మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Sunday, 28 February 2016

ప్రతిసారీ నేనే


రేయ్... 
నేనెవరినిరా?
నీకు నేనేమిట్రా? 
నీడను కాదూ... 
నీ నిజాన్ని కదూ 
రెప్పల్ని దాటేసుకుంటూ వచ్చే ఏకైక స్వప్నాన్ని కాదూ? 
గుండెని  అంటిపెట్టుకుని ఉండే శాశ్వత వాస్తవాన్ని కాదూ

పోనీ నువ్వెవరో తెలుసా
నువ్వు నాకేమిటో తెలుసా 
నువ్వొక నిర్వచనం...
నా జీవనపర్యంతం...! 
చీకటిని చిద్రం చేస్తూ  
కదిలే చిత్తరువులా  
నిన్ను వెన్నెలని చేస్తూ 
నింగి నాలో కురుస్తుంటే 
నా కొనసాగింపంతా అనంత ఏకాంతమే 

ఎప్పటికప్పుడు పాత సందర్భాలు కొత్తగా గుర్తొస్తున్నాయి 
ప్రతిదానిలోనూ నువ్వే
నిను దాటి చూడటానికి ఇంకేమీ లేదక్కడ
నువ్వంటూ నన్ను హత్తుకున్నాక 
నీకూ నాకూ మధ్య లోలకంగా మారిన క్షణాల సవ్వడి 
తన మునివేళ్ళ స్పర్శతో ఎన్ని శూన్యాలని 
అలవోకగా పక్కకి నెట్టెయ్యలేదూ

మరేమయ్యిందిరా ఇప్పుడు 
నన్ను నీ నీడగా కట్టేసుకున్నావని మరచావా ఏం
ఒంటరిగా తడిబారిపోతున్నావ్
చీకటించిన లోకానికి నీడల జాడ కానరాకపోవచ్చుగానీ 
జీవిత పథమంతా ఏకాంత ఆవాసంలో 
మనవైన క్షణాలకి మాత్రం 
మనమే పాలకులం మనమే పాలితులం 
ఒకరిలో ఒకరిమై ఒదిగిన జనితులం 

ఒక్కటి  చెప్పనా 
నీ కంటికి తేమ తగలకముందే 
మెదలాలి
ఏ తడి చిహ్నాలనీ సహించలేని స్వార్ధమంత నేనే 
నిన్ను నిలువెత్తు స్వార్ధంగా చేసుకున్న నేనే 
నీ నిశ్చింతలో విశ్రాంతి వెదుక్కునే నేనే 
నేనే నేనే 

ప్రతిసారీ నేనే

Thursday, 25 February 2016

డిజైనర్ హ్యమన్ మెషీన్స్


ఫాబ్రికేటేడ్ స్వామీజీల మాన్యుఫాక్చర్డ్ దేవుళ్ళ ముందు
మోకరిల్లే వాళ్ళంతా అమాయకులేం కాదు
ఇన్స్టంట్ వరాల కోసం హుండీ నింపే మోడరన్ మాహా భోక్తలు

ప్లాస్టిక్ పూలకి
యాంత్రిక సుఖాలకీ అలవాటు పడ్డ మనుషులకి
ఇప్పుడు
ఫేస్బుక్ రియాక్షన్స్ వాట్సప్ ఏమోజిలతో తప్ప
ఒరిజినల్ ఫీలింగ్స్ తో అవసరాలు కనపడవు

అరచేతిలోనే ఎక్స్టసీ నిండి పోయిన  చోట
పంచభూతాల స్పర్శని  వికృతిగా ఆలోచించటం
ఒక నిర్వచించబడని సత్యమై మెదళ్లనిండా నాటుకుపోతుంది

ఇప్పుడింతే
స్వభావసిద్ధమైనవన్నీ యంత్రపరిమళాన్ని అద్దుకుంటూ
సహజత్వమంటే గేలిచేస్తున్నాయ్
ఇప్పుడిక యంత్రం చెయ్యల్సింది ఒకటే మిగిలినట్లుంది
మనిషిని పుట్టించటం మనసుని ప్రోగ్రాం చెయ్యటం

ఎవరికి తెలుసోయ్ !
బహుశా రేపటి వారసత్వమంతా
త్రీడీ ప్రింటింగ్ నుండి బయటకు వచ్చే
డిజైనర్ హ్యమన్ మెషీన్స్ కావచ్చేమో

వీడ్కోలు


బాహ్యాంతరాల మధ్య సరిహద్దు రేఖపై
కాసేపలా నిలబడి చూడు మిత్రమా
జీవితం ఎలాంటి సున్నితమైన త్రాసుపై నిలబడి ఉందో
కులమతాలో ప్రాంతీయవాదాలో గీసే సరిహద్దు కంచెలలో
మనిషి ప్రస్థానం అలవోకగా సాగుతుంటే
తరువు తలలు తెగనరికిన పాపపు ప్రాయశ్చిత్తం
వర్షాభావమై నేలని పగలగొడుతున్న దృశ్యం  
ఏ తలపు తలుపునూ ఇంకా తట్టటం లేదు

సజీవ శిలల నర్తనంతో
కుండపోతగా కురుస్తున్న లోకం
గజిబిజి చినుకుల్లా ఎగిరిపడుతూ ఉంటే
బెరుకు బెరుకుగా రాలి పడుతున్న
అక్షరాల ఆత్మలన్నీ నీళ్ళు కురుస్తున్నాయి
రాబోయే ప్రళయానికి ఇంధనమౌతూ

ఒక నాగరికత్వపు విశృంఖలత్వంలో
కొట్టుకుపోతున్న కాలం
ఏ ప్రశ్నకూ సమాధానం ఇచ్చే స్థితిలో లేదన్న నిజం
కొన్ని చట్టబద్ధమైన చీకట్లని
మనకి పరిచయిస్తే
మనసారా హత్తుకోవటం తప్ప ఇంకో దారేమీ లేదు

కనీసం అదృశ్యం అయ్యేటప్పుడైనా
దోషిత్వం ఒప్పుకున్న సంతృప్తితో
వీడ్కోలు పుచ్చుకోవటం
చారిత్రిక అవసరమేమీ కాకపోవచ్చు కానీ
మనిషిగా ముగిసిపోవటమెప్పుడూ
ప్రకృతిలో స్వచ్ఛంగా కరిగిపోవటమే…!

Wednesday, 24 February 2016

బొమ్మ చెట్లుతల్లి వేరు లేకున్నా నిలబడే బొమ్మ చెట్లు కురిపించే
వానధారకోసం
వరుసలు కడుతున్న దేహాలలో
దాహంగా చిక్కుకుపోయిన ప్రవాహానికి
సవ్వడద్దటానికి
ఏ అంతర్వాహినిలూ తడిదేరిలేవు

పొడి గుండెల తడి చూపుల్లో తీరం దాటేస్తున్న
కలల కనికట్టుల్లో
రెప్పల అలజడికి
పలుచగా కదలాడే నిజాల జాడలు
ఇంద్రజాలపు మాయా వీచికలు కాదని చెప్పే
కర్ణపిశాచిలేమీ కనుచూపు మేరలో కానరావటంలేదు

మచ్చిక చేసుకోవడానికి
జీవమద్దుకున్నవేమీ లేవన్న సత్యాలూ గ్రహింపుకు రాని
అజ్ఞాన యంత్రాలయిన సమయాల్లో
ఎంత బరువుగా కురిసిందో ఏమో చీకటి
మనుషుల్ని నింపేస్తూ లోలోనికి ఇంకిపోయింది
నిజమే
ఇప్పుడందరూ చీకటి మనుషులే
ఒక్క వెలుగుకోసం
కొత్తరకపు చకోరాలై
ఎదురుచూస్తూ... ముగిసిపోతూ…!

Thursday, 18 February 2016

నారాయణ మంత్రంచీకటికి అలవాటు పడినంత తేలికగా
వెలుగుని సూటిగా చూడలేని కళ్ళున్న దేహాలమై
రాజకీయుల హిప్నాటిక్ మాయలలో
సామూహిక మోహావేశాలకు లోనై
దక్కిందే మహా ప్రసాదమనుకుంటూ
ఒక్క నిమిషపు నోటు కోసం ఒక ఓటు త్యాగం చేసేసి
అయిదేళ్ళ భవితను తాకట్టు పెట్టే  త్యాగధనులమై
దపదపాలుగా దాచుకున్న కన్నీటితో
ఎప్పటికప్పుడు బతుకును  ప్రక్షాళన చేసుకుంటూ
నిరాశల రహదారుల్లో నడకలని సాగదీస్తూ
ఉక్కబోస్తున్న మనసులని వెలివేసుకుంటూ
దేహాలకి అంటుకట్టబడ్డ ఋణాలుగా కొట్టుమిట్టాడుతూ
‘నలుగురితో నారాయణ’ మంత్రాన్నే నడకగా చేసుకుని
బతుకు బండిని లాగించేస్తున్న జీవితాల్లో
పోరాటమేమిటోయ్?
కుర్రవాడా… ఓ వెర్రివాడా…
మరణమొక వార్తకాని గొప్పోళ్ళే ఎక్కువ ఉన్న ప్రస్తుత లోకంలో
మృత్యుస్పర్శనద్దుకున్న మనసులని నింపుకున్న మనుషుల దేహాల్లో
పడకెక్కిన పోరాటం కోసం ఆరాటపడటమంటే
నువ్వింకా భ్రమల వలయంలో గిరగిరా తిరుగుతున్నావన్న మాటే
వ్యూహాలు లేని పోరాటాలన్నీ వ్యర్ధమైన ఆరాటాలుగా
నేలరాలటం తప్ప కొత్తగా సాధించేదేమీ లేదు సోదరా

పక్కోడిది లాక్కునే సమానత్వాలు  కాదు
తనంత ఎదిగే అవకాశం దొరకబుచ్చుకోవటానికి నిలతీతలు కావాలి
మనసు మనసులో వేళ్ళూనకున్న కోటాను కోట్ల కంచెలని
సమూలంగా కూలదొయ్యకుండా ఏ  పోరాటమూ  పరిపూర్ణమవ్వదని తెలియాలి
మొదలు పెట్టే ప్రతి పోరాటానికీ రణ తంత్రాలు కొన్ని కావాలి…
ఊహలుగా కాదు… వ్యూహాలుగా

Wednesday, 17 February 2016

మరణ శాసనం


వొళ్ళు కొవ్వెక్కి పడుకోలేదు నీ నాన్నతో
సృష్టి కార్యం లో నేనో కార్మికురాలిననుకున్నా
కడుపున మోసిన తొమ్మిది నెలలు నిన్నో బరువనుకోలేదు
నా వంటిలో నువ్వో భాగం అనుకున్నా
పురిటి నొప్పుల్ని పులకింతలనుకున్నా
బాలింత బాధలన్నిటినీ గిలిగింతలనుకున్నా
గుండెపై నీ నడకలని తీపి ముద్రలనుకున్నా
నీకు చల్లదనానికై నే చెమట చుక్కనయ్యా
నీ కలల సాధనకై నే సోపానమయ్యా

నీలో ఎప్పటికీ ఆ పసితనమే తారాడుతుందనుకున్నా
వయసుతోనే ‘పశు’తనమెదిగిన దుండగీడువని తెలియక

నీ దేహానికి దాహమైనప్పుడల్లా
నువ్వొక మదమృగమై కీచకిస్తుంటే
రక్తమోడుతున్న అబలల ఆక్రందనలు
నీ అమ్మ మానం మీద మరకలుగా అలుముకుంటుంటే
నా బిడ్డవైతేనేం.. మమకారానికి ‘మమ’ చెప్పేసి
మదమెక్కిన నీ మగతనానికి
మరణ శాసనం రాయటం ఎంతసేపని?
ఆదమరచి నువ్వు నిద్రిస్తున్న వేళ
అరచేతిని ఆయుధం చేస్తే చాలదూ…!

సత్యమేవజయతేఅశోకుని కాలం నుండి సజీవమైన ‘సత్యమేవజయతే’ నినాదాలన్నీ
గొంతు నుండి మొదలయ్యాయి కానీ ఏ గుండెనూ ఇంకా చేరలేదు
దేశద్రోహులని  కీర్తించే విశ్వవిద్యాలయాల ప్రాంగణాల సహనాలకూ
సరిహద్దుల్లో నేలరాలే సైనికుల జీతభత్యాల లెక్కలేసే అప్రజల త్యాగాలకూ
మానవహక్కులన్నీ ఒకే కంటితో చూసే చూపులకూ
అధికారం కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయులకూ
నిజంగా ఇది అసహన భారతమే

కోట్లకు పడగలెత్తిన మీకు
అవార్డుల పేరిట లక్షలు గుమ్మరిస్తుంటే
గంజి దొరకని చెల్లిని చూసి అసహనం
రైతన్నల దగ్గర గుంజిన నేల తివాచీని
అకాడమీల పేరిట మీరు పరుచుకుంటున్నప్పుడు
కూలీ చేసుకోవడానికీ  నేల మిగలని అసహనం
నూరు  కోట్లకో వేయి కోట్లకో
మీ  నటన విలువని తూకమేస్తుంటే
మా కన్నీళ్ళని తూయడానికీ మనిషి మిగలని అసహనం
మీ బొమ్మల మీద పాలాభిషేకాలు మొదలై మీరు దేవతలైన చోట
పసిబిడ్డల ఆకలి తీర్చటానికి మాలో చేవలేని అసహనం
అత్యాధికాదాయవర్గాలకూ పన్ను మాఫీ చేసే దేశభక్త అధికారం మాటున
పొలం శిస్తుకూ పైసా లేని రైతు స్వేదపు అసహనం
వర్ణాల లెక్కల్లో వర్గాల ఖాతాల్లో మనిషితనపు తూనికలేసేచోట
మానవత్వపు శిధిలాలకై వెదుకులాడే అసహనం

మా అసహనాలన్నీ కొన్ని కొవ్వొత్తుల ఖర్చో
గాలిలోకి విసురుతున్న కొన్ని పిడికిళ్ల సవ్వడో
అయినంతకాలం మీ వేషాలన్నీ చెల్లిపోతుంటాయ్
బ్రతుకంటే వీయైపీలు చెప్పే దేశభక్తి కథలు కాదని
పోరాటాలన్నీ ఎర్రఝండాల్లో ఎగిరే చారిత్రిక తప్పిదాలు కాదనీ
సమాజమంటే సామాన్యుల సమాన హక్కనీ
తెలిసొచ్చిన ఘడియల్లో
నరాల నిండా కొన్ని అగ్నిశిఖలు ప్రజ్వరిల్లటం మొదలయ్యాకే తెలుస్తుంది మీకు
నిజమైన అసహనమంటే
ప్రతి మీకూ… ప్రతి నీకూ…
మా అసహనాలకూ ఓ లెక్కుంటుందిగా మరి!

Sunday, 14 February 2016

ఒక అసంపూర్తి వచనంలోతలుపులు తెరచుకున్న రాత్రి నిండా కూరబడ్డ ఒకానొక బానిసత్వాన్నై ఒక మిథ్యా సమయాన్ని కలగంటున్నప్పుడు మిథ్యని మిథ్య చేస్తూ ఒక ఊపిరి నాలోకి ప్రవహించింది.  కలని దాటేసాక నాలో ఇంకిన ఆ ఊపిరి భౌతిక శ్వాసల స్పర్శ  కోసం కొన్నాళ్లుగా… కొన్నేళ్లుగా  అవిశ్రాంతుడినై నే నిరీక్షించిన సమయాలంటే నాకెంత ఇష్టమో తెలుసా… అనుక్షణం నీ ఉనికిని ఊపిరిస్తూ నా ఊపిరిని భద్రంగా చూసుకున్నాయని…!

నిజం… కళ్ళకంటుకున్న ఉదయం మనసుకద్దుకునే క్షణం కోసం ఎన్ని రాత్రిళ్ళు వేచిచూస్తేనేమిరా ఒక నిజమైన ప్రభాతమెంత ప్రభావవంతమో నువ్వు ఎదురు పడిన వేళని స్పర్శించాకే తెలిసింది.

గాటు పడ్డ గుండెమీద వెన్న రాసినట్లుగా ఒక నిశ్శబ్దం మీద పరచుకుంటూ వస్తున్న శబ్దం నీదైనప్పుడు గుండె పొరల కింద గొంతు విప్పలేని ఉరకలెత్తే ఒక అలజడి చేసే సందడిని చెప్పగలిగేంత అక్షర జ్ఞానం  నాకు అబ్బలేదేమో,  కానీ అలలు అలలుగా ఆ పొరలని తడుముతున్న నీ అణువణువుకీ నా భావ జ్ఞానం అందుతున్న సడి నాకు తెలుస్తూనే ఉంది.

ఒక్క చేతి స్పర్శతో ఒకరిలోకి ఒకరం ప్రవహించిన సవ్వడి ఇంకా ఇంకా వినవస్తూనే ఉంది. నులి వెచ్చని స్పర్శతో నాలోకి నువ్వు పంపింది మైకాన్ని కాదు... నాకు నువ్వున్నావన్న సందేశాన్ని.  ఇంతకంటే  ఇంకేం కావాలిరా నాకు?

నా హృదయం పై నువ్వు చేసి వెళ్ళిన సంతకం ఒక్కటి చాలు వెలుగారని లిపి ఒక్కటి జీవితాంతం నా మీదుగా ప్రవహించటానికి.

నువ్వెళ్ళిపోయిన మైళ్ళ దూరాల కొలతల నిండా నా శ్వాసలు వెలిగించిన దివ్వెల వెలుగులు విరజమ్ముతూ ఉన్నాయ్ కదూ. అది చాలదూ ! మన శ్వాసల కుండ మార్పిడి జరిగిందని తెలియడానికి...

నీకూ నాకూ మధ్య ఎంత దూరం అని ఎవరైనా అడిగితే ఎంత నవ్వొస్తుందో తెలుసా…? ఎందుకురా మనుషుల్ని దూరాలతో కొలుద్దామని చూస్తూ ఉంటారు చాలా మంది. దూరాన్ని బట్టి మనుషులు, మనసులు దగ్గరైతే బహుశా ప్రపంచం ఈపాటికే దగ్ధమై ఉండేదేమో…!

నిజంగా భౌతికపు  దగ్గరితనాలూ… దూరాలు మనసుల్ని శాసిస్తాయా?
ఎంత దగ్గరైతేనేం ? మనసులు సమాంతరంగా కదిలిపోతుంటే…
ఎంత దూరమైతేనేం? ఆత్మలు ఒక్కటై పెనవేసుకుపోతే...

మనఃస్థల కాలాలు ఒక్కటయ్యాక  దూరాలెప్పుడూ భారం కాదు. ఇది నిజంగా నిజం…   ఒకటి చెప్పు… ఒక్క చిరునామా కోసం గతానికి వెళ్లి స్మృతుల వనంలో వెదకటం కన్నా పెద్ద దూరం ఏదైనా ఉందంటావా?

చీకటిని చిదిమేసిన కాంతివానవై నాలో నిండుగా నువ్వు కురిసేసాక, ఎన్ని ఏకాంతాలని సవరించుకుంటున్నా… అన్నిటికీ సరిహద్దులు గీస్తూ నువ్వే కనిపిస్తున్నావ్...

కొన్ని ఇష్టమైన పుటల్లో నే రచించుకున్న వేళల నిండా నిన్ను స్వార్ధం చేసుకున్నాక నన్ను రాసుకోవడానికి ఖాళీతనం అంటూ మిగలలేదు.


అయితేనేం... ఒక అసంపూర్తి వచనంలో తల్లడిల్లిపోతున్న తడియారని హృదయ లేఖపై కొన్ని నవ్వుల ముద్రలేసి నువ్వు పూరించిన చేవ్రాలు ఒక్కటి చాలు నీలో నన్ను చూసుకోవటానికి…!

Friday, 12 February 2016

అరువుఅసంకల్పిత వేకువలకోసం
గాలి తివాచీని కప్పుకున్న
గాజుకళ్ళ కలలకెంత ఆరాటమో
ఒక నవ్వు మధ్యలో శాశ్వతించాలని

వర్షపు చినుకునద్దుకున్న
నిశ్శబ్దపు శ్వాసలన్నీ
నాలోకి ప్రవహిస్తున్నట్లున్నాయ్
పొడి పొడి మాటలకి తడి తడి మౌనాన్నద్దుతూ

వెన్నెల రాత్రిని చూసి పారిపోయిన చీకటంతా
ఎన్ని రెక్కలలో ఒదిగివచ్చిందో మరి
గుండెనిండా రాత్రి ముద్రలు వేసేస్తూ
నాలో ఇమిడిపోయినట్లుంది

భూమ్యాకాశాలు కలిసే సరిహద్దుకోసం
అన్వేషిస్తున్న వేటగాడిననుకుందేమో
అవకాశాలన్నిటినీ నాకు సమాంతరంగా పరిచేసిందీ జీవితం
కళ్ళ అంచులలో నిర్వేద సాగరాన్ని మంత్రిస్తూ

అయితేనేం మించిపోయిందేమీ లేదు
దేహం మొత్తాన్ని ధైర్యానికి అరువిచ్చేస్తున్నా
నిరంతర దైన్యాన్ని దునుమాడే
అక్షర సైన్యానికి ఊపిరిస్తూ

అముద్రితాలే అన్నీసాగరమంత గంభీరతకు
కాస్తంత అలజడి అలంకారమనుకున్నాయేమో
పడుతూ లేస్తున్నాయ్ అలలు కొన్ని
తీరంలో తీర్ధయాత్ర చేస్తూ

లోక సారాంశం అంతా
గాలి రెక్కల మాటున కొట్టుకొస్తూ ఉంటుంది
కొన్ని కల్లలకు పట్టం కడుతూ
కొన్ని వాస్తవాలని అపభ్రంశం చేస్తూ

చినుకుకో చిల్లు పడుతున్నట్లుంది
మట్టికి మంటల్నద్దుతూ
లోకాన్ని చిధ్రం చేస్తూ
పగుళ్ళు కానరాని శిధిలాలు సజీవంగా తిరిగే వేళ

అనంతానికీ అంతం చూపుతూ
కొన్ని శ్వాసలు ఆగిపోతుంటాయ్
ఛాయాచిత్రాల్లో నిశ్చింతగా నిశ్చలిస్తూ

సూదూర తీరాలన్నిటినీ చుట్టివచ్చేంత
దిగులు పువ్వొకటి వేలాడుతున్న చోట
అముద్రితాలన్నీ తడి తడి శాశ్వతాలవుతున్నాయ్