తమో ముద్రలేసుకుంటూ వస్తున్న నిమిషాల లోతుల్లోకి చూస్తున్నప్పుడు
గాలి అలలలో ఈదులాడుతున్న అలజడిని
ఎవరో గుండెలోకి పోతపోస్తున్న చప్పుడవుతుంటే
మౌనమంతా మైదానంలో కరిగిపోయి
రక్త నీలపు సంధ్యారాగమంతా కంటిమాపుల్లో కంపనమవుతుంది
గరిక వేటుకి గాయపడి నెత్తుటి పారాణి అద్దుకున్న పసిపాదాల క్రింద
నలిగిపోయిన పచ్చదనాల లెక్కలేస్తూ
స్మృతినిండా మృతి చెందిన క్షణాల కూడికలేసుకుంటూ
ఉచ్ఛ్వాస నిశ్వాసల గణనల్లో లోకాన్ని బేరీజువేస్తూ
గాంధారిత్వపు చూపులతో నిజాలని తూద్దామనుకుంటే
మొలిచేవన్నీ తిమిరాన్ని పండించే చీకటి విత్తనాలే
గాలిలో వేలాడుతున్న నల్లమబ్బులని చప్పరించి దాహం తీర్చేసుకుందామని
రెక్కలని చాపుకుంటూ ఎగురుతున్న తెల్లపావురపు ఆశలో భ్రమనే చూస్తే
ఆశావాదానికి ప్రతీకలంటూ ఏ మెలకువలోనూ రాయబడి ఉండవు
కాటుకని కప్పుకున్న పసిడి కిరణాలే ముంగిట్లోకి వస్తూ
ఉన్న ఒక్క జీవిత కాలమూ జీవన్మృతమై సాగిపోతూనే ఉంటుంది..
మోటబావి నెర్రెల్లోనూ చిగురించే రావి మొక్కకున్న పట్టుదల నేర్వక!
ఇంత తెలిసాక…
జన్మల క్రితమే వలసబోయిన నవ్వులను ఈ బ్రతుకులకి ఆశబెట్టడమంటే
నిజాన్ని
ఏ మడతల్లోనో దాపెట్టి అబద్ధానికి ఆడంబరమద్దటమే కదూ…!
(అంతర్జాల పత్రిక 'కౌముది' లో మే 2021 లో ప్రచురితం)











