మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Showing posts with label air. Show all posts
Showing posts with label air. Show all posts

Friday, 23 December 2022

అక్షయం

 


అదిగో… 

అప్పుడొకసారి ఓ మిణుగురుల  పొద  

కాస్తంత కాంతి ధూపాన్ని విసిరి వెళుతూ  

ఇలా  చెప్పింది 


గాలంటే 

ఎప్పటి స్పర్శను  అప్పుడే 

ఎక్కడి స్పర్శని అక్కడే 

పరదాలుగా  కప్పే  అనుభూతి  అక్షరమనీ … 

నిప్పురవ్వని దాచుకున్న మంచు ముద్దలా

తనకోసమంటూ ఒక రోజును 

ఏ సీతాకోక రెక్కల కిందనో దాచుకుని 

ఇప్పటికిలా  జీవ ఇంధనమై 

నీకూ… నాకూ… తనకూ… ఊపిరిస్తుందనీ  


***


ఏ  ఔషధీ అరణ్యాల నుండో  

తనని తాను నింపు కొచ్చి 

కొన్ని ఊపిరుల స్పర్శ కోసం 

అన్ని అస్తిత్వాల సాంద్రతని  నింపుకుని 

తనని తాను  ఉగ్గబట్టుకుంటూ 

ఈ గాలి చేసే జాగరణ ఉంది చూశావూ… 

అది కొన్ని స్వప్నాలని 

యదార్థ స్థిరత్వంలోకి 

లాక్కొని వచ్చే తపన!


*** 


ఏ మొహమాటాలకు పోయిందో ఏమో  

ఇప్పుడిలా 

కాస్తంత రంగుల వాసనల రుచిలో  

చిక్కుకుని పోయింది   


నువ్వు కొద్దిగా మేల్కొంటే…

ఏ రంగూ రుచీ వాసనా లేని  

తన యదార్థాన్ని తనకిచ్చేసి 

రేపటి మన శ్వాసల పచ్చదనానికై 

కాస్తంత  ఊపిరి పోసుకుందాం !


(ఈమాట అంతర్జాల పత్రిక డిసెంబర్ 2022 లో ప్రచురితం)