మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Thursday, 9 April 2020

దేనికి యజమానివి?

నువ్వొచ్చేవరకూ 
ఈ ప్రపంచం నీ  కోసమే వేచి ఉంది

నీకోసం ఒక నందనవనంగా 
తనను తాను సిద్ధం చేసుకున్నాకే 
నిన్ను రప్పించుకుంది 

నువ్వొచ్చావు… 
నడక నేర్చావ్ 
పరిగెత్తావ్
యంత్రమెక్కావ్
యంత్రమయ్యావ్ 

ప్రకృతికి యజమానిననుకుంటూ 
నీకు నువ్వే ప్రతిధ్వనివై 
ప్రపంచాన్ని నీకు నచ్చినట్లుగా 
ఋతువులని నీకు వీలైనట్లుగా 
సర్డుకుంటున్నావ్ 
ప్రకృతి సమతుల్యతని 
అతలాకుతలం చేస్తూ 

ఇప్పుడు
ఆ ప్రకృతేమో
తనను తాను
సమతుల్యం చేసుకోవడానికి 
తన అంతరాంతాల్లోనికి 
నిన్ను వడపోసుకుంటుంది  

మరి
ఇప్పుడు 

దేనికి యజమానివి నువ్వు?


Saturday, 4 April 2020

పసి వసంతం


నాకు నన్ను చూపుతూ నువ్వు మొదలైన క్షణం
ఇంకా నా అరచేతుల నిండా ఆకాశమై పరుచుకునే ఉంది

వేవేల వసంతాలు ఒక ఉధృతమై ఒక్క సారిగా
కమ్ముకున్న సవ్వడి ఇంకా వినిపిస్తూనే ఉంది

ముద్దు ముద్దు మాటలని మూటగట్టేసి
నా మౌనాన్ని చిధ్రం చేసిన తీపి గాయం ఇంకా పచ్చిగానే ఉంది

కలల్ని మాట్లాడటం పట్టుబడని నన్ను
కలల సరిహద్దుని దాటించేసిన నీ భవిత ఇంకా పలకరిస్తూనే ఉంది

శూన్యం నను తడిమినప్పుడల్లా
నువ్వొక అలారం మోతవై నన్ను తట్టిలేపుతున్న సందర్భాలు కొనసాగుతూనే ఉన్నాయ్

నిద్రిస్తూ నువ్వు కనే కలల లేత చిరునవ్వులలో వెలిగే అమాయకత్వపు వెలుగులు
ఎప్పటికీ తరగని ఒక ఆశ్చర్యమై నన్ను కట్టేస్తున్నాయ్

నిన్ను నేను లాలించడమే అందరికీ తెలిసిన నిజం
నువ్వు నన్ను పాలించడం నాకు మాత్రమే తెలిసిన అలౌకిక ఆనందం

నవ్వుతూ తుళ్ళుతూ కళ్ళు పెద్ద చేసి నువ్వునాన్నా' అని పిలిచినప్పుడల్లా
నువ్వు యువరాణివై నన్ను ఈ ప్రపంచానికి రాజుని చేసిన ఆనందం

నీ పసి స్పర్శలో ఏ మర్మాలు దాచావో ఏమో
నా శూన్యాల అలికిడిని చెరిపేస్తూ ఒక దైవత్వం కురుస్తున్న చప్పుడు వినవడుతుంది

నీ నవ్వుల మంత్రదండంతో నా కలతలన్నిటిని సరి చేసేసి
మనఃక్లేశాలన్నిటినీ మాయం చేసేస్తున్న అద్వైత అల్లరివి

ఎప్పటికప్పుడు నన్ను కొత్తగా మొదలు పెట్టడం
ఎక్కడికక్కడ నన్నునిర్మలంగా ఆవరించుకోవడం తెలిసిన ఏకైక సత్యానివి నువ్వు

నా వంటినే మెట్లుగా నడచిన నిన్నటి నీ పసినడకల నిర్వచనాలని దాటి
నేడు నేను పరిచే దారిలో రేపటి నీ పరుగుని కలగంటూన్నా

కన్నా నన్ను తడిపే సున్నితపు ప్రేమ సుమాల తొలకరివి నువ్వు
నువ్వు నా ఆనందానివి నువ్వే నా అనంతానివి!