మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Tuesday, 5 March 2013

వెన్నెల కుసుమం - 5


సాగర మధ్యంలో అరవిరిసిన ప్రకృతి అందాలు చిందే అందాల దీవిలో నీవు నేను జంటగా ఆకుల్లో ఆకులమై, తీగల్లో తీగలమై ఒక్కటవ్వాలనీ సెలయేటి గలగలల్లో మన ప్రేమ సవ్వడి కలసిఫోవాలనీ, లేడి కూనలూ... కుందేటి పిల్లల మధ్య మనమిద్దరం దాగుడు మూతలాడాలనీ... ఎన్నో... ఎన్నెన్నో కోరికలు.

ప్రతిరోజు ఒక కల... అదేమిటో తెలుసా...

పసిడి పల్లకిని మోయుచున్న బోయీలు, ఆ పల్లకిలో బంగారు జలతారు పరదాల మాటున ఓ అపూర్వ లావణ్య సౌందర్యరాశి, దేవలోకం నుండి దిగి భువికి ఏతెంచిన దేవకన్యలా... ఇంద్ర సభలో నర్తిస్తున్న అప్సరాంగనలా... గంధర్వ రాజుపై అలిగి భూమికి దిగివచ్చిన గంధర్వ బాలలా... యక్షిణీ కన్యలా ఓ ముగ్ధ మనోహర సౌందర్య రాశి ఈ దీనుణ్ణి చూసి చల్లగా... మనోహరంగా నవ్వింది. కొంటెగా కన్ను గీటింది. 

ఎవరబ్బా ఈ అపురూప లావణ్య సౌందర్య రాశి అని ఆత్రంగా జలతారు పరదాలను  అడ్డుతీసి చూశాను. ఆమె ఎవరో తెలుసా? రోజూ కలలో కొచ్చి నన్ను కవ్విస్తున్న ఆ కన్యకా మణి... నా ఊహలలో ఊయలూగుతున్న నా ఊహా ఊర్వశి వైన నీవే...
 అవును నిజం గా నీవే ఆ పల్లకిలోని అప్పూర్వ సౌందర్య రాశివి.

రోజూ ఉదయాన్నే తుషార బిందువులు నీ జలతారు మేనిపై పడి నీ సాన్నిధ్యంలో కరిగి ఆవిరి అవుతాయి. ఆ మంచు బిందువుల పాటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో కదా...

నీ శిగలో తురిమిన మల్లెల పాటి భాగ్యం కలగాలంటే నేను కూడా మల్లెనై నీ శిగలో చేరాలని ఉంది. నువ్వు  వేసుకునే ప్రతి వలువా నేనే కావాలనీ... ఎప్పుడూ నీ సాన్నిధ్యంలో గడపాలని నా చిరు కోరిక. ఘల్లు ఘల్లుమనే నీ కాలి అందియల పాటి భాగ్యం నాకు లేదా...

`నీ మనసు పాడే మౌనగీతంలో ఓ అర్ధవంతమైన నిశ్శబ్దపు చరణం. డానికి ఓ అందమైన పల్లవిగా నేను మారాలి. ఆందుకు నేనేం చెయ్యాలి. శెలవియ్యవా ప్రియతమా?’ 

Monday, 4 March 2013

వెన్నెల కుసుమం - 4


`నీలి నీలి నీ వినీల కుంతలాలు చూసి అవి మేఘాలు కాబోలునని భ్రమించి అచ్చట చేరిన నక్షత్రాలు తెల్లబోయి తాము అరవిరిసిన మల్లియలయినాయట’ ఇది ఏ కవి భావనో కాని నిన్ను తలచి నేననుకున్న భావనలో నుండి ఉదయించిన పలుకులవి.
'నీ కళ్ళల్లో వెండిపన్నీరు వెన్నెలలా కురిసిన వేళ
 నా ఎదలో మరుమల్లెల మాల విచ్చిన వేళ
 మన జంట ప్రేమంటే లోకానికి చేప్పిన వేళ
 మన ఊహల్లోని ఊసులన్నీ సత్యాలై సందడి చేసిన వేళ
 అదే అదే కదా మన జంట ఒక్కటైన వేళా
ఆకాశరాజు భూదేవి కన్నియకు నక్షత్రాల అక్షరాల్ని కూర్చి ఉత్తరాన్ని రాయటానికి ఆయత్తమవుతున్నవేళ నీ వడిలో నా తల పెట్టుకుని నీ కళ్ళలో కళ్ళు కలిపి మౌనముగా కనులతోనే సంఙ్ఞలు చేసుకునే సమయాన జాబిల్లి కూడా నీ ముఖచ్చాయ ముందు వెలవెలబోయి మబ్బు చాటుకు తప్పుకుని మన ఇద్దరినీ ఏకాంతంగా వదిలి తాను తారలతో సరససల్లాపములకు వెళ్ళెనేమో! 
పువ్వులా విరిసే నీ నవ్వు చూసి పాటంటే తెలియని పామరుడు సైతం రాగాలు తీయగలడు. ఆటలు రాని అమాయకుడైనా నర్తించగలడు.
నీరెండ సంధ్యలో నీ మందార చెక్కిళ్ళ నునుపులు మెరసి అస్తమిస్తున్న సూర్యుని ఎరుపులో ప్రతిఫలిస్తున్నాయనుకుంటా కదూ...
రెపరెప లాడుతున్న నా కనురెప్పల మాటున దాగి ఉన్న నా కన్నులలో అనుక్షణం నీ రూపు ప్రతిఫలిస్తూ నన్ను కవ్విస్తూ ఉంది. నీ తలపులు లేకుండా ఒక్క క్షణమైనా నాకు గడవదే...
మరి నీ ఊహల జగతిలో నేను ఒక్క క్షణమైనా ఊగిసలాడేనా. నీలాల నీ కళ్ళల్లో ఒక్క క్షణమైనా నా రూపు ప్రతిఫలించేనా.
నీవు నా మదిలో అల్లరి చేస్తుంటే ఆకలి అంటే ఏమిటో తెలియదు. నిద్ర పట్టే రాత్రే లేదు. చదువుదామంటే పుస్తకంలో నీ రూపే.
నీ మరాళ కుంతలాలపై జాలువారిన మల్లె మొగ్గలు వినీలాకాశంలో మెరుస్తున్న నక్షత్రాల్లా ఉన్నాయి. నీలాంటి అందాల హరివిల్లుని వర్ణించాలంటే కాళిదాసుకైనా మాటలు దొరకవేమో. నీ లాంటి వన్నెల ఇంద్రధనస్సుని చిత్రించాలంటే రవివర్మ కుంచెకూడా వణుకుతుందేమో.