మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Thursday, 28 April 2022

మరక (కథ)

శానిటరీ ప్యాడ్స్  పాకెట్ ని  పొట్లంలో కట్టిస్తే అది ఎవరి కంట పడకుండా దాచుకుని తెచ్చుకుంటున్నాను నేను. కానీ అక్కడ చూడు డాడీ వాడెవడో!  కండోమ్ పాకెట్ ని గాలిలో ఎగరేసుకుంటూ రోడ్డుకి అడ్డంగా ఎలా వెళుతున్నాడో. ఏమనుకోవాలి దీన్ని? మాకే ఎందుకు డాడీ ఇలా?” న్యూస్ పేపర్ చుట్టిన పొట్లాన్ని చున్నీ చాటున దాచుకుని వచ్చి డోర్ తీసి కారులో కూర్చుంటూ రోడ్డు వైపు చూపిస్తూ అంది ఆద్య .   

తను చూపించిన వైపు చూసాను. నిజమే అక్కడెవరో కుర్రవాడు కండోమ్ ప్యాకెట్ ని గాలికి ఎగర వేస్తూ మళ్ళీ చేత్తో క్యాచ్ పట్టుకుంటూ రోడ్డు మధ్యలో నడుస్తున్నాడు.  బహశా  పద్దెమిదీ పంతొమ్మిదేళ్లు ఉంటాయేమో.. 


ఆద్య  అలా అడగ్గానే చాచి లెంపకాయ కొట్టినట్టు అనిపించింది నాకు. నిజమేఇప్పుడిప్పుడే జీవితం లోకి అడుగు పెడుతున్న ఆడపిల్ల న్యూనతలోకి వెళ్లిపోవడానికి ఇదొక్కటి చాలదూ. 


కారు స్టార్ట్ చేసి తల తిప్పి ఆద్య  వైపు చూశాను. తన  ముఖమంతా ఎర్రబడిపోయి ఉంది. భావరహితంగా రోడ్డు మీదకి చూస్తూ ఉంది ఆద్య. 


చిన్న పిల్ల! అసలు జీవితం ఏం చూసిందని?” లాంటి మాటలు ఆడపిల్లల విషయంలో శుద్ధ తప్పు. పుట్టినప్పటి నుండే వాళ్లకి వివక్ష తెలుస్తూ ఉంటుంది. నడక నేర్చినప్పటినుండి సంఘం కొట్టే దెబ్బలని తట్టుకుంటూ ఎదగడంలోనే వాళ్ళ మనఃశక్తి ఎంత బలమైనదో తెలుస్తుంది. ఆడవాళ్ళ జీవితానికొచ్చేసరికి ఆకాశంలో నక్షత్రాలు కూడా తమని తాము కాల్చేసుకుంటాయో ఏమో చిన్న వెలుగు కూడా ఇవ్వకుండా ఉండటానికి జాగ్రత్త పడుతూ ఉంటాయి. 


అయిన వాళ్ళ దగ్గర అబద్ధంలో బ్రతకడం కంటే అసలు మనం రాకుండా ఉంటేనే బాగుండేదేమో కదా డాడీ?” అకస్మాత్తుగా అంది ఆద్య . తన గొంతులో నిర్వేదం! అసలు నిర్వేదమంటే అర్థమన్నా తెలుసో లేదో తనకి. 


తన ప్రశ్నకి నా దగ్గర తను ఎదురు చూసే సమాధానం లేదు. నేను చెప్పే సమాధానం నన్ను సమర్ధించడానికి తప్ప ఆద్య  ని ఊరడించలేదు. 


అందుకే సమాధానం చెప్పకుండా ఆలోచనల్లోకి వెళ్ళాను. 


* * * 


ఒక రోజు మధ్యాహ్నం ఆఫీస్ లో ఉండగా మామయ్య నుండి ఫోన్రాజేషూమన సూర్యాకి మంచి సంబంధం వచ్చిందిరావాళ్ళు ఇక్కడికి వచ్చి మన ఇల్లూ అదీ చూసి వెళ్ళారు. మేము కూడా మొన్న బుధవారం వాళ్ళ ఊరెళ్ళి పసుపూ కుంకుమ పెట్టి వచ్చాం. వచ్చే ఫస్టు తారీకున ఎంగేజ్మెంట్ అని అనుకుంటున్నాం. ఆద్య  ని తీసుకుని ఆరోజుకల్లా నువ్వు వచ్చెయ్యిఅని. 


అలాగే వస్తాం మామయ్యాఅని చెప్పి ఫోన్ పెట్టేసాను. 


మామయ్య అంటే నా మేనమామ. మా ఊళ్లోనే ఉంటాడు. రేపల్లె దగ్గర ఓ పల్లెటూరు. ప్రతి సంవత్సరం వేసవి లోనో, లేదా వీలు కుదిరినప్పుడో మా ఊరెళ్ళి అమ్మమ్మని, మామయ్య వాళ్ళని చూసి రావడం నాకు అలవాటు. ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళే అలవాటు లేదు. ఎప్పుడు వెళ్ళినా నాతోపాటు అంతా కదలాల్సిందే. అంతా అంటే ఎందరో కాదుఅమ్మనేనుఆద్య ముగ్గురమే…  అంతే!  ఆద్య  తల్లి లేని పిల్ల.  


మా చెల్లెలు తెనాలిలో  ఉండటంతో అమ్మ మాత్రం కుదిరినప్పుడల్లా వెళ్లి వస్తూ ఉండేది. ప్రస్తుతం అక్కడే ఉంది.  మేము మాత్రం  గత రెండేళ్లగా ఊరు వెళ్ళ లేదు. ఆద్య  10వ తరగతిలో ఉండటంతో పరీక్షలు అయ్యాక ఊరు  వెళ్లి వద్దాం అనుకున్నాము. ఈ లోగానే కరోనా మహమ్మారి బయలు దేరి ప్రపంచాన్ని క్వారెంటైన్ చెయ్యడంతో.  10 వ తరగతి పరీక్షలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇక అంతే…  ఎప్పటికప్పుడు లాక్ డౌన్లు, ఐసొలేషన్లుక్వారెంటైన్లతో ఎక్కడివాళ్ళం అక్కడే ఉండి పోయాం.   ఆద్య కి తోడబుట్టిన వాళ్ళు లేరు. హైదరాబాద్ లో కజిన్స్ కూడా లేరు. స్కూలూ, ఇల్లూ తప్ప  తనకి ఆటవిడుపు అంటూ ఉండేది కాదు. తనకి ఆటవిడుపు అంటే ఊరు వెళ్లి వచ్చినప్పుడే. రెండేళ్లుగా అదీ లేకపోవడంతో పిల్ల ఎప్పుడూ ఊరిని తలచుకుంటూ ఉండేది. 


ఈ మధ్యనే మామయ్య వాళ్ళు రేపల్లెలో కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. మొన్న జూన్ లోనే గృహ ప్రవేశం కూడా అయ్యింది. కానీ ఎవరమూ వెళ్ళడానికి లేదు ఆ టైం లో. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటం తో వాళ్ళ ఇంట్లో వాళ్ళ వరకే పాలు పొంగించి గృహ ప్రవేశం చేశారు. వీడియోలో చూశాము కానీ, కొత్త ఇల్లు ఎలా ఉంటుదో అన్న ఆసక్తి మా అందరిలోనూ ఉంది. అనుకున్నదానికంటే పది లక్షలు ఎక్కువ ఖర్చు అయిందని చెప్పాడు మామయ్య ఫోన్ లో. అప్పటికే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసి వేసి వాల్స్ ఏమీ కట్టకుండా వదిలేశారంట. 


ఇప్పుడు ఊరు వెళుతున్నాం అని చెపితే వెలిగిపోయే ఆద్య  ముఖాన్ని తలచుకుని నాకు సంతోషంగా అనిపించింది. సాయంత్రం ఇంటికి వెళ్ళాక విషయం చెప్పినప్పుడు చూడాలి ఆద్య  సంతోషం. తన ముఖమంతా దీపావళి దివ్వెలా వెలిగిపోయింది. 


ఊరెళ్ళి చాలా రోజులయ్యింది. మిస్సవ్వకుండా వెళదాం డాడీ!ఆఫీస్ వర్క్ అని చెప్పి నేనెక్కడ వద్దంటానో అన్నట్లు నా ముందరి కాళ్ళకి బంధం వేస్తూ అంది ఆద్య. 


వెళ్లక పోతే ఎలా? తప్పకుండా వెళదాం కన్నా!అని అన్నాను.  


ఎంగేజ్మెంట్ కి మూడు రోజుల ముందే కార్ లో బయలుదేరి తెనాలి వెళ్ళాము. ఒక  రోజు అక్కడే ఉండి అక్కడి నుండి రేపల్లె వెళ్లాలని మా  ప్రణాళిక.  వెళ్లిన రోజు రాత్రీ, మరునాడు తెనాలిలో సరదాగా గడిచిపోయింది.  మరునాడు, ఉదయాన్నే లేచి ప్రయాణం అవుదామని అనుకుంటూ ఉండగా, వాష్ రూమ్ నుండి బిక్కపోయిన ముఖంతో బయటకి వచ్చిన ఆద్య ని చూసిఏంటి నాన్నా? అలా ఉన్నావ్. నిద్ర సరిగ్గా పట్టలేదాఅన్నాను. 


లేదు డాడీ బాగానే పడుకున్నానుఅంది ఆద్య . 


మరెందుకు అలా ఉన్నావ్?” అడిగాను. 


డేట్  వచ్చింది డాడీ!అంది ఆద్య . 


ఈలోగా అక్కడికి వచ్చిన అమ్మ అది వినిఅదేంటమ్మా! డేట్ వచ్చే టైమ్ అని నీకు తెలియదా?” అని అడిగింది ఆద్య ని. 


నీకు తెలియనిది ఏముందమ్మా? ఆద్య కి ఒక్కోసారి రెగ్యులర్ గా పీరియడ్స్ అవుతాయి కానీ, ఒక్కోసారి పది పదిహేను రోజులు ఆలస్యం అవుతాయిగా. ఒక్కో నెల అసలు అవ్వవు కూడాపిల్ల కన్నా ముందు నేనే సమాధానమిచ్చాను. 


డాక్టర్ కి చూపించమన్నాను చూపించలేదాఅంది అమ్మ. 


చూపించానమ్మాప్రాబ్లెమ్ ఏమీ లేదు. ఇంకా చిన్న పిల్ల కూడా పీరియడ్స్ స్టార్ట్ అయిన కొత్తలో అలానే ఉంటుంది. కంగారు పడాల్సిన పనేమీ లేదు అన్నారుఅదో పెద్ద విషయం కాదన్నట్లు సమాధానమిచ్చాను. 


ఇప్పుడిది ముట్టయిందని తెలిస్తే వాళ్లేమనుకుంటారో ఏమిటోఅంది అమ్మ కాస్త గాభరాగా. 


ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారమ్మా?” అన్నాను నేను. 


లేదబ్బాయ్! మన జయకి ఇలాంటి పట్టింపులెక్కువ. అందులోనూ శుభకార్యం. పట్టించుకోకుండా ఎలా ఉంటారు?” అంది అమ్మ. 


అక్కడి నుండి ఇక్కడిదాకా వచ్చాక ముట్టయిందని వెనక్కి వెళ్లిపొమ్మంటావా?” 


అంతకన్నా చేసేదేముంది రా?”


పిల్లని చూడమ్మా! ఎప్పుడో ఒకసారి చుట్టాలందరూ కలిసేది. పిల్లకి అందరినీ కలవాలని ఎంత తపనో. రాక రాక అవకాశం వచ్చిందని అది సంతోషపడుతుంటే నువ్విలా అంటే ఎలా అమ్మా?”


నా మనవరాలు సంతోషంకన్నా నాకు మాత్రం ఎక్కువ ఏముంటుంది రా. కాకపోతే అక్కడికి వెళ్లి అవమానపడటం కంటే వెళ్ళకపోవడం ఉత్తమమని


అంతా మనవాళ్లే కదమ్మాఏమీ అనుకోరులే


నీకు తెలియదు నాయనాఇలాంటి వాటిల్లో తన పర అంటూ చూడరు.  అందరినీ ఒకే గాటన కట్టేస్తారు” 


అలా అయితే మరి పిల్ల లేకుండా ఎలా వెళతాం అమ్మా?”


సరేలే అంత దూరం నుండి వచ్చారుగానువ్వన్నట్టు మళ్ళీ వెనక్కి వెళ్ళినా బాగోదు. వెళదాం కానీ వాళ్ళతో ఏమీ చెప్పకుండా ఉందాంలే


అలా ఎలా అమ్మానలుగురూ మెసిలే ఇంట్లో తెలియకుండా ఎలా ఉంటుంది. అందులోనూ మన చుట్టాలంతా ఉంటారు.


తెలియకుండా నేను చూసుకుంటాగా! అంతగా తెలిస్తే ఇప్పటికే ఐదు రోజులు దాటి తలంటు పోసేసుకుందని చెప్తాలే. పిల్లకి వారం వరకూ నెత్తురు పడుతూ ఉంటుందని ఎందుకైనా మంచిదని ప్యాడ్లు వాడుతున్నాం అని చెప్పవచ్చులే


అలా ఎందుకులేమ్మా? ఎప్పుడు వాళ్లకి తెలుస్తుందో వాళ్లేమనుకుంటారో అని భయపడుతూఅక్కడకి వెళ్లిన మనఃశాంతి లేకుండా ఉండాల్సి వస్తుంది.


వెళ్లకపోతే మాత్రం మనఃశాంతి ఉంటుందని అనుకున్నావా? మనం రాకపోతే కావాలని రాలేదనుకుంటారు తప్ప నిజాన్ని నమ్మరు. ఇబ్బంది పెట్టే నిజాన్ని స్నేహితులతో చెప్పినంత సులువుగా చుట్టపక్కాల దగ్గర చెప్పలేం. చాలా చిన్న చిన్న కారణాలకే  బంధుత్వాలు దూరం అవుతాయి.


అమ్మ ఆ మాట చెప్పాక ఆ మాట నిజమేనని నాకూ అనిపించింది. మిగిలిన చుట్టాల సంగతి ఏమో కానీ నాకు నా మేనమామ అంటే చాలా ఇష్టం. తాగుబోతు అయిన మా నాన్నకి దూరంగా, ఎనిమిది నెలల పిల్లాడుగా ఉన్నప్పుడు  అమ్మమ్మ తాతయ్య నన్ను తెచ్చుకుని పెంచితే, నా పదవ తరగతి అయ్యాక స్కూల్ ఫస్ట్ వచ్చిన నాకు పై చదువులు చదివే మార్గం కనిపించకపోతే మామయ్యే  నన్ను ఆదుకుని నా చదువు కొనసాగేలా చూసాడు. అప్పటికి మామయ్యకి ఇంకా పెళ్లి కూడా కాలేదు. అంతే కాదు, తానే బాధ్యత తీసుకుని నా చెల్లి పెళ్లి కూడా ఎలాంటి అవాంతరం లేకుండా చేసాడు. అందుకే నాకు మామయ్య అంటే ప్రేమ, భక్తి, గౌరవం అన్నీ ఉన్నాయి.  మామయ్య భార్య జయది కూడా మా వూరే. నాకు చెల్లెలు వరసే. చాలా మంచిది. చెప్పాలంటే సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఎవరేమనుకున్నా పెద్ద పట్టించుకోను కానీ వాళ్ళేమైనా అనుకుంటే నేను తట్టుకోలేను. వాళ్లంటే నాకున్న ప్రేమ, అభిమానం ఆద్య కి కూడా తెలుసు. ఇప్పుడు తనకి వాళ్ళ మీద నాకంటే ఎక్కువ ప్రేమ. అందుకే అక్కడికి వెళ్లాలంటే తనకి ఏంతో ఉత్సాహం. 


నాకు తన ఉత్సాహం మీద నీళ్లు పొయ్యాలని లేదు. అలా అని చూస్తూ చూస్తూ వాళ్ళని వదులుకోనూ లేను. ఏదైతే అదవుతుంది...  అమ్మ  చెప్పినట్లు చేద్దామని అనిపించింది. 


ఊరునుండి వచ్చేడప్పుడే ఎందుకైనా మంచిదని ఆద్య శానిటరీ ప్యాడ్స్  తెచ్చుకుందట. అందుకే అప్పటికప్పుడు కొనాల్సిన అవసరం రాలేదు.  


బ్రేక్ ఫాస్ట్ చేసిరేపల్లె బయలు దేరి వెళ్ళాం. మేము వెళ్లే సరికే అప్పటికే వచ్చిన చుట్టాలతో ఇల్లంతా సందడిగా ఉంది. అక్కడికి వెళ్ళగానే మా లగేజ్ అంతా ఒక బెడ్ రూమ్ లో  పెట్టాం. ఆద్య  ఆ రూమ్ కి అటాచ్డ్ గా ఉన్న బాత్ రూమ్ లోకి వెళ్ళింది. లోపలి వెళ్ళేటప్పుడు తన చున్నీ చాటున కవరేదో ఉంది. అదేమిటో నాకు అర్థం అయ్యింది. 


పిల్ల మనసులో ఎంత పీకులాటగా ఉండి ఉంటుందో కదాతెలియకుండానే మనసులో ఏదో చిన్న డిస్టర్బెన్స్.  దాన్ని పక్కకి నెట్టి హాల్ లోకి వచ్చాను.  అమ్మ అప్పటికే కిచెన్ లోకి వెళ్ళిపోయినట్లు ఉంది. అక్కడ పని అందుకుని అందులో మునిగిపోయి ఉంది.  హాల్ లో అందరూ మాటల్లో మునిగిపోయి ఉన్నారు. నా ఆఫీస్  గురించి, ఆద్య  స్టడీస్ గురించి కాసేపు మాట్లాడుకున్నాం.


ఏవి ఎక్కడ కొన్నారో, ఏ వర్క్ కి ఎంత అయ్యిందో చెబుతూ ఇల్లంతా తిప్పి చూపించాడు సూర్య. ఇల్లు చాలా బాగుంది. హాల్ లో కొత్త సోఫాలు ఉన్నాయి. సోఫా కవర్లు మల్లెపువ్వుల్లా తెల్లగా చాలా బాగున్నాయి. వాటిల్లో కూర్చుంటేనే మాసిపోతాయేమో అన్నట్లు ఉన్నాయి అవి. అదే చెప్పాను సూర్యాతో మరీ ఇంత తెల్లగా ఉంటే ఊరికే మాసిపోతాయని.  


ఇంకా వేరే కలర్ కవర్లు  కూడా ఉన్నాయ్ బావా. ఫంక్షన్స్ లాంటివి ఉన్నప్పుడు ఇవి బాగుంటాయనిపించి ఇవి వేసాం. రోజూవారీగా వేరేవి వాడుతున్నాంఅన్నాడు వాడు. 

 

అదే మంచి పనిరాఅన్నాను. 


అదే టైంలో ఆద్య  బెడ్ రూమ్ నుండి బయటకి వచ్చి అటూ ఇటూ చూసింది. తన నాయనమ్మ కోసం వెదికినట్లు అనిపించింది నాకు. తన వైపు చూసిఏమిటన్నట్లు?’ కళ్ళు ఎగర వేసాను. 


నాయనమ్మ ఏదిఅన్నట్లుగా చూసింది.  నేను కిచెన్ వైపు చూపించాను. తను కాసేపు అటువైపు చూసింది. నాయనమ్మ తన వైపు చూస్తుందేమో అన్నట్లు. కానీ అమ్మ అక్కడ పని చేసుకుంటూ చిన్నమ్మ వాళ్ళతో ముచ్చట్లలో మునిగిపోయి ఉంది. పిల్ల ముఖం అదోలా అయిపోయింది. కిచెన్ వైపు అలానే చూస్తూ, మళ్ళీ వెనక్కిబెడ్ రూమ్ లోకి వెళ్ళింది.  మామయ్యసూర్య ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. 


రెండు నిమిషాల తరవాత హాల్ లోకి వచ్చి నా పక్కన కూర్చుంది. నా అర చేతుల్లో తన అర చేతులు పెట్టి నా భుజం మీద తల వాల్చి కూర్చుంది. ముఖం చూస్తే అర్ధం అయ్యింది…  పిల్ల కాస్త టెన్షన్ గా ఉందని! దానికి తోడు తన అరచేతులు  చల్లగా తగలడంతో తనింకా కంగారుగానే ఉందని అర్థం అయ్యింది. మామయ్య వాళ్ళ వైపు చూశాను. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. మా వైపు చూడటం లేదు.  


ఏమైంది నాన్నా? ఎందుకలా ఉన్నావ్తనకు మాత్రమే వినపడేలా అడిగాను. 


భయంగా ఉంది డాడీఅంది చిన్నగా. తన గొంతులోని ఏడుపు నాకు తెలుస్తుంది. 


భయమెందుకు నాన్నా?” తానెందుకు భయపడుతుందో అర్థం అయినా అడిగాను. 


నా డేట్ విషయం బయట పడుతుందేమో అనిఅంది ఆద్య . 


అలా ఏమీ జరగదమ్మా. భయపడకు.అన్నాను. 


అది కాదు డాడీమార్చుకున్న ప్యాడ్స్  ఎక్కడ పార వెయ్యాలో తెలియడం లేదు. నాయనమ్మని అడుగుదామంటే తనేమో అక్కడ ఉంది. మన బ్యాగ్స్ పెట్టిన చోటే పెట్టి వచ్చాను. ఎవరైనా చూస్తారేమోనని భయంగా ఉంది”  అంది. 


సరే నాన్నావాటి సంగతి నేను చూస్తాలే.  నువ్వు భయ పడకు. ఫ్రీ గా ఉండు. లేదంటే వాళ్లకి అనుమానం వస్తుంది.అని తనని సముదాయించాను. 


చాలా పొట్ట నొప్పిగా ఉంది డాడీతట్టుకోలేకపోతున్నానుఏడుపొచ్చేస్తుందిఫ్రీగా ఉండలేకపోతున్నాతన ఏడుపు నాకు తెలుస్తుంది.


కొంచెం ఓర్చుకోవాలి నాన్నాకొంచెం కఠినంగా అన్నాను. 


ఇంతలో మామయ్య ఆద్య ని పలకరించాడుకన్నాఎలా ఉన్నావమ్మా? బాగా చదువుతున్నావాఅంటూ.  


ఆద్య  సమాధానం చెప్తుంది. నెమ్మదిగా వాళ్ళు మాటల్లో మునిగిపోయారు.  నేను లేచి బెడ్ రూమ్ లో ఉన్న  బాత్ రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ కమోడ్ పక్క చిన్నగా రక్తపు మరక. పిల్ల చూసుకోనట్లుంది. నాకు గుండె గుభేల్ మంది.నేను కాకుండా ఇంకెవరైనా వచ్చి, ఈ మరక వాళ్ళ కంటబడివుంటే?”  అనుకుంటూ   అది పోయే వరకూ దానిమీద నీళ్లు కొట్టాను. తరువాత రూమ్ లోకి వచ్చి బ్యాగ్ ల పక్కన పెట్టి ఉన్న పాలిథిన్ కవర్ ని చూశాను. దాన్ని ఒక మూలకి పెట్టి బయటకి కనిపించకుండా  బ్యాగ్ లని అడ్డం పెట్టాను. మా బ్యాగ్  లని మేము తప్ప ఎవరూ కదిలించం కాబట్టి ప్రస్తుతానికి ఎవరికంటా పడవు. తరువాత బయటికి వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్లి ఎక్కడైనా పడేసి రావచ్చులే అనుకుంటూ హాల్ లోకి వచ్చేశాను. 


మళ్ళీ వచ్చి ఆద్య  పక్కన కూర్చుని ఏమీ పర్లేదన్నట్లు  తన వైపు చూసాను. తన ముఖం లో కాస్త రిలాక్సేషన్. తరువాత ఎవరి పనుల్లో వాళ్ళుండగా మేమిద్దరం డాబా పైకి వెళ్లాం. అక్కడి నుండి వ్యూ చాలా బాగుంది. ఇంటి పక్కన అంతా పొలాలుపచ్చటి తివాచీ వేసినట్లుగా! ఈ మధ్యనే నాట్లు వేసినట్లుగా అనిపిస్తుంది. 


చూసావా నాన్నా! ఎంత పచ్చదనమోనీకిష్టం కదా!అడిగాను నేను.


అవును డాడీ! చాలా బాగుంది చూడటానికికానీ  మధ్యలో  అక్కడక్కడా ఎత్తుగా ఉన్నాయి ఏమిటవి?అవి మాత్రం అసలు బాలేదు.అంది ఆద్య .


అవి కలుపు మొక్కలు నాన్నాపైరు మధ్యలో పెరుగుతూ ఉంటాయ్.


వాటినలాగే వదిలేస్తే  ఏమవుతుంది?”


వదలరు నాన్నా పీకేస్తారు. లేకపోతే పంట నాశనమవుతుంది” 


పంట బాగా పండటం కోసం పైరులో కలుపుని మనుషులు పీకేస్తారు. మరి మనలో ఉండే కలుపు పీకలేమా డాడీ?”


తను ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లిందో నాకు అర్థం అయ్యింది. మనుషుల తీరు మీద అవగాహన రావడానికి, ప్రశ్నించడానికి ఈ కాలం పిల్లలకి పెద్దగా సమయం అవసరమవదనుకుంటా. ఇంకా ఎదిగీ ఎదగని జ్ఞానంతో, నాన్న చాటు పిల్లగా ఉందనుకున్న నా బంగారు తల్లికి తనవైన ఆలోచనలు మొగ్గతొడగడం నాకు సంతోషంగానే అనిపించినా, ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం ఏ మాత్రం సంతోషం అనిపించలేదు. ఈ మధ్య తనడుగుతున్న ఎన్నో ప్రశ్నలకి నా మౌనమే సమాధానమవుతుందిలేదంటే మాట తప్పించి మరో టాపిక్ కి వెళ్లేలా చూస్తున్నాను. సమాధానం చెప్పలేక కాదుతానెదురు చూసే సమాధానం కోసం నేను అబద్ధమవ్వాలి కనుక! 


ఈ మధ్య తను చాలా క్యాజువల్ గా అడుగుతున్న ప్రశ్నల్లో, ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న తన బలమైన వ్యక్తిత్వపు పునాదులే కనిపిస్తున్నాయి. తండ్రిగా నేను కోరుకునేది అదే… 


ఏం చెప్పవేంటి డాడీ? నేనేం తప్పు చేశానని భయపడాలి. మనవాళ్ళ దగ్గరే ఈ దాగుడు మూతలెందుకు? పీరియడ్స్ రావడంలో తప్పేముంది? అవి తప్పనుకోవడం మనుషుల్లో కలుపే కదా! అదెలా తీసెయ్యాలి?” ఆలోచనల్లో  పడిన నన్ను భుజాలు కుదుపుతూ అడిగింది ఆద్య . 


నువ్వడిగేదంతా నిజమే నాన్నా! కానీ మన సొసైటీ లో కొన్ని నమ్మకాలు పాతుకుపోయి ఉన్నాయి. వాటిని కాదనుకుని బతకాలంటే మాత్రం చాలా పోరాటం చెయ్యాలి.  ఆ పోరాటం మన వాళ్ళని దూరం చేస్తుందేమో అన్న భయం ఒకటుంటుందేదాని గురించే ఈ దాగుడు మూతలు. వాళ్ళ నమ్మకాలని కాదని వాళ్ళనెందుకు బాధపెట్టడంతనని అనునయిస్తూ చెప్పాను. 


ఏమో డాడీ…  ఒక పక్కన కడుపు నొప్పిమరోవైపు మూడ్ స్వింగ్స్వీటి మధ్యలో లేని నవ్వుని తెచ్చుకోవాలంటే నాకైతే చాలా కష్టంగా ఉంది. ఎంత సేపు మేనేజ్ చెయ్యగలం. తెలిస్తే ఇంకా ఫీల్ అవుతారుగా వాళ్ళు


తెలియకుండానే చూసుకుందాంఅయినా ఇప్పుడింకా నయం నాన్నా. నా చిన్నప్పుడైతే ఎవరికైనా డేట్ వస్తేబయటుందిఅని చెప్పి మూడు రోజుల పాటు ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. వాళ్ళలా ఎండా వానలతో సంబంధం లేకుండా బయటే ఉండాల్సి వచ్చేది. అప్పటి తో పోల్చుకుంటే ఇప్పుడు నథింగ్


అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు నథింగ్! అంటే ఇది మా అదృష్టమన్నమాటహ్మ్మ్! గుడ్ పోగ్రెస్తన ముఖంలో అదోలాంటి నవ్వు. 


వేదనని మింగుతున్న నవ్వు!  అలాంటి నవ్వు ఎప్పుడు చూసినా నాకు భయమేస్తుంది. 


సరే నాన్నాపద కిందకి వెళదాం. చాలా సేపయ్యింది మనం పైకి వచ్చిఅంటూ కిందకి దారి తీశాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు తనలో పుడుతున్న ప్రశ్నల ఉధృతిని తప్పించుకోవడానికే అలా చేశాను. 


రోజంతా  ముళ్ల  మీద కూర్చున్నట్లు కూర్చున్న ఆద్య  రాత్రిలోగా మరో రెండు మూడు సార్లు ప్యాడ్స్ మార్చుకుంది. మార్చిన ప్యాడ్స్ పెట్టిన కవర్ ని పారెయ్యడానికి వీలు కుదరలేదు. నేను చూసుకుంటాలే అన్న అమ్మ తన పనుల్లో తను పడిపోయింది ఈ సంగతి మర్చిపోయింది. నేను మధ్య మధ్యలో రూమ్ లోకి వెళ్లి ఆ కవర్ ఎవరికంటా  పడకుండా ఉండేలా ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉన్నాను. అమ్మ ఒక్కటే ఉన్నప్పుడు ఆద్య  అడిగింది వాటిని ఎలా బయట పడెయ్యాలని. 


చూస్తున్నావ్ కదమ్మా! ఇంటి నిండా మనుషులేఎవరికంటా పడకుండా బయటకి తీసుకుని వెళ్లాలంటే కష్టం అనిపిస్తుంది. ఈ రాత్రికి ఇలా కానివ్వు. రేపు పొద్దున్నే నేను ఎవరూ లేవకముందే లేచి ఆ కవర్ ని బయట పారేస్తాఅంది అమ్మ. 


ఎప్పుడూ గాఢ నిద్రపోయే ఆద్య రాత్రి సరిగ్గా నిద్ర పోలేదు. దుప్పటికి మరక అంటకూడదన్నట్లు తను పడుకున్న బెడ్ మీద రెండుమూడు టవల్స్ వేసుకుని వాటి మీద పడుకుంది. మొత్తానికి ఆ రాత్రి ఏదోలా గడిపేశాం.  తెల్లవారు ఝామునే వైజాగ్ నుండి కజిన్స్ రావడంతోఅమ్మకి కవర్ ని బయట పారవేయడం వీలు పడలేదు. కాస్త పొద్దెక్కాక మా చిన్నమ్మ రూమ్ ఊడ్చి వచ్చి  “మీరు పడుకున్న రూమ్ ఊడుస్తుంటే అదోలా వాసన వస్తుందబ్బాయ్అంది.   


ఆద్య  బిక్కు బిక్కు మంటూ నా వైపు చూసింది. 

 

మేము స్నానం చేసి తుడుచుకున్న తడి టవల్స్ ఉన్నాయ్ కదా చిన్నమ్మావాటి వాసనయి ఉంటుంది లేఅన్నాను మనసులో కాస్త కలవర పడుతూ. ఒక అయిదు నిమిషాల తరువాత నేను రూమ్ లోకి వెళ్లి చూశాను. బ్యాగ్ ల చాటున దాచిన కవర్ కాస్త బయటకి కనిపిస్తూ ఉంది. ఇందాక చిన్నమ్మ ఊడ్చినప్పుడు బ్యాగ్ లని అటూ ఇటూ జరిపి ఉంటుంది. అందుకే అది అలా కనిపిస్తుంది అని అనుకున్నా.  కాకపోతే కవర్ ఏమిటని చిన్నమ్మ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. 


మధ్యాహ్నానికి ఆ కవర్ కి ఇంకో కవర్ తోడయ్యింది. ఆద్య  మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉందో నా మాటలకి కూడా అందటం లేదు. తన వైపు సూటిగా చూడలేకపోతున్నాను. ఏదో ఒకటి చేసి అప్పటి వరకూ పోగుపడిన వాటిని బయట పడేసి వస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుందని అనిపించింది. 


అప్పటికప్పుడు ఎవరో ఫ్రెండ్ ని కలసి రావడానికి పక్క ఊరు వెళ్ళొస్తానని చెప్పి, చిన్న బ్యాగ్ లో వాడి పారేసిన ప్యాడ్స్ ఉన్న కవర్లు పెట్టి దాన్ని భుజాన తగిలించుకుని బయలు దేరాను.నేనూ వస్తాను డాడీఅంటూ కారెక్కి కూర్చుంది ఆద్య. నాకూ అదే  నయమనిపించింది.  పిల్లకి కాసేపైనా రిలాక్స్ గా అనిపిస్తుంది అనుకుంటూ కారుని కదిలించాను. ఊరు దాటి బయటకి వెళ్ళాక, ఎవరూ లేని చోట  కారుని ఆపి  బ్యాగ్లో నుండి ప్యాడ్స్ ఉన్న కవర్లు బయటకి తీసి పడేశాను. పెద్ద బరువేదో దించుకున్నట్లుగా అనిపించింది నాకు.  కృష్ణ ఒడ్డుకు వెళ్లి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుని మళ్ళీ వెనక్కి బయలుదేరామిద్దరం.  


డాడీబ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. నేను తెచ్చుకున్న ప్యాడ్స్ సరిపోయేలా లేవు. వెళ్ళేటప్పుడు కొనుక్కుని వెళదాంఅని అంది ఆద్య . 


దారిలో ఒక షాప్ దగ్గర కార్ పక్కన ఆపాను, ఆద్య  కార్ దిగి షాప్ లోకి వెళ్ళింది. షాప్ లో ఒక నడివయసతను ఉన్నాడు. ఆద్య  అడిగింది విని ఆయన లోపలకి చూస్తూ ఎవరినో పిలిచినట్లు అనిపించింది. లోపలి నుండి ఒకామె షాప్ లోకి వచ్చి శానిటరీ ప్యాడ్స్ ఉన్న పాకెట్ ని ఒక షెల్ఫ్ లో నుండి బయటకి తీసి దాని మీద ఒక న్యూస్ పేపర్ ని  చుట్టి ఇచ్చింది. ఆద్య  డబ్బులు ఇచ్చి షాప్ లో నుండి వచ్చి కారులో కూర్చుంటూ రోడ్డుమీదకి చూసినప్పుడు కనిపించిన దృశ్యం... ఎవడో ఒకడు కండోమ్ పాకెట్ ని గాలిలో ఎగురవేస్తూ ఆదుకోవడం!


* * *


రెండు రోజుల నుండి తనలో ఉన్న ఫ్రష్టేషన్ ఇప్పుడీ దృశ్యాన్ని చూశాక ఒక నిర్వేదంగా మారినట్లనిపించింది. 


ఉహూఁఎదిగే పిల్లలో నిర్వేదం అసలు మంచిది కాదు. తనలో నేను చూడాలనుకునేది ఒక ఫైర్అది తనలో పుష్కలంగా ఉందని నాకు తెలుసు! దాన్ని రాజేసేలా ఏదో ఒకటి చెయ్యాలి…  చేస్తానుఅనుకుంటూ ఇంటి దగ్గర కార్ ఆపాను. 


ఆద్య  కార్ దిగింది. నేను కూడా లాక్ చేసి దిగబోతూ ఆద్య  కూర్చున్న చోట చూసాను. అక్కడ  తెల్లటి సీట్ కవర్ మీద ఎర్రగా నెత్తుటి మరకనా ముఖాన్ని ఎరుపెక్కిస్తూ! 


కన్నా! బ్లీడింగ్ ఎక్కువవుతున్నట్లు ఉంది. ప్యాడ్స్ మార్చుకో.ఇంటి లోపలికి  వెళుతున్న  ఆద్య తో నెమ్మదిగా చెప్పాను. ఆద్య  తల ఊపి రెండడుగులు వేసిందో లేదోఒక్క నిమిషం నాన్నా!అంటూ తనని వెనక్కి పిలిచాను. 


చెప్పు డాడీ!అంటూ వెనక్కి వచ్చింది. 


ఏంలేదు నాన్నా!  ప్యాడ్స్ మార్చుకున్నాకక్యాజువల్ గా కూర్చున్నట్లు కిందే కూర్చోసోఫా మీద కూర్చోకుచెప్పాను. 


ఆద్య  తలెత్తి నా కళ్ళల్లోకి సూటిగా చూసింది… 


తన కంటిభాష నాకెప్పుడూ అర్ధం అవుతుంది. 


నా మనసు మీద ఉన్న పెద్ద మరకని చూసి నవ్వుతుందా చూపు.  


* * *