మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Sunday, 19 October 2025

రచయిత అవ్వాలంటే ఏం పుస్తకాలు చదవాలి?


రచయితగా మారాలంటే ఏం పుస్తకాలు చదవాలో చెప్పడానికి గొప్ప రచయితలో, పెద్ద రచయితలో అయి ఉండాలంటే నేను ఈ సమాధానం చెప్పడానికి అనర్హుడిని. ఎందుకంటే నేనేమీ రచయితను కాదు. కానీ కాస్తో  కూస్తో మంచివో, చెడ్డవో పుస్తకాలంటూ చదివే అలవాటు ఉంది కాబట్టి నా అవగాహన మేరకి ఇది రాస్తున్నాను. 

రచయితగా మారడానికి చదవాల్సిన పుస్తకాల జాబితా కేవలం ‘ఏం చదవాలి' అనేదానిపైనే కాకుండా, 'ఎందుకు చదవాలి' మరియు 'ఎలా చదవాలి' అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక మంచి రచయితకు ఉండవలసిన  ప్రధాన లక్షణాలు… అవగాహన, భాషా పటుత్వం, కథాకౌశలం, కల్పనా చాతుర్యం. 

రచయితగా మారటానికి ప్రత్యేకంగా చదవాల్సినవి ఇవే అంటూ  ఖచ్చితమైన  పుస్తకాల జాబితా ఉండదు. ఎందుకంటే ప్రతి రచయిత శైలి, అభిరుచి, ఇతివృత్తం భిన్నంగా ఉంటాయి. రచయితకి ఉండాల్సిన లక్షణాల్లో ప్రధాన లక్షణం ఏమిటంటే  మన చుట్టూ ఉన్న జీవితం చదవడం. రచయితకి అనే కాదు, ఏ మనిషికైనా  సమాజమే పెద్ద పుస్తకం. ప్రపంచమే పెద్ద గ్రంధాలయం. 

మన చుట్టూ ఉన్న ప్రతి మనిషి ఒక పాత్రే. ప్రతి మనిషి జీవితం ఒక ఒక కథే. చుట్టూ ఉన్న ప్రతి మనిషినీ ఒక నవలలోని పాత్రలా చూడటం ప్రారంభించండి. వారి ప్రవర్తన, మాట తీరు, భావోద్వేగాలు, కష్టాలు, సంతోషాలను నిశితంగా గమనించండి. రచయితకు కావలసిన అసలైన ముడిసరుకు ఇదే. ఒక మంచి రచనకు కేవలం  మంచి పాత్రలు ఉంటే సరిపోదు. వాటికి తగ్గట్టుగా వారి చుట్టూ ఉండే ప్రదేశాల మీద పరిజ్ఞానం ఉండాలి. ఇల్లు, ఊళ్ళోని మార్కెట్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఫ్యాక్టరీ, కార్యాలయం ఇలాంటివన్నీ కథల గనులు. ఇవన్నీ కథలకు నేపథ్యాన్ని, వాతావరణాన్ని అందిస్తాయి. ఈ ప్రదేశాలలోని శబ్దాలు, వాసనలు, దృశ్యాలను శ్రద్ధగా పరిశీలించి నమోదు చేసుకోండి. పత్రికలు, సంస్కృతి కథలు, సామాజిక మాధ్యమాల్లోని నిజమైన అనుభవాలు, మానవ సంబంధాల సంఘర్షణలు గమనించండి. వాస్తవ ప్రపంచంలో ప్రజలు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా స్పందిస్తున్నారు అనే దానిపై పట్టు సాధించండి.

అలాగే మంచి రచయిత అవ్వడానికి భాష మీద పట్టు ఉండటమూ తప్పని సరి.  రచయితకి భాష అంటే ఆయుధం. భాషను అందంగా, మృదువుగా, కఠినంగా, కవితాత్మకంగా, తాత్వికంగా — అవసరానికి అనుగుణంగా వాడే శక్తి రావాలి. దానికి వివిధ రకాల రచయితల రాతలు చదవాలి.

కొన్ని  పుస్తకాలు మనలో భావన, భాష, నిర్మాణం, ఆలోచనా లోతుని  పెరిగేలా చేస్తాయి. గురజాడ అప్పారావు గారి  కన్యాశుల్కం, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చిన్న కథలు, నవలలు, విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగలు, రామాయణ కల్పవృక్షం లాంటి పుస్తకాల వలన సంభాషణల తీరు, వర్ణనాత్మక భాష, తెలుగు భాషలో ఉన్న మాధుర్యం, వాక్య నిర్మాణంలో పరిపూర్ణత అర్థం అవుతాయి.  

రవీంద్రనాథ్ టాగూర్ గీతాంజలి, శ్రీశ్రీగారి మహాప్రస్థానం, సినారె గారి కవిత్వం, నగ్నముని కొయ్యగుర్రం, తిలక్ అమృతం కురిసిన రాత్రి, అజంతా చిత్రలిపి, మో కవిత్వం, అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం లాంటివి చదవడం వలన కవిత్వంలోని భావోద్వేగ తీవ్రత, సమాజం పట్ల నిబద్ధత, కొత్త పదాల, పోలికల వాడకం అవగాహనకు వస్తుంది.  

చలం గారి మ్యూజింగ్స్, మైదానం, కొడవటిగంటి కుటుంబ రావు గారి కథల్లాంటి వాటితో లోతైన మానసిక విశ్లేషణ, భావ వ్యక్తీకరణలో నిర్భీతి, సరళమైన, సూటియైన శైలి అలవడుతుంది. చలం గారి రచనలు భావాలను మొహమాటం లేకుండా, సూటిగా వ్యక్తం చేసే శైలిని అలవర్చుకోవడానికి, కొడవటిగంటి కుటుంబరావు (కొకు) కథలు కథనంలో అనవసర విషయాలు లేకుండా, సూటిగా, స్పష్టంగా చెప్పడం ఎలాగో తెలుసుకోవడానికి, ముళ్ళపూడి వెంకటరమణ రచనలు  హాస్యాన్ని, పల్లెటూరి మాండలికాన్ని కథలో సమర్థంగా ఉపయోగించే విధానాన్ని నేర్చుకోవడానికి అద్భుతమైన పనిముట్లలాంటివి. 

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చిన్న కథలు, పాలగుమ్మి పద్మరాజు కథలు (గాలివాన), ఎడ్గార్ అలన్ పో కథలు, ఓ  హెన్రీ కథలు, మపాసా కథలు…   కథను ప్రారంభించే విధానం, ఉత్కంఠను పెంచడం, ముగింపు ఇవ్వడం లాంటివాటిని మనకు పరిచయం చేస్తాయి. 

యుద్ధనపూడి సులోచనా రాణి, అరెకపూడి కౌసల్యా దేవి, యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణ మూర్తి, సూర్య దేవర రామ్మోహన రావు  లాంటి వాళ్ళ రచనలు పాఠకులని ఎలా ఆకట్టుకోవాలో తెలిపేలా ఉంటాయి. కథనం, సంఘర్షణ సృష్టించడం, పాఠకుడి ఉత్సుకతను పెంచడం, శిల్పం, శైలీ లాంటి వాటి గురించి చక్కని అవగాహన ఏర్పడుతుంది. 

రచయితకి కావాల్సిన మరో ప్రధాన లక్షణం లోతైన ఆలోచనలు కలిగి ఉండటం, తాత్వికతలో, తర్కంలో ప్రవేశం ఉండటం. కథను కేవలం వినోదం కోసం కాకుండా, మానవ జీవితపు  అంతిమ సత్యాన్ని ప్రశ్నించేలా రాయడానికి ఇది అవసరం. జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు, ఓషో రచనలు, వివేకానందుడి సాహిత్యం వంటివి జీవితం, మనిషి ఉనికి, సత్యం గురించి కొత్త కోణాలను,  తాత్విక దృక్పథాన్ని పరిచయం చేస్తాయి. బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది, త్రిపురనేని గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర, రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావిశాస్త్రి) కథలు, నవలలు ఇంగ్లీష్ లో జీన్ పాల్ సార్త్రే - నాజియా, ఖలీల్ జిబ్రాన్ - ది ప్రాఫెట్, పాలో కోయిలో - దిఅల్కెమిస్ట్   వంటివి మానవ మనస్తత్వాన్ని, సామాజిక అన్యాయాన్ని లోతుగా ప్రశ్నిస్తాయి. పాత్రల అంతర్గత సంఘర్షణ, భావోద్వేగాల సంక్లిష్టత లాంటి వాటిని కథలో ఎలా  ప్రతిబింబించేలా రాయాలో తెలుస్తుంది.  ఈ ప్రభావం ఎన్నేళ్ళు గడిచినా మీ రచనల్లో కనిపిస్తుంది.

కేవలం తెలుగు సాహిత్యమే కాకుండా, ప్రపంచంలోని గొప్ప నవలలు చదవడం వలన కథను వివిధ కోణాల్లో చెప్పే విధానం, ప్రపంచ తాత్విక ధోరణులు అర్థమవుతాయి. విస్తృత దృష్టి, మానవతా లోతు లభిస్తుంది. ఉదాహరణకు, లియో టాల్ స్టాయ్ రచనలు వార్ & పీస్ (యుద్ధం శాంతి - బెల్లంకొండ రామదాసు గారు తెలుగులోకి అనువదించారు), అన్నాకరెనినా (తెలుగు అనువాదం తాపీ ధర్మారావు) , మాక్సీం గోర్కీ రచన మదర్ (అమ్మ - క్రొవ్విడి లింగరాజు),  ఫియోడోర్ దస్తోయెవ్‌స్కీ గారి క్రైమ్ అండ్ పనిష్మెంట్, బ్రదర్స్ ఆఫ్ కరమజోవ్ గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ గారి వన్ హండ్రెడ్ ఇయర్స్ అఫ్ సాలిట్యూడ్, ఆల్బర్ట్ కాముస్ గారి ది ఔట్‌సైడర్ / ది స్ట్రేంజర్, హెమింగ్వే గారి ది ఓల్డ్ మాన్ అండ్ సీ వంటి రచనలు చదవడం వలన ప్రపంచవ్యాప్త సాహిత్య ధోరణులు అర్థం అవుతాయి. జీవితపు అర్థం, ఉనికి, మనిషి స్వేచ్ఛ,  బాధ్యతలపై లోతైన ఆలోచన గలిగిస్తాయి ఇలాంటి రచనలు. 

ఉన్నవ లక్ష్మీ నారాయణ గారి మాలపల్లి, కాళీపట్నం రామారావుగారి యజ్ఞం, వాసిరెడ్డి సీతాదేవి గారి మట్టిమనిషి, జార్జ్ ఆర్వెల్ గారి  1984, యానిమల్ ఫార్మ్ , హార్పర్ లీ గారి టు కిల్ ఎ మాకింగ్‌బర్డ్ లాటి రచనలు సామాజిక, రాజకీయ స్పృహని కలిగిస్తాయి. వీటి వల్ల సమాజంలోని అసమానతలు, దోపిడీ, అన్యాయం, వాటిని నిర్భయంగా కథావస్తువుగా ఎంచుకోవడం ఎలానో అర్థం అవుతుంది. 

తిరుమల రామచంద్ర గారి హంపీ నుంచి హరప్పాదాకా, ముళ్ళపూడి వెంకట రమణ గారి కోతికొమ్మచ్చి, మహాత్మాగాంధీ గారి సత్యశోధన,  అన్నే ఫ్రాంక్  రాసిన ది డైరీ ఆఫ్ ఆ యంగ్ గర్ల్, వాల్టర్ ఐసక్‌సన్ రాసిన స్టీవ్ జాబ్స్ లాంటి పుస్తకాలు ఆత్మకథల్లో ఆణిముత్యాల్లాంటివి. ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర అద్భుతమైన ట్రావెలోగ్ అని చెప్పాలి. 

రచయితగా మీ పరిధిని పెంచుకోవడానికి వివిధ ఇతివృత్తాలను, ప్రక్రియలను పరిచయం చేసే పుస్తకాలు చదవాలి. నవలల్లో  చరిత్ర, కల్పనను ఎలా మేళవించాలో తెలుసుకోవడానికి నోరి నరసింహ శాస్త్రి, ముదిగొండ శివప్రసాద్ వంటి వారి చారిత్రక నవలా రచనలు, కథనంలో వేగం, సస్పెన్స్ ఎలా నిర్వహించాలో తెలుసుకోవడానికి తెలుగులో కొమ్మూరి సాంబశివరావు, మధుబాబు లాంటి వారి రచనలు, ఇంగ్లీష్ లో ఐతే అగాథా క్రిస్టీ నవలలు, ఆర్థర్ కానన్ డోయల్ (షెర్లాక్ హోమ్స్) పుస్తకాలు చదవాలి. వాస్తవంలో ఊహను, అద్భుతాన్ని ఎలా కలపవచ్చో తెలుసుకోవడానికి మాజికల్ రియలిజంలో రాసిన పుస్తకాలు చదవాలి. ఇవి తెలుగులో అరుదనే చెప్పాలి. (వచ్చి ఉండవచ్చు కానీ నాకు అవగాహన లేదు). ఇంగ్లీష్ లో మాత్రం గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ వన్ హండ్రెడ్ ఇయర్స్ అఫ్ సాలిట్యూడ్ పుస్తకం ఐతే ఒక అద్భుతమైన రచన. అలానే హరుకి మురకమి  రాసిన కాఫ్కా ఆన్ ది షోర్ కూడా!   

భాషలో వస్తున్న మార్పులను, మాండలికాలను, వాడుక భాషను అర్థం చేసుకోవడానికి విరివిగా చదవాల్సింది మనుషుల్ని సమాజాన్ని అయితే, ఇతర భాషల్లోని రచనా ధోరణులను తెలుసుకోవడానికి అనువాదాలను చదవడంకూడా అంతే ముఖ్యం.

చివరికి, రచయితగా మారటానికి మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఎక్కువ చదవడం,  విభిన్నంగా చదవడం, లోతుగా చదవడం, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి రాస్తూ ఉండటం…  ఎక్కువగా రాయడం. మీరు చదివే ప్రతి పుస్తకం, చూసే ప్రతి జీవితం, వినే ప్రతి మాట మీ రచనకు ప్రేరణగా మారుతుంది. మీరు ఏ ప్రక్రియలో రాయాలనుకుంటున్నారో (చారిత్రక, సైన్స్ ఫిక్షన్, ప్రేమకథ) వాటికి సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ ఉత్తమ రచనలను చదవాలి. రచనా ప్రక్రియ గురించి గొప్ప రచయితలు రాసిన పుస్తకాలు చదవడం కూడా చాలా ఉపయోగ పడుతుంది. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి కథాశిల్పం, నవలా శిల్పం, పోరంకి దక్షిణామూర్తి గారి కథానిక స్వరూప స్వభావాలు, ఇంగ్లీష్ లో  స్టీఫెన్ కింగ్ గారి ఆన్ రైటింగ్, అలాగే ఎలిస్ వాల్కర్, వర్జీనియా వూల్ఫ్ వంటి రచయితల డైరీల నుండి వారి రచనా పద్ధతులు తెలుసుకోవచ్చు.

రచయిత కావడానికి, ఏది చదివామనే దాని కంటే, చదివిన దాని నుండి ఏమి నేర్చుకున్నాము, ఎలా రాస్తున్నాము అనేదే ముఖ్యం. చదివే ప్రతి అక్షరం ఒక పాఠమే.  మీ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని, మీ సృజనాత్మకతకు పదును పెట్టండి. రాసేడప్పుడు మాత్రం  వీటన్నిటి ప్రభావాన్నీ   మర్చిపోయి మీ సొంత గొంతుకతో రాయడం ప్రారంభించాలి.

నేను చెప్పిన వాటికన్నా ఎన్నో రెట్ల మంచి పుస్తకాలు ఉండి  ఉంటాయి. వాటి పేరు ఇక్కడ రాయకపోవడంలో ఎలాంటి దురుద్దేశమూ లేదని మనవి. ఇక్కడ నేను ఉదాహరణగా రాసిన పుస్తకాలు ఇది రాసే సమయంలో నేను చదివిన, నాకు గుర్తుకువచ్చిన పుస్తకాలు మాత్రమే. మీకు తెలిసిన మంచి పుస్తకాలని ఇక్కడ పంచుకోండి. 





Tuesday, 14 October 2025

ఓం ణమో: దైవాన్ని వెతకడమా? మన లోపలి నిశ్శబ్దాన్ని గుర్తించడమా?



పోయిన డిసెంబర్ లో బుక్ ఎక్జిబిషన్ లో కొన్నా ఇన్నాళ్ళూ చదవడానికి ఇబ్బంది పడుతూ పక్కన పడేసి, మొత్తానికి నిన్ననే చదవడం పూర్తి చేసిన అనువాద నవల ‘ఓం ణమో’. కన్నడ భాషలో ప్రసిద్ధి చెందిన ఈ నవల ను రచించింది ప్రముఖ కన్నడ రచయిత శాంతినాథ్ దేసాయి గారు. ఈ పుస్తకానికి 2000 సంవత్సరంలో సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. దీన్ని రంగనాథ రామచంద్రరావుగారు తెలుగులోకి అనువదించారు.


ఇందులో కథ విషయానికి వస్తే పెద్దగా లోతైన కథ ఏమీ కాదు. కథ కన్నా ఈ నవలలో చర్చించిన నేపధ్యమే ప్రధానంగా ఉంటుంది.  భారతదేశంలోనే పుట్టినా మనకి అతి తక్కువగా పరిచయం అయిన మతం జైనం. జైన మతాన్ని, సమాజాన్ని ప్రధానంగా చర్చించిన నవల ఇది. 

మతం, సంస్కృతి, సమాజం,  సంబంధాల సంక్లిష్టతలలో వాస్తవికతను వెతుకుతున్న మనిషి విధి  ఈ నవలకు కేంద్రబిందువు. కథ కర్ణాటకలోని కృష్ణాపురం అనే గ్రామంలోని ఒక సంపన్న జైన కుటుంబం చుట్టూ తిరుగుతుంది.

ఇంగ్లాండ్‌కు చదువుకోవడానికి వెళ్లిన నేమినాథ, అక్కడే తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందున, భారతదేశంలో ఉన్న అతని భార్య సన్యాసిని అవుతుంది. ఆ అపరాధ భావన అతని మనసు నుంచి తొలగిపోకపోవడం వల్ల, అతను భారతదేశానికి రావడానికి ఇష్టపడడు. అతని కొడుకు తన  పరిశోధనా వ్యాసం కోసం, తన స్నేహితురాలు ఆ్యన్ తో కలిసి భారతదేశానికి వస్తాడు. నవల ఆరంభంలో, ఆ్యన్ పాశ్చాత్య విలువలు, వ్యక్తిగత స్వేచ్ఛ,  భౌతికవాదం పట్ల మొగ్గు చూపుతుంది. జైన జీవనశైలిని, కఠిన ఆచారాలను ఆమె బయటి వ్యక్తిగా పరిశీలిస్తుంది.

పరిశోధనా వ్యాసం కోసం జైన మతం గురించి చదవడం ప్రారంభించిన ఆ్యన్, ఆ మతంలోని సిద్ధాంతాలచే ఆకర్షించబడి దాని లోతుల్లోకి ప్రయాణం ప్రారంభిస్తుంది. జైన జీవన విధానాన్ని దగ్గరగా చూసినప్పుడు, ముఖ్యంగా కఠినమైన సన్యాస వ్రతాల గురించి, శరీర త్యాగం గురించి తెలుసుకున్నప్పుడు, ఆమె మనస్సులో లోతైన తాత్విక మార్పు మొదలవుతుంది. ఆమె తాను పెరిగిన భౌతికవాద ప్రపంచంలో లేని, శాశ్వతమైన ఆనందాన్ని, విముక్తిని ఈ జైన మార్గంలో కనుగొంటుంది. ఈ అంతరంగిక సంఘర్షణ పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు, ఆ్యన్ తన ప్రేమను, తన గుర్తింపును, సుఖవంతమైన లౌకిక జీవితాన్ని పూర్తిగా త్యజించి, జైన మతంలో దీక్ష  తీసుకుని సన్యాసినిగా మారాలని నిర్ణయించుకుంటుంది.

ప్రతిదాన్నీ నెమ్మదిగా, దాని సహజత్వంతో ఎదుర్కొనే ఆడమ్‌కు, ఆ్యన్  ప్రవర్తన కొంచెం భయాన్ని కలిగిస్తుంది. ఆడమ్‌కు, ఆన్‌కు మధ్య శారీరక సంబంధం ఉన్నప్పటికీ, మతంపై ఆమెకున్న ఆసక్తి వల్ల, దాన్ని ప్రేమ అనే పరిధిలోకి మార్చకుండా, తమ బ్రిటిష్ సంస్కృతికి అనుగుణంగా స్నేహమనే పరిధిలోనే శారీరక అవసరంగానే దాన్ని పరిమితం చేస్తారు.

మార్క్సిస్ట్ సిద్ధాంతాలను తీవ్రంగా పాటించే రోజా అందం వల్ల ఆడమ్‌కు ఆమెపై ప్రేమ భావం కలుగుతుంది. అది తెలుసుకున్న ఆ్యన్, వారికి ఏకాంతం ఇవ్వడానికి, తన పరిశోధనా వ్యాసానికి అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి ఒంటరిగా బయలుదేరుతుంది. ఆ్యన్ కు దూరంగా ఉన్న కాలంలో, ఆమె ప్రాముఖ్యతను తెలుసుకున్న ఆడమ్, ఆమెనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.

ఆడమ్ తాతగారు దేవేంద్రప్పకు జైన మతంపై తీవ్రమైన భక్తి ఉంటుంది. భార్య మరణించిన తర్వాత సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకుంటాడు, కానీ అతని వయస్సు దానికి అడ్డంకిగా మారుతుంది. అయినప్పటికీ, అన్ని రకాల బంధాలను వదిలి వెళ్లిపోతాడు.

దేవేంద్రప్ప తమ్ముడు అప్పాసాహెబ్ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి ఎన్నికల్లో గెలిచినా, మంత్రి కాలేకపోతాడు. ప్రజల దృష్టిలో గొప్పగా చెప్పుకోదగిన వ్యక్తిగా ఉన్నా, చాలా మంది మహిళల విషయంలో తప్పులు చేస్తాడు. తన భర్త గురించి తెలిసినా, తన గౌరవానికి భంగం కలగకుండా భార్య అనే హోదా కోసం అతని చర్యలన్నింటినీ చూసీ చూడనట్లు ఉంటుందిఅతని భార్య పద్మావతి. వయస్సు మీద పడడం, గుండె సమస్యతో అతను కూడా మరణిస్తాడు.

పూర్వీకుల ఆస్తుల్లో కొన్నింటిని ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో పంచి ఇచ్చి, ఆ్యన్ తో కలిసి ఆడమ్ తన దేశానికి బయలుదేరుతాడు. జైన మతంలో పూర్తిగా లీనమైన ఆ్యన్, తన  మతం మార్చు కుంటుంది.  జైనురాలిగా మారిన తర్వాత తన  వ్యక్తిత్వం, తన లక్ష్యం ఇతరుల చర్యల వల్ల ప్రభావితమవుతున్నాయని ఆమె గ్రహిస్తుంది. మతం పుట్టిన కాలంలో ఉన్న విధంగా కాకుండా, కాలక్రమేణా మార్పులు వచ్చినందున, ఇకపై తాను పూర్తి శ్రద్ధతో అందులో మమేకం కాలేనని తెలుసుకున్న ఆమె, మతం గురించిన అంశాన్ని పరిశోధనా వ్యాసంతోనే ఆపివేయాలని నిర్ణయించుకుంటుంది.

సాధారణంగా, భారతీయ సాహిత్యంలో ఒక భారతీయ పాత్ర పాశ్చాత్య జీవితాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. కానీ 'ఓం ణమో' లో, ఒక పాశ్చాత్య యువతి అత్యంత కఠినమైన భారతీయ ఆధ్యాత్మిక మార్గాన్ని (జైన సన్యాసాన్ని) స్వీకరించడం అనేది ఈ నవలను అసాధారణం చేస్తుంది. ఆ్యన్ పాత్ర ద్వారా, రచయిత జైన ధర్మాన్ని, దానిలోని కఠినత్వాన్ని, దాని పవిత్రతను ఒక 'బయటి వ్యక్తి' కోణం నుండి చూపిస్తారు. పశ్చిమ దేశాల్లోని మేధోపరమైన విశ్లేషణకు, భారతీయ ఆధ్యాత్మిక నిష్ఠకు మధ్య ఉన్న తేడాను ఆ్యన్ ప్రయాణం స్పష్టం చేస్తుంది. 

ఆమె దీక్ష స్వీకరించడానికి ముందుకు వచ్చినప్పుడు, ఆమె ఆధ్యాత్మిక నిష్ఠను చూసిన మతాధికారులు  ఆ తరువాత మరో సందర్భంలో ఆమె జాతి, సంస్కృతి,  విదేశీ నేపథ్యాన్ని మాత్రమే చూస్తారు. ఈ తిరస్కరణ మత సంస్థల్లోని మానవ బలహీనతలు, సంకుచితత్వం ఆదర్శాలను కూడా ఎలా కలుషితం చేస్తాయో చూపిస్తుంది. ఆ్యన్ మొదట లౌకిక బంధాల నుండి విముక్తి కోరింది. మతాధికారుల తిరస్కరణ కారణంగా, ఆమె చివరికి మత సంస్థాగత బంధాల నుండి కూడా విముక్తి పొందుతుంది. ఆమె తన ప్రయాణాన్ని సంస్థల ప్రమేయం లేకుండా, తన స్వంత మార్గంలో కొనసాగించడానికి నిర్ణయించుకుందని చెప్పవచ్చు. నిజమైన విముక్తి ఎక్కడా లేదు, అది మన అంతరంగంలోనే ఉందనే తాత్విక సత్యాన్ని ఈ పాత్ర ద్వారా రచయిత చెప్పారు. 

ఆడమ్-ఆ్యన్ సంబంధం శారీరక ప్రేమ నుంచి ఆత్మాన్వేషణకు మారుతుంది. భారతీయ పాత్రల్లో ప్రేమ అనేది కుటుంబ, సంస్కృతి, ధర్మం వంటి పరిమితుల్లో సరిహద్దులు వెతుకుతుంది. 

జైన ధర్మం కథా వస్తువుగా ఉన్న ఈ నవలలోని అన్ని పాత్రలూ, తమ తమ దృక్పథాల ప్రకారం జైన ధర్మాన్ని, జీవితాన్ని చూసే విధంగా రచయిత, పాఠకులైన మనకు జైన ధర్మంలోని వాస్తవిక చిత్రాన్ని తగినంతగా అందించారు. జైన ధర్మంలో అంధ విశ్వాసం కలవారు, కొద్దిపాటి విశ్వాసం కలవారు, తర్కబద్ధంగా వాదించేవారు, జిజ్ఞాసువులు, పూర్తి నాస్తికులు, పరమత పాలకుల వంటివారు, ఆషాఢభూతులు, ఇలా పలు రకాల పాత్రలను ఒకేసారి, వారి వారి నమ్మకాలకు అనుగుణంగా నడిపించుకుంటూ వెళ్లి, రచయిత కథను చాలా ఆసక్తికరంగా  సృష్టించారు.

అలాగే, కథలో  మధ్య మధ్యలో కనిపించే రచయిత, పాఠకులతో మాట్లాడుతూ, తరువాతి అధ్యాయాలను చదవడానికి ప్రోత్సహించే విధానం కొత్తగా, సరదాగా అనిపించింది. 

ఈ నవల  జైన మతపు ఆలోచనలను మించిన ఆధ్యాత్మిక అనుభవంగా ఉంది. ఇది కేవలం జైన మత కథ మాత్రమే కాదు…   మనిషి అంతర్గత లోక తత్వాన్ని వెలికి తీయించే సాహిత్యయాత్ర అని చెప్పవచ్చు. శాంతినాథ్ దేసాయి గారు  అనారోగ్యంతో ఉన్న సమయంలో వ్రాసిన చివరి రచన అయి ఉండవచ్చనే ఆలోచన వస్తే పాఠకులుగా అది మన తప్పు కాదేమో. నిజం కూడా అదే.  ఇది ఆయన చివరి రచనే. ఒక  జైన  రచయిత తన మతంలోని లోతులను అన్వేషించే ప్రక్రియగా ఈ నవల రాసి ఉండిఉంటారని అనే భావన కలిగింది నాకు. అన్ని మతాల్లోని ఆచారాల శక్తులు, బలహీనతలు ఇందులోనూ ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి కాదు. 

జైన కుటుంబంలో, జైన సమాజంలో జరిగే ఈ కథను చదువుతుంటే పాఠకుడు కూడా ఆ  కుటుంబ సభ్యుడిలా అనిపించేలా రచనా శైలి ఉంది.  

మతం ఆవిర్భవించిన కాలంలో నిర్దేశించబడిన నియమాలచే ఆకర్షించబడి, వాటిలో ఐక్యమయ్యే వారిపై ప్రస్తుత కాలంలో ఉన్నవారు చూపే ఒత్తిడి, మత భావనను పెంచకుండా మానవ శాస్త్రంలో ఉన్న వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమే అయినప్పటికీ, ఏదో ఒక సమయంలో తన అభిప్రాయాలను పరిమితం చేసుకుని ఇతరుల అభిప్రాయాలను కూడా విన్నప్పుడే ఉమ్మడి సమాజం, దానికి అనుగుణంగా జీవనం కొనసాగడం మొదలవుతుందన్న  తత్త్వం ఉందీ నవలలో. 

ఆధునిక జీవితంలోని సమస్యలు, ఆశలు, ఆకాంక్షలు, ఒకవైపు ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షణ, లౌకిక జీవితం మధ్య ఉండే సంఘర్షణను ఈ నవల లోతుగా విశ్లేషిస్తుంది. ప్రధాన పాత్ర తన జీవితాన్ని, ప్రేమను, స్వేచ్ఛను, చివరకు తాను ఎంచుకోవాల్సిన మార్గాన్ని నిర్ణయించుకోవడంలో పడే మానసిక సంఘర్షణను, ఆమె తీసుకునే అంతిమ నిర్ణయాన్ని ఈ నవల చాలా శక్తివంతంగా చెబుతుంది.  నేటి సమాజంలో వ్యక్తి స్వేచ్ఛ యొక్క అనివార్యతనూ దాని పరిమితులనూ అన్వేషించడం కనిపిస్తుంది. పాత్రల అంతరంగాలను, వారి ఆలోచనలను, వారి సంఘర్షణలను రచయిత అద్భుతంగా ఆవిష్కరించారు. జైన సంప్రదాయాలు, వాటి నియమాలు, ఆధునిక సమాజంలో వాటి ప్రాముఖ్యత వంటి అంశాలను చర్చించడం జరిగింది. జీవిత పరమార్థం ఏమిటి? శాశ్వతమైన సత్యం కోసం మనిషి చేసే అన్వేషణ ఎలాంటిది? అనే తాత్విక ప్రశ్నలకు ఈ నవల సమాధానాలు వెతుకుతుంది.  

నవలలోని కొన్ని విషయాల ద్వారా కథాకాలం 1981 అని మనం అర్ధం చేసుకోవచ్చు. అయినా ఈ రోజుకి కూడా ఇందులోని చర్చ కొత్తగానే అనిపించడం ఈ సబ్జెక్ట్ విస్తృతిని, కాలాతీత భావనని మనకి తెలియజేస్తుంది. 

ఈ నవల ప్రధానంగా వ్యక్తిగత స్వాతంత్య్రం, ఆధ్యాత్మిక విశ్వాసాలను సమన్వయపరిచే సందేశాన్ని అందిస్తుంది. రచయిత ఆధునికతను అంగీకరించి కూడా సంప్రదాయ విలువలను గౌరవిస్తూ జీవించాల్సిన అవసరాన్ని కథ ద్వారా ప్రతిపాదించాడు. వ్యక్తులు  తమ నమ్మకాన్ని,  దాని ఆదర్శాలను అమల్లో పెట్టడంలో ఉన్న వ్యత్యాసాలను గమనించి, తమ స్వేచ్ఛను సమర్థవంతంగా రక్షించుకోవాలని ఈ నవల సూచిస్తుంది. అంతేకాక, వివిధ సంస్కృతుల కలయికలో ఆధ్యాత్మిక సమగ్రత పెంపొందించాల్సిన అవసరం కథకి ప్రాథమిక పాఠంగా నిలిచింది.

ప్రతి వ్యక్తి జీవనశైలి భిన్నమైనా, సత్యం, ధర్మం కోసం స్వాతంత్ర్యాన్ని సమానంగా గౌరవించాలి, ఆయా ధార్మిక విలువలను అవగాహనతో ఆచరించాలనే వాస్తవాన్ని  తెలుపుతుంది నవల. 

సంక్లిష్టమైన, తాత్విక నేపథ్యం ఉన్న ఈ నవల అనువాదం అంతగా ఆకట్టుకునేలా లేదనే చెప్పాలి. సులభంగా చదివించగలిగే శైలి ఇలాంటి నవలలో కష్టమే అయినా అనువాదం ఇంకాస్త ఆకట్టుకునేలా  ఉంటే ఇంకా ఎక్కువమంది పాఠకులని చేరుకొని ఉండేదేమో అనిపించింది. ఇందులో ప్రధాన పాత్ర పేరు ఆ్యన్. దీన్ని తెలుగులో ఎలా పలకాలో నాకు అర్థం కాలేదు. నవలలో ఉన్న తాత్విక, మేధోపరమైన చర్చలనుఅదే స్థాయిలో తెలుగు పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో అనువదించడం అనువాదకుడికి చాలా కష్టమైన పని అయ్యింది. అలాగే ప్రచురణ కర్తలు కూడా అచ్చుతప్పుల మీద మరింత దృష్టి పెడితే బాగుండేది. బ్యాక్ కవర్ మీద ఈ నవలకు 2007 లో కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చిందని రాశారు. నిజానికి అది 2000. 

"ఓం ణమో" అనేది కేవలం ఒక కథ మాత్రమే కాదు, జీవితం, ఆధ్యాత్మికత, మానవ సంబంధాల గురించి లోతైన ఆలోచనలను రేకెత్తించే, మానవ ఆత్మసంధాన యాత్రను లోతుగా చిత్రించే ఒక గొప్ప సాహిత్య రచన. జీవితార్థం, మతం, నమ్మకం, విముక్తి వంటి అంశాల మధ్య సంబంధాన్ని విశ్లేషించే ఈ నవల పాఠకుల్లో ఆధ్యాత్మిక ఆలోచనలను ప్రేరేపిస్తుంది.

దైవాన్ని వెతకడం కాదు, మన లోపలి నిశ్శబ్దాన్ని గుర్తించడమే ‘ఓం ణమో’  నవల సార్ధకత. 

నవలా రచయిత, విమర్శకుడు, చిన్న కథా రచయితగా ప్రసిద్ధి చెందిన శాంతినాథ దేశాయ్ ఉత్తర కన్నడ జిల్లాలోని హలియాల్‌లో జన్మించారు. ఆయన ప్రాథమిక, మెట్రిక్యులేషన్ విద్యను ధార్వాడ్‌లో పూర్తి చేశారు. తరువాత, ఆయన ముంబైలోని విల్సన్ కళాశాల నుండి బి.ఎ. మరియు ఎం.ఎ. డిగ్రీలను పొందారు. తరువాత, ఆయన బ్రిటిష్ స్కాలర్‌షిప్ పొందారు  లీడ్స్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత, ఆయన కర్ణాటక విశ్వవిద్యాలయం, కొల్హాపూర్‌లోని శివాజీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, ఆంగ్ల విభాగాధిపతిగా పనిచేశారు, తరువాత 1988లో కువెంపు విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా పనిచేశారు. ఆయనకు కర్ణాటక  సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ్ అవార్డులు లభించాయి…