మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Wednesday, 23 March 2016

నిషిద్ధ మంత్రంనీకు నేను నాకు నువ్వు
మృగత్వంగా మారిన
క్షణాల మోత బరువులో
లోకానికి మనిషి అరుదయిన వార్తలు
ఇప్పుడసలు వింతలే కాదు

మనిషికి మనిషి భయమవుతున్న చోట
ప్రకృతి ప్రకోపించటం
ప్రళయాన్ని ఆలపించటం
ఎప్పటికప్పుడు వార్తా యంత్రాలలో
ముద్రితమవుతూ ఉన్నప్పుడల్లా
నెపాలని కాలానికి మనమంటించిన
కలిముద్రలమీద వేసేసి
మనం మాత్రం పవిత్ర జీవాలైపోతాం

తప్పేముందిలే
ఎవరికివారు తమదే చివరి ఊపిరన్నట్లుగా
స్వార్ధమవుతున్న చోట
పాపం పుణ్యం అన్నీ సామాజిక ధర్మాలవుతుంటే
ఒకరికి ఒకరు నిషిద్ధ మంత్రాలే

Monday, 21 March 2016

ఇంద్రజాలంనిజమే
భ్రమలని ప్రేమించటం
కలలని రమించటం మొదలు పెట్టాక
ఇంద్రజాలాలూ ఇంద్రధనుస్సులూ
ఎప్పుడూ నచ్చేస్తుంటాయ్
శూన్యాలూ ఎప్పుడూ అంతే మరి
కొత్త కొత్తగా మత్తుజల్లుతూ
నీ ప్రతి సమయాన్నీ గడ్డ కట్టిస్తూ ఉంటాయ్
మట్టి వాసనని వదిలేసినప్పుడే
జీవం నిన్ను బహిష్కరించిందన్న సంగతి
నీకు చేరవెయ్యగలిగే స్వచ్ఛహృదయాలకి
కొరత వచ్చేసిందిప్పుడు
ఎందుకంటే
ప్రపంచమిప్పుడు కుగ్రామం కదా మరి
హృదయాలూ కుంచించుకు పోయాయి.

నడక


ఇన్నేళ్ళ ప్రయాణంలో
నీదంటూ
ఒక్క అడుగూ లిఖించబడ్డ నేల
కానరాకపోవటం
నేల సాంద్రత ఎక్కువవ్వటమేమీ కాదు
నీకింకా నడక కుదరక పోవడం
కాదనలేని నిజమే ఇది
కాళ్ళ మీద నమ్మకం కుదిరేంతవరకూ
నడకకు పట్టు చిక్కదు
తడబాటు పడని నడకలకి
గమ్యాల వరద వెల్లువవడం
అడుగులన్నీ చరిత్రలో ముద్రితమవ్వటం
చర్వితచరణమే

Sunday, 20 March 2016

ప్రపంచమంత నవ్వుఖాళీ చేసుకున్న మనసులో
లోకాన్నంతా కూర్చేద్దాం అనుకున్న
ప్రతీసారీ
మరింత శూన్యం పోగుపడుతుంది కానీ
నిండారా నిన్ను పూయించే
నవ్వు జాడ మాత్రం
ఏ నిషిద్ధ మంత్రలిపిలోనో
చిక్కుబడిపోతుంది
మరి… ఆశలకి అంతులేని చోటు
ఏ ఆనందాలకూ చిరునామా అవ్వదుగా
అయినా మించి పోయేదేమీ లేదు
ప్రపంచమంత నవ్వు చేరువవుతుంది
అన్ని ఖాళీతనాలలో
నిన్ను నువ్వు స్వచ్ఛంగా నింపుకోవటం మొదలు పెడితే

Saturday, 19 March 2016

చద్మ వేషంఊపిరి కమ్మిన అద్దంపై
తను రాసిన అశ్రువొక్కటి
ఒక అబద్ధపు ముఖాన్ని పలచగా కప్పేసింది, నిజానికి ముసుగే నప్పినట్లుంది

జీవన తూకాలని తకరారు చేస్తుంది
ఆషాడభూతిత్వమెక్కువైన సానుభూతి ఒకటి
ప్రపంచం చాలా మంచిది, లోతు చూడకుండానే తోడుంటానంటుంది

గోడలన్నీ చెమ్మగిల్లే కథలు
ఆమె చెప్తూ ఉంది
అతనేమో బయటెక్కడో తడి తడిగా కురిసేస్తున్నాడు

ఆమె ఒంటరితనం కురుస్తున్నప్పుడల్లా
అక్కడ సమూహాలు గుంపు కట్టాయ్
అతని వెలివాడకై రహదారి సిద్దం చేస్తూ

కథలేమోకానీ
కొన్ని జీవితాలు మాత్రం ఎప్పుడూ మూగగా ఉండటమే
ఓదార్పుని సిద్ధం చేసుకున్న లోకపు చారిత్రిక అవసరం

చద్మవేషధారణతో నిండిన లోకతత్వంలో
పరాయి అంతరంగం అంతుబట్టదు
అణువణువునా కాపు కాసినా

చిలకకొయ్యనుండి కోసుకు వస్తున్న
అనేకానేక ముఖాల వ్యధల కొలువులో
ఏ కన్నీరూ నిజాలు కురియదు

సమానత్వమంటే ఏ ఒక్క వైపో తూగుతున్నంతసేపూ
నిజంగా రాలే ప్రతి కన్నీటి బొట్టుకీ లెక్కగట్టగలిగే నేర్పు
ఈ ప్రపంచం ఇంకా నేర్వలేదు

నిద్ర పోనివ్వలేదుగ్రీష్మ తాపంతో మంటెక్కిన భూమి దాహం తీర్చుతూ
తొలకరి అద్దిన మధుర వాసనతో
ప్రకృతిలో మమేకమై అనేకాలుగా అనుభూతిస్తున్న
మనసుకి ఆనందాన్ని అనంతం చేద్దామనుకుందేమో
ఈ మట్టి నన్ను నిద్ర పోనివ్వలేదు ఇన్నాళ్ళూ

వసంతాన్ని తనువుకద్దుకున్న తరువుని
చల్లగా స్పర్శిస్తూ
తన వీవెనలతో తలలూపుతున్న చిగురాకు హొయలని
కంటినిండా లిఖిద్దామనుకుందేమో
ఈ గాలి నన్ను నిద్ర పోనివ్వలేదు ఇన్నాళ్ళూ

శూన్య స్మృతులన్నిటినీ తానొడిసిపట్టి
చుక్కల వరుసలతో వెలుగుల దారులు వేసి
కరి మబ్బుల కదలికల కోలాటంతో
చినుకుల కోలాహలం చేద్దాం అనుకుందేమో
ఆ నింగి నిద్ర పోనివ్వలేదు ఇన్నాళ్ళూ

స్వార్ధం తిప్పుతున్న తిరగలి నుండి రాలిపడుతున్న
తిమిరం అలుముకున్న లోకానికి
ఎడతెరగని కాంతిని పరిచయిద్దామనుకుందేమో
నా నరాల్లో స్వేచ్ఛగా జ్వలిస్తూ జ్ఞానప్రమిదలా వెలుగుతూ
ఈ నిప్పు నిద్ర పోనివ్వలేదు ఇన్నాళ్ళూ

యంత్రతనాన్ని అద్దుకుంటూ
పొడిబారుతున్న గుండెలపై
ఎడారులుగా మారుతున్న మనసులపై
తడిసంతకం చేస్తూ చెమ్మగిల్లుదామనుకుందేమో
ఈ నీరు నిద్ర పోనివ్వలేదు ఇన్నాళ్ళూ

పంచభూతాలంటే నిరంతర చైతన్య ప్రవాహికలై
తమ అనిమిషేత్వంతో ప్రకృతిని కాపు కాస్తున్న కరదీపికలు
ఎప్పటికప్పుడు వాటి పవిత్ర స్పర్శతో పునీతమౌతున్నా
జన్మాంతర ధూళినై వాటికి నిత్యార్చన చేస్తూ
నిత్యం ప్రకృతిగా కదలాడుతుంటా... నిరంతర జీవ ప్రవాహాన్నవుతా !

Friday, 18 March 2016

ఒక నవ్వుఒక ఆగంతకత్వం తడిమినప్పుడల్లా
చుట్టుముట్టాడే భయానికి అస్తిత్వాన్ని రద్దుచేసే భరోసావై
ఒక తేలికపాటి నవ్వుతో నువ్వు కమ్ముకుంటావు చూడూ
అప్పుడు...దిగంతాల ధైర్యపు ప్రతిధ్వనిలా అనిపిస్తావు

ధ్వని పూరితమైన నిశ్శబ్దం పెట్టే చికాకులో
వ్యవస్థీకృత మౌనాన్ని పూయించటం కష్టమైనప్పుడల్లా
నిన్ను ఆవాహన చేసేసుకుని
నీ స్వరరహిత నవ్వుల తరగల్లో ఈదులాడటం
పల్లె మట్టినద్దుకుని పంటకాలువలో సేదతీరటమేననిపిస్తుంది

శిలా పుష్పాల అంశలో పుట్టిన నవీనత్వమంతా
ఒక్క స్వచ్ఛతా నవ్వులో కరిగిపోవటం
కొందరికి అలవిమాలిన తపనే కావచ్చు
నాకు మాత్రం అది ఒక ఎనలేని ఆత్మీయ వరద

నీ నవ్వెప్పుడూ వృధా కాలేదు
కంటి చివర్లలో కాంతిని వేలాడదియ్యటం
గుండె లోతుల్లో ఒక ఉత్సవాన్ని జరపడం
ఒక్క తనకి మాత్రమే తెలుసు

ఏయ్.. ఇప్పుడైతే
నిన్ను నాకు వాగ్ధానం చేసుకుంటున్నా
ప్రతీ ధ్వనిలో ప్రతిధ్వనిగా నిన్నే నవ్వుతానని
ప్రతి పదం చివరా ఒక నవ్వుగా జన్మిస్తావని

హంసధ్వనిఇష్టమైన మౌనంలో
తచ్చాడుతున్న మాటల హంసలు
బద్ధకమెక్కిన తరగలపై
నెమ్మదిగా
చాలా నెమ్మదిగా తేలియాడుతూ
మనసులో కురిసే ప్రతి శబ్దాన్ని
మౌనం నుండి వేరు చేద్దామనుకున్నప్పుడల్లా
కవిత్వమే విలీనమైన తనమొకటి హంసధ్వని చేస్తుంది

ఎప్పటికప్పుడు లోన చెక్కుకున్న మాటలన్నీ
మౌనాన్ని ఆలపిస్తున్న వేళ
కళ్ళనుండి కారుతున్న ఒంటరి క్షణాలని వెలివేస్తూ
అప్పుడప్పుడూ నీ నీడల కింద నిద్రపోవాలని ఉంది
ఆకాశం చెప్పే రహస్యాలని
గుండె గదుల్లో ఖైదు చేస్తున్నప్పుడల్లా
పెరిగే హృదయం బరువుని
అతి తేలికగా తేలిక చేస్తున్న
అతిధివై నడిచొస్తుంటే
నా తలపులన్నీ ఒద్దికగా
తలుపుల గడియలు విప్పేసాయి

పాతదనాలన్నీ పచ్చి పచ్చిగా తడుముతుంటే
కాసేపలా నీలో కూర్చుని వెలగాలని ఉంది
ఇప్పుడు కాదు
నిన్నటి పసితనంలో
అప్పుడైతేనే
నిజంగా అప్పుడైతేనే
నీ పెదాలమీది నిజమైన వెలుగుల్ని
నిండారా నాలో చిమ్మేసుకుంటాను
నీదీ నాదీ అంటూ తేడాలేని ఆ నవ్వుల కన్నా
స్వచ్ఛతను ఇంకెక్కడి నుండి కోసుకోను మరి?

Sunday, 13 March 2016

నీకోసం ఒక తీరంఓ నా సహచరీ
నీ సుఖదుఃఖాలన్నీ నావిగా చేసుకున్నాననుకున్నాక
నీ చెక్కిలిపై చెమరింతలని చూసినప్పుడల్లా
నాలో నన్ను వెలి వేసుకోవాలనిపిస్తుంది
నాలో నేను మునిగిపోవాలనిపిస్తుంది

శూన్యానికి ముసుగేసుకున్న మనసెప్పుడూ
మిథ్యా సమయాలనే వాంఛిస్తుందేమో
ప్రతి క్షణమూ సంధి కాలమైనచోట
పరిచయం పాతబడింది కానీ
పెరిగిన దూరం తెలియనితనంలో
అంతరంగాన్ని అణువణువునా అనువదించే
నిశ్శబ్దభేది ఒక్కటుంటే బాగుండు

ఇదెప్పుడూ నిజమే
నీలో నువ్వు ముడుచుకుపోతూ
గుమ్మరించబడ్డ గరళాలన్నిటినీ గొంతులో దాపెట్టి
నాకు మాత్రం అమృత భాండాన్ని అందిస్తుంటే
దాన్ని మోసుకు తిరిగేంత అమరత్వం నాకు లేదు

ప్రతి నా నిశ్చలతలో నీకై ఎన్నెన్ని చలనాలనో కూరి ఉంచా
నీ ప్రతి గాయానికి ఒక లేపనంగా సిద్ధమై ఉన్నా
పూడిక పడని శోకంగా నువ్వు తడి శ్లోకాన్ని పఠిస్తుంటే
ఇక నా శబ్దమెప్పుడూ నిద్రిస్తుంది నిశ్శబ్దమై

నీ దుఃఖాల మీదుగా ప్రవహించటానికి
నాలో నన్ను దాటేసిన కొన్ని సమయాలని
ఒక తెరచాపగా చేసుకుని
కాంతిసాగర తీరాన్ని సిద్ధం చేశాను
నావికత్వం తెలియని వాడికి
తీరాన్ని చేర్చే నేర్పు రాదని మరచిన నేను
కేవలం తీరాన్నే సిద్ధం చేశాను

కానీ ఒక్కటైతే చెప్పగలను
నావలో నువ్వున్నాక
నిన్ను తీరం చేర్చగలిగేంతవరకూ
నా ఊపిరి విశ్రమించదని