మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Friday, 22 September 2017

తెల్లకాగితం

అక్షరం రాయబడని  కాగితంపై
పరుచుకున్న మనసుని  చదువుతున్న తనని చూసి
విషాదం విరిగిపోతున్న చప్పుడు కరిగించేస్తున్న  
నిశ్శబ్దంలో నుండి
గుండె కిందగా
ఒక నవ్వు మొదలవుతున్న సవ్వడి వినగానే
ఇందాక  
తెల్లకాగితంపై రాలిపడ్డ
రెండు కన్నీటి చుక్కలు
ఇప్పుడు నవ్వుల చిగుర్లు వేసుకుంటూ
తడి తడిగా  మనసుని  అల్లుకుంటున్నాయి
కంటి నిండుగా  వెన్నెల పూలని పుష్పిస్తూ


Thursday, 21 September 2017

పురాతనమంతా

మట్టికుండ లాంటి
పురాతనమంతా పరిమళమే
అనుకున్నంత సేపూ
ఈ లోకం నచ్చకపోవడం  పెద్ద వింతేమీ కాదు

మరకతాలు పొదిగినవన్నీ
అలంకారమే  అనుకుంటున్నామంటే
మనం నేర్చినవన్నీ  మర్చిపోయి
మరోసారి  కొత్తగా  లోకాన్ని చదవాల్సిందే

మనసు పాత్ర మారనంత వరకూ
మట్టి కుండ అయినా
మరకతాలు పొదిగిన కలశమైనా
ఒకే ఆనందాన్ని నింపుకుని ఉంటాయి

అనంతమైన కాంతినీ…
గాడాంధకారాన్ని
ఆప్తంగా  హత్తుకునే  మనసే

నీ లోకాన్ని వెలిగించే  ఆనంద దీపం

Tuesday, 19 September 2017

ఎడారి వాసన

నల్లని రాత్రిని మూసేస్తూ
సూర్యుణ్ణి తెరచిన కాంతి ద్వారం
ఆకాశాన్ని మరింత స్పష్టపరిచే
కథని చూస్తున్న కళ్ళ వైపుగా
శూన్యాన్ని మూసేసుకున్న రాజసాలుగా
నడిచే అడుగుల కోసం
ఎన్నాళ్ళైనా  ఎదురుచూపులు సాగాల్సిందే

మరో చోటకి వలస పోయే చూపుల్లోని  పొడిదనంలో
తనకు పనిలేదంటూ
ఎప్పటికప్పుడు
కళ్ళని శుభ్రం చేసుకుంటున్న నిరీక్షణలకి
చేరువ కావడమన్నది
లోలోన గూడు కట్టుకున్న
ఉద్వేగాలని  వెలికితియ్యడమే

తడి కొరడాతో
మనసుని ఈడ్చి కొడుతున్న కళ్ళలోకి
సూటిగా చూసేంత
స్వచ్ఛతని రాసుకున్న చూపులు కొన్నైనా దాచుకుందాం
లేదంటే...
నిలువెత్తు దాహాలుగా ఆవిరవుతాం
ఎడారి వాసనలుగా వీయబడతాం


Sunday, 17 September 2017

అమృతమంటే...

వెలసిపోయిన కాగితాలను
చూసిన కథలున్నాయి గానీ
వెలసిపోయిన అక్షరాల
చరిత్ర ఎక్కడా కనపడలేదు.

మనసుకి చేరిన అక్షరాలు
చరిత్రలో కొనసాగటానికి
ఏ శాసనాలూ… కాగితాలూ
అవసరం లేదు

అప్పటికే అవి

తమ విలువని
ఉన్నతంగా రాసేసుకున్నాయి మరి

అందుకే అనిపిస్తుంది
అక్షరమంటే అమృతమని
నేటి అమృతమంటే అక్షరమని

Wednesday, 13 September 2017

దారి మలుపుకి ఆవల...

ఇన్నాళ్లూ నేను చూసిన అన్నిటినీ
చరిత్ర నడకలతో నలిగిన దారిపైనే  చూసాను
ఇకమీదటంతా నాకే ప్రాధాన్యతలూ లేవు
పరిచయమయ్యే ప్రతి నిజాన్నీ
ఆప్యాయంగా ఆదరించటం తప్ప

దారి మలుపుకి ఆవల
ఏమున్నదో అనుకుంటూ నడుస్తుంటే
బాట పక్కనున్న అందాలని చూడలేమంటూ
మనసు గొంతు సవరించుకున్నప్పుడు
ఒక ఆనందం ఎంత ప్రశాంతంగా
పరిచయమవుతుందో అనుభవమయ్యింది.
ఇప్పటి వరకూ చూసినదంతా
మరోలా పరిచయమయ్యింది

ఇదిగో
ఈ క్షణం నేను చూసినది
ఇంతకు ముందు పరిచయం లేనిది

నన్ను ఆవరించుకున్న ఈ గాలీ
నన్ను నింపుకున్న ఈ నిమిషమూ
ఇప్పుడే ఇక్కడే కొత్తగా పరిచయమయ్యాయి
ఇన్నాళ్ల తెలివిడికీ తెరదించుతూ

అవును… నిజంగా !
గాలంటే  కోట్ల జీవుల ఊపిరి నజరానా అని
నిమిషమంటే పంచభూతాలనూ శాసించే శాసనమని
ఉన్నది ఉన్నట్లుగా పరిచయమవ్వటం ఇప్పుడే మరి

ఒక అనుభూతిలోకి కొత్తగా నడవడం కన్నా  
అద్భుతమంటూ ఏముంటుందనీ


Tuesday, 12 September 2017

మరణమంటే

మన మరణం
మనదైనంత వరకూ…
మన కథ సమకాలీనం మాత్రమే.


అదే మరణం
లోకాన్ని ఒక్క సారి కుదిపిందంటే…
మనం చరిత్ర పుటలకెక్కిన అక్షరాలం   

అప్పుడనిపిస్తుంది
మరణమంటే
ముందే రాయబడిన విజయమని...!


Monday, 11 September 2017

నాలుగు రంగుల ఝండా

మనకెప్పుడూ అబద్దమంటేనే ఎక్కువ ఇష్టం . ఇదే అసలైన నిజం.

మూడు రంగుల జండా ముచ్చటైన జండా అంటూ పెద్దగా కనిపించే రంగులనే నిజం అంటూ మనల్ని మనం మభ్య పరచుకుంటూ నాలుగవ రంగైన నీలాన్ని మనం ఎప్పుడూ బయటకు తీయలేదు. ఝండాలో నాలుగు రంగులు ఉండటం అబద్ధమా? మరెందుకు మనం గుర్తించం?

ఎందుకంటే మనం అబద్ధాలని నమ్మటానికి అలవాటు పడ్డాం. అంతేనా అవే అబద్దాలని నిజాలని ప్రచారం చెయ్యటం లో సిద్ధహస్తులయ్యాం. ఎక్కడన్నా ఒక గొంతు నిజాన్ని మాట్లాడటం మొదలు పెట్టిందా… తన మీద అన్ని రకాలుగా దాడి చేసేస్తాం.  

ఇన్నాళ్ళుగా అబద్ధంగా కొనసాగుతున్న ఒక నిజాన్ని మాట్లాడటానికి చాలా ధైర్యం కావాలి. కళ్ళకి కనిపించే ఒక నిజాన్ని మనం గుర్తించలేకపోతున్నామంటేనే అర్థమవుతుంది… ఎడతెగని ప్రచారం అబద్ధం చాటున నిజాన్ని ఎలా సమాధి చెయ్యగలదో !

చూద్దాం ఇంకెన్ని తరాల తరువాత నాలుగు రంగుల ఝండా నలు చెరగులా ఎగిరే ఝండా అని అంటారో...