మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Sunday, 8 June 2014

ఓయ్...

ఓయ్...
ఇదిగో ఇది నీకే... అచ్చంగా నీకే...
‘అందరిలా నేను కూడా నీతో పైకి నవ్వుతూ... లోపల తిట్టుకుంటూ’ భలే ఊహించావ్ కదూ... నిన్ను దాటి వెళ్ళే ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టుకుని నా మనఃకుటీరంలో దాచుకుంటూ మళ్ళీ మళ్ళీ ఆ క్షణాలని తడుముతూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ వాటి అమరత్వంలో అహరహం ఉండిపోవాలని, రాలి పడే నీ నవ్వుల్ని ఏరుకుంటూ... నా శుష్క మందహాసాలపై అతికించుకుంటూ నా నవ్వులకీ జీవం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉండే నా గురించి.
గుండె కన్నీరవ్వటం ఎప్పుడైనా చూసావా... నీ కళ్ళు చెమరించినప్పుడు ఒక్కసారి నా గుండెని స్పర్శించి చూడు... వరద గోదావరి ఉరవడిలా ఉబికి వచ్చే కన్నీటి తడి తగులుతుంది. ఇంకా చెప్పాలంటే గుండె దాకా ఎందుకు... ఆ సమయంలో ఒక్క సారి నా కళ్ళల్లోకి సూటిగా చూసినా చాలు నా కళ్ళల్లో సుళ్ళు తిరుగుతుండే కన్నీటి సుడిగుండాలలో చిక్కుకు పోతాయి నీ చూపులు.
ఏదో రాస్తున్నాను కానీ నా మనస్సులో చెలరేగే ప్రతి ఘర్షణని నీతో పంచుకుంటున్నప్పుడు నువ్విచ్చే ఓదార్పు మంచు వరదలా నా మనసుని చుట్టి నన్ను చల్లబరుస్తుంది. అప్పుడు నేను అనుభవించే నీ మనఃస్పర్శని ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు తెలియరావటం లేదు. అంత అవ్యక్తానుభవాన్ని నాకిచ్చేది నువ్వే... అవును కేవలం నువ్వే. నీ ముఖంలో నువ్వు దాచే భావాలని వెలికి తీసి చదవటం నాకెంత ఇష్టం అయిన పనో... నీను చదివిన భావాలే నువ్వు దాచుకున్నవి కూడా అని తెలిసినప్పుడు నా మనసు పడే మిడిసిపాటు నీకు తెలియదు కదూ...
నేను చెప్తుంటే ఏదో అనుకుంటావ్ కానీ నీ నవ్వుల నజరానా నా మనసుకి సంజీవనియై కొత్త కొత్త ఊహా పరిమళాలని నాలో వికసింప చేస్తూ ఉంటుంది. అందుకేగా ఒక్క సారి నవ్వు మరో సారి నవ్వూ అంటూ నిన్ను బతిమలాడి నీ నవ్వులని ఏరుకునేది. నీకు తెలియదు కానీ నిన్ను గురించి నేను తలస్తున్న తలపులని పదాలుగా మారుస్తూ మది పలక మీద నేను దిద్దే అక్షరాలని చదవటానికి యుగాలు కూడా చాలతాయో లేదో...
రెప్పలు చీకటించినప్పుడల్లా వెలుగై కనుపాపల్లో నిలబడిపోతావ్ కదా నువ్వు. ఆ సమయం లో కాస్త నా మనసులోకి తొంగి చూసి అక్కడ ఏముందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యవచ్చు కదా... మ్మ్ హు. అది మాత్రం చెయ్యవు. రెప్పల కవచాల్లో నులి వెచ్చగా ఒదిగి పోయి స్వప్న లోకాల్లోకి తీసుకుని వెళతావ్ కానీ నా కంటి భాష మాత్రం చదవవు కదా...
నువ్వు పరిచయం అయ్యాక నీతో పంచుకోని విషయాలు ఏమీ లేవు. అచ్చు నీకూ అంతే అని నాకు తెలిసినప్పుడు నా చిన్ని గుండెకు నేనిచ్చుకున్న భరోసా నువ్వు చూడలేదు. చూసి ఉంటే తెలిసేది నాలో నీకు నేనిచ్చుకున్న స్తానం ఏమిటో. కొంత మంది క్షణం మాట్లాడినా వినలేని నేను... నువ్వు ఉన్నప్పుడు ఓ క్షణం నువ్వు మౌనిస్తే నాకెందుకు ఊపిరాగిపోయిన అనుభూతి.
నేనో చిన్న పరిమళాన్నై వ్యాపించి నీ అంతరాలయంలో నిండి పోవాలని ప్రగాఢంగా కోరుకుంటున్నాను. నా మన:క్లేశాలన్నీ తెలిసిన ఒకే ఒక్క ఆత్మీయ స్నేహానివి నువ్వు... నీకు నేనూ అంతే కదూ... ఎన్ని గాయాలైనా కానీ నా మనసుకి... మందు మాత్రం నీ నవ్వే.
నా జీవిత పర్యంతం నీ స్నేహితుడిగా ఉండాలనే కోరికే నాకెప్పుడూ... నిన్ను తాకిన సమీరం నన్ను తాకేంత సమీపంలో జీవితాంతం ఉండాలని నా ఆశ.
చివరిగా ఓ కోరిక... కాసింత వెన్నెలివ్వరాదూ ఓ నవ్వు నవ్వి...

నీ...
స్నేహితుడు 
సురేష్ రావి

Tuesday, 3 June 2014

నా స్నేహమా...

ఓ నా స్నేహమా...

జీవితపు ప్రతి మలుపులోనూ ఎందరో పరిచయస్తులు... కొందరు హితులవుతారు ఇంకొందరు స్నేహితులవుతారు... మరి కొందరు మన జీవితమే అవుతారు.

ఏంతో మంది తమ పరిచయస్తులనే స్నేహితులు అని భావించేస్తూ ఉంటారు... కానీ పరిచయస్తులు అందరూ స్నేహితులు కాలేరు అన్న నిజం తెలుసుకున్న రోజున ఆ నిజాన్ని జీర్ణించుకోలేరు. అందుకే నా జీవితం లో చాలా మంది పరిచయస్తుల్లాగానే మిగిలిపోతూ ఉంటారు. అతి కొద్ది మంది స్నేహితులయ్యారు.

మరి ఇదేమిటో కొత్తగా...

నీ పరిచయం నాకు నన్ను పరిచయం చేసింది...! నాలోని నిజమైన నన్ను వెలుపలికి తీసింది...!
కేవలం పరిచయం మాత్రమే కదా ఎప్పుడూ పలకరింపులెందుకూ అనుకుంటూ ఉంటుంటే... మనసెందుకో ఊరుకోవటం లేదు... నిన్ను నీకు పరిచయం చేసిన వ్యక్తితో నీకుంది కేవలం పరిచయమేనా? స్నేహం లేదా? అని ప్రశ్నిస్తూ ఉంది.

నాకున్న నిజమైన స్నేహం నువ్వేనని నాకు అర్ధం అయ్యింది.

ప్రేమలో ఎదురు చూపులుంటాయని తెలుసు కానీ... స్నేహితులతో మాట్లాడటానికి కూడా మనసు తహ తహ లాడుతుంది అని నీ స్నేహం పొందాకే తెలిసింది.

నీతో మాట్లాడే ప్రతీక్షణం నా తప్పొప్పులు అన్నీ అద్దం లో కనిపించినంత స్పష్టంగా నాకు తెలుస్తూ ఉన్నాయి. నేను ఏం చెయ్యగలనో... ఏమి చెయ్యాలో... ఎలా బతకాలో అన్నీ చాలా స్పష్టం గా కళ్ళకు కట్టినట్లుగా అర్ధం అవుతుంది. పిరికి మనసుని సమాధి చేసి మొమాటపు నవ్వుల్ని తుడిచేసి బతుకుతున్నాను అంటే అదంతా నీ స్నేహపు గొప్పతనమే...ఒక్కోసారి గల గలా మాట్లాడతావు... మరో సారి అర్ధాంతరంగా ఆపేస్తావు...

అలా అలా మాట్లాడుతూ అర్ధాంతరంగా ఆపేసిన నీ మాటల వెనక నిశ్శబ్ద అర్ధాలు ఏ నిఘంటువుల్లో వెదకాలి?
ఎన్ని నిఘంటువులు వెదకినా నీ గురించి నేను చదవబోయే అర్ధం ఒక్కటే... నువ్వంటే ‘స్నేహం’ అని.

నీ

స్నేహితుడు.