మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Thursday, 30 June 2016

మర్మంబతుకంటే బంగారు నీడలు కప్పుకోవటమనుకుంటూ
వ్యక్తిగతాల్లోనే
జీవన కావ్యాలు మధురాల్ని అద్దుతాయనుకుంటూ
దారంటూ తప్పని వర్తులావృతాల్లో
స్వార్థ కేంద్రాలుగా
మనల్ని మనం
బాటసారులుగా కొనసాగించుకున్నంత కాలం
మనుషులుగా మనం దారి తప్పినట్లేనన్న నిజం
మనల్ని చేరే మార్గం మృగ్యమైన సమయాలివి
మనసు స్పర్శగిట్టని వ్యక్తి వ్యాకరణాలు
వంటబట్టించేసుకుని
మనమిప్పుడు
ఎవరికీ కనపడని రహస్య వధ్యశిలలమై
సంచరిస్తున్న మృత్యు హితైషులం
నిజమే…
మనకెవరూ చెప్పరిక్కడ
మనం... ఒక బలిపీఠం వెంట బెట్టుకుని
తిరుగుతున్న సంచార స్మశానవాటికలమని

తోడంటూ మిగుల్చుకోలేని
బతుకు నడకల్లో అమృత సేవనమంటే
అనంత శూన్యసదనంలో వసించటమేనని
తెలియనంత మూర్ఖత్వం కప్పుకున్న నాగరీకులం

అమృతమూ... మృతమూ…
దిగంతాల మర్మం కావచ్చు కానీ
మనకి మనం మర్మంగా మారటం
విశ్వద్రోహమే...

Wednesday, 29 June 2016

శాపవచనంగదుల లెక్కకోసం తరువు రెక్కలు తెగిపడుతున్న చోట
కంటికింపుగా ఒక్క పచ్చని గరికకూ మట్టి దొరకని చోట
నాగరికపు ఆడంబరాలు
వల్లెవేయబడుతున్న మనిషి సద్దుల్లో
రేపటి వ్యాపారానికి నేడే పునాదులు తీస్తూ
గాలిని నులిమేస్తున్నారిక్కడ
లెక్కకట్టి అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తూ

నాగరికమేమీ పసిడి గాలులు వీయదన్న సత్యం
ఊపిరి ఖరీదు బంగారమంతటి ప్రియమైన రోజున
బోధపడవచ్చేమో గానీ
మళ్ళీ తరువుని నిలుపుదామన్నా
అభివృద్ధి పొరల కింద సమాధయిన
మట్టి స్పర్శనైతే  కొనలేము

మన కాలాన్ని మనమే గడ గడా తాగెయ్యటం
మనల్ని మనం దగా చేసుకోవటమేనన్న నిజం
ఒప్పుకోకున్నా మనల్ని చేరటం తథ్యం
మనిషి మాయమైన రుద్రభూమికి
ఏలికలవ్వటం మనం రాసుకున్న శాపవచనాలే

పచ్చందనాల వాకిట్లో
విశ్వబాహువుల కౌగిట్లో
అతి స్వేచ్ఛగా
సుతి మెత్తగా
మనిషిని శ్వాసించిన క్షణాలని
చీకటింకిన గొట్టపు గదుల్లో
నెమరు వేసుకునే ప్రాణవాయువుకి
ప్రకృతి స్పర్శ మృగ్యమేనన్న సంగతి
ఎవరికీ పట్టకపోవటం
ఒక ప్రళయం నెమ్మదిగా ఆవరించుకోవడమే కదా

వాక్య మాలిక - 2

నీ గుండె గొంతుక ఘోష...
నీ మదిని చేరే భాష...!

ఈ క్షణం మౌనంగా ఉన్నాననుకుంటున్నావేమో...
నీ తలపులే భాషగా నా మదితో నేను నీ గురించే ఊసులాడుతున్నా...!పున్నమి రాత్రుల్లో జాబిలి తునకలపై వెన్నెల రాణల్లే
తారల సందిట్లో మబ్బుల సంద్రంలో మెరుపుల తారకవై
పువ్వుల పల్లకిలో మువ్వల సవ్వడితో మేఘ మాలికవై
నా గుండెలోన కొలువు తీర రావే నాకలలచెలియా...


నే చూసే నిజాలన్నీ కలలై
మది కాంచే కలలన్నీ నిజాలై 
నను తడిమితే ఆ క్షణమే మారనా 
నేనో నిశ్శబ్దపు  శిలలా?

Tuesday, 28 June 2016

ముగింపు చుక్కఎందుకో మరి
తన మనసు వ్యాకరణం అసలర్థం కాదు
బహుశా తాను రాస్తున్న ఎడద లిపికి
ఒక చిత్తుకాగితంగానూ పనికిరాని నిషిద్ధాన్నేమో

తనలో నన్ను సమీక్షించుకున్నప్పుడల్లా
నాలోకి నేను ఒక వర్షపు చినుకునవుతున్నా
గుండెల్లో ఉగ్గబట్టుకున్న
ఒక జ్వలనాన్ని నెమ్మదించటానికి
నీటి వలువలను అల్లుకుంటూ

నాకంటూ ఒక వాక్యం ఉందనుకోవటం
ఎప్పటికప్పుడు నీటి రాతగా మారిపోతుంటే
ముగిసిన పగటిని తెచ్చుకోలేక
కమ్ముకొస్తున్న రాత్రి సవ్వడిని వినలేక
జీవితమిప్పుడు సాంధ్యవర్ణపు కూడలిలో
నిశ్చల విగ్రహమై పోయింది

ఒక్కటైతే నిజం ఎప్పుడైనా సరే
నాదంటూ ఒక వాక్యం ఉందంటే
ముగింపు చుక్క వరకూ తనే


Saturday, 25 June 2016

తేమ పతాకం


ప్రాణమొచ్చిన పసి శిల్పంలా
మనసునొక వెచ్చని వేదిక చేసి
స్వప్నాలన్నిటికీ హద్దులు కట్టేసి
అహరహం వేచి చూస్తున్నా
రా ప్రియా ! త్వరగా వచ్చేయ్

తూరుపు బాలిక విప్పిన రెప్పల్లో
వెలుగు తిలకం దిద్దుకుంటూ
రాతిరి పడతి కాటుక చాటుల్లో
విరహపు జోలలని వల్లెవేస్తూ
ఎన్ని క్షణాలు, ఎన్ని నిమిషాలు,
ఎన్ని రోజులు, ఎన్ని యుగాలు
వ్యర్ధంగా నిస్సారంగా గడచిపోతున్నాయ్

ఇతిహాసాల మధుపాత్రలన్నీ
పెదవంచుల్లో తమకమద్దుతుంటే
ఎన్ని మల్లెలు, ఎన్ని జాజులు,
ఎన్ని రాత్రులు, ఎన్ని రాగాలు
మధుశాలలై ఊపిరద్దుకున్నాయో
ఇవన్నీ నీ కోసం
నీవొచ్చాక మన కోసం

ఆశతో బేలగా, జాలిగా ఎదురుచూస్తున్నా ప్రియా
నీ లాలింపుకై... నీ పాలింపుకై...
యుగ యుగాల పాలితుడినై !
రా ! ఉన్న పళంగా
గాలి కంటే వేగంగా
మనస్సు కంటే త్వరితంగా

నిన్ను చూడక పోయినా
నీ సన్నిధి దూరమైనా
కనీసం నీ స్వరమైనా వినే అదృష్ఠం కోసం
చకోరంలా ఎదురు చూస్తూ చూస్తూ
నేత్రాంచలాలపై తేమపతాకాన్ని
ఎగురవేసుకున్న ఆర్ద్ర శ్వాసనయ్యా...

- 25.06.16

ప్రణయ గాంధర్వం - 2ప్రేమైషీ,

కోనసీమలో గోదారి గట్టున కొబ్బరి తోటల్లో వెన్నెల రాత్రుల్లో నీవు నేను కలసి ఎన్నో ఎన్నెన్నో ఊసులాడాలని, సంధ్యా సమయాన సాగరతీరంలో సాగరుని ధాటికి అరగిన రాళ్ళమీద మనమిద్దరం కూర్చుని ఉండగా... గాలికి రేగే నీ ముంగురులను సవరిస్తూ సముద్రపు అలల తాకిడికి తడసిన నీ పసిడి పాదాలను నా పెదవులతో స్పృశిస్తూ పచ్చని ప్రకృతిలో నీ వడిలో తల పెట్టుకుని పడుకుని నీ మోమును పలుకరించాలని ఎన్నో కోరికలు, ఎన్నెన్నో ఆశలు... అవన్నీ తీరేనా?.

చల్లని సాయంత్రాన తెరలు తెరలుగా సడి చేస్తున్న  పిల్ల గాలుల పరిమళాలతో నీవు నేను చెప్పుకునే ఊసులన్నీ వినే  చిలకా గోరింకలు వాటి సఖులైన మిగిలిన పక్షులకు చెప్పేనా...? చెపితే  బాగుండు. ప్రతి ప్రభాతమూ ఓ సుప్రభాతమై, చిరుగాలుల సవ్వడిలో ప్రేమ పక్షుల కిలకిలరావాలలో మన ప్రేమ రాగాన్ని తన్మయించడం ఎంతటి ఆనందకారకమో కదా!

" ప్రాణమొచ్చిన పసి శిల్పంలా
మనసునొక వెచ్చని వేదిక చేసి
స్వప్నాలన్నిటికీ హద్దులు కట్టేసి
అహరహం వేచి చూస్తున్నా
రా ప్రియా త్వరగా వచ్చేయ్

తూరుపు బాలిక విప్పిన రెప్పల్లో
వెలుగు తిలకం దిద్దుకుంటూ
రాతిరి  పడతి కాటుక చాటుల్లో
విరహపు జోలలని  వల్లెవేస్తూ
ఎన్ని క్షణాలు, ఎన్ని నిమిషాలు,
ఎన్ని రోజులు, ఎన్ని యుగాలు
వ్యర్ధంగా నిస్సారంగా గడచిపోతున్నాయ్

ఇతిహాసాల మధుపాత్రలన్నీ
పెదవంచుల్లో తమకమద్దుతుంటే
ఎన్ని మల్లెలు, ఎన్ని జాజులు,
ఎన్ని రాత్రులు, ఎన్ని రాగాలు
మధుశాలలై ఊపిరద్దుకున్నాయో
ఇవన్నీ నీ కోసం
నీవొచ్చాక మన కోసం

ఆశతో బేలగా, జాలిగా ఎదురుచూస్తున్నా ప్రియా
నీ లాలింపుకై... నీ పాలింపుకై...
యుగ యుగాల పాలితుడినై !
రా ! ఉన్న పళంగా
గాలి కంటే వేగంగా
మనస్సు కంటే త్వరితంగా

నిన్ను చూడక పోయినా 
నీ సన్నిధి దూరమైనా 
కనీసం నీ స్వరమైనా వినే అదృష్ఠం కోసం
చకోరంలా ఎదురు చూస్తూ చూస్తూ చూస్తూ
నేత్రాంచలాలపై తేమపతాకాన్ని
ఎగురవేసుకున్న  ఆర్ద్ర శ్వాసనయ్యా..."

నిజం... ఒక ఎదురు చూపులో యుగాల చలనాన్నీ గుర్తెరగకపోవటమంటూ ఉంటుందనర్థమయ్యాకే తెలుసుకున్నాను... అనంత కాలమూ పిపీలికంలా కనిపిస్తుందని... క్షణపు కొలత అనంతాన్ని అద్దుకుని భూమండలానికే నిరీక్షణా శ్వాసల వెచ్చదనాన్ని పరిచయిస్తుందని. 

నువ్వు చేసే ప్రతి జాగూ నా ఎదను ఎరగా కొరుక్కుతినే కన్నీటి తడి అవుతుంది. నువ్వు నాదానివన్న స్వాతిశయపు అహమింకా సంశయంలో కొట్టుమిట్టాడటం నీకు మాత్రం ఆనందమా? లేదు కదూ ! 

బుగులుకునే దుఃఖమెంత భారమో కొలత తేల్చగలిగేదెవరైనా ఉంటే పంపి  చూడు. మనఃసాంద్రత నింపుకున్న బిందువుకి సింధువు ఏ సాటి? సింధువు కొలతలే తేలని లోకాన మరి కన్నీటి బిందువుని చూడాల్సింది కొలతలతో కాదోయ్… మమతలతో… మనఃస్పర్శతో...

నా వేచి చూపులకి వీడ్కోలు పలుకుతూ,  గ్రీష్మ ఋతువులో వేడి తాకిడికి మండిపోతున్న అభాగ్యునికి తొలకరి జల్లులు పన్నీటి జల్లుల్లా సేదతీర్చినట్లు నీవు నా దరి చేరి స్వాంతన కలిగిస్తావని నా ఆశ. ఒక్క సారి తొలకరివై తాకాక జాజుల జడివానగా మారకుండా ఉండటం అసాధ్యమేనన్న హామీ  నాది. 

గట్టు తెగటం  అంటూ  ఉండదు  సముద్రానికి, తన పాటికి తాను భూమండలాన్ని ఆక్రమించుకోవడమే తనకి తెలుసు… నా వరకు నువ్వూ  అంతే నీలో నువ్వు కదలకుండా ఉంటూనే నన్ను ఆసాంతంగా ఆక్రమించుకోవటమంటే  మరేమిటనీ?  ఎంత దురాక్రమణదారువో :p. 

నువ్వొచ్చే వరకూ  నా మౌనం మహార్ణవమయితేనేం,  నువ్వొచ్చాక, చూపులే శీతలీకరించేసిన గొంతులో... సగం సగంగానైనా వెల్లడవ్వాలనే మాటల తపనని ఎలా స్వీకరిస్తావోనన్న ఉత్సుకత నా ఊపిరిని భారం చెయ్యటం ఎంతమాత్రమూ వింత కాదు. 

ప్రేమ పొత్తిళ్ళలో పసి పాపాయిలం మనం.  మనలాంటి ఎందరి పాపాయిల స్వచ్ఛ నవ్వులతో తన ఆయువు పెంచుకుందో మరి… తానొక చిరాయువై కోటానుకోట్ల జీవ పరిమళాలని లోకాన కుసుమించటం కాలం పొడుగూతా సజీవ సాక్ష్యమే కదా. 

గాటు పడ్డాకే గంధపు సువాసన లోకానికి వెల్లడవుతుందన్న సత్యం తెలిసిందే కదా. మరి నా ప్రేమా అంతే ! గుండే తడతావో... గాటే పెడతావో… ఏదైనా సరే అక్కడ వెల్లడయ్యే సత్యం మాత్రం… నువ్వే !

నీ

ప్రేమైషి

Friday, 24 June 2016

పర్యవేక్షణనిశ్శబ్దం మాటున వేదనతో రమిస్తున్న గాలి
చేస్తున్న రవంత సడిలో
జ్ఞానేంద్రియాలన్నీ నిశ్చలతనద్దుకుంటున్న
ఒకానొక శూన్య దృశ్యం ఇప్పుడిక నిత్యకృత్యం

ఏ కాంతి పవనాలు చుట్టేస్తాయోనని
ఎండుటాకుల సవ్వడి మీదుగా
ఉరుకురికి వచ్చిన రాత్రిని
గుండె గూటిలో భద్రపరచటం
నా కాలం ఎరిగిన పురా సత్యం

ఇక్కడున్నదంతా
జ్ఞాపకాల మంజూషంగా కూర్చబడ్డ మస్తిష్కమూ
ఉదయం మొదలైతే సాయంత్రానికి అలసిపోయే దేహగేహమూ
తాళం వేయబడ్డ కొన్ని లోక నిషిద్ధ తలపులూ
కళ్ళనెప్పుడూ మోసపుచ్చలేని నిర్లిప్తత

వెనక్కి తీసుకురాలేని నిన్నలని
మూసి ఉన్న రేపటిలని దాటేసి
మూసలోకి జారిపోయిన సమయాలని
క్షణానికోసారి అనుకున్న మలుపు తిప్పెయ్యడానికి
జీవితానికి ఇంకా దర్శకత్వం అబ్బలేదు
అదెప్పటికీ కాలం పర్యవేక్షణలో సాగుతూనే ఉంటుంది

Tuesday, 21 June 2016

అదృశ్యపు దృశ్యంగడ్డి మొలిచే వేళకోసం తపన పడేవి
పశువులు మాత్రమే అనుకోవటం
చారిత్రక సత్యమేం కాదన్న నిజం
మనకు మాత్రమే తెలుసు... మనకు మాత్రమే

దించేసుకున్న పాప భారాలన్నీ
శిధిలాలైతే సరిపోదన్న సత్యం
వెంటాడుతుంటే
మట్టి విచ్చుకునే వేళకోసం ఎదురుచూపులాపేసి
నేల గర్భాన్ని కోసేసి
మన పంకిలాలని దాపెట్టిన ఆనవాళ్ళు
అదృశ్యమయిన దృశ్యం
శాశ్వతమవుతున్న ఆ సవ్వడి
మనకెప్పుడూ కనసొంపైన విశేషమే

మరి మనిషెప్పుడూ
శిధిలాలూ కప్పడిపోయిన దృశ్యమే కదా !

Monday, 20 June 2016

వాక్య మాలిక - 1

నిశ్శబ్దం నీ శబ్దం అయినప్పుడు
మౌనమే నా మాట అయినప్పుడు
కలల తీరపు వాకిళ్ళలో నాటిన
కల్పవృక్షమే మన ప్రేమ

ఇసుక రేణువుల మీది నీ పాద ముద్రలు 
అలల అలికిడికి అరక్షణంలో చెరిగిపోతాయేమోగానీ 
నీ జీవితంలో నువ్వేసిన స్నేహ ముద్రలు మాత్రం
నాలో  ఊపిరున్నంత వరకూ  పదిలం 


Saturday, 18 June 2016

వాక్యం ఆగిపోయిన చోటకొన్ని భావాలకి మాటలు ఉండవు.
కొన్ని మనం చెప్పగలుగుతాం
కొన్ని మనం చేయగలుగుతాం
కొన్ని ఈ రెండిటికీ మించినవి…
ఊహించలేం

రక్తబంధాలకే రక్తదానం చెయ్యాలంటే ఆలోచనలు పుట్టలేసే వాళ్ళ మధ్యలో
జన్మ ముగిసాక అవయవదానపు హామీ ఇవ్వమంటే ముఖం చాటేసే లోకాన
ఓ సాయంకాలపు వ్యాహ్యాళికి వెళ్లినంత సులువుగా
వాన నీటిలో కాగితపు పడవని నడిపినంత స్వచ్ఛంగా
తమకేమీ కాని ఎవరికోసమో
తమని తాము వదిలేసుకుంటూ
మానవత్వపు పాదుగా చిగురిస్తూ ఉంటారు కొందరు
అప్పుడనిపిస్తుంది
కొందరింకా మనుష్యులుగానే పుడుతున్నారు.
వాళ్ళ నీడలో మనం సేద తీరవచ్చు అని

నిజం...నిజంగానే కొందరుంటారు
‘ఏయ్… లోకమా భయపడకు
నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారంటూ’
ప్రపంచం మీద ఒక మానవత్వపు సంతకం చేస్తూ

ఇలాంటి వారిని రాయాలంటే
అక్షరం అడుగడుగునా మొరాయిస్తుంది
వాక్యం సగంలోనే ఆగిపోతుంది
ఒక సమున్నతాన్ని వ్యక్తీకరించే శక్తి లేదని

శాశ్వతించుకోవాలి ఈ మానవత్వపు స్పర్శని
కథల్లోనో కావ్యాల్లోనో అక్షరాలుగా కాదు
మనల్ని మనం మనుషులుగా ఆవిష్కరించుకుంటూ...

***

ఏయ్ శ్వేతా…
అరుదైన స్నేహితా...
మలినపు వడకట్టుని ఉదారంగా ఇచ్చేస్తూ
మనుషుల్లో మానవత్వపు వడకట్టుకు తొలిమెట్టువైన
అరుదైన ఆత్మీయ నేస్తమా
చిరకాలం చిరునవ్వులతో చిరంజీవిగా వర్ధిల్లు

(తనకేమీ కానీ ఓ వ్యక్తి కోసం కిడ్నీ దానం చేసిన నా ఆత్మీయ నేస్తానికి...)