మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Sunday, 27 November 2016

నిడివి

రాత్రి అక్కడే ఆగిపోయింది

***

అక్కడే
ఆ కాటుక కళ్ళలోనే

తనకు అచ్చివచ్చిన చీకటంతా
అక్కడే పోతపోసుకుని ఉందని

***

పగలెప్పుడో వీగిపోయింది
వెలుగుకి చోటులేనిచోట
నిలబడటమెలాగో తెలియని అయోమయంలో

***

విశ్వం నవ్వుకుంటూ ఉంది
తన ధర్మాలని దాటి
మనిషి మనిషికీ మారుతున్న
రాత్రీ పగళ్ళ నిడివిని చూసి


ఆ రాత్రి

ఆ రాత్రి
ఒక పరిమళమేదో హత్య చేయబడింది
లోలోని పత్రహరితమేదో
అత్యాచారానికి గురయినట్లుగా
నవ్వులన్నీ నిర్జీవమై
నిండు శూన్యంలోకి ప్రవహిస్తున్నాయి

ఒక శిశిరాన్ని పోతపోసుకుని
ఇహం లో కూరబడ్డ చీకటంతా
మనసులోకి చేరుకోవాలని పడే తపనకు
కంటి తడేదో ఇంధనమైనట్లుంది
విశృంఖలంగా తిమిరాన్నిచేరవేస్తుంది

కళ్ళకి కాటుకలా
తనకి చీకటి ఆడంబరమనుకుందేమో
మనసు తనని ముచ్చటగా హత్తుకుంటుంది
తలుపు తడుతున్న వెలుగు సవ్వడిని
ఆలకించలేనంత మైమరపుతో

అప్పుడలిగి వెళ్లి పోయిందో దీపం
లోకాన్ని వెలుగుమయం చేస్తూ


Sunday, 20 November 2016

మనుషుల్ని రాసుకుందాం రా

కాసేపిలా కూర్చుని మనుషుల్ని రాసుకుందాం రా

మనుషులంటే?

ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అక్క, ఒక తమ్ముడు …

వాళ్ళు ఒక కుటుంబం రా

ఒక బాబాయ్, ఒక పిన్ని, ఒక మామయ్యా, ఒక అత్తయ్య…

వాళ్ళు బంధువులు రా

పాలవాడు , పూల వాడు, ఎదురింటాయన, పక్కింటాయన…

ఈ అందరినీ సమాజమంటారోయ్

ఒక నువ్వు, ఒక నేను, ఒక వాడు, ఒక తను…

మనం స్నేహితులం రా

అన్నిటికీ ఏదో చెప్తున్నావ్… మరి మనుషులంటే ఎవరు?

కుక్క, నక్క, పులి, పిల్లి, చెట్టూ చేమా
అంటూ కనిపించిన వాటన్నిటికీ నామకరణం చేసాడు చూడు
వాడికి పేరు పెట్టేవాడు లేక
తనకు తాను పెట్టుకున్న పేరు రా మనిషంటే

నువ్వు మరీ చెప్తావ్
మనమంతా మనుష్యులమే

ఓ.. నిజమా ! అలా అయితే
మరి నువ్వు పుట్టాక ఎవరినైనా మనిషీ అని పిలిచావా…
పోనీ ఇకపై పిలుస్తావా

‘-----’‘మనిషంటే ఓ పవిత్ర భావం
మనిషంటే జగతికి కాపలా దారు
మనిషంటే సకల జీవకోటికీ రక్షకుడు
మనిషంటే ఎదిగే కొద్దీ ప్రకృతిగా మారే వాడు’
మరి ఇప్పుడు రాసి చూపించవూ ఒక్క మనిషిని

‘-----’

ఆ కాస్త నడిచాక

భూమ్యాకాశాలు కలిసినట్లుండే చోటే కానరాని
నగర స్పర్శలలో
ఆకాశ హర్మ్యాలు మొలిచిన చోట
చూపులకు సరిహద్దులు కట్టబడి
ప్రకృతి దృశ్యం చిన్నబోతుంది

కలల పరిధి పెరిగినప్పుడల్లా
కుంచించుకుపోతున్న హద్దుల్లో
ఇక్కడ జీవితం
చాలా చిన్నదన్న నిజం
తలపుకొచ్చాకే తెలుస్తుంది

విశాలాకాశపు హద్దులనీ
మా చూపులకి మాయం చేస్తూ
కళ్ళు చూడగలిగే అనంతాన్నీ దూరం చేసే
పేదరికమూ ఒకటుంటుందని
అది మనిషి దృశ్యాన్నే కొల్లగొడుతుందని
నాకు నేను చిన్నగా అయినప్పుడే తెలిసింది
***
శరీర పరిమాణమే ప్రమాణమై
కళ్ళకందినంత దూరమే
ముచ్చటైన చోటును దాటి నడిచాక
విశ్వపు కొలత మొత్తం
మనసు పరిభ్రమణంలో ఇమిడిపోతుంటే
తెలిసింది మనిషి పరిమాణం అనంతమనిThursday, 17 November 2016

దేహం

లోపల ఏముందో
ఈ దేహానికి
ఎప్పటికీ తెలియదన్నది నిజమే కావచ్చు

నరాల అల్లికలో
కవాటాల బిగింపులో
అలుపెరుగని ఇంధనం
ఒక్క క్షణం గడ్డకడితే చాలు
మాయమయ్యే ఆత్మ తావేదో
ఎవరికీ తెలియదు

ఎంతటి సమున్నత ఆత్మ ఉంటేనేం
ఎంతటి పవిత్ర జ్యోతిగా అది వెలుగుతుంటేనేం
తన విలువంతా
దేహం క్షేత్రంగా ఉన్నంతవరకే
మరి వాహకం లేని చోట ఆత్మకి ఉనికి రాసేదెవరని

ఊపిరున్నంత వరకూ
దేహమే ఓ అహం…
ఆడంబరం
అనంతాన్ని స్పృశించే ఆత్మని
నిలుపుకున్నంత సేపూ
దేహమే దేవాలయం