మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Wednesday, 27 February 2013

వెన్నెల కుసుమం - 3


గ్రీష్మ ఋతువులో వేడి తాకిడికి మండిపోతున్న అభాగ్యునికి తొలకరి జల్లులు పన్నీటి జల్లుల్లా సేదతీర్చినట్లు నీవు నా దరి చేరి స్వాంతన కలిగిస్తావని నా ఆశ.
కోనసీమలో గోదారి గట్టున కొబ్బరి తోటల్లో  వెన్నెల రాత్రుల్లో నీవు నేను కలసి ఎన్నో ఎన్నెన్నో ఊసులాడాలని సంధ్యా సమయాన సాగరతీరంలో సాగరుని ధాటికి అరగిన రాళ్ళమీద మనమిద్దరం కూర్చుని ఉండగా గాలికి రేగే నీ ముంగురులను సవరిస్తూ సముద్రపు అలల తాకిడికి తడసిన నీ   పసిడి పాదాలను నా పెదవులతో స్పృశిస్తూ పచ్చని ప్రకృతిలో నీ వడిలో తల పెట్టుకుని పడుకుని నీ మోమును పలుకరించాలని ఎన్నో కోరికలు, ఎన్నెన్నో ఆశలు  --- అవన్నీ తీరేనా ...   
చల్లని సాయంత్రాన పిల్ల గాలుల పరిమళాలతో నీవు నేను చెప్పుకున్న ఊసులన్నీ విన్న చిలకా గోరింకలు వాటి సఖులైన మిగిలిన పక్షులకు చెప్పేనా...
చిరుగాలుల సవ్వడిలో ప్రేమ పక్షుల కిలకిలరావాలలో మన ప్రేమ రాగం వినిపించాలి.
పాలసంద్రం నుండి ఉద్భవించిన అమృతధారలో నీ శరీరాన్ని మెరుగు పెట్టినారా అన్నట్టున్న నీ శరీరఛాయను, సుధలు కురుస్తున్న నీ లేలేత చెక్కిళ్ళను చూసిన వెన్నెల రాజు సిగ్గు పడి తాను మబ్బుతెరల చాటుకు తప్పుకుంటున్నాడు.
ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చటి చెట్లు, తీగల్లా అల్లుకుపోయిన లతలు ఉన్నచోట పిల్లగాలి తెమ్మెరలు వీస్తున్నప్పుడు పులకించే వనసీమలలో  సెలయేటి గలగలలు వింటూ నీవు నేను ఆ సెలయేటిలో జలకాలాడి వంటి తడి ఆరమునుపే మన ప్రణయ కేళీ విలాసాలు పూలతలతో అల్లిన మంచెపై జరగాలి ప్రియతమా...

అప్పుడు నీవు వనకన్యకలా.... అభినవ శకుంతలలా.... ఆకులు, పూలతలే ఆభరణాలుగా నన్ను చేరి నా హృదయపీఠం కదిలించాలి.
నీ వడిలో నా తల పెట్టుకుని నీ కళ్ళల్లో నా కళ్ళు పెట్టి చూస్తూ విరహతాపంతో భారంగా వణుకుతున్న నీ అధరాలలోని సుధలను నా పెదవులతో గ్రోలాలి.
చెలి చెంత లేకున్న చెలికాడు వ్యధ చెప్పుకునేదెవ్వరికి. చెలి ఛాయ చూసినా చాలు కదా చెలుడు చింతనుండి తేరుకుని తనకై ఆశగా ఎదురు చూడటానికి.

Friday, 22 February 2013

మరుభూమి


సోదరా ఓ భారతసోదరా
చూడరా భారతమాత వేదన ఆవేదన
మరుభూమిగా మారుచున్నది మన మాతృభూమి
బీటలు వారెను భవితవ్యం భరతభూమిలో
యువత అంతా నిర్వీర్యం హిందూసీమలో                     

భవితే లేదా హిందూస్తాన్లో భారతయువతకు
సవతిగ మారెను పాకిస్తాన్ మన హిందూమాతకు
బందులుకూడా పండుగలే భరత భూమిలో
హత్యలు కూడా వేడుకలే హిందూసీమలో
మర్డర్లంటే మక్కువ ఎక్కువ మన మాతృభూమిలో
అల్లర్లంటే ఆరో ప్రాణం అస్సాం మొదలు ఆంధ్రా వరకు       

లోహవిహంగాలై ఆకాశ యానం చేసే ధరలు
ఆరని మంటల జ్వాలల్లోన కాలే కడుపుల ఆకలికేకలు
వరకట్నపు చితిమంట్ల్లోన ఆడపడచుల సజీవదహనాలు
మామూలేగా మన మాతృసీమలో
కుర్చీ కోసం కుస్తీపడుతూ కుమ్ములాటలు
పదవికోసం ప్రాణాల్తోనే పైరవీలు
దేశభక్తులు ఎందరుపోయినా తెలుస్తుందా ఒక్కరికైనా
దుర్మార్గుల్లో ఒక్కడు చచ్చినా దేశమంతా హత్యాకాండలు 

అందుకే లేవరా! ఓ సోదరా
తీర్చరా! మన మాతృభూమి కష్టాలు కడతేర్చరా

Friday, 15 February 2013

వెన్నెల కుసుమం - 2


వెన్నెల తోటలో విరబూసిన తారకలా, మణిమయ భవనాన నిలచిన వరూధినిలా, ప్రాణం పోసుకొని వచ్చిన మొనాలిసా చిత్రంలా, కాళిదాసు తలపుల్లోని కావ్యనాయికలారవివర్మ కుంచెనుండి జాలువారిన ఊహాసుందరిలా ఉన్న నీ ముగ్ధమనోహర రూపం...
ఓహ్! మండు వేసవిలో నీడలేక తిరుగుతున్న పాంధుడికి వటవృక్షం నీడ చూపినట్లుంది. నీవు నన్ను చూసి చిరునవ్వుల బాణాలు విసిరితే నీ సన్నిధే స్వర్గంలా, మధుస్రవంతిలా వుంటుంది.
తెల్లని సూర్యకాంతి పడిన పాలరాతి గచ్చులా నా హృదయంలో నీ రూపం  ప్రతిఫలిస్తుంది.
భిక్షపాత్ర పట్టుకొని ప్రేమార్ధినై నీ దగ్గరకు వస్తే నీవు చూపు ఆదరణ తలచుకుంటే ఓహ్! నా మనస్సు పులకరిస్తుంది.
నడి ఎడారిలో నీళ్ళు లేక దాహంతో అలమటిస్తున్న బాటసారికి అమృతంతో గొంతు తడపినట్లుంది.
ప్రపంచం - ప్రకృతి - సృష్ఠి - సూర్యచంద్రులు - ఆకాశం - మేఘాలు -వెన్నెల - నక్షత్రాలు - ఎండా వానా అన్నీ నీవే.
నీవులేని ఊహను కూడా నేను ఊహించలేను.
మలయ మారుతానికి రూపం వస్తే నీ రూపే కావాలంటుందేమో.
మల్లెల పరిమళాలకు స్వరూపం వస్తే నీ రూపే  కోరతాయేమో.
ధవళకాంతులీనుతున్న నీ మోముచూసి చంద్రుడైనా సిగ్గుతో తలవంచుకుంటాడేమో.
గులాబీల సున్నితత్వానికి ప్రాణంపోస్తే నీ రూపు దాల్చిందేమో.
పాడుతాతీయగా అంటూ పాడే కోయిల సైతం నీ గాన మాధుర్యానికి తన్మయం చెందుతుందేమో.
స్వాతిచినుకు నీ మేనిపై పడితే వెన్నెల ముత్యంలా మెరుస్తుందేమో.
"రా ప్రియా త్వరగా వచ్చేయ్
ఎన్ని క్షణాలు, ఎన్ని నిమిషాలు,
ఎన్ని రోజులు, ఎన్ని యుగాలు
వ్యర్ధంగా నిస్సారంగా గడచిపోతున్నాయ్
ఎన్ని మల్లెలు, ఎన్ని జాజులు,
ఎన్ని రాత్రులు, ఎన్ని రాగాలు
ఇవన్నీ నీ కోసం నీవొచ్చాక మన కోసం
ఆశతో బేలగా, జాలిగా ఎదురుచూస్తున్నా ప్రియా
రా ఉన్నపళంగా
గాలి కంటే వేగంగా
మనస్సు కంటే త్వరితంగా
నిన్ను చుడక పోయినా
నీ సన్నిధి దూరమైనా
కనీసం నీ స్వరమైనా వినే అదృష్ఠం కోసం
చకోరంలా ఎదురు చూస్తూ చూస్తూ చూస్తూ........"

Thursday, 14 February 2013

వెన్నెల కుసుమం - 1


వెన్నెల జలపాతం నుండి జాలువారుతున్న కలువ నక్షత్రంలా
తొలిపొద్దు రవి కిరణం సోకి విరిసిన కుసుమంలా
అమృత భాండం చేతబట్టి దేవతల్ని చూసి  నవ్విన జగన్మోహినిలా 
నీవు నవ్వి నా హృదయ పీఠికను అధిష్ఠించినావు
వెండి వెన్నెల స్పర్శతో వికసిస్తున్న కలువమొగ్గల్లా ఉన్న అధరాలు
కోటి సూర్యుల వెలుగుతో ప్రకాశిస్తున్న నీ నీలాల నయనాలు
గులాబీల కాంతులతో జాబిల్లికె వెన్నెల పంచుతున్న నీ అందమైన చెక్కిళ్ళు
వానవెలసిన తరువాత కనిపించే ఇంధ్రధనస్సులో మిళితమైన సప్తవర్ణాలు నీ చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తూ
సాగరతీరాన వెండి వెన్నెల రజను లా ఉన్న ఇసుకలో దొరకిన శంఖంలాంటి నీ కంఠం
లేత గులాబీ ఛాయతో మెరుస్తున్న నీ అందాల మేనిపై అరుణోదయాన పడిన మంచు తొలి కిరణం వేడికి కరిగి నీ శరీరంపై పడి వెన్నెల రజనులా మెరుస్తున్నట్లు
అఙ్ణాత కార్మికుల ఊపిరితో రూపందాల్చి శతాబ్దాలుగా వెండికొండలా ఉన్న తాజ్‌మహల్ అందమైన పడతిగా మారి నా ఎదలో వగలు రేపినట్లు
నీవు నా చెంతన తిరుగుతూ ఊంటే,
"రవివర్మ కుంచెకందని లావణ్యం
కాళిదాసు గీతికకందని స్నిగ్ధత్వం"
కలబోసుకొని ఉన్న నిన్ను చూసి గంధర్వకన్యలూ, దేవతమూర్తులూ, అప్సరాంగనలూ, యక్షిణీకన్యలూ అసూయతో దహించుకుపోతూ ఉంటారేమో.
మణిదీపశిఖలా, విద్యుల్లతలా, హంపీ కన్యలా, అజంతా చిత్రంలా, ఎల్లోరా శిల్పంలా, బాపు బొమ్మలా, కాంతి తీరాన గంధర్వ బాలలా నిలుచున్న  నీ తలనుండి రాలి పడే మల్లెలు చీకటిలో మెరుస్తున్న మంచులా ఉన్నాయి.

కలలారని కనుపాపకి నీ రూపమే కవచంప్రభాతపు సుప్రభాతం లో నాకు వినిపించే తొలి పదం నీ పేరేగా

వేకువనే వికసించే ప్రతి కుసుమం నీ నవ్వు నుండే పుట్టిందా?

కాళిదాసు కావ్య నాయిక ఇలలోకి ఇప్పుడొచ్చెనా

నింగిలోని జాబిలమ్మ కి  నిదుర రాక  నాకోసం నడచి వచ్చెనా

నిదుర నదిలో ఎదురుపడే కలలనావలన్నిటిలో నీవేగా

కలలారని కనుపాపకి నీ రూపమే కవచం

మది దాటని మధురూహకి నీ ధ్యానమే వేదం

ఎదవాకిలి తలుపులు తీసి మది కోవెలలో పీఠం వేసి

నా ఊపిరినే వింజామర చేసి నీ కోసమే వేచి ఉన్నా...