మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Friday, 8 January 2010

హలో... బ్లాగ్ స్నేహితులూ... తస్మాత్ జాగ్రత్త ...

ఏదో దిక్కు మాలిన వెబ్ సైట్ ఓ ఊహా జనిత కధనాన్ని ప్రచురిస్తే తమ తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మీడియా ముసుగులో ఏదో సినిమా కధ లాంటి ఆ కధనాన్ని జనాల మీదకు వదిలాయి మన తెలుగు వార్తా సంస్థలు. ఎప్పుడే గొడవ చేద్దామా మన దురద తీర్చుకుందామా అని కాచుకుని కూర్చునే రాజకీయ రోమియోలు, వాళ్ళ అనుచరులు రాత్రి కి రాత్రి అరాచకం సృష్టించేసారు. రాబోవు పరిణామాలు ఆలోచించకుండా తమ TRP ratings కోసం ప్రసారం చేసిన కధనమో, మరి కొందరు అంటున్నట్లు రాజకీయ కుట్రలో మనకు తెలియదు కానీ మన బ్లాగు సోదరులు చాలా మంది కూడా ఆ కధనం ప్రభావం లో పడి పోయి నేను అప్పుడే చెప్పాను అలా జరిగి ఉండవచ్చు అని, ఇలా జరిగి ఉండవచ్చు అని మళ్ళీ బ్లాగేశారు.

కానీ బ్లాగ్ స్నేహితులూ... తస్మాత్ జాగ్రత్త....

మీరు రాసే మీ ఊహాజనిత కధనాలు ఏ ఛానల్ వాడికో తెగ నచ్చేసి వాటిమీద ఏ వెర్రి వెంగళప్ప తో నో చర్చ పెట్టేసి ఓ మూడు నాలుగు గంటల పాటు చర్చ పెట్టేసినా పెట్టేస్తారు పలానా బ్లాగ్ లో ఇలా అంటున్నారు అని. ఇలాంటి కధనాల కోసమే కాసుక్కూచ్చునే బాచ్ తెగులునాట ఏ మూల కెళ్ళినా రెడీ గా ఉంటారని ప్రత్యేకం గా మళ్ళీ చెప్పాలా నిన్న రాత్రి జరిగిన దాన్ని చూసాక.

బ్లాగ్ పాపులారిటీ ఏమో గాని ఆనక పోలీసు కేసులూ గట్రా మన నెత్తి మీదే. ఆ రష్యా వాడైతే మన వాళ్లకి వెంటనే దొరక్క పోవచ్చు కానీ మనమైతే వీళ్ళ చేతులకి చిక్కటం క్షణాల్లో పని.

ఇక నుండి ఇలా జరిగి ఉండవచ్చు అలా జరిగి ఉండవచ్చు అని మనం చెప్పాలన్నా మీడియా దెబ్బ కి మన జాగ్రత్త లో మనం ఉండాలి. కాబట్ట్టి బ్లాగ్ స్నేహితులూ... తస్మాత్ జాగ్రత్త.....

మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Thursday, 7 January 2010

మనం మనుషులమా గొర్రెల మందల్లో గొర్రెలమా?


దాదాపు గత రెండు నెలలు గా మన రాష్త్రం లో జరుగుతున్న పరిణామాలు, వాటి పై కొంతమంది జనం స్పందిస్తున్న తీరు చూస్తుంటే పై అనుమానం రాక మానటం లేదు.

ఏమిటీ గత కొంత కాలం గా మనకీ మంట?.

తెలుగుజాతి కి ఏదో పీడ పట్టినట్లు మనలో మనమే కొట్టుకోవడం.

పాకిస్తాన్ ఇండియా సైనికుల్లా , కాలికి కత్తి కట్టిన పందెం కోళ్ళలాగా రెండువర్గాలు గా మనం విడిపోయి కొట్టుకొంటుంటే ఏదో రిఫరీ లా ఆ అరవ చిదంబరం గారు ఉన్నట్లు ఉన్నారు.

జై తెలంగాణా అన్న నాయకుల సంబంధీకులు కానీ, జై సమైఖ్యాంధ్ర అనే నాయకుల బంధుగణం లో కానీ ఎవరైనా ఆత్మాహుతి చేసుకున్నారా. సామాన్య జనం తప్ప. వాళ్ళు జై అని మాత్రమే అంటారు తమ రాజకీయ పునాదులు ఆ నినాదాల్లో తవ్వులుని ఉంటారు కాబట్టి. కానీ మనం మాత్రం గొర్రెల మందల్లా జై జై అంటూ ఆత్మార్పణం చేసుకుంటూ ఉంటాం. ఆ ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తుల కుటుంబాలు పడే క్షోభని ఈ రాజకీయ నాయకులు, విద్యాలయాల్లో చదువులు చెప్పటం మాని ఉద్యమాలు ఎలా చెయ్యాలో చెప్పే అధ్యాపకులు తీర్చగలరా?

మన ఆస్తులు మనమే నాశనం చేసుకుని మనం బాపుకున్నదేమిటి. బస్సు చార్జీల మోత తప్ప. రవాణా చార్జీల పెంపు ఒక్కటి చాలు మనలాంటి సామాన్యుల జీవితాలని అస్తవ్యస్తం చెయ్యటానికి. ఎందుకంటే మనం ఉపయోగించే ప్రతి వస్తువు ఖరీదులోనూ రవాణ చార్జీ మిళితం అయి ఉంటుంది కాబట్టి.

ఈ రోజున ప్రభుత్వాన్ని మనం గట్టిగా నిలదీయగలిగే నైతికత మనలో ఉందా.? ప్రభుత్వ ఆస్తి అంతే పౌరుల ఆస్తే కదా. మన ఆస్తి మనమే నాశనం చేసుకుని ప్రభుత్వాన్ని ఏమని అడగగలం.

ఉద్యమాల ముసుగులో అరాచక శక్తులకు ఊతం ఇవ్వడం తప్ప ఇంతవరకూ ఎవరికి అయినా ఒరిగింది ఏమిటి.? గొర్రెల మందల్లో గొర్రెల్లా ముందున్న వాడిని అనుసరించి మన జీవితాలని నాశనం చేసుకోవటం తప్ప?మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)