మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Showing posts with label My Musings. Show all posts
Showing posts with label My Musings. Show all posts

Friday, 17 June 2022

ముగిసిపోదామా? కథని మార్చి రాద్దామా?

 



ఇది ఎలా ముగుస్తుంది?

ఏమో… తెలియదు… తెలుసుకోవాలనీ లేదు. అది ఆటైనా… కథైనా… జీవితమైనా... ముగింపు తెలిసాక  మనల్ని కొత్త కొత్తగా నడిపించే తపన ఎక్కడ మిగిలి ఉంటుంది?

ముగింపు తెలియని ఒక పరిచయం… ముందు ముందు ఎన్ని కొత్త బాటలని పరిచయం చేస్తుందో… మన ముగింపుకే తొలి అడుగుని ముద్రిస్తుందో కదూ !  

మనకు తెలియని ముగింపుకి ఎన్నెన్ని కథనాలో… ఏ కథనంలో మన ముగింపు ఇముడుతుందో అన్న ఆలోచన మాత్రం ఎప్పటికీ ముగియదు. 

ముగింపుని అలా వదిలేసినంత కాలం నువ్వో కొనసాగింపువే…  

సముద్రం మీద దూరంగా కనిపిస్తున్న ఓడ ఇంకాసేపటికి మన కళ్ళకి కనిపించనంత మాత్రాన అది లేదని కాదు. తన ఉనికి ముగిసి పోయిందనీ కాదు. తన ప్రయాణంలో మరో చోటకి… మరో కంటికి దగ్గరగా వెళుతూ ఉందనే. 

ఈ క్షణంలో ఇది ముగిసిపోయింది అనుకుంటే… మరో చోట మరోలా మొదలవుతుంది. మరో రూపంలో ఇదే చోటకి మరల మరల వస్తూ ఉంటుంది. ముగింపులని మనం అనుకునేవన్నీ రూపు మార్చుకున్న కొనసాగింపులే. 

అయితేనేం… మనిషంటేనే పట్టువదలని విక్రమార్కుడు కదా… 

అందుకేనేమో మనిషి కథ ముగింపుకి తానే పథక రచన చేస్తున్నాడు. 

మరి ముగిసిపోదామా? 

కథని మార్చి రాద్దామా? 

మనిషి కథ ముగింపులేని వాక్యమవ్వాలీ అంటే తను చివరంటూ లేని నిస్వార్థమవ్వాలి.  


Saturday, 11 June 2022

ఊపిరి కొలత

 



ఇదిగో…

నీ  హృదయం నుండి జారుతున్న ఈ చిన్ని ఉప్పు నీటి చినుకుని చూడు… ఈ అనంతానంత విశ్వపు రచనలో…  నీలో రేగిన కల్లోలాన్ని ఋజువు పరుస్తూ చెక్కిలి మీద తేమరాతని రాస్తూ సాగుతున్న ఈ నీటి అక్షరపు ఊపిరి యొక్క ఉనికి  ఎవరికని చేరుతుంది. ఎవరికో ఎందుకు… అసలు మళ్ళీ నీకు దొరుకుతుందా తన ఉనికి? 

ఎందుకు దొరకదు ? 

చెక్కిలి మీద ఆవిరైన ఆ తడి బిందువు ఎన్ని కోట్ల కోట్ల ఆర్ద్రతా కణాలుగా మారి ఈ లోకం మీద తన ఉనికిని పరచుకుంటూ వెళుతుందో  కదా!  ఏ చిన్ని హృదయం మీదకో  చేరిన ఒక అణువంత రేణువు చాలు… నిన్ను ఒక  రచనగా మలచటానికి.  నీ  ఉనికిని విశ్వమంతటికీ పరిచయించటానికి. 

నిజానికి,  ఆదీ అంతమూ తెలియని ఈ విశ్వంలో  నువ్వెంత ?  నీ ఉనికెంత ? 

నిజంగా తరచి చూస్తే ఈ ప్రపంచం… ఒక మాయా మోహనం. తన ఉనికినే… తన కొలతనే… తానెప్పుడూ గుప్పెట విప్పదు  మరి. ఇది నిజంగా నిజం… 

ఎలా అంటారా?  

ఈ ప్రపంచం చాలా పెద్దది. చాలా అంటే చాలా… ఒక్క సారి తప్పిపోతే మనకి మనం  దొరకనంత… ఈ ప్రపంచం చాలా చిన్నది… చాలా అంటే చాలా… కోట్లకోట్ల నక్షత్రాల ఆచూకీ మన కంటి చూపుకి  అందేంత… 

ఇంతకూ ప్రపంచం పెద్దదా…  చిన్నదా… ?  ఏమో ఎవరికి తెలుసు ? ఎప్పటి మనఃస్థితికి ఏమని అనిపిస్తుందో… నిజం చెప్పాలి అంటే ప్రపంచం చిన్న్దదో పెద్దదో కాదు… నువ్వు  ప్రపంచాన్ని చూసిన క్షణపు కొలత అది. 

ఆ క్షణం లో మిగిలిన అన్ని సమయాలూ… పరిమాణాలూ… గడ్డ కట్టుకు పోయి ఉంటాయి. అసలవి నీ  దగ్గరకు రావు కూడా ! 

ప్రపంచానికి నువ్వు పెద్దగా తెలియాలంటే… అసలు నువ్వెంత పెద్దనో నీకు తెలియాలి. నీకు నువ్వే చిక్కనప్పుడు ప్రపంచానికి నువ్వెక్కడ తగులుతావ్… అందుకే నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకుంటూ ఒక స్వఛ్చతా దీపంలా నువ్వు ప్రజ్వరిల్లాలి. దానికోసం నీకు నువ్వే ఇంధనంగా మారాలి. 

ఈ ప్రపంచపు పాంచ భౌతిక స్వరూపంలో ఒక రేణువంతనే నువ్వుండనీ… తన ఆత్మానుగత స్వరం నుండి నువ్వు వినిపిస్తే… ఇక నువ్వూ… ప్రపంచమూ…  ఏది ఎవరు?

ప్రతి సామాన్యతలో ఒక అసామాన్యత ఒదిగి ఉంటుంది. నీకు నువ్వుగా  తనని  ఎప్పుడు తెలుసుకుంటావా అని వేచి చూస్తుంది తప్ప తనకి తానుకు అది బయట పడదు.  

మరి నీకు నువ్వు తెలియాలంటే…?

అంత సులభమా… నిన్ను నువ్వు చదవాలి… అహరహం అకుంఠిత దీక్షతో.  అంతా కొత్తగా ఉండవచ్చు… మరంతే కదా! నీకు నువ్వు పరిచయం అవ్వటం ఇప్పుడే కదా ! అలానే ఉంటుంది.  అయినా సరే… ఇక ఆగమన్నా ఆగవు.  

అదంతే మరి! 

వేవేల కావ్యాలు … వేదాలు… ఉపనిషత్తులు… ఇతిహాసాలు… పేరేదేతైనేం   వాటిన్నిటి సారం నువ్వే… అవన్నీ చెప్పేది నీ గురించే… నీలో నువ్వెంతగా వ్యాపితమయి ఉన్నావో తెలిసి వచ్చే కొద్దీ బహిరంగపు ఆసక్తులన్నీ అనాసక్తులై నీకు నువ్వే ఒక నిరంతర ఆసక్తిగా కొనసాగుతూనే ఉంటావు.

Friday, 8 October 2021

రహస్యంగా

 




ఎవరో అన్నారు… 

రహస్యాన్ని శోధించడమంటే 

బాధని వేటాడి తెచ్చుకున్నట్లే అని 

నిజమే కదా ! లోపలి నుండి చిన్నగా గుస గుస 

హేనోర్ముయ్! శోధించక పోతే సాధించేదెలా గదమాయించాను.

సాధించి చేసేదేముంది. నీకు తెలియాల్సిన అవసరం ఉంటే అదే నీ కంటబడదూ? మళ్ళీ గుస గుస

ఇక నువ్వు ఆపు. నువ్వేం చెప్పినా నేను వినేదేలేదు.  నా రహస్యాన్వేషణని కొనసాగించాను. 

బంగారు వర్ణంలో మెరిసిపోతూ కనిపించిన కాగితాన్ని చూసి  ఇదిగోఇదే కదూ నేను వెదుకుతున్న రహస్యం అనుకుంటూ తెరిచి చదివాను.

ఈ క్షణం నుండి ఏ క్షణంలో అయినా నువ్వు చనిపోతావు రాసి ఉందక్కడ.

రహస్యాన్ని గౌరవించిరహస్యంగానే ఉంచాలని గట్టిగా చెప్పవద్దూ లోపలెవరిమీదో గట్టిగా అరిచేసాను.


Sunday, 1 January 2017

చీకటి

ఓ చీకటీ !

నీవు నా నేస్తానివి. నిత్యం నా చుట్టూ ఆవరించుకోవాలనే నీ తపన ఉంది చూశావూఓహ్! ఎంత ముద్దుగొలుపుతుందో తెలుసా అది. నిజం నువ్వు నా చుట్టూ పరుచుకున్నప్పుడే నిన్ను ఛేదించుకోవాలనే కోరికలో నాకు నేను చేరువవ్వటం మొదలవుతుంది. ఆ చేరికలోనే ఒక వెలుగు కిరణం ప్రభవిస్తుంది. ఎప్పుడైనా ఒకటి గమనించావానీలోకి చేరగానే అంధకారమయమే అనిపిస్తుందికాస్తంత అలవాటు పడ్డామా ఒక్కొక్కటిగా ప్రతిదీ కనులకి విపులంగా విశదమవుతుంది.

ఏదో అనుకుంటాం కానీ వెలుగు చుట్టూ కప్పబడే కవచమై నువ్వున్నప్పుడే దానికి మరింత రాణింపు. ఆ నిజం తెలిసిన ఎవరికైనా నువ్వు నేస్తానివే. మనసులో చీకటి లేని మనిషంటూ ఒక్కరైనా ఉంటారా? కష్టం కదూ. ఎంతటి ఉన్నత వ్యక్తిత్వానికైనా రెండవ పార్శ్వంగా ఉండటం అన్నది సహజాతి సహజం. నిజం పగటికి రేయి, సుఖానికి కష్టం, వెలుగుకి చీకటి మరో పార్శ్వంగా లేకపోతే ఈ లోకం ఎన్నటికీ నచ్చదు కూడా.

నీవు కేవలం రాత్రి పొర మాత్రమే కాదు, మౌనాన్ని మాలగా ధరించిన మాతృమూర్తివి కూడా. నీ ఒడిలో చేరినప్పుడే కదా... ఈ లోకం సృష్టించే శబ్దాలన్నీ నెమ్మదించి, నా హృదయ స్పందన నాకు స్పష్టంగా వినిపించేదీ, నా ఆలోచనల అల్లరి కాస్తంత అణిగి, సమాధానాల రూపం దాల్చడం మొదలయ్యేదీ. ఆధ్యాత్మిక అన్వేషణలో ప్రతి ప్రయాణీకుడు ముందుగా దాటవలసిన రహస్యం నువ్వే.

నీవు లేకపోతే స్వప్నాలకి రూపమెక్కడిది? నీ ముఖమల్ తెరల వెనుకే కదా... నిన్నటి జ్ఞాపకాలు, రేపటి ఆశలు రంగుల ప్రపంచాన్ని సృష్టించుకునేది. కనులు మూసుకుంటే చాలు, నువ్వు నా అంతరంగమంతా ఆకాశంలా విస్తరించి, నా ఊహల విహంగానికి ఇంధనమవుతావు. పగటి వెలుగులో దాచిన ప్రతి నిజమూ, నీ సమక్షంలో నా ఏకాంతంలో నివురు రాల్చుకుని నిప్పులుగక్కుతుంది.

ఒక సంగతి చెప్పనా

ఆరుబయట మంచం మీద వెల్లకిలా పడుకుని నక్షత్రాలు లెక్కబెట్టుకునే పసితనంలో ఏమో గానీ, ఇప్పుడు వాటిని అలా చూస్తుంటే అర్ధమయ్యేది ఒకటేఎంతోటి నక్షత్రం చుట్టూ అయినా నిశి పరుచుకునే ఉంటుందని, ఆ నిశి ఉండబట్టే వేల కోట్ల కాంతి దూరాలలో ఉన్న నక్షత్రాలూ నా ఈ కన్నులకి కన్పిస్తున్నాయని.

మరి నిశీ నువ్వూ వేరు వేరు కాదుగా

అందుకే, వెలుగును తాకడానికి ఎంతటి ధైర్యం అవసరమో, నిన్ను కౌగలించుకోవడానికి అంతే విశ్వాసం కావాలి. నువ్వు ఆశ్రయం కల్పించేంత విలువ పొందాలీ అంటే నన్ను నేను పూర్తిగా నీకు అర్పించు కోవాలి. నన్ను నేను శూన్యం చేసుకునే చోటూ... నన్ను నేను నింపుకునే చోటూ నువ్వే. మరి అంతే కదా! శూన్యం నుండే కదా ప్రతి సృష్టి మొదలయ్యేది! నిన్ను తిరస్కరించేవారు వెలుగు విలువను మాత్రమే చూస్తారు కానీ, దాని పుట్టుకకు మూలమైన నిన్నూ, నీ నిశ్శబ్దాన్ని, నీ ఏకాంతాన్ని గుర్తించలేరు.

నేల గర్భంలో విత్తనానికి, అమ్మ గర్భంలో శిశువుకీ మొదటి నేస్తానివి నువ్వే... అంటే నా మొదటి నేస్తానివి నువ్వే. నాకు మాత్రమేనా... ప్రతి ఒక్కరికీ అంతేగా! కన్నులకు కనిపించని నీవు, కనిపించే ప్రతిదానికీ ఆధారంగా ఉన్నావు. పగలు పరుగులో మరచిపోయిన ఓర్పును... ఓదార్పునూ, రాత్రి వేళ నీవు తిరిగి నేర్పుతావు. గాఢాంధకారాన్ని అనుభవించిన తరువాతే కదా, ఉషోదయం వర్ణరంజితమై మధురంగా ఆహ్వానం పలుకుతుంది. నీవు పుటం వంటిదానివి. నిన్ను దాటిన ఆత్మ మాత్రమే నిజమైన మెరుపుతో ప్రకాశించగలదు. నిన్ను రాస్తూ ఉంటే కలానికీ, కాలానికి అలుపు రాదు... కాగితానికి చివరెక్కడో చిక్కదు.

ఏదైతేనేం ఈ జీవితం నీ గురించి నాకు నేర్పిన పాఠం ఒక్క వాక్యంలో చెప్పనా

చీకటంటే మరేమీ లేదు చిక్కగా కమ్ముకునే నల్లని వెలుగే'

Saturday, 24 December 2016

రెప్పల్లో రహస్యంగా...!


నువ్వంతేరా ! రెప్పల్లో రహస్యంగా కొన్ని నవ్వులుంచి వెళ్లిపోతావ్. అదేమంటే పెదవులకి మోమాటమెక్కువై తమ నవ్వుల స్వచ్చతని పలుచన చేసుకుంటూ ఉంటాయ్ అందుకే నవ్వులెప్పుడూ కళ్ళల్లోకి నడిస్తేనే బహు స్వచ్చం అంటావ్. సవ్వడి చెయ్యకుండా సందడి చెయ్యటం వాటికే బాగా తెలుసు అంటావ్.
ఇంతకీ నువ్వెళ్ళిపోయాక కళ్ళు ఈ నవ్వులని ఎలా దాపెట్టుకుంటున్నాయో అర్థం కావటం లేదు రా అంటే… ఏమన్నావ్? నిన్ను నువ్వొక్క సారి వచనం చేసి చదువుకోవోయ్ అని కదూ. అప్పుడేగా మరి తెలిసింది నువ్వు వెళ్ళింది ఎక్కడికో కాదనీ... ప్రతి కణానికీ ఓ నవ్వును రాస్తూ, ప్రతి అణువుపై ఆనందపు అనుభూతిని అనువదిస్తూ… ప్రేమసారివై నాలోనే నిత్య సంచారం చేస్తున్నావని. అసలు నువ్వన్నట్లుగా లోలోన లోకం ఎంత విస్తరించినా ఇరుకవ్వని పుష్పకాలు కదా కళ్ళు.

ఎక్కడెక్కడో రాయబడ్డ కలలన్నీ రంగుల దృశ్యాలై అప్పుడప్పుడూ అదాటుగా దిగంతాలనీ తమలో చప్పుడు చేస్తుంటే రెప్పల పరదాలు కప్పేసి, నేను చేజిక్కించుకోవాల్సిన రేపటిని మనసుకు అవగతమయ్యేలా వడకడుతూ ఒక గమ్యాన్ని నేను రాసుకునేలా కొట్టుకలాడతాయి చూడూ… అప్పుడు తెలుస్తుంది… కళ్ళూ ప్రాణ నేస్తాలనీ.
‘తెరిచినప్పుడు చూపు మేరానే తమ దృశ్య విస్తీర్ణం. అదే మూసి చూస్తే బ్రహ్మాండపు విస్తీర్ణమూ ఆ రెండంగుళాల జాగాలోనే ఆటస్థలమవుతుంది కదోయ్. మరి అక్కడ ఉంచిన నవ్వులని ఆ బ్రహ్మాండానికే అంటుకట్టెయ్యవోయ్...లోకం నవ్వటం నేర్చుకుంటుంది ’ అంటూ లోపల నుండి అల్లరి చేస్తూ నువ్వంటున్న మాటలు ఒక జీవితమంత శబ్దం చేస్తున్నాయ్.
ఇప్పుడైతే నేను నేర్చుకున్న పాఠం ఏమిటో చెప్పనా?

కళ్ళంటే...
"మూసినప్పుడు చీకటినీ... తెరిచినప్పుడు వేకువనీ... వెలిగించే జంట దీపాలని"

Sunday, 20 November 2016

మనుషుల్ని రాసుకుందాం రా

కాసేపిలా కూర్చుని మనుషుల్ని రాసుకుందాం రా

మనుషులంటే?

ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అక్క, ఒక తమ్ముడు …

వాళ్ళు ఒక కుటుంబం రా

ఒక బాబాయ్, ఒక పిన్ని, ఒక మామయ్యా, ఒక అత్తయ్య…

వాళ్ళు బంధువులు రా

పాలవాడు , పూల వాడు, ఎదురింటాయన, పక్కింటాయన…

ఈ అందరినీ సమాజమంటారోయ్

ఒక నువ్వు, ఒక నేను, ఒక వాడు, ఒక తను…

మనం స్నేహితులం రా

అన్నిటికీ ఏదో చెప్తున్నావ్… మరి మనుషులంటే ఎవరు?

కుక్క, నక్క, పులి, పిల్లి, చెట్టూ చేమా
అంటూ కనిపించిన వాటన్నిటికీ నామకరణం చేసాడు చూడు
వాడికి పేరు పెట్టేవాడు లేక
తనకు తాను పెట్టుకున్న పేరు రా మనిషంటే

నువ్వు మరీ చెప్తావ్
మనమంతా మనుష్యులమే

ఓ.. నిజమా ! అలా అయితే
మరి నువ్వు పుట్టాక ఎవరినైనా మనిషీ అని పిలిచావా…
పోనీ ఇకపై పిలుస్తావా

‘-----’



‘మనిషంటే ఓ పవిత్ర భావం
మనిషంటే జగతికి కాపలా దారు
మనిషంటే సకల జీవకోటికీ రక్షకుడు
మనిషంటే ఎదిగే కొద్దీ ప్రకృతిగా మారే వాడు’
మరి ఇప్పుడు రాసి చూపించవూ ఒక్క మనిషిని

‘-----’

Sunday, 15 May 2016

ప్రజ



ఒక కులంగానో, ఒక మతంగానో, ఒక ప్రాంతంగానో తప్ప ఒక సమాజంగా మనమెప్పుడు ప్రవర్తించాం? చరిత్ర శిధిలాల్లో శోధించినా సమాధానం దొరకని సమస్య ఇది. సమాజం బాధ్యత ప్రభుత్వాలకి అంటగట్టేసి అసహానాల్ని మనసులో కట్టేసుకున్న మేధావులం మనం.

మన ఇంటి ఎదుట పందిళ్ళకి గుంజలు పాతటానికి కొత్త రోడ్డుమీద గోతులు తీసి రోడ్లు వెయ్యరని ప్రభుత్వాన్ని దుయ్యబట్టే మహాత్ములం. ఇంటిపక్కన ఖాళీస్థలాన్ని చెత్తకుప్పని చేసేసి మురుగు ఎక్కువయ్యిందని ప్రభుత్వాన్ని తిట్టుకునే మేధావులం. పొద్దున్న లేచిన దగ్గరినుండీ తప్పులన్నీ మనం చేసేస్తూ నెపాల్ని పరాయిల మీద వేసేస్తూ ఆవేశాలు తెచ్చేసుకునే

మనకి మన కులం ముఖ్యం
మతం ముఖ్యం
ప్రాంతం ముఖ్యం
మనకి మనం ముఖ్యం
సమాజం ఎప్పుడూ ముఖ్యం కాదు

ఇప్పుడు మనిషికి మనిషే సరిహద్దు

మనమెప్పుడూ చూడని మనవాళ్ళు విలువలంటూ చెప్పిన ప్రతిదీ ముఖ్యమే అనుకుంటాం కానీ కాలాన్ని బట్టి మార్చుకోవాల్సినవేవీ అన్న వివేచన మాత్రం తెచ్చుకోం. ఇలాంటి వాటిల్లో స్వంత ఆలోచనలు అంటూ ఎదగనివ్వం.

అసలు కులాన్ని బట్టో, మతాన్ని బట్టో , వృత్తిని బట్టో ఒక మనిషిని అంచనా వేసే కుహనా మేధావులు పెరిగిపోతున్న లోకంలో సామాన్యుల దారీ అదే అయినప్పుడు ప్రజ.. ప్రభుత...ప్రగతి... అన్నీ చిత్తభ్రమలే.

అధికారానికి ప్రజల మీద మమకారం ఎప్పుడూ ఉండదు. దానికి కులం, మతం, ప్రాంతం... దేన్నైనా సరే ఎప్పటికప్పుడు ఎలా అయినా దానికి అనుకూలంగా మార్చుకోగలదు. లేదంటే వాటికి అనుకూలంగా మారగలదు. మరి ప్రజ అలా మారగలదా? యుగాలుగా ఎవరెవరో పోతపోసిన భావజాలాల నడుమ కొట్టుకులాడటమే తనకు వచ్చిన విద్య. ప్రజలదంతా భావజాలాల బానిసత్వమే.

ఎవరికి వారు తమల్ని ప్రభావితం చేస్తున్న భావజాలాన్ని ఆత్మావలోకం చేసుకుని, దాని లోని మంచిని మాత్రమే స్వీకరించి చెడుని దునుమాడితే బానిసత్వాలూ, వ్యక్తిస్వామ్యాలూ... మానవత్వాలుగా మారి ఒక మెరుగైన సమాజంగా మనగలగడం గొప్ప విషయమేమీ కాదు కదా?

Tuesday, 28 July 2015

తాకుతూ... తాగుతూ

అప్పుడప్పుడూ ఆకాశం జల్లే మెరుపాక్షతలని మనస్సులో మధురంగా దాచుకుంటూ ఉన్నప్పుడు... తమ పరిమళం బరువు మొయ్యలేక లోకం మీదకి విసిరేస్తున్న మల్లెల సౌరభాలు వెన్నెల చల్లదనాన్ని కలుపుకుని  రక్తాన్ని మరిగిస్తుంటే రాసక్రీడా రహస్సులన్నీ మన శ్వాసలకి అద్దుకున్న  మన తొలి చలనాల సవ్వడిని  మనఃమంజూషంలో శాశ్వతం చేసుకున్న మౌనం ఎంత చక్కని అనుభూతి. 

మన అస్తిత్వాల ఏకత్వాల పరస్పర మార్పిడి నిన్ను నిన్నుగా నన్ను నన్నుగా నిలబెడుతూ మనల్ని ఏకం చేసిన సమయాల శుభముహూర్తం... మన స్మృతుల ఖజానాలో మేలిమైన లాలిత్యపు స్పర్శ. 

పగటి వేడినంతా రాత్రిపూట  సంద్రంలో నిమజ్జనం చేస్తూ పొద్దున్నే సాగర గర్భం నుండి ప్రతి రోజూ  కొత్తగా పుట్టే సూర్యుడు రాల్చే ఉషస్సులా  ఎప్పటి కప్పుడు కొత్తగా మనలో మనం ఉద్భవిస్తూ ఉంటే జీవితమెంత ఆహ్లాదమో అనుకుంటూ  కాసేపలా కళ్ళల్లో ప్రకృతిని కలుపుకుంటూ కూర్చుంటే చెదిరిపోయిన స్మృతులన్నీ ఊపిరిపోసుకుని వస్తూ తెచ్చే ఆనందాన్ని ఒక్క చుక్క కూడా కింద పడకుండా తాగాలనిపిస్తుంది... 

అప్పుడప్పుడూ ప్రకృతిని తాకుతూ తాగుతూ ఉండాలి కదూ... మనవైనవి కొన్ని మనసారా ఆస్వాదించటానికి...! 


Monday, 18 May 2015

ఓ నిరీక్షణం


అప్పుడప్పుడూ అతిచిన్న విషయాలే మనసుకి సాంత్వననిస్తాయి... వేదననీ ఇస్తాయి. ఆనందమో విషాదమో కురవాలంటే పెద్ద పెద్ద సంఘటనలు ఏమీ అవసరం లేదు. ఒక్క ఎదురు చూపూ చాలు.

ఒక నిరీక్షణలో గొంతు పూడుకుపోతూ కళ్ళు నీలాలని నింపుకుంటున్నాయంటే ఆ ఒక్క ఎదురు చూపు ఎంత మాట్లాడగలదో నిరీక్షించే హృదయానికి మాత్రమే తెలుస్తుందనుకుంటా...

ఆ చూపు ఒక నిశ్శబ్ద భాషగా మారి నా కన్నీటిజాలంలో తన పలకరింపుని లాక్కొని వస్తే...? ఇక చెప్పేదేముంది మరి...


Sunday, 17 May 2015

దూరం

మనసు కోసం మనిషి నిరీక్షణో… మనిషి కోసం మనసు నిరీక్షణో… అర్ధం కాని ప్రతీ క్షణం అంతరంగం మొత్తం  మరో కొత్త ప్రపంచంగా కనపడుతూ ప్రతి తనకూ తననే ప్రవాసిగా చేస్తున్న అనంతమైన దూరం. ఈ దూరాన్ని దాటేదెలా? ఎక్కడెక్కడి బడలికా ఎప్పటికప్పుడు ఇప్పుడున్న మజిలీనే బాగుందని గదమాయిస్తుంటే బహిరంగం నుండి అంతరంగానికి ప్రయాణ సమయం ఎప్పటికి  తగ్గుతుంది. 

అంతరంగం… బహిరంగం… ఈ రెండిటి మధ్యా ఎంత దూరం అంటే ఎవరైనా ఏమి చెప్పగలరు. మనిషి మనిషీ  కొత్త లెక్కలు కడుతుంటే. నాకు మాత్రం  మనసుకు మనిషికీ ఉన్న దూరమంత దూరమేమో అనిపిస్తుంది. అదేమిటో  కానీ మనసెక్కడా కనపడదు. మనిషెక్కడా మిగలనూ లేదు. ఇక దూరాల కొలతలు కాలాల గమనాలు ఎప్పటికీ అంతు చిక్కని ప్రశ్నలే కదా మరి? 

ఇప్పుడు కొత్త వ్యూహరచన ఏదో చెయ్యాలి... అంతు తెలియని అంతరంగ గమ్యాన్ని అలవోకగా చేరుకోవటానికి… అసలైన మజిలీలో  శాశ్వత ఆనందపు పతాకని ఎగురవెయ్యటానికి...


Tuesday, 12 May 2015

పోలిక

తాను అనుకున్నట్లుగా తాను బతకలేక పోవటానికి కారణం ప్రపంచమే కారణం అనుకునే వాళ్ళే చాలామంది.  తప్పేముంది ప్రపంచానిది. ప్రపంచపు సోకులమీద మోజు పడింది నువ్వైతే? 

పక్కోడి ఫలితంలో తానెందుకు ఒదగలేదా అనుకునే మనిషి తన పనిలో తాను ఎందుకు ఉండటం లేదా అన్న నిజం ఎప్పుడూ చూసుకోడే?   

ప్రతి విషయంలోనూ తాము తెచ్చుకునే పోలికే తమ బతుకులని కాల్చేస్తుంది అన్న ఆలోచనని ఏనాడూ తన దరి చేరనివ్వనిది ఎవ్వరు? 

పోలిక ఎప్పుడూ తనతో తనకే ఉంటే ఎదుగుదల ఎందుకు ఉండదు? రేపటి తాను ఎక్కడ ఉండాలను కుంటున్నాడో  అదే కలగనాలి… అదే గమ్యంగా చేసుకోవాలి. నిన్నటి తనతో నేటి తనను పోల్చుకుంటూ  రేపటి తన విజయం వైపు ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఇక ప్రపంచం ఎప్పుడూ తనని హత్తుకుంటూనేనే ఉంటుంది తనకో విలువని సాధించుకున్నాడు గనుక.  

ఇది కాని నాడు లోకానికి తాను  పరాన్న భుక్కులా కనిపిస్తే ఆశ్చర్యపడాల్సిన పనేలేదు.  


Saturday, 9 May 2015

పరుసవేది

మన భ్రమణం మొత్తం వలయంలోనే సాగిపోతుంది గమ్యం నిర్దేశించుకోలేని ప్రణాళికలతో... అపజయాల నెపం మొత్తం పరాయి మీద వేసేస్తూ స్వవిలువని... స్వశక్తిని గుర్తించలేని మనిషితనంలో ఒదిగికూర్చున్నాం. 

ఇలాంటప్పుడే పరుసవేది ఒకటి కావాలి ఈ లోకానికి ఇనుముని బంగారం చెయ్యటానికి కాదు. బతుకుని జీవంగా మార్చుకోవటానికి. అన్వేషణ మొదలెడదాం. పురాశిధిలాల తవ్వకాల్లో కాదు.  అంతరంగ ఫలకాలలో లిఖించబడ్డ ఆత్మవిశ్వాసపు నిధి రహస్యాన్ని ఛేదిద్దాం. 

అంతఃచైతన్యం రాసిన వీలునామాని లోకానికి వెల్లడి చేద్దాం అలుపెరుగని అన్వేషణతో అంతరంగ మూలాలని శోధించి ... మనవైన జీవితాలలో నరనరానా ప్రకృతి దాచిన ఎనలేని నిధులతో లోకాన్ని జయిద్దాం.


Thursday, 7 May 2015

నిశ్శబ్దం

నిశ్శబ్దం పరిచయం చేసే శబ్ద ప్రపంచం ఎప్పుడూ నాలో కొత్త ద్వారాలని తెరుస్తూనే ఉంటుంది. 

శిశిరం రాల్చిన ఆకుపాటలు, వసంతం తెచ్చిన సుగంధాల సందోహాలు, చిరుగాలి సవ్వడీ, తుమ్మెద ఝుంకారం, మరుమల్లె మాటలు, కోయిలమ్మ స్వరాలు, నేలరాలిన తారల స్థానాన్ని భర్తీ చెయ్యటానికి నింగికేగుతున్న దివ్యతేజాల సందేశాలు, మనిషి చూపుల వేవేల అర్థాలు..., నవ నాగరికపు మాయావర్ణాలు, బతుకు పోరాటాలు, కీర్తి కామాలు, మనసు కాలుష్యాలు... నిజమైన ప్రపంచాన్ని  నిశ్శబ్దమే చూపించింది. 

అసలు వీటన్నిటినీ మించి నా గుండె చప్పుళ్ళ అర్ధం తెలుసుకునే మహదవకాశం నాకెప్పుడు వస్తుందని నిశ్శబ్దం చప్పుడు చేసే క్షణసీమల్లో తప్ప. నాకై నేను మౌనించాలని తెలుసుకున్న తొలి క్షణమే నా జీవితపు నిజమైన పుట్టుక మొదలైనట్లుంది. 

ఎంత వైవిధ్యమీ నిశ్శబ్దం...! అందుకే అప్పుడప్పుడూ నిశ్శబ్దపు హోరులో కొట్టుకు పోవాలి... నిశ్శబ్దం తోడిచ్చిన వాస్తవంలో జీవితాన్ని నడుస్తూ ఇక అలుపు తీరనంతసేపూ అదే నిశ్శబ్దాన్ని  తాగుతూ...

Wednesday, 6 May 2015

సరికొత్తగా...


ఏ పరిచయానికి ఆ పరిచయం ఎప్పుడూ కొత్త ప్రారంభమే... చాలా పరిచయాల్లో బహుశా ముగింపు కూడా అదే క్షణం. 

కొన్ని పరిచయాలు చెవులకి, మరి కొన్ని పరిచయాలు కలలకి, ఇంకొన్ని పరిచయాలు కళ్ళకి... అప్పుడప్పుడూ ఏ ఒక్క పరిచయమో మనసుకి.  మిగిలిన పరిచయాలు నన్ను నన్నుగా ఉండనివ్వకుండా కదిలించలేవు కానీ మనసుకైన పరిచయం జీవితాన్ని ఏ  మలుపు తిప్పుతుందో ఊహించటం దుర్లభం. అయినా సరే కొంగ్రొత్త పరిచయాల కోసం నిరంతర యాత్రికునిలా తిరుగుతూనే ఉంటుంది మనసు. ఎన్ని దెబ్బలు తిన్నా బుద్ధి తెచ్చుకోని జ్ఞానమంజూషమే కదా మరి మనసంటే. 

ఒక గాయాన్ని మాన్పుతుందేమో అని ఒక వీడ్కోలు నుండి  మరో పరిచయానికి ఎడ తెగని ప్రయాణం చేస్తూనే ఉంటుంది కాని మూల కారణం ఏమిటా అని తనను తాను అవలోకన చేసుకోవటానికి సమయమే దొరకని అవిశ్రాంత యంత్రమీ మనసు.

ఏ విశ్రాంత క్షణంలోనో తనని తనకి పరిచయం చేసి నన్ను నేను సరికొత్తగా లోకానికి పరిచయించుకోవాలనే  తపనే తోడుగా నిరంతరంగా దాహపడుతూనే ఉన్నాను నాలో నేను పరదేశిలా గడిపేస్తున్న క్షణాలని అంతం చెయ్యాలనే ఆశతో...

Tuesday, 5 May 2015

స్నేహితం



మనిషి సంఘ జీవి అయి ఉండవచ్చు. కానీ ఏ మనిషికీ కూడా తనగురించి తనకు ఉన్న అవగాహన పక్క మనిషిమీద ఉండదు. ద్వంద్వ ప్రవృత్తి అలవాటు అయిన ఈ నవ నాగరిక యుగంలో అది  అసాధ్యం కూడా…  

అసలు నీ గురించి నీ కన్నా ఎవరికి బాగా తెలుస్తుంది? నువ్వు మంచో చెడో నీకు తెలియదా? అన్నీ నీ లోపలి నీకు బాగా తెలుసు. కానీ ఇంకేదో ఉందనుకునే భ్రమలో… ఇంకెవరికో మంచిగానో చెడ్డగానో అయిపోతున్నాను అన్న ఆలోచన నిన్ను నిన్నుగా ఏనాడూ ఉండనివ్వదు. 

నిజంగా నీ మనసులో దురాలోచనలే ఉంటే అవే నీకు శిక్షలు అవుతాయి. ఆ దురాలోచనలే  అనుక్షణం అంతరంతరాలని గుచ్చేస్తాయి కూడా…  

పరాయి మనుషుల అభిప్రాయాలు నీ స్వచ్ఛతని ప్రశ్నలకి గురిచేసినప్పుడు నీ మనసే నీకు ఆయుధం. 

ఎవరో ఏదో అన్నారనో ఇంకెవరో ఏదో అనుకున్నారనో తమలో ఉన్న ప్రాణశక్తిని వేదనకి గురిచేసుకోవటం ఎంత  అవివేకమో కదా… 

నీకు నువ్వే ప్రశ్న… నీకు నువ్వే జవాబు. నీతో నువ్వు మొదలెట్టే స్నేహితమే  అసలైన లోకహితం. 




Monday, 4 May 2015

ఆ కాసేపూ మిథ్యగా మారిపో ...

వానలో తడచిన ఆకుల పచ్చి వాసన పీల్చుకున్నాక తెలిసింది... అంటిన మలినాన్ని కడిగాక మాటలకందని  పసిప్రాయమొకటి మనసుని తడిమేస్తుందని. పచ్చని ఆకు నగ్నత్వం  ప్రకృతి మొత్తాన్నీ పరిమళించినట్లుగా  మాయతెరలు కప్పని మనసు మనిషిని మనిషిగానే లోకానికి ఇస్తుందని.  

కంటిమీదకి ఆవాహన చేసుకుంటున్న దృశ్యా దృశ్యాలన్నీ వాస్తవాలని పరిచయిస్తుంటే… ఇవే వాస్తవాలు కొందరికి కలలుగానే ఉండిపోతున్నాయన్న ఆలోచన చెప్పింది మనసు నడక తీరుతో మనిషి బతుకు తీరుల చిత్రవిచిత్రాలని. 

మనిషికి మనిషిని దూరం చేసే భావావేశాలు చుట్టుముట్టినప్పుడూ… తనలోని తనని ఛిద్రంచేసే వేదనలు ముంచెత్తినప్పుడూ కాసేపు తను ‘మిథ్య’గా మారిపోతే ఏమవుతుంది… తను తన స్వచ్ఛతని నిలుపుకోవటం తప్ప?  చినుకు తడిమినప్పుడల్లా మిథ్యగా మారిపోతున్న తామరాకు చెప్పిన నగ్న సత్యమే నాకో కొత్త పాఠం అయ్యింది.



Sunday, 3 May 2015

తనెంత దూరమో… అంత దగ్గర...!

లోకం మొత్తం నేనై ఉండాలన్న తపనలో నాలో నుండి నేను మాయమవుతున్న సంగతి గ్రహింపుకొచ్చేసరికి అనంత శూన్యమొక్కటి నన్ను తనలోకి ఆవాహన చేసుకుంది. ఈ శూన్యాన్ని ఛేదించడానికి నాకు ‘తాను’ కావాలి అనుకున్నా. తన సహాయంతో లోకాన్ని గెలవగలననుకున్నా.  

ఎక్కడ ఉంటుంది తను. ఎప్పటికప్పుడు కనిపించినట్లే కనిపించి మాయం అవుతుంటే నా సమయం మొత్తం తన అన్వేషణకే అంకితమై మొత్తంగా మానసిక సంఘర్షణలోకి నన్ను నెట్టేస్తూ ఉంది. 

నిజంగా నిజం ఇది. నిరంతరం తన గురించే ఆలోచిస్తూ నా  చుట్టూ ఉన్న తనని గుర్తించకపోవడం నా తప్పే కదూ...   అనుక్షణం తను నా  సమక్షంలో పరిమళిస్తున్నా తననొక భౌతిక స్థితిగా ఊహిస్తున్న నాకు తన ఆత్మీయ స్పర్శ అసలు తెలియలేదు. పిచ్చి కోరికల మోహంలో ఉన్నప్పుడు ఏ నిజాలని మాత్రం అర్ధం చేసుకోగలం గనుక? 

ఎక్కడో ఉంటుంది అనుకున్న తనకోసం దివారాత్రాల అన్వేషణలో నేను కోల్పోయింది ఎవరినో అర్ధం అయ్యాక మనసులోని భావావేశాలకి కొలతల లెక్కలేసుకుని చూసుకున్నా… ఈ సమస్యకి ఇంత దుఃఖం… ఈ బాధకిన్ని కన్నీళ్లు అనుకుంటూ… 

అదేమి చిత్రమోగాని నెమ్మదిగా  పెదవినద్దుకుంది ఓ చిరునవ్వు చిన్ని మొలకగా. బాధల కొలిమిని రగిలించేదీ... నవ్వుల జడివానని కురిపించేది నా ఆలోచనల నడకే అన్న సత్యం స్పృశించింది.  

ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది...

నా పంచేంద్రియాలకి  ఎప్పటికప్పుడు ‘ఆనందం’ అందుతూనే ఉంటుంది అర్థవంతంగా... అనంతంగా…


Saturday, 2 May 2015

నా అహం నాది


ఎప్పటికప్పుడు ఏకాంతమే ఇది అనుకుంటూ ఎన్నాళ్ళు భ్రమ పెట్టుకోను నన్ను నేను.  ఏకాంతంగా అనిపించేవన్నీ ఏకాంతాలు కాదోయ్ అని మనసు ఎప్పుడో చెప్పింది. అది నిజమని ఒప్పుకోవటానికి ధైర్యం చాలవద్దూ…అసలు చరిత్రలో నిజాలంటూ ఎప్పుడు ఒప్పుకోబడ్డాయి కనుక. 

అసలు ఒంటరితనం అనేది తాను ఒంటరినని ఒప్పుకున్న సందర్భం ఏదైనా ఉందా? ఒక దైన్యాన్ని తోడుగా తీసుకుని జంటతనంలోకి తూలిపడ్డట్లుగా ఎంత అహంకరిస్తుందో నాకు తెలియని తనమా? తెలిసినా సరే కొన్ని అబద్ధాలని యధేచ్చగా అలంకరించుకోవాలి. అదొక అభిజాత్యంగా మార్చుకున్న నాకు నిజాలని పక్కకి తోసెయ్యటం ఎంతసేపని? నా అహం నాది కదా మరి. 

లోపలి నేనుని బయటకి రానివ్వని బయటి నేనుకి కొత్తగా నిజాలు చుట్టుకోవాలనే తపన మొదలైతే  బయటకి వచ్చే మొదటి నిజం ఏమిటో మీరూ చూడండి. 

‘నా ఒంటరితనం ఇక పరిపూర్ణం’


Wednesday, 29 April 2015

ఆమె ఎవరు?

ఆమె ఎవరని మీరడుగుతుంటే నేనేం చెప్పాలి. 
ఆమెకోసం నేను ఎక్కడ వెదకాలి? 
అసలు వెదకాలా? తనెవ్వరో నాకు తెలియదూ...! 
రాసే నిజాలు వేరు. 
గుండెని తడిమే తడి వేరు. 

కొన్ని అబద్ధాలని అక్షరాలుగా లోకానికి పరిచయం చేస్తున్న నేను కొన్ని నిజాలని మది మంజూషంలో  పదిల పరచి కన్నీటి జల్లులతో నన్ను నేను స్వచ్ఛ పరచుకునే నిజమెప్పుడూ నాలోనే అత్యంత భద్రం.

ఆత్మ కథల్లోనే కాల్పానిక సాహిత్యం  గుప్పించేసే ఈ రోజుల్లో అంతరాంతరాలలో  అణువణువూ తనేనన్న నిజం నిర్భయంగా చెప్పగలుగుతున్న నేను  తనెవ్వరో ఏమిటో ఎప్పటికీ లోకానికి  తెలియని రహస్యంలో దాచేసుకుని  ఆ నిజాన్ని ఎప్పటికీ లోకానికి చూపించలేనే అన్న ఒకే ఒక్క బాధా వీచికని ఎప్పటికీ నాలోనే అదిమి పెడుతున్నా. 

నిజాలు రాయాల్సి వస్తే ప్రతి నిజమూ ఒక విషాద కావ్యమౌతుంది. 

ఇంతకూ 

ఆమె ఎవరంటే... నా ప్రతి క్షణానికి తానో అతిధి.  నా విషాదానికి తానొక ప్రమోదం.

అంతకు మించి ఆమె ఎవరన్న ప్రశ్న... ప్రశ్నగానే ఉండి పోయే నిజమే ఈ లోకానికి. 

ఆమె గురించిన ఆలోచనలే ఊపిరిగా సాగుతున్న నా  ఈ జీవితం నాది కాదు ఆమెదే...