింది
తమ కల పండటం కోసం
వారు మర్చిపోయిన కలలనీ
మళ్ళీ మళ్ళీ తట్టిలేపుతూ…
ఎన్నెన్ని”కళ”లనో చూపిస్తుంటే
***
గాయాలనే గంథం అనుకుని
తన అంతిమ వ్యాకరణం
తానే రాసుకునే చోట
నా నడక ఆగిపోయింది
అక్కడున్న మనిషనే లేఖకుణ్ణి చూస్తూ…
Tuesday, 1 January 2019
నీలి మెత్తని జల
ఇంద్రనీల శిలకి దైవత్వాన్నిచ్చిన
గుళ్ళో దేవుడిని కాకుంటేనేం
గులకరాళ్ళనీ అభిషేకించవచ్చన్నట్లుగా
తాకుతున్న నీలి మెత్తని జల
ద్రవరూపం దాల్చిన నందివర్థనాలు చేస్తున్న
నిరాణమైన ఒక తపస్సులా సాగిపోతుంటే
నా చిన్ని దోసిలితో కాస్తంత ప్రకృతిని తడిపాను
దేశాంతరం వెళ్లి వచ్చేసరికి...
రాదారుల వెంట నీడల కాపు కాస్తూ
ఇక్కడంతా పచ్చని తోట 













