మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Tuesday, 20 January 2015

గురివింద గింజ

ఏయ్… సమాజమా…

‘ఓటమికి ఋణపడ్డా… ఆత్మీయులెవరో తెలిపిందని..!’ అంటూ… నాలుగే నాలుగు పదాలు రాస్తే… అందులో నిజంగా ఎవరికీ తెలియని విషయం ఏమీ లేదు… కానీ అందరి స్పందనా ఒకే లా ఉంది.  

నా మాటలుగా రాసుకున్న పదాల్లో ఎవరికి వారు వారిని చూసుకుంటున్నారు అంటే అర్ధం కావటం  లేదూ...  ప్రతి ఒక్కరి విషయంలో నీ తీరు ఒక్కటేనని… తరతమ భేదాలూ నీకు లేవని…

అంటే ప్రతివారికీ… వారికి  ఓటమి ఎదురైనప్పుడు…అప్పటి వరకూ ఆత్మీయులనుకున్న వారు ముఖం చాటేశారు అనే కదా…  

మరి అక్కడ ముఖం చాటేసింది ఎవరంటావ్… నాకు వాడు… వాడికి నేను… అంతే కదా మరి... వాడూ నేనూ కలిస్తేనే కదా  నువ్వు (సమాజం)గా మారేది.  

మేమున్నాం చూశావూ ( విడి విడిగా ఉన్నప్పుడు మమ్మల్ని మనుషులంటారులే)...  మా జీవితాల్లో  జరిగే  ప్రతి విషయంలో నిన్నే తలచుకుంటాం… నీ స్పందన గురించే మా ఆరాటం.  మా భయం… బలహీనత అన్నీ నీవే…  

నువ్వేమనుకుంటావనే శంక ఒక్కటి చాలు మా జీవితాలని చిన్నాభిన్నం చేసుకోవటానికి…! మేము దేవుణ్ణి నమ్మినా దెయ్యాన్ని నమ్మినా నిన్ను చూసి భయపడే… మా ఇంట్లో పిల్లల పెంపకం నుండి… మేమేసుకునే బట్టల వరకూ  నువ్వు విధించావు అన్న పరిధులకి లోబడే… తిన్నా తినక పోయినా నీకు దర్జాగా కనిపించటానికి  అప్పు చెయ్యాలి… అది తీర్చలేని రోజున ఇంటి దూలానికి వేళ్ళాడాలి… ఇదీ మనుష్యులుగా మేము నీకిస్తున్న శవతర్పణం.

ఏదో పరువంట దాని రంగు రుచి ఎలా ఉంటాయో తెలియదు కానీ అది పోతే నువ్వు తల ఎత్తనియ్యవంట… నీ ముందు తల ఎత్తుకోవటం  కోసం  కన్నబిడ్డలనే హతమార్చే కసాయిలుగా మారే తల్లి దండ్రులున్నారు.  ఇంతా  చేస్తే  అసలు నీకో రూపం లేదు… రంగూ రుచీ అంతకన్నా లేవు.

నిజంగా నువ్వు అంత చెడ్డదానివా… నువ్వు చెడ్డ దానివి అనుకుంటే నేనూ… వాడూ… ఇంకోడూ... అందరూ చెడు అనే కదా మరి అర్ధం.  మరెందుకు ఎవరికీ వాళ్ళం మంచి వాళ్ళగా ఉంటున్నప్పుడు (అలా అనుకుంటున్నాంలెద్దూ…) నువ్వు మాత్రమే చెడ్డదానివి ఎలా అయ్యావ్?  నీకు తెలిస్తే కాస్తంత చెప్పవూ…!

అందరూ బాగున్నారు నేను తప్ప…
అందరూ గెలుస్తున్నారు నేను తప్ప…
అందరూ సుఖపడి పోతున్నారు నేను తప్ప...

ఎప్పుడో ఒక్కసారైనా ఇలాంటి మాటలనుకోని మనిషెవరైనా  ఈ భూమ్మీద  ఉన్నాడని నేననుకోను.

కానీ ఆ అందరూ ఎవరు… అంటే సమాధానం ఏముంటుంది…? వాడికి  నేనే అందరిలో వాడిని… నాకు  వాడు అందరిలో ఒకడు… ఒకరికి ఒకరం అందరూ అయినప్పుడు మరి ఎవరు బాగున్నట్లు? ఎవరు గెలుస్తున్నట్లు? ఎవరు సుఖంగా ఉన్నట్లు?

ఈ ప్రకృతి అందరికీ సమాన అవకాశాలే ఇచ్చింది.  మేధ పెంచుకున్న  మేము మాత్రం  మా దాకా వచ్చిందే సమస్య అనుకుంటూ పక్క వాడి విషయంలో మాత్రం దూర దూరంగా సుదూరంగా జరిగిపోతూ… వీలైతే  మన వరకూ రాకుండా నాలుగు చిక్కు ముడులు ఎలా వెయ్యాలా అనుకుంటామేమో కానీ తన కష్టానికి స్పందించం.

మరి మాకు కష్టం వచ్చినప్పుడు వాడూ అదే చేస్తాడు ఎందుకంటే  వాడు మాకు… మా ప్రవర్తనకీ...  నిలువుటద్దం కనుక…

గెలుపు ఎవడబ్బ సొత్తూ కాదు… అస్తమానూ అంటిపెట్టుకుని ఉండటానికి… జీవితంలో ఏదో ఒక దశలో ఒక్క ఓటమైనా  పరామర్శించని మనిషంటూ ఎవ్వడున్నాడని…?

అలాంటప్పుడు వస్తుంది కోపం నీ మీద… ఎందుకంటే  మా  పరిస్థితికి  కారణం నీలోనే  వెదుక్కుంటాము కనుక… (అసలు మాలో లోపాలు ఉంటాయా ఏంటి… మేము చాలా గొప్పోళ్ళం కదా మరి)

సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయంటాం… ఆ సమాజానికి మేమేదో బయట నిలబడి ఉన్నట్లు.

గురివింద గింజలమే... నాకు తను... తనకు నేను...  ఇదే ఈ నాటి లోకం...!

ప్రతి మనిషీ తాను  కష్టంలో ఉన్నప్పుడు ఒక ఆలంబన కోసం ఎంత ఎదురు చూస్తాడో… పక్కవాడు కష్టంలో ఉన్నప్పుడు తానున్నాను అంటూ వెన్ను తడితే... మనిషి మనిషిలో మానవత్వం గురించి ఇంతటి నిరాశా వాదం పెరిగి పోతుందా?

తామెంత  ఉన్నతంగా ఉంటే సమాజమంత ఉన్నతంగా ఉంటుంది అని ఎవరికీ వారు అనుకోవాల్సిందేగానీ...  నేను మారను,  కానీ ఈ  సమాజం మాత్రం స్వచ్ఛమవ్వాలి…. నా  ఓటమిలో ధైర్యమివ్వాలి… నా  గెలుపులో వెన్నుతట్టాలి  అని అనుకుంటే ఇంకెన్ని యుగాలకైనా ఈ లోకమింతే అనుకుంటున్నా…

మరి నువ్వేమంటావ్…?

నీలోని…

ఒకడు


(ప్రపంచమొక అద్దం… నీ ప్రవర్తననే అది నీకు చూపిస్తుంది… సుతి మెత్తగా కాదు సుమా… భళ్ళున  నువ్వు బద్దలయ్యేలా…)


హేమంత స్పర్శ - 6

నా ప్రాణమా …

మెత్తగా ఊరడిద్దాం  అనుకోవటానికి  నాకంటూ నలిగిపోయిన జ్ఞాపకాలేమీ లేవు నువ్వు సందడి చేసే క్షణాలు  తప్ప… నువ్వు ఒదగని కాల పల్లకీ అంటూ ఉంటేనే  కదా  జ్ఞాపకాలంటూ పోగయ్యేది… 

కొందరికి స్వప్నం మరికొందరికి జ్ఞాపకం… జీవితమంతా ఈ రెండిటి మధ్యనే పరుగెట్టే జనాలలో మనం  కూడా కలవాలా… లేదు కదూ… ఉదయాన్నే ఒక రవి కిరణాన్ని ఘాటుగా  తాగేసి రోజు మొత్తానికీ వెలుగుని పంచేసుకుందాం… ఎలాగోలా బతికెయ్యటానికి లోకంలో కోట్లమంది ఉన్నారు… నువ్వుగా నేను నేనుగా నువ్వు మారి బతికేది మాత్రం మనలాంటి అతి కొద్దిమందే రా…!

మనం ఉన్న లేకున్నా పరిగెట్టే కాలంతో మనం ఎందుకు పోటీ పడటం… అందుకే ఎప్పటికీ మనసులో  ఇదే  యవ్వనంలో  మనం ఆగిపోయి దేహాలని కాలానికి అప్పచెప్పేద్దాం… మహా ఐతే ఏమవుతుంది వంటి మీద ఓ నాలుగు ముడతలు వచ్చి చేరతాయ్… కానీ మన మానసిక యవ్వనంలో ఈ ముడతలు ఏమైనా కలవరాన్ని తీసుకు రాగలవా… అంతగా అయితే వయసుతో దేహాలకి కొచ్చే  వార్ధక్యాన్ని  ఈ నేలపై విదిల్చి చెట్టాపట్టాలేసుకుని మరో లోకం లోకి సాగిపోతాం అంతే కదా… 

నిన్ను అల్లుకుపోయే విజయంగా నేనున్నప్పుడు కదా నా పుట్టుకకు సార్ధకత బంగారూ…! 

నీ పెదవులకి తావి అద్దే చిరునవ్వుల్లో విచ్చుకున్నప్పుడు కదా నా ఉనికికో అర్ధం పరమార్ధం…!  

నువ్వు కనే రంగుల కలలన్నిటిలో చేరి  వాటిని నిజం  చెయ్యగలిగినప్పుడు కదా  నేనంటూ వాస్తవం…!

నీ కళ్ళకి చేరే చెమ్మ... కళ్ళకి ఇంధనమవ్వాలి కానీ కంటికి బరువై చెక్కిలి మీదకు జారతానంటే…. ఊహూ… నేను ఊరక ఉండలేను కదా… అక్కడ కొచ్చి నేనే ఊరటనవుతా...

నువ్వు నడిచిన దారిలో నీడల్ని నాటుతూ బాటసారులకి నిన్నో మార్గదర్శిని చేసినప్పుడు కదా నేను నిజంగా  నువ్వుని.

కళ్ళు చూసేవన్నీ నిజాలేనా?  కళ్ళు చూసేవాటిలో నిజమెంతో  లోకమంతా నిండిన  పాప ఫలాలని అడుగు...
సుదూరపు ఆకాశం... కంటికందే దూరంలో నేలమీదకి వంగి ప్రణమిల్లుతున్నట్లే  అనిపిస్తూ  ఉంటుంది కదా… నిజానికి అది ప్రతి  కంటికీ కనిపించే అతి సాధారణ దృశ్యమే కదా… మరి నిజంగా దానిలో ఉన్న నిజమెంత?... అది నిజం కాదు అని ఊహ తెలిసిన ప్రతి మనిషికీ తెలుసు కదా....  అంటే కంటికి కనిపించేవి అన్నీ సత్యాలు కాదు అనే కదా… 

అందుకేరా  నేను మనసు చూసేదే నమ్ముతాను. మనసు చెప్పిన దానిలోనే  నిజాలని తెలుసు కుంటాను. భ్రమలు చేరని దూరమేమీ లేదుగా  మనుష్యుల మధ్య… మరి వారి  మనసుల మధ్య… 

నీ 
నేను


Sunday, 18 January 2015

తెలుగు తేజం

యుగ పురుషా
తెలుగు జాతి తేజమా

ఈ రోజు  మా  కంటి తడికి  మాటొస్తే అది స్వర్గాన  ఉన్న నీకు  వినిపిస్తే  మళ్ళీ  ఈ తెలుగు జాతి కోసం  బొందితో దిగి వస్తావేమో ఇది కలకావొచ్చేమో  కానీ  ఎందరి  మనస్సుల్లోనో  గత 19 వత్సరాలుగా సజీవం గా  ఉన్న ఆశ.  

అసలు నిన్ను ఎలా ఇష్ట పడాలి మేము  ఒక నటుడిగానా  లేదా  ఒక నాయకుడిగానా? ఎలా?  తెలుగు జాతి వరకూ  దేవుడెలా  ఉంటాడో చూపిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడివి నీవే  సమాజమే  దేవాలయం , ప్రజలే  దేవుళ్ళుఅంటూ మాటలతో మాత్రమే కాక  చేతల్లో చూపించిన  నిజజీవిత  కథానాయకుడివీ  నీవే...

ఎందరో నటులు   వచ్చారు , వస్తున్నారు  వచ్చినట్లే  పోతున్నారు  కానీ   కొందరో  శాశ్వతమవుతున్నారు  ఆ కొందరిలో  నువ్వో  మేరునగధీరుడివి.  కేవలం  నటుడివైతే  ఇది  సాధ్యమా?  

రాయల సీమ  కరువులో  ఇండియా పాకిస్తాన్  యుద్ధ సమయంలో  దివిసీమ  ఉప్పెనలో ఇలా  జాతి  కష్టాల్లో  ఉన్న ప్రతిసారి  నాయకుడివై  చలన చిత్ర సీమని ఒక్క తాటిపై  నడిపించి...  కేవలం  ముఖానికి రంగులేసుకునే  నటుడిని మాత్రమే  కాదని  జన్మతహా  నాయకుడినని  ఆనాడే  నిరూపించావ్.

తమ పార్టీ కి  ఉపయోగ పడతారు అనుకుంటే  చాలు  అవార్డుల పందేరం  చేస్తూ ఎవరెవరికో   భారత రత్నాలు  ఇచ్చేస్తున్నారు. భారత చలన చిత్ర సీమలో  దాదాసాహెబ్ ఫాల్కే. పద్మభూషణ్ పద్మ విభూషణ్  లాంటి  అవార్డులెన్నో  పొందిన  చలన చిత్ర  ప్రముఖులందరూ  ప్రతిసారీ మహా నటుడిగా  తలచుకునేది నిన్నే అయితేనేం  హస్త  సాముద్రికాలతో  అరచేతుల్లో  స్వర్గం  చూపించేసిన  రాజకీయులు మాత్రం  నీ  విషయంలో  తాము  నిజంగా నే   మిథ్య  అనే  అనుకున్నారేమో  ఏ అవార్డులనీ  నీ దరి చేరనియ్యలేదు.  

అయినా గానీ వారి పిచ్చిగానీ  ఒక  కాగితపు ముద్రతో ఒక  లోహపు  ముక్కతో   మనిషినైనా  జనం గుండెల్లో  శాశ్వతం  చెయ్యగలరా?   ఒక  అశోక  చక్రవర్తి, ఛత్రపతి  శివాజీ, శ్రీ కృష్ణ  దేవరాయలు, రాణి రుద్రమదేవి ఇలాంటి వాళ్ళంతా  శతాబ్దాలుగా జనం గుండెల్లో  ఎలా  శాశ్వతమయ్యారు?  అలాంటి  మహనీయుల  వారసుడివి  నీవు. అయినా గానీ ఎక్కడో భూమి పొరల్లో దాగుండే రత్నానివి కాదు నువ్వు...  నిత్యం వినువీధిలో తెలుగు జాతి  పతాకాన్ని  రెపరెపలాడించే ధృవతారవు.

"దేశమదేల యన్న దేశంబు తెలుగేను
యెల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
యేను తెలుగు వల్లభుండ తెలుగొకొండ
దేశ భాషలందు తెలుగు లెస్స"  

అని శతాబ్దాల క్రితమే  దక్షిణ భారత సార్వభౌముడైన శ్రీ కృష్ణ  దేవరాయలంతటి సకల కళా వల్లభుడిచే శ్లాఘించబడ్డ  తెలుగు భాషా / తెలుగు జాతీ కాల క్రమేణా మదరాసీలుగా పేరు పడితే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తట్టిలేపి తెలుగోడి సత్తాను సరి కొత్తగా ప్రపంచానికి  చాటి చెప్పిన పౌరుషాగ్ని జ్వాలవి నువ్వు.

చలన చిత్ర రంగంలో నువ్వు రారాజుగా ఉన్నప్పుడు... తిరుపతి వెంకన్నకు మొక్కు  తీర్చుకుని అటునుండి అటు చెన్నపట్నం వచ్చి నిన్ను దర్శించుకుంటేనే ఆ యాత్ర ముగిసేది అన్న వార్తలు చదివితే  జనాల గుండెల్లో నువ్వేంటో అర్ధం అవుతుంది.

33 ఏళ్ల చలన చిత్ర రంగంలో .

పురాణ పాత్రల్లో దివ్య మంగళ స్వరూపంతో దైవాంశ సంభూతునిలా
జానపద చారిత్రాత్మక పాత్రల్లో   పోతపోసిన పౌరుషం నిండిన ధీరోదాత్త నాయకునిలా
సాంఘిక చిత్రాలలో సమాజానికి చక్కనైన ప్రతినిధిలా

మూడు వందలకు పైగా  చిత్రాలు పదుల కొద్దీ  పాత్రలు పాత్ర పాత్రకీ  ఏంతో వైవిధ్యం నాయకుడి గానూ ప్రతినాయకుడి గానూ  మెప్పించిన అనితర సాధ్య నటనా వైదుష్యం ఎవరికి సాధ్యం నీకు తప్ప

13 ఏళ్ల రాజకీయ రంగంలో

అసలు సిసలు ప్రజానాయకుడివి సమకాలీనుల్లోనే కాదు ఇప్పటికి కూడా తెలుగు  జాతి లో ప్రజాదరణలో ఎవరైనా నీ తరువాతే.  వటవృక్షం లాంటి కాంగ్రెస్స్ పార్టీని నెలల బాలుడిగా మట్టి కరిపించిన మేరునగధీరుడివి.  

ఏ జాతి మనుగడ  అయినా స్త్రీ జాతి మీదే ఆధార పడుతుంది అని నువ్వు ఆడపడచులు అని పిలుచుకునే  మహిళలకి ఆస్తిలో హక్కు ఉండాలని చట్టం చేసిన మహిళా పక్షపాతివి. అలాగే మహిళల కోసం ప్రత్యేక  విశ్వవిద్యాలయం నీ పుణ్యమే కదా...

బడుగు బలహీనవర్గాలని పట్టి పీడుస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థ లని రద్దు చేసి బడుగు బలహీన వర్గాల  వారికి రాజకీయంగా ఉన్నత స్థానాలు కల్పించావు.  ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో పధకాలు

అసలంటూ తెలుగు గడ్డ మీద మార్పు మొదలయ్యింది నీతో. తెలుగు జాతి నరనరాల్లో చైతన్యం నింపింది నువ్వు .  

గుండె గుండెలో ఒక ఆర్తిలా దాగున్నావ్ కంటి కంటినీ ఎప్పటికప్పుడు పలకరిస్తూనే ఉన్నావ్.  దిగంత లోకాలలో దివ్య తారల నీరాజనాలు అందుకుంటూ ఉండి ఉంటావ్ రెండుగా చీలిన నీ తెలుగు జాతి నిండుగా వెలిగేలా  రెండు కళ్ళతో కనిపెట్టుకుని ఆశీర్వదిస్తూ ఉండి ఉంటావ్.

ఎవ్వరేమనుకోనీ... నువ్వే నాయకుడివి...

నువ్వున్న కాలంలో మేమూ ఉన్నాం  ఒక చారిత్రిక పురుషుడిని  మేమూ  చూసాం  అన్న తృప్తి  చాలదూ  మా జీవితాలకి.

తరతరాల తెలుగు చలన చిత్ర  / రాజకీయ రంగంలో సరిలేరు  నీకెవ్వరూ  జనం  మెచ్చిన  ఒకే ఒక్క నాయకుడివి  నువ్వే...

తెలుగుజాతి కోసం  తెలుగు భాష  కోసం  ఆ దేవదేవుడు  అందించిన  సమ్మోహన  అస్త్రం ...  నందమూరి తారక రామాస్త్రం...

తారక రామా...అజరామరం నీ కీర్తి... దిగంతాల్లోనూ నీతోనే తెలుగుకు ఖ్యాతి...!

తెలుగు జాతి గుండెల్లో నీ రూపం శాశ్వతం...

ఓ యుగ పురుషా... తెలుగు జాతి ఉన్నంత వరకూ నువ్వుమృతంజీవుడివే

మళ్ళీ నీ ఊపిరి చప్పుడు కావాలట తెలుగు జాతికి... తారక రామ తేజమై రా!

ఇట్లుతెలుగోడు

(నందమూరి తారక రాముడి ౧౯వ వర్ధంతి నివాళులు)


Sunday, 11 January 2015

హేమంత స్పర్శ - 5


నిత్య హేమంతమా...

ప్రతి ఉషోదయాన నీతో కలసి భానుని  ఉదయ కిరణాలలో తడుస్తూ  అనంత వాయు గానాలలో లీనమై పోతూ నడుస్తున్నప్పుడు   తమ కిల కిలా రావాలతో ప్రకృతికే  మేలు కొలుపుతున్న బుజ్జి బుజ్జి పిట్టల  ఇచ్చే సాదర స్వాగతం  ముందర ఎన్ని స్వర్ణ కంకణ సత్కారాలూ  ఏ మూలకి?

నీకో సంగతి తెలుసా..?

ఎప్పటికప్పుడు నీకేదో చెప్దాం అనిపిస్తుంది… కానీ చెప్పటానికి గుండె  పెగలదే… చెప్పాలనుకున్నది ఒకసారి చెప్పేసాక ఇక చెప్పటానికి ఏమీ ఉండకపోతే… నీకూ నాకూ మధ్య ఏదైనా శూన్యం వచ్చి  ఆక్ర మించుకుంటుందేమో  అన్న భయం నా పెదాల మీదే నిలిచి ఉంటుంది మాటల్ని తూలనివ్వకుండా…

గుండె సవ్వడికి పెదవి చప్పుడికి సమన్వయం కుదిరిన మనిషి పయనం ఎప్పుడూ ఆహ్లాదమే కదూ…

శ్రావణ మేఘాల్ని దాటి కార్తీకపు కోనేటిలో మునిగి  హేమంతపు తుషారంలో తడుస్తున్నప్పుడు చిగురుటాకుల్లా వణుకుతున్న దేహాల దాహాల్లో కోరికల తీర్ధం పోసి వేడుక చూస్తున్న ఏకాంతపు స్పర్శ ఎంత బాగుందో కదా….

ఏ గుండె కథ చూసినా ఏ మనసు వెత వెదకినా కనిపించే ప్రతి తడికీ కదిలిపోయే నీ కన్నీటి  రాత్రుల్లో  నన్నొక్కసారి  తలపుకు తెచ్చుకుని చూడు....  కలల లోకపు పసిడి ఊబిలో చిక్కుకు పోవూ నీ  కనుపాపల తెరలు…!

అసలెందుకో ఇలా ఇన్ని కథలు… వ్యథలు… బ్రహ్మ రాసిన నాటకంలో  కాసేపు వచ్చి  ఎవరి పాత్ర  వాళ్ళు  పోషించే  నటుల్లా అనుకుని చూడు… ప్రతి జీవితాన్ని ఒక కమ్మని కథలా ఆస్వాదించుకోవచ్చు కదూ… నవరస పోషణల్లో ఎన్ని రకాల  అభినయాలో. ఎవరికీ తాము నటులం అని తెలియదు కదా అందుకే   ఏదీ కృతకంగా అనిపించనే అనిపించక అలా సాగిపోతున్న పాత్రల చిత్రీకరణ చూడు… నైరాశ్యం దరిచేరదు బంగారూ….  


యాంత్రికాలన్నిటినీ వదిలించేసుకుని  చలచల్లని ప్రకృతిలోకి నును వెచ్చగా  సెలపాటలాడుతూ జారిపోయే ఒక సాయంకాలపు బద్ధకంలో నిన్నో వలయంలా చుట్టేసుకోవాలని ఉంది రా…

నిశ్శబ్దంగా మగతని తాగేస్తున్నా నేను...మధుర స్వరమై నువ్వు మత్తును పోత పోస్తుంటే…!  

మాటొక మధు ప్రవాహమైనప్పుడు సమ్మోహనాల వాగులన్నీ స్వరాస్త్రాలుగా మారి నీ గొంతుకలో సందడి చేస్తుంటే  ఏ నాగ స్వరాలూ నీ మాటకు సాటి వస్తాయంటావ్? ఎన్నిన్ని కబుర్లో  పరవళ్ళుగా మారి నా చెవి చేరుతుంటే  దేహమంతా చైతన్య రహితమై మనసంతా మత్తిల్లుతూ  నీ పెదవుల నర్తనాన్ని మౌనంగా అవలోకిస్తూ  నాలో నుండి నేను  స్రవించే  ఆనందం  ఉంది  చూశావూ… వినటం కాదు ఒక్క సారి ఆ అనుభూతిలోకి ఒలికి చూడు… నీ విద్వత్తు ఏమిటో నీకే అవగతమవుతుంది.

ఓ వలయంలో చిక్కుకుని పరుగెడితే ఆపలేని బతుకు పందెం కన్నా తాపీగా తేనె తాగినంత మధురంగా జీవితాన్ని ఒంపేసుకుందాం… ఏమి కావాలి మరి ఆ మధురానికి?  కాసిన్ని పగళ్ళు…. ఎన్నో సాయంత్రాలు… మరెన్నో నిశి రాత్రులు… ఇంకెన్నో పొద్దు పొడుపులు…

ఆ కాసిన్ని పగళ్ళలో కాయాన్ని బతుకులోకి  నెట్టేద్దాం… ఆ దేహాల్ని సాయంత్రాలలోకి లాగేసుకుని అలసటలన్నిటినీ  మన ఊసులతో చెరిపేద్దాం. నిశిరాత్రుల్లో నిద్రని చీకట్లో పారబోసి వెన్నల  మొత్తాన్నీ కళ్ళకి కప్పుకుని పచ్చిక  దుప్పటిని నలిపేద్దాం. తొలి పొద్దు పొడుపులో రాలి పడుతున్న తుషారాలన్నిటినీ గొంతులోకి ఒంపుకుంటూ హేమంతాన్ని గుండెల్లో దాచేసుకుందాం…

నీ


నేనే...

Friday, 9 January 2015

హేమంత స్పర్శ - 4

నా జీవమా...

ఆకాశం రాల్చే వెన్నెల ముక్కలనే మంచెగా ఎంచుకుని జలపాతపు ఒడ్డున సెలపాటల రాగాలతో   జంటగా జావళీలు పాడుకుంటున్నప్పుడు ఒకరి చూపుల సుగంధాలనింకొకరం పీల్చుకుంటూ  మాటలు మత్తిల్లుతుంటే తుళ్ళి పడే తనువుల జాగారంలో రేయంతా నువ్వు  కడిగేసిన నా నిద్ర పగలంతా  రెప్పల పైన కూర్చుని  వాలటానికి సిద్ధంగా ఉన్నప్పుడు నా కళ్లపై నువ్వేసే పెదవి ముద్రలలో జీవితాన్ని అనుభూతించాలని ఉంది.

తెల్లటి నెమలీకల్నిగుదిగుచ్చిన వెన్నెల విసనకర్ర విసిరేటప్పుడు వచ్చే పరిమళాల సమీరాల్లో మనం క్రీడిస్తూ  నారికేళపాకంలా అనిపించే జలాన్ని నింపుకున్న తటాకాలలో రాయంచలమై స్నానిస్తూ  ఏక తీరుగా మన ఏకాంతాన్ని  
హత్తుకుందామనే నా కోరికలోని స్వార్ధం  నీకూ ఎంతో ఇష్టమే కదూ…

హిమవత్పర్వతాలలోని దేవతా వనాల సౌందర్యాన్ని అమృతంలో కలిపితే వచ్చినంత మత్తులో ముంచెయ్యదూ...ఇష్టమైన  పలకరింపులోని  మాటల మాధుర్యం…

ఎంత చందనం కరిగిందో నీ మేనిలో… ఎన్ని మల్లెలు తాగావో గొంతులో… మాటగా తొలికినా   మౌనంగా  నడచినా   పరిమళమే రాలి పడుతూ ఉంటుంది.
ఎప్పుడూ చెప్పేదే అయినా మళ్ళీ మళ్ళీ  నాకు చెప్పాలనిపించే మాట ‘ నీతో  కలసి  బతకాలనేది  కాదు నా కోరిక…  నీలో కలసిపోయి  వసించాలని…’ నీ కణకణంలో అణువు అణువుగా  నేను ఇంకిపోతూ జీవితం చూడాలని ఉంది.

కొన్ని క్షణాలు ఉంటాయి చూడూ… వాటికి వేరే పని ఏమీ ఉండదు… నన్ను నీలా నిన్ను నాలా చూడాలనుకునే ఆశ  తప్ప. మన  ఇద్దరినీ ఒకే ఏకత్వంలో చూడాలనుకునే తపనని వెంటేసుకుని మనల్నే ఆవరించుకుని కావలి కాస్తుంటాయి.   

నువ్వు తాకని నా రోజులో యుగాల ప్రయాణం చేసే ఆ క్షణాల మీద జాలి నీకే మాత్రం ఉన్నా నాలో కొచ్చి వాటిని  స్పర్శించవూ. నీ స్పర్శని పొందిన ఆనందం చాలదూ వాటికి... చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా వెలుగులీనటానికి?

నువ్వున్నంత సేపు నా అస్తిత్వం ఎటు కొట్టుకుపోతుందో  అర్ధం కాని సందిగ్ధంలో  నేనో అనుభూతిగా  మారి  నిన్ను హత్తుకుపోయే ఉంటాను. లేకపోతే ఏమిటి మరి?  నువ్వున్నంతసేపు అసలు ప్రపంచమే కనిపించని నాకు… నువ్వు పక్కన లేని పగలంతా వెచ్చని చెమటగా కారిపోతూ ఉంటుంది. జంట నిట్టుర్పులతో మత్తిల్లే రాత్రి నువ్వు  లేనప్పుడు  ఏకాంతంగా నా కంట్లో కురుస్తూ ఉంటుంది...  

పగలూ రాత్రీ శత్రువులై  నా మీద చేసే యుద్ధం లో నీ తలపొకటి  వస్తే  చాలు… అది ఇక బ్రహ్మాస్త్రమే…  పాపం రేయింబగళ్ళు   పిచ్చుకల్లా మారిపోతాయ్… ఒద్దికగా ఒక మూల కూర్చుని  వణికి పోతూ...

నువ్వు లేనప్పుడు ఏదైనా ఒక సాయంత్రం అలా ఏటి ఒడ్డుకు షికారుకి వెళ్లి కూర్చుటానా… అవిశ్రాంతంగా పరుగులు పెట్టే ఆ చక్కటి నదీ పాయవై నువ్వే అగుపిస్తూ ఉంటావ్. చల్లని ఆ నీటి జాలులో వెచ్చగా  ఒదిగి పోయి  నిన్ను  ఆవరించుకోవాలని అనిపిస్తుందప్పుడు. వడి వడిగా వచ్చి ఏట్లో వెచ్చగా నన్ను ఒంపుకుంటూ నీ కోసం చూస్తానా… అక్కడ ఉండవే… మరెక్కడా అని చూస్తే వెన్నెల రజనులా మెరిసిపోయే ఏటి ఇసుకలో  వళ్లారా స్నానం చేస్తూ  ఆకాశాన్ని తెరగా చుట్టేసుకుని కనిపిస్తావ్…

అప్పుడు గానీ అర్ధం కాదు నాకు నేను చూసేది  నిజమైన నిన్ను కాదని నా ఊహలకి  ఊపిరిచ్చుకుని నేను  ఆ  క్షణాల్లో జీవం పోసిన నీ  భ్రమల రూపాన్నని.  నీ భ్రమల బొమ్మని చూస్తూ కూడా జీవితాన్ని ఆస్వాదించటం అలవాటు చేసుకున్న నన్ను ఆ నిమిషంలో ఎవరైనా చూస్తే నన్నో పిచ్చివాడి కింద జమకడతారేమో…  నిజమే ఊహల్లో నీతో కలసి వేస్తున్న అడుగులు… నీ సంతోషాల  నుండి  రాలి పడుతున్న నా నవ్వులు బయటి వాళ్ళకి పిచ్చితనంగానే తోస్తాయి కదూ…   

తప్పేముందిలే… జీవితాన్ని నిజంగా ఆస్వాదించ గలిగేది  మనసైన ప్రేమికులు… మరియు పిచ్చివాళ్ళే…

భావాల పందిరికి ఒక్కసారైనా అల్లుకోలేని మానవ యంత్రాలకి మనమెలా కనిపిస్తేనేం… నిజానికి ప్రకృతి సౌందర్యం ఆస్వాదించలేని ఆ సజీవ ప్రాణ యంత్రాలు కదా అసలు సిసలు పిచ్చివాళ్ళు.  

నీ


సురేష్

Wednesday, 7 January 2015

అంటుగట్టిన మనఃస్పర్శ

ప్రియమైన నీకు,

ఇంత కాలానికా లేఖ అని కోపమా.... 

నీ ముఖానికి కోపం అసలు బాగోదమ్మడూ… దరహాసాలన్నిటినీ దండగుచ్చి  నీ  పెదాల మీద  చిలకరించినట్లే ఉంటావ్ నువ్వు… అలా ఉంటేనే  నువ్వు అందంగా ఉంటావ్…

ఏయ్… పక్కకి చూడక్కర్లేదు అక్కడ ములగ చెట్టు లేదులే… నేను నిన్ను ఎక్కిస్తున్నాను అనుకోవటానికి. నీకు తెలియదూ నేను ఎప్పుడూ నిజాలే చెపుతానని.  

ఏదో  ఒక ఉత్తరం రాయటం ఎంత సేపురా? కానీ ఏదో ఒకటో రాసేసి నేను పోస్ట్ డబ్బాలో పడేసి అందుకున్న నువ్వు ఓ క్షణంలో దాన్ని చదివేసి  ఇంటి వసారాలో కట్టిన ఉత్తరాల తీగకు దాన్ని గుచ్చేసి…. ఉహూ తలచుకుంటుంటే నాకు మన ఇద్దరి మనసులని కలపి అక్కడ గుచ్చేసినంత బాధగా ఉందిరా… నీ గురించి ఒక్క వాక్యం రాసినా  చిత్తుకాగితం సైతం అమూల్యమవుతుంది నాకు. పరమ పద సోపానపటంలో ఎప్పుడూ నిచ్చెనలెక్కితే  వచ్చేంత  ఆనందం  నా చేతిరాతతో నీ పేరు రాస్తున్నప్పుడు  వస్తుంది… ఆ ఆనందాన్ని కొంచెం చదివి చూడవూ… దాని నిడివి కొలిచి చెప్పవూ… తెలిసింది కదూ  నీతో  నా  ఆనందం నీ మనసంత లోతని.

క్షణంలో  వెలిసిపోయే అక్షరాలు ఎన్ని రాసి ఏమి ప్రయోజనం… రాసిన కాగితం చెదపట్టినా… అక్షరం మదిని చేరి తలచినంతనే అలవోకగా అనుభూతిగా  మరల మరలా హృదిని మీటేలా రాయాలి….

మాటమీద మౌనాన్ని కప్పెట్టి  నిశ్శబ్దాల తపస్సు  చేసే నాకు  ఏ శబ్దమైనా  నువ్వే… నిశ్శబ్దపు సడిలో నీ శబ్దాన్ని వింటూ అలౌకిక స్థితిలోకి నేను చేసే ప్రయాణాన్ని అక్షరీకరించటం నీ ఊహలు నాలో వర్షిస్తున్నంత  సులువు కాదు కదా… 

నా  లేఖ అంచున అంటిన తడి ఏమిటో  తెలుసా… 

ఏయ్… పిచ్చీ… అది కన్నీటి తడి  కాదురా… నీ  కళ్ళల్లో  నదులు  పారటానికి…. ఆ తడి ‘నిన్నటి మన క్షణాల జ్ఞాపకాల  స్పర్శ…. మన  రేపటి  ఆశల  తాకిడి… వర్తమానమై కురిసిన ఆనందం …! ‘

నిన్నటి హేమంతపు ఉదయాలల్లో మొదలైన మన ఊసులు  సాయంత్రాలలో నీ జతలో  వెచ్చని అడుగులుగా మారి రాత్రులన్నీ నాలో  వేస్తున్న కలల  ముద్రలని  నీకు చేరవేసే  నీ మది మంజూషంలోని  స్మృతుల  ఖజానాలో  చేర్చి  మరల మరల నీ మధుర శ్వాసలలో ఊపిరి తీసుకోవాలని నా చిరు ఆశ....! 

బాగా నడిచినంత సేపు  చాలా  తేలికగా  కనిపిస్తుందీ కాలం.  గతి తప్పిన ఒక్క అడుగు చాలు కదా  కాలం  తన  మహిమ చూపి ఎద బాటని  ఎడబాటుగా మార్చటానికి…! కాదంటావా... చెప్పు మరి…  లేకపోతే ఏమిటి మరి  పక్క పక్కన కూర్చుని శంఖులాంటి నీ మెడ మీద వెచ్చని ఊపిరిలడ్డుతూ చెవిలో ఎన్నో గుసగుసలాడాల్సిన  నేను  ఇక్కడ… నువ్వు అక్కడెక్కడో… అక్షరాలలోనే అనుభూతులన్నీ చవి చూసుకుంటూ....!

ఒక్కటి మాత్రం నిజంరా… కాలం ఎంత గొప్పదైనా కావొచ్చు కానీ నీ మీద నా ప్రేమని ఏ నాటికి తుంచలేదు… దేహాలనైతే వియోగించగలడేమో కానీ మనసుల సంయోగాన్ని ఏ కాల పురుషుడు మాత్రం కాల రాయగలడు…?  కాలంతో మరుపు సహజమే అన్న నానుడి అందరికీ అన్ని సార్లూ  వర్తించదు కదూ … కొందరి విషయంలో కాలంతో  కొన్ని స్మృతులు మరింత గాఢంగా మనసుని పెనవేసుకుపోతూ గడచిన ప్రతి క్షణాన్ని అమరం చేస్తాయి. 

భౌతికంగా ఒక్క చోటున లేమని తప్ప నిజంగా మనకేమి లోటురా… ఖాళీగా ఉన్న ప్రతి క్షణమూ  ఒకరి మనసుతో  ఒకరం  భాషించుకుంటూ… ఖాళీ చేసుకుని మరీ కొన్ని క్షణాలకి మన ఊసులద్దుతూ.... మరి మన జీవితం మధురం కాదా చెప్పు…! 

జీవితాన్ని చదివేశాం … బతుకుని దోసిట్లో నీరు పోసి తాగినంత సులువుగా గడిపేస్తున్నాం అని చెప్పే వారి కళ్ళల్లోకి  ఒక్క సారి సూటిగా చూడు… మాటల్లో ఎక్కడా కనపడని నిస్తేజత అంతా అవే మోస్తూ కనపడతాయ్… ఎందుకంటే… వాటికి అబద్ధం ఆడటం రాదు పాపం… అయినా పరాయివాళ్ళకేం వంద చెప్తారు… నాలుగు గోడల మధ్యే ఉన్నా నాలుగు యుగాల దూరంతో బతికే వారే వారంతా…

అద్దం ఎదురుగా నిలబడి నీ కళ్ళని ఒక్కసారి చూసుకో… ఎంత తేజంతో  వెలిగిపోతున్నాయో  కదా… అది చాలదూ మనజీవితాలని చెప్పటానికి… 

మనమిద్దరం  పరాయి ప్రదేశాలలో ఉంటున్నామేమో కానీ మనసైన మన అనుభూతులెన్నడూ  పరాయీకరణ చెందవు రా… 

ఒక్కటి చెప్పనా... ఇక్కడున్నప్పుడు నువ్వు కూర్చున్న కుర్చీ కూడా నాకు నీ ఊసులని స్పర్శించేలా  చేస్తుంది… తాను చెట్టుగా ఉన్నప్పుడు వసంతం చూసిన సంతోషం తనకి నీ గురించి నాకు చెప్పేటప్పుడు...అద్భుతం కదూ...  

నువ్వు  తాకిన ప్రతి  వస్తువూ నీ స్పర్శని  నా మనసుకు అంటుగట్టేసాయి… ఇప్పుడీ ఉత్తరంలోని అక్షరాల ద్వారా నేను నీలోకి కురిసినంత మత్తుగా…!  

ఉత్తరం ముగిసే సరికి ఇదిగో నీ నవ్వు కురుస్తున్న చప్పుడు నా హృదిని తాకుతూ… :) 

నీ

నేను