మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Saturday, 30 November 2013

నా నేను...

నాది కాని మనస్తత్వమేదో అందరూ నాలో చూస్తుంటే
నేనో అద్దం లా మారిపోయానేమో అనిపిస్తుంది
నన్ను కదా నాలో చూడాల్సింది 
మరి మిమ్మల్ని చూసుకుంటారెందుకు
ఎవరి కళ్ళకి వారి మనసులా నే కనిపిస్తుంటే
నేనేంటో ఎవరికీ చెప్పుకోవాలి?

నా కోపం నా బాధ నా సంతోషం నా ఆనందం
అన్నీ మీవే అవును అన్నీ మీవే
నా ప్రతి చర్యా మీకు ప్రతిచర్యే
మీ కోపమే నా కోపమయ్యింది
మీ నవ్వే నా నవ్వు అయ్యింది
మీ సంతోషం నా సంతోషమయ్యింది

మీ ఊహలు నావిలా మీకనిపిస్తుంటే
నాక్కనిపించని అజ్ఞాతపు నీడ
నాలో ఉందేమో అని తరచి తరచి చూస్తూ
ఎక్కడ నేను మీ నీడగా మారిపోతానో
నాలో నుండి నేను మాయమవుతానేమో
అన్న ఓ భ్రమ నాలో కదలాడుతుంది

అందుకే ఈ తపన
ఈ లోకానికి నేను తెలియాలని
నన్ను నాలా ఆవిష్కరించుకోవాలని ఉంది
నేనెప్పుడూ నాలానే ఉంటున్నా
నన్ను నన్ను గా తెలుసుకోవాలంటే
నీ మనసో తెల్లకాగితం అవ్వాలి

Tuesday, 26 November 2013

నీ స్నేహం

ప్రభాతపు పలకరింపులో పెదవి మీది చిరునవ్వులో
ఏకాంతపు మౌనంలో నిశీధి నిశ్శబ్దం లో
కంటిచుక్కని జార నివ్వని చేతి స్పర్శలో
తప్పొప్పుల ఎంపికల మందలింపులో

కలలారని కనుపాపపై చిత్తరువై
మౌనాన్ని చదవగలిగే మది భాషవై
ఓటమి బాధలో ఊరడింపువై
విజయపు ఆనందం లో మృదుస్పర్శవై

క్షణ క్షణమూ నా పరవశానివై
గమ్యం చూపే మార్గానివై
నా ప్రతి అడుగులోని సాహసానివై
భయమంటే తెలియని నా ధైర్యానివై

ఊహవై  నా  ఊపిరివై శ్వాస వై  నా సర్వం నువ్వై
అనుక్షణం నా తోడుగా నీడగా  ఉన్న నీ పేరు స్నేహమేగా?