మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Friday, 18 September 2009

వెయ్యి కోట్ల డీల్సూ... మర్డర్ల మాటలు

అయ్యా.... రోశయ్య గారూ ....


ముఖ్య మంత్రి గారి ఫోన్ టాపింగ్ చేస్తున్నారంటే నేనేమన్నా వేఉయ్యి కోట్ల డీల్సూ.. హత్యల గురించి మాట్లాడతానా.... నేను ఊళ్ళో వర్షాలు ఎలాపడుతున్నాయి. మన వాళ్లందరూ బాగున్నారా? అనే మాట్లాడతాను కాబట్టి నా ఫోన్ టాపింగ్ చేసినా నాకేం బాధ లేదంటారా ...

అసలు ఒక అధికారం లో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా అవి. బుద్ధీ జ్ఞానం ఉన్న ముఖ్య మంత్రి ఎవరన్నా అలా అంటారా....

వెయ్యి కోట్ల డీల్సూ... మర్డర్ల మాటలు ఫోనుల్లో మాట్లాడుకునే రోజులా ఇవి...

అయినా ఇక్కడి సమస్య మీరేమి డీల్స్ మాట్లాడుతున్నారో అని కాదు. ముఖ్య మంత్రి గారి ఫోన్ నే టాపింగ్ చేస్తున్నారే అని.

స్కాం లు చేసి ఇరుక్కున్నా మీ లాంటి రాజ కీయ నాయకులు బయటకి రాగలరు. కాబట్టి మీఎలాంటి వాళ్లకి టాపింగ్ లో లెక్క కాదు కానీ... సామాన్యుల దృష్టి లో ముఖ్యమంత్రి స్తాయి ఎంత దిగజారుతుంది.

ప్రభుత్వాధి నేత కనుసన్నల్లో మెలగ వలసిన అధికార వర్గం & మంత్రి వర్గం షాడో ప్రభుత్వాధి నేత ఇంటిదగ్గర పెంపుడు కుక్కల్లా తాను ఆడించినట్లల్లా ఆడి ముఖ్యమంత్రిని ఖాతరు చేయకుండా తాన పైకే నిఘా వేస్తే ఇక తమకు నచ్చని వ్యక్తుల విషయం లో వాళ్ళు ఎంత దూరమైనా పోగలరు కదా?

45 ఏళ్ల రాజ కీయ జీవితం మీకు నేర్పిన సంస్కారం ఇదేనా...?


మీ మాజీ నేత రాజీవ్ గాంధీ మీద నిఘా వేసారని ఒక ప్రభుత్వాన్నే కూల దోసిన ఘనత గల పార్టీ తమరిది. మరి ముఖ్య మంత్రి ఫోన్ మీద నిఘా అంతే చిన్న విషయం అయిపోయిందా?


మీ

స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Thursday, 17 September 2009

మంత్రదండం బయటకి తీసి ఖజానాని నింపి వెయ్యవయ్యా....

తట్టా బుట్టా సర్దుకుని ఇక రాజకీయాలు చాలు శాసన సభ లో నాగం జనార్ధన రెడ్డి తో వేగలెక చస్తున్నాను అంటే నీ లాంటి మాటకారి మాయలోడు లేకపోతె ప్రతిపక్షాలతో వేగటం చాలా కష్టం అని నీకు క్రీడా ప్రాంగణం లాంటి శాసన మండలి లలో కి పంపారు మీ నేత వై.ఎస్. నక్క తోకను తొక్కితే అదృష్టం పట్టినట్లు, వై.ఎస్ పోయి నిన్ను అందలాన్ని ఎక్కేట్టు చేసారు. అది బాగానే ఉంది.

నిన్నటి వరకూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బెమ్మాండం అని వై.ఎస్సూ నువ్వూ తోడు దొంగల్లా ఒకే మాట వల్లే వేస్తుంటే నిజమే కామోసూ... రిసెషన్ టైం లో కూడా మన ఆంధ్ర ప్రజానీకానికి మీలాంటి అమాత్యులు దొరకటం మా పూర్వజన్మల పుణ్యమేమో అనుకున్నాం.

కానీ ఇదేన్దయ్యా.... ఒక్క సారిగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులన్నీ ఆపెయ్యటం. ఇది దేనికి సూచన?

మాటల మరాఠీ గాడివైన నువ్వు మాత్రం యధాప్రాకారం ఆర్ధిక క్రమశిక్షణ కోసం అలా చేస్తున్నాం అంటూ ఏదేదో చెపుతున్నావు. కానీ లోపాయి కారీ వార్తల ప్రకారం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ బిల్లులు చెల్లిస్తే తరువాతి జమా ఖర్చుల కోసం ఓవర్ డ్రాఫ్ట్స్ కోసం పరుగులు పెట్టాలి అంటున్నారు.

అంతే కాక మీ మానిఫెస్టో లో చెప్పిన 9 గంటల ఉచిత విద్యుత్ & రేషన్ బియ్యం కోటా పెంపు వాయిదా అన్నట్లు వార్తలు వస్తున్నాయి. రేషన్ కార్డుల ఏరివేత తరువాత కోటా గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నారట. మరి ఎన్నికల ముందు కూడా మీ జమానా నే కదా ఉంది. అప్పుడు తెలియలేదా బోగస్ రేషన్ కార్డుల సంగతి. ఏదో సంతర్పణ లాగా మరీ పంచిపెట్టారు కదా తెల్ల కార్డులు. అప్పుడవి మీ వోట్ల కార్డులన్న మాట.

ఇప్పుడు ఖజానా ఖాళీ అయ్యేసరికి మీకు బోగస్ కార్డు ల విషయం అర్జంటుగా ( మీ వై.ఎస్. గారు భువి పై తిరుగాడుతున్నప్పుడే) గుర్తుకు వచ్చింది. ఏమి మాయలయ్యా మీవి?.

దొంగలెక్కలతో (రాజకీయ నాయకులు కాబట్టి మీ దొంగ లెక్కలన్నీ అసెంబ్లీ లో సవాళ్ళతో సరి. అదే వ్యాపారవేత్త లైతే జైలు ఊచలు లెక్కపెట్టిస్తారు) తిమ్మిని బొమ్మిని చెయ్యటం ఇంకా ఎన్నాళ్ళు?

ఇకనైనా ఊసరవెల్లిలాగా రంగులు మార్చటం ఆపేసి జనాలని ఇంకా భ్రమ పెట్టకుండా వాస్తవం లోకి రండయ్యా రోశయ్యా...

13 బడ్జెట్ లు ప్రవేశ పెట్టిన ఆర్ధిక మంత్రవేత్తవి. నీ మంత్రదండం బయటకి తీసి ఖజానాని నింపి వెయ్యవయ్యా...

రోశయ్య గారిలోని 'రోషయ్య' ని బయటకు తెండి.

(నీతో మాట్లాడాల్సిన విషయాలు ఇంకాసిని ఉన్నాయి. అవి రేపు చెప్తాలే..)

మీ
స్నేహితుడు
(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Wednesday, 16 September 2009

ఆత్మవిశ్వాసం

నిన్ను నీవు తెలుసుకో నీ శక్తిని నమ్ముకో

అసాధ్యమన్నదే లేదు ఆత్మవిశ్వాసం నీకుంటే

అపజయమే దరికి రాదు ఆత్మస్థైర్యం నీకుంటే

గుండె బలముంటే గెలుపన్నది నీ ఇంటి గడపే

నిన్ను నీవు తెలుసుకో నీ శక్తిని నమ్ముకో

నిరాశతో కుంగిపోకు నీ శక్తే నీకు బలం

ఓటమికి వెరవొద్దు అదే నీ గెలుపుకి తొలి మెట్టు

నొప్పికి వెరవకుంటే ముళ్ళు కూడా పువ్వులే

నిన్ను నీవు నమ్ము కుంటే ప్రతి పనిలో విజయాలే

నాకంటూ ఓ రోజు వస్తుందని కూర్చుంటే

కాలం కరుగుతుంది కాని నీకా రోజు రాదులే

ఈ రొజునే నీ రోజుగా చేసుకో

ప్రతి క్షణం విజయం నీదని తెలుసుకో

నిన్ను నీవు తెలుసుకో నీ శక్తిని నమ్ముకో

సలహాలకేముంది ఎవరైనా ఇస్తారు

సాయం చేయ రమ్మంటే వారంతా పరారు

దేవుడేమి చేస్తాడు నీ ప్రయత్నం లేకుండా

నీ శ్రమ తోడైతే ఆ దేవుడే నీకు జోడు

నీ ఖర్మకు నీవు కాక ఎవరు బాధ్యుడు

నీ లక్ష్య ఛేదనకు ఆత్మ బలమే ఆయుధం

నీ కలల సాధనకు ఆత్మ విశ్వాసమే అస్త్రం

నిన్ను నీవు తెలుసుకో నీ శక్తిని నమ్ముకో

Tuesday, 15 September 2009

వీరాధి వీరుడా స్టారాధి స్టారుడా.... డిపాజిట్ ఏదయ్యా?సినీ వినీలాకాశం లో అగ్ర తారగా ఓ వెలుగు వెలుగిన మెగా స్టారుడా అచ్చిరాని రాజకీయాలు నీకెందుకయ్యా...?

మళ్ళీ నీ మార్కు వ్యంగ్య భరిత డైలాగులతో సినిమాలు తీసుకుంటే ఉపయోగం ఉంటుందేమో ఆలోచించవయ్యా....

ఝెండా పీకేద్దాం అనగానే ఉగ్రనరసిహుడిలా ఆవేశ పడితే, రామోజీ రావుగారు ఝెండా పీకేద్దాం అనే వార్తాకధానం ప్రచురించి ఒక విధం గా మీకు మంచే చేసారనుకున్నా. ఇంకేముంది చాలెంజ్ సినిమా లో లా మీ సత్తా టెక్కలి ఉప ఎన్నికలనుండి చూపించటం మొదలెట్టేస్తారు అనుకున్నా.

సానుభూతి వల్ల మీరు (మీ పార్టీ అభ్యర్ధి) గెలవలేరు కానీ మంచి పోటీ ఇస్తారనుకున్నా. కానీ జనాలకి మీ మీద ఎంత నమ్మకముందో చూడండి. ఆరు నెలల్లో మీ ఓటర్లను సగం తగ్గించేసింది.

మీరు అన్నారు సానుభూతి వల్లే కాంగ్రెస్ గెలిచింది అని. అది నిజమే అనుకుందాం మరి తెలుగుదేశానికి ఏం సానుభూతి ఉండి కాంగ్రెస్ తో పోటాపోటీగా రాగలిగారు.
అంటే ఇప్పటికి కూడా ప్రజలకి ప్రత్యామ్న్యాయం గా తెలుగుదేశాన్నే భావిస్తున్నారు.

అంటే ప్రతిపక్ష పాత్ర మీకంటే వారు పోషిస్తున్నారనే కదా. మీరు ప్రతిపక్ష పాత్ర సరిగ్గా నిర్వర్తిస్తుంటే జనాలు మిమ్మల్ని కూడా ఇంకా గోదా లోనే ఉంచేవారు.

ఆటలో విజయం కోసం చూసే ఆటగాడి కంటే, ఒక జట్టు కి అనుకూలంగా నిర్ణయాలు వెలువరించే అంపైర్ ని జనాలు మీలో చూసారు కాబట్టే మీకు పడాల్సిన ఓట్లు కూడా ఆ జట్టు ఖాతాలోకే వేసేసారు జనాలు.
మీరు వచ్చింది మార్పు కోసం అన్నారు. సినిమా లలో మీకున్న అభిమానుల్ని మీ వోటర్లు గా మార్చుకోలేని మీరు మా జీవితాల్లో ఏం మార్పు తీసుకువస్తారు.

జనాలు మీ నుండి ఆశించింది మార్పుని. ముందు ఆ మార్పుని మీలో , మీ బావ మరిదిలో, మీ నాయకుల్లో & మీ పార్టీ పునాది రాళ్ళల్లో తీసుకు రండి.

కాంగ్రెస్ లో ఎవర్ని ముఖ్యమంత్రి ని చెయ్యాలో మీ శాసన సభ్యురాలి కి ఎందుకండీ?

అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. కానీ రాజకీయ పార్టీ లో పార్టీ అభిప్రాయమే బయట పడాలి కానీ ఎవరికీ వారు తమ తమ వ్యక్తి గత అభిప్రాయాలని ఇష్టం వచ్చి నట్లు పబ్లిక్ లో చెప్పుకుంటూ పోతే ఏది మీ పార్టీ అభిప్రాయమో ఏది వ్యక్తిగత అభిప్రాయమో చెప్పటానికి మీ పార్టీ తరపున ఒక ప్రతినిధిని పెట్టాల్సి రావచ్చు చూసుకోండి మాస్టారూ...

లేదంటే ఈ వ్యక్తిగత అభిప్రాయాలతో మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కి తోక పార్టీలా మారటానికి ఎక్కువ సమయం పట్టదు.


మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Monday, 14 September 2009

కాంగ్రెస్ దేవుడు వై.ఎస్ పాలన అంత బాగుంటే...

పై లోకాల్లో ఉన్న కాంగ్రెస్ తాజా దేవుడు వై.ఎస్. ఆశీస్సులు, ఆయన గారి పై వెల్లు వెత్తుతున్న సానుభూతి ఇవన్నీ కలపి మిగిలిన పార్టీలు అసలు ఖాతాలు ఓపెన్ చేస్తాయా అనిపించింది టెక్కలి ఉప ఎన్నికల్లో . కానీ ఫలితాలు చూస్తే అంత సానుభూతిలోనూ 7 వేల చిల్లర ఆధిక్యం మాత్రమే వచ్చింది. అదీ ప్రతిపక్ష నాయకులెవరూ ప్రచారం చెయ్యకుండా.... వాళ్ళు కూడా పూర్తి ప్రచారం చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదో మరి?


నిజం గా రాష్ట్రమంతా వై.ఎస్ మేనియా తో ఊగిపోతుంటే, రెండు సానుభూతులూ (వై.ఎస్ & రేవతీ పతి) కలిస్తే ఎంత భారీ ఆధిక్యం రావాలి పాలక పక్షానికి. ఎన్నో వందలమంది చావులని తన ఎకౌంటు లో వేసుకుని వెళ్ళిన కాంగ్రెస్ దేవుడు వై.ఎస్. గారి పరిపాలన అంత సుభిక్షం గా ఉంటే ఈ పరిస్థితి ఎందుకో పాలక పక్షానికి.

మన భారతీయులు పోయినాళ్ళంతా మంచివాళ్ళే అని ఎలాంటి వాడు చనిపోయినా తన గురించి మంచిమాటలే చెప్పుకుంటాం. అంత మాత్రాన తను చేసిన పనులన్నీ మంచివి అయిపోవు.

ఒక MLA చస్తే ఆయన గారి భార్యామణి లేదంటే సుపుత్రుడో తనూ లేకపోతే సోదరుడో.... వీళ్ళు తప్ప మరో నాయకుడు దొరకనంత దౌర్భాగ్య స్తితి లో ఉన్నాయా మన రాజ కీయ పార్టీలు.

ఈ రోజు వచ్చిన ఫలితం చూస్తే అర్ధమవుతుంది వై.ఎస్.ఆర్ మరణించకుండా ఉండి ఉంటే వచ్చే రిజల్ట్ ఏమిటో....

ఆయన ఈ లోకం నుండే నిష్క్రమించాడు. ఆయన ను పెంచి పెద్ద చేసిన పార్టీ లో ఎంతో మంది నాయకులు ఉన్నారు. కానీ వై.ఎస్ గారి అనుచరుల దృష్టిలో ఆ నాయకులెవరికీ ఆయన గారి ఆశయాలను నెరవేర్చే సామర్ధ్యం లేదట ఆయన గారి సుపుత్రుల వారికి తప్ప. ఇదేమన్నా రాచరికమా? తండ్రి పోగానే పదవి కట్ట బెట్టటానికి? ఇంకెందుకు 125 ఏళ్ల చరిత్ర కల పార్టీ మాది అని చంకలు గుద్ది చెప్పుకోవటంతీసుకు వెళ్లి తుంగలో తొక్కుకోక.

ఒక నాయకుడు చస్తే ఆయన గారి ఆశయాలని నెరవేర్చే సామర్ధ్యం లేని నాయకులు కానరాని పార్టీ అయిపోయిందా కాంగ్రెస్ వై.ఎస్. వందిమాగధుల దృష్టిలో ? పొద్దున్న లేస్తే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆత్మ హత్య చేసుకున్న వారి చిట్టా పద్దుల పేపర్ ఒకటి. ఒక్క పనికి వచ్చే న్యూస్ కనపడటం లేదు వారికి జగన్ ముఖ్యమంత్రి కావాలనే తపన తప్ప.

యధా రాజకీయులు తధా వార్తా పత్రికలూ.

ఇదీ నేటి భారతం


మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Friday, 11 September 2009

మన పాలక పార్టీ పేరు కాంగ్రెస్సా లేక కాంగ్రెస్ (ఐ) నా ?


ఇప్పుడు మన రాష్ట్రం లో & దేశం లో పరిపాలన సాగిస్తున్న పార్టీ కాంగ్రెస్సా లేక ఇందిరా కాంగ్రెస్సా (కాంగ్రెస్ (ఐ)).

ఎందుకంటే, ప్రస్తుతం 125 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకుంటున్న ప్రస్తుత కాంగ్రెస్ నా చిన్నప్పుడు ఎక్కడ చూసినా కాంగ్రెస్ (ఐ) అనే పిలవబడేది. దానితో పాటు ఇంకా కాంగ్రెస్ (జే) & కాంగ్రెస్ (ఎస్) అని కూడా ఉండేవి.

కానీ ప్రస్తుతం కాంగ్రెస్ (ఐ) అనే పదమే వినపడటం లేదు.

కాంగ్రెస్ (ఐ) మళ్ళీ కాంగ్రెస్ గా మారిపోయిందా? మారితే ఎప్పుడు మారింది?

ఎవరికైనా తెలిస్తే చెప్ప గలరు.మీ
స్నేహితుడు

Thursday, 10 September 2009

సోనియా జీ..... మాకున్న అర్హత 30 ఏళ్ల నెహ్రూ కుటుంబ విధేయత & ఓ కర పత్రికజగన్ ని ముఖ్యమంత్రి ని చెయ్యటానికి ఆయన గారి పత్రిక ఎంత కంకణం కట్టుకుందో పైన ఉన్న యాడ్ ని చూస్తేనే అర్ధం అవుతుంది.

2014 లో రాహుల్ గాంధీ ని ప్రధాని చెయ్యాలనే వై.ఎస్ గారి కలని పదే పదే (దాదాపు ప్రతి రోజూ పేపర్ లో టీవీ లో ఇదే భజన) ప్రస్తావించటం దారా రాష్ట్రం లో తమను మించిన విధేయులు వారికెవరూ దొరకరని చెప్పకనే చెప్పేవాళ్ళు. ఈ రోజు దాన్ని పబ్లిక్ గా చెప్పుకున్నారు.

"2014 నాటికి రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని... ప్రజలు తప్పకుండా పట్టం కడతారు " ఈ మాటలన్న వై.ఎస్. ధీమా వెనక ఉన్నది రాహుల్ పై అభిమానమే కాదు ఆ కుటుంబం పై ఉన్న మూడు దశాబ్దాల విధేయత.

అసలు నాకర్ధం కానిది ఈ కాంగ్రెస్ వాళ్ళకి నెహ్రూ గారి వారసుల మీద ఉన్న విధేయత జాతి పిత గాంధీ గారి వారసుల మీద ఏ నాడూ ఉండదు ఎందుకని.?

ఆయన వారసులు ఏ అత్యున్నత పదవుల్లోనూ లేరు కాబట్టి.

రాజ్యాంగ పరం గా అత్యున్నత పదవుల్లో ఉన్న వారికి విధేయులై ఉంటే తమకూ ఓ పరగణా కు ఆధిపత్యం వహించే అవకాసం ఉంటుంది కాబట్టి.

ప్రజలకు కావాల్సింది నెహ్రూ గారి కుటుంబం మీద విధేయత ఉన్న వాళ్ళు కాదు. ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద విధేయత ఉన్న వాళ్ళు కావాలి.

మా తాతలు నేతులు తాగారూ మా మూతులు వాసన చూడండీ అన్నట్టు గాంధీ దగ్గర నుండి వై.ఎస్. వరకూ ప్రజల మీద ఉన్న విధేయత ఉన్నంత మాత్రాన ఆ విధేయత మాకూ ఉంది అంటే కుదురుతుందా...

కొన్నాళ్ల పాటు దాన్ని నిరూపించుకుంటే వారసత్వం దానికదే వస్తుంది.మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

అశ్రువుకను రెప్పల మాటున
కను కొలనుల్లో పుట్టి
కను కొనల నుండి  జాలువారే ఓ కన్నీటి ముత్యమా

గుండెలో ఎగదన్నే బాధల నుండి
నన్ను సేద తీర్చడానికి
నీ జన్మస్థానానికి వీడ్కోలు చెబుతున్న క్షణాన
నీ పేరేమో దుఃఖాశ్రువు

మది నిండిన ఆనందంలో కూడా
నువ్వో తడి సందడి చేస్తూ
నీ మాతృస్థానానికి వీడ్కోలు చెబుతావు కదూ
అప్పుడేమో నీ పేరు ఆనందభాష్పమట

నీవు నీ మాతృమూర్తి వడి నుండి
జారిపోతున్న క్షణాన
అది దుఃఖమైనా, ఆనందమైనా...
ఎదుటి మనిషి మనసు పొరల్ని మీటి  
దానిలో ఆర్ద్రత కలిగిస్తావు కదూ

మనిషి కష్ట సుఖాల్లో,
భారమైన మనసుల సంవేదనలని గుర్తెరిగి
నీ వీడ్కోలుతో తేలిక పరిచే నువ్వు

నా ఆత్మీయనేస్తానివి… అనంత వేదానివి…!

Wednesday, 9 September 2009

జ్వలనం


ప్రియా.... నీవొక కాంతి కిరణానివి.
నేను ఒక చిన్న మంచు బిందువుని.
నీ వేడి తాకిడికి నేను కరిగి ఆవిరి అయిపోతున్నాను.
జారిపోతున్న నా ఆత్మ నీ చుట్టూ పరిభ్రమించాలనే ఆశతో ఉంది.
నీపై పగతో కాదు... నిన్ను మరువలేక...
నీ సాన్నిహిత్యం సదా కావాలని అనుకుంటుంది నా ఆత్మ.
నీ అమృత స్పర్శతో మరొక్క సారి పునీతమవ్వాలని అనిపిస్తుంది.
కాని నువ్వేమో నన్నే లేకుండా చేస్తున్నావు.
అయినా నీపై నాకు కోపం రావటం లేదు.
ప్రియమైన వాళ్ళు ఏం చేసినా అలానే ఉంటుందేమో.
నీవు స్పర్శిస్తేనే ఆవిరి అయిపోతున్న నేను నీవు జ్వలిస్తే ఏమయిపోతానో.
ఇప్పుడు పొందుతున్న అదృశ్యరూపం కూడా నాకు మిగలదేమో.
నీవు జ్వలిస్తూ నన్ను తాకితే ఆ స్పర్శ ఎలా ఉంటుందో చూడాలని ఉంది.
అందుకోసం మరొక్కసారి మంచుబిందువునై పుట్టాలని ఉంది.
కాని నీవు జ్వలించే సమయంలో నాకంటూ రూపు ఉండదు కదా....
నేను మరలా రూపం దాల్చాలంటే నీ స్పర్శ కూడా తగలని ప్రాతఃకాలంలో జన్మించాలి.
దానికోసం మరో పగలు, రాత్రి గడవాలి.

రోజుకొక్కసారే కదా నీవు నన్ను తాకే అదృష్టం నాకు కలుగుతుంది అని చాలా బాధగా ఉంది
ప్రియతమా...

Tuesday, 8 September 2009

కలల లోగిలి


నా కలల లోగిలి లోకి తొంగి చూడు నేస్తం
అక్కడ ఉన్న నీ రూపాన్ని మాత్రం దొంగిలించకు
నా ఊహల ఊగుటుయ్యాలలో ఊగి చూడు నేస్తం
అక్కడ ఉన్న నీ ఊసులను మాత్రం తస్కరించకు
నా తలపుల పల్లకిలో పవళించు నేస్తం
అక్కడ ఉన్న వలపు పరదాలను మాత్రం కదిలించకు

Monday, 7 September 2009

శాంభవి.... టిబెట్ స్వేచ్ఛా ప్రధాత?


కోటప్ప కొండకు దైవ దర్శనానికి వెళ్ళిన శాంభవి అనే బాలికను అదే పనిగా రోజు అంతా TV9 లో చూపిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు పాప గురించి కొన్ని వార్తలు చదివాను కానీ ప్రత్యక్షం గా తన మాటలు విన్నది మాత్రం రోజే.
చిన్ని పాపని చూస్తుంటే చాలా ముద్దుగా ఉంది. తను వల్లె వేస్తున్న మాటలు అంత కన్నా ముద్దు ముద్దు గా ఉన్నాయి.
కానీ మాటల్లో సత్యాసత్యాల సంగతేమిటో నాకైతే అంతుబట్టటం లేదు.
నిజానికి పాపలో అద్భుత గ్రాహక శక్తి ఉండి ఉండాలి.దానిని ఎవరైనా స్వార్ధ పరులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారేమో అనిపిస్తుంది. తను చెప్పే విషయాల్లో ఏదీ నమ్మశక్యం గా లేవు.
తను దలైలామా పూర్వ జన్మలో స్నేహితులట. ఇద్దరూ కలసి గౌతమ బుద్ధుని వద్ద శిష్యులు గా ఉండే వారట. టిబెట్ కి ఇంకొక 3 సంవత్సరాలలో (2012)స్వాతంత్ర్యం ఇప్పించటానికే తాను జన్మించిందట. వీర బ్రహ్మేంద్ర స్వామి వీర భోగ వసంత రాయలు గా 2012 లో జన్మిస్తారట. మంచి వాళ్ళని రక్షించి పిచ్చి వాళ్ళని (చెడ్డ వాళ్ళని కాదు) సంహరిస్తాడట. 2012 లో మంచి భూమి మిగిలి చెడ్డ భూమి నాశనం అవుతుందట. (భూమి లో మంచీ చెడ్డా నాకు అర్ధం కాలేదు).
భారత దేశం బాగానే ఉంటుందట కానీ చైనా, పాకిస్తాన్ & అమెరికా దేశాలు నాశనమైపోతాయట. (బహుశా చెడ్డ భూమి అంటే మనదేశానికి శతృదేశాలేమో అనిపించిది తను చెప్పిన మాటలు విన్నాక)...
ఇవన్నీ విన్నాక నాకు కొన్ని సంగతులు అర్ధం కాలేదు.
2012 లో సునామీ లు, భూకంపాలు వచ్చి చైనా నేలమట్టమై పోతే ఇక ప్రత్యేకం గా టిబెట్ కి స్వాతంత్ర్యం ఇప్పించటానికి తాను జన్మించవలసిన అవసరం ఏమిటి.
చైనా, పాకిస్తాన్, అమెరికా తదితర దేశాలు సునామీ లు, భూకంపాలు వచ్చి నాశనం అయిపొతే వీరభోగ వసంతరాయలు చ్చి ఏం చేస్తారు?
మధ్య జులపాల స్వామి వారు తమ ముఖార విందాన్ని రాత్రికి చందమామలో దర్శించమని తరువాత తూఛ్... తూఛ్.... ఇప్పుడే కాదు అన్నట్లు, కొన్నాళ్ళాగాక బహుశా 2012 లో) పాప చేత కూడా నాకు దేవుడి నుండి సందేశం వచ్చింది ఇంకా పాపం పూర్తిగా పండలేదు అందుకే ఇంకా టిబెట్ కి స్వేచ్ఛ రాలేదు అనిపించరంటారా?
ఇలా అంటున్నానని నేనేం నాస్తికుణ్ని కాదు. కానీ దేవుడి పేరు చెప్పి చిన్న పిల్ల చేత ఇలా చెప్పిస్తున్నారేమో అని బాధ గా మాత్రం ఉంది.
మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)