మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Showing posts with label లేఖలు. Show all posts
Showing posts with label లేఖలు. Show all posts

Monday, 26 December 2016

ఎవరు నువ్వు?

ఏయ్…

ఎవరు నువ్వు?

నేనుగా  సాగిపోతున్న నా అహాన్ని  వెక్కిరిస్తూ ‘మనం’గా మారిపోదాం రమ్మంటూ అస్తిత్వపు లెక్కల్ని తిరగ రాసే సంకల్పానికి శ్రీకారం చుడుతూ… నిద్ర పోతున్న నిన్నటి స్వప్నాల్ని రాజహంసల రథంపై సున్నితంగా మోసుకొస్తూ… కలుపు మొక్కలా నాలో పెరిగిపోయిన చీకటి తత్వానికి కొత్త భాష్యం చెబుతూ… చిత్రమైన నా ఒంటరితనాన్ని బహు చిత్రంగా అంతిమప్రయాణం వైపు నడిపిస్తూ…

అసలెవరు నువ్వు?

ప్రణయమొకటి ఘటం పట్టుకుని రాసిన ఊపిరి ప్రణవానివా
కలం చివర గడ్డ గట్టిన ఆలోచనకి  మళ్ళీ  జీవం పోసిన అరుదైన అక్షరానివా
తనువులో ఇంకిపోయిన నీలాల దిగులు సెగల్ని తరుముతున్న చంద్ర రేఖవా
వాయుగుండమై  చలిస్తున్న శీతల సమీరాన్ని పట్టి తెచ్చి రగిలిపోతున్న గుండెపై పరచిన హేమంతానివా!

ఎవరు… ఎవరు… అసలెవరవు నువ్వు?  నీ అడుగుల ధ్వనిని నా పాద సవ్వడితో జత పరచటానికి నువ్వు పడే తహ తహ మధురాక్షర ముద్రితమై మూసుకున్న నా గుండె వాకిలి గుమ్మానికి  స్వాగతాతోరణం కట్టేలా చేసింది.

ఎవ్వరివైతేనేం…. నేనొక ఖాండవ వనమైన చోట నువ్వొక విరహ దహనమై నన్ను కాల్చేస్తున్న సడిలోనూ నా తమస్సు ఉనికిని ఆవిరి చేస్తున్న కాంతి ఉషస్సువైన స్పర్శే తెలుస్తుంది.  యుగాల తపస్సులు ప్రోది చేసుకున్న  యశస్సులన్నీ ఒక్కటిగా నన్ను పునఃనిర్వచనం చేస్తున్న సంగతివి నువ్వన్న నిజం గుండెని తడుతుంది.

బతుకంతా  ఆనందాన్ని స్వప్నించటంలోనే సరిపోతుంటే నన్ను నేనొక రంగస్థలం చేసుకుని ఆడుతున్న నటనల విముక్తివై,   ప్రణవాన్ని  ప్రణయంతో… మోదాన్ని మోహంతో… దాటవెయ్యడానికి నువ్వు పడే తపన ఉంది చూశావూ…అందులో... శతాబ్దాల  దాహాన్నీ ఒక్కసారిగా తీర్చేయ్యాలన్న ఆరాటమే కనిపిస్తుంది.

ఇప్పుడు… నా హృదయ ఆవరణ నిండా పరచుకున్న పసిడి మీగడ తరక ఒక్కటి నీ నవ్వుల తారకలని ఒడిసి పట్టడానికే తానక్కడ తిష్ట వేశానని స్వగతంలో చెప్పుకుంటుంటే తెలిసి వచ్చింది… కొన్ని నవ్వులు  నక్షత్రాలవుతాయని… మనసాకాశాన పర్ణశాలలై సేద తీరుస్తాయని.

మళ్ళీ మళ్ళీ తడుముతున్న స్మృతుల స్పర్శతో కను రెప్పల మధ్య కురిసీ కురిసీ గుండెలో గడ్డ కట్టిన కన్నీళ్ళని హత్తుకోవడానికి సెలయేరై చేతులు చాచిన మనసు కొనల చిరుతాకిడి నన్నొక ఆనంద ప్రవాహంగా కరిగించడం నీ ప్రేమ జాలమే కానీ ఇంకే ఇంద్రజాలమూ  కాదని తెలుస్తున్న ఈ సమయాలు ఉన్నాయి చూశావూ కాలానికి కొన్ని మెరుపులద్దుతూ సమ్మోహనమై మనఃమందసంలో నిక్షిప్తమై అహరహమూ వెలుగులీనుతూనే ఉంటాయిక.

నా గాయాల రహదారులద్దుకున్న అనంతపు గమ్యాలన్నీ నిన్ను తాకగానే అదృశ్యమైపోవటాన్ని నా అంతట నేనే  సర్వేంద్రియాలతోనూ వింటున్నా. క్రొంగ్రొత్త సందిగ్ధాల పలకరింపులో  ఒక అపరిమితమైన పులకింతల థిల్లానా కొనసాగుతుంటే నాకు  తెలిసిందొక్కటే… సందిగ్ధాలన్నీ సమస్యల సడేమీ కాదని.

కళ్ళలో దీపాలని వెలిగించటం మాత్రమే నీకు తెలుసన్న సంగతి నాకనుభవమైన ఈ నేడు… ఈ జీవితపు కొనసాగింపు వరకూ నా మనసుని చుట్టు ముట్టే ఉంటుంది. అంతర్లోకంలో వెల్లువలా వచ్చిన ఆహ్లాదకరమైన పరిమళం నీ చోటుని వదలటానికి ఇష్టపడటం లేదు. బహుశా నువ్వొక పరవశపు అయస్కాంతానివేమో

ఇన్నాళ్లుగా నిశ్శబ్దానికి ఎంత నిర్దయో నన్ను వదిలి వెళ్ళదు అనుకున్నా. ఇప్పుడది తనకు తానుగా ఆత్మహత్యించుకుంటూ శూన్యం నుండి జారి పడుతున్న ఓంకారాన్ని నా నినాదంగా మార్చినప్పుడు తెలిసింది… నిశ్శబ్దమంటే మరేమీ లేదు ఒక్క ఆది ప్రణవాన్ని ఆవరించుకుని కొన సాగుతున్న అనంత మౌననాదమని.

నాలోని నల్లని నీడలన్నిటినీ ఒలిచేసిన ప్రభాత చాయకి దారిని సుగమం చేసిన సమ్మోహనపు వంతెనవు  నీవన్న నిజం నీకు నువ్వుగా నాకు చెప్పక పోవచ్చుకానీ, వంతెన దాటేసినా పరిమళాన్ని కోల్పోని కిరణాల శ్వాస నిన్ను పట్టించేస్తుంది.

"ఎండమావుల వాకిట్లో, వెచ్చగా మునిగిన
తడి కలల నావలన్నిటినీ
వాస్తవ తీరం చేర్చడానికి
గాలికి ఎదురొడ్డి నిలబడే
చిరగని తెరచాప కుట్టగలిగే ధీశాలి
అడుగుల చప్పుడొక్కటి చాలు
లోకం కొత్త బాట పడుతుంది

నిజం…
కొన్ని అడుగులంతే !
ఎక్కడ నుండి మొదలైతేనేం
గడ్డకట్టిపోయిన కొన్ని నడకలకి ఊతమౌతూ
అచలనపు చరణాలకి  కొన్ని గమ్యాలని అంటుగడుతూ
మెత్తగా... సుతి మెత్తగా... తమ ముద్రల్లో
కొన్ని విజయాల్ని దాచి పెడుతూ
ఒక్క ధైర్యాన్ని దారంతా పరిచేస్తాయి

ఇప్పుడు ఆ ధీశాలి ఎవరంటే
చెప్పలేకపోవటానికి ఏముంది
నా నడకలకి కొత్త అడుగుల జతవై
ఒక జీవితపు దూరమంత తోడుగా
మారిన ‘నిన్ను’ చూస్తూ కూడా "

నిజంరా ! నీకు నువ్వుగా నా జీవితం వైపు వేసిన ఈ కొన్ని అడుగులే నన్నొక కొత్త వచనంగా రాయబోతున్న సవ్వడి అనుభవమవుతూ ఉంది.  నువ్వు నాలో ఎన్ని పేజీలు  చదివావో నాకు తెలియదు కానీ,  నా మౌనాన్ని చిదిమిన లేహ్యంతో  నీ మనసునొక లేపనం చేసి నాపై రాసిన నీ శబ్దం చెబుతుంది ఇక జీవితాంతం నేను చదవబోయే మధుర కావ్యం నువ్వని.

ముద్దుని చిదిమి మురిపాన్ని సుగంధంగా వీస్తున్న అన్వేషణలో ఒకరికొకరిగా తారసబడ్డ తాళ పత్రాలమైన అలజడిలో అధరాలే ఘటాలై తనువంతా  మధురాలే రాయబడుతున్న క్షణాల అల్లరిలో తెలిసింది నువ్వు ఇన్నాళ్లుగా నే భ్రమ పడుతున్నట్లుగా  కథవు కావని… మనంగా మారిన నా నీ కొనసాగింపని !

ఇంతకూ నీ అడుగులు ‘సప్తపది' కై  నా అడుగులనే జతగా ఎందుకు  కోరుకున్నాయో చెప్పవూ… ఒక్క సారి వినాలని ఉంది..

నీ…

నేను


Monday, 3 October 2016

నీలాంటి వాడినే



ఏయ్…

నిన్నేమనాలో… నీలాంటి నన్నేమనాలో తెలియని అయోమయమిది. నాగరికం నేర్చుకున్న మేథావులం కదా మరి. మనకంటికాననివన్నీ చులకనే. మనిషికి మనిషే వెటకారమైన వ్యవస్థలో ఇంకా మనిషిగానే పిలవబడుతున్నామంటే మనలని నిలదీసే జీవమింకా లేదు కాబట్టే.

ఎవరెలా ఉండాలో మనమే చెప్పేస్తాం. ఇలా నడిస్తే తప్పు ఇలా మాట్లాడితే తప్పు ఇలా రాస్తే తప్పు. ఇలా కాదు నువ్వు అలా రాయాలి. ఇలా నటించాలి. ఇలా డాన్స్ చెయ్యాలి… ఇలా ఇలా ఇలా… ఈ ఇలాలన్నీ ఇళాతలంలో మనకి నచ్చిన ఇలాలే.

ఎదుటి మనిషి బతుకంతా మనకు నచ్చిన నియమాలలో బందీ అయితేనే మనకి ఆనందం.
మనకి నచ్చని భాషా... యాసా … అన్నీ అవకరాలే అనిపించటం… మనిషిలో శారీరక లోపాలూ న మన నవ్వుకోళ్ళకి సాధనాలవ్వటం విచారకరం. మనిషి మనిషిలో పెరిగిపోతున్న వెకిలితనానికి పరాకాష్ట.

మనకు నచ్చని ప్రతిదీ మనకి నవ్వుకునే విషయమవ్వటమే విషాదం. మనకి నచ్చని ప్రతి వారిని ప్రతివాదిగా చూడటమే నేటి మనిషి నైజం. మనకి నచ్చని ప్రతి మనిషిని విదూషకుడిగా చూడటం.... ఏ సిద్ధాంతమైనా మనిషిని ఆవరించిన వాతావరణాన్ని బట్టే ప్రోది చేసుకుంటుందని తెలిసీ మనది కాని ప్రతి సిద్ధాంతాన్ని గేలిచెయ్యటం నవీన మేధావిత్వం. ప్రతి మాటలో సెన్సార్ షిప్ కి దొరికేవి ఏముందని రంధ్రాన్వేషణ చేసుకుంటూ అలవి మాలిన ఘర్షణ లోకి ఒదిగిపోవడమే నేటి జీవన విధానం.

నాగరికం పెరిగే కొలదీ మనిషి మనసు నేర్చుకున్నది అనాగరికం సాటి మనిషిని ఎలా చూడాలో తెలియని వెకిలి తనం. మన స్థాయిలో ఇమడని వాళ్ళంతా ఎర్రబస్సు దిగి వచ్చిన వాళ్ళో లేదా అడవి మనుషులో. కుక్కలకి పట్టు పరుపులేసే మనకి మనుషులే అంటరాని వాళ్ళు.

రోడ్డు మీద వెళుతున్నప్పుడు మన ముందు వెహికల్ ఆగిపోతే తన ఇబ్బంది గురించి ఆలోచించక చెవులు మోతెక్కేలా హారన్స్ మోతెక్కించే మనం మన వెహికల్ ఆగిపోయినప్పుడు మాత్రం మనుషుల్లో విలువలు మృగ్యమై పోయాయని వాపోతుంటాం.

మన పక్క కాంపౌండ్ ఖాళీగా ఉంటే మనింట్లో చెత్తని అక్కడ డంప్ చేసే మనం ఊళ్ళో చెత్తగురించి మునిసిపాలిటీని తిట్టుకుంటాం. మనం చేసే ప్రతిపనిలో మనకి మనం ఉన్నతులమే అయ్యాక ఎదురయ్యే ప్రతివాడూ ఒక లోపధారే...

అసలు మనం పుట్టటమే

ఫలానా కులంగానో
ఫలానా మతంగానో
ఫలానా జాతిగానో
ఫలానా ప్రాంతం గానో

ఇంకా ఎన్నో ఫలానా.. ఫలానా లని తగిలించుకుని పుడుతున్నాం… దాన్నే మన మనస్సులో ఇంకించుకుంటున్నామే కానీ… అసలు మనిషిగా పుట్టటం లేదన్న సంగతినే విస్మరించేసాం. దాని ఛాయలని గుర్తు పెట్టుకున్నా ఆర్కియాలజీ వాళ్ళు ఎక్కడ భద్రపరిచేస్తారేమో అన్న భయంలోకే వెళ్లి పోయినట్లున్నాం.

ప్రతి బంధానికి సంవత్సరంలో ఒక రోజుని కేటాయించుకున్న మనం మనిషి తనం కోసం మనిషి మనిషిగా బతకటం కోసం ఒక్కరోజునీ కేటాయించుకోలేకపోవడం లో ఉన్న అర్ధం ప్రపంచంలో మనిషి మైనారిటీ లో పడిపోయాడనేనేమో.

ఇట్లు...

ఓ నీలాంటి వాడు

Sunday, 2 October 2016

జై జవాన్ జై కిసాన్

లాల్ బహదూర్ శాస్త్రీజీ...

ఇప్పుడంటే సర్జికల్ స్ట్రైక్స్ అంటూ మోడీ నామస్మరణలో ఊగిపోతున్నాం కానీ 50 ఏళ్ల క్రితం ఇదే పాపిస్తాన్ కి ముచ్చెమటలు పట్టించిన మేరునగధీరుడివైన నీ గురించి ఈ తరానికి ఏమీతెలియదు.
కనీసం ఈ రోజు నీ పుట్టిన రోజు అని కూడా (1904 అక్టోబర్ 2). అసలు మీ పేరే తెలియని వారికి మీ పుట్టిన రోజు తెలిసి ఉంటుందనుకోవటం భ్రమే కదూ. దేశ నాయకులు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలకు మాత్రమే పరిమితమై కళ్ళకు అక్షరాలుగా పరిచయమవుతున్నారు గానీ మనసుకు మహనీయులుగా చేరటం లేదు. వీరత్వానికీ ధీరత్వానికి ఆరడుగుల ఎత్తో ౫౬ అంగుళాల ఛాతీ కొలతలో కొలమానం కాదని ఒక్కసారి మిమ్మల్ని చూస్తే తెలియదూ... మీ గురించి చదువుతుంటే... చదువుకోసం గంగానదిని ఈతకొట్టి దాటిన బాల్యమే మీ ఆత్మాభిమానాన్ని... ఆత్మ స్థైర్యాన్ని ఏకకాలంలో మాకుపరిచయం చేసింది. మహానుభావా....

క్షమించండి మా నిర్లక్ష్యాలని... మర్రి చెట్టు నీడలో మరే చెట్టు ఎదగదు అన్నట్లు మహాత్ముని స్మరణలో మిమ్మల్ని మరచిపోతున్న నీ జాతి అజ్ఞానాన్ని. ఎందరెందరో మహానుభావులు స్వాతంత్ర్యాన్ని కొందరికే అంటగట్టేసి మహాత్ములని జాతిపితలని చేసిన జాతి మాది. గాంధీజీ... చాచాజీ... వ్యక్తిగత జీవితాల మీద మచ్చలు... ఆరోపణలు వచ్చాయేమో కానీ ఏ మచ్చా వినపడని సిసలైన రాజ నీతిజ్ఞులు మీరు. శాస్త్రి అనేది మీ కులం వల్ల సంక్రమించినదని భావించి మిమ్మల్ని ఒక కుల ప్రతినిధిగా పొరపడ్డ మిత్రులెందరినో నేను చూసాను. అది కుల నామం కాదని మీ విద్వత్తుతో మీరు సంపాదించుకున్న బిరుదు అని ఈనాటికీ ఏంతో మందికి తెలియదు. జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కూడా బట్టీ పట్టే మా నవ జాతికి మాత్రం మీరు భారతదేశ రెండవ ప్రధానమంత్రి. అది కూడా ఎంతమందికి గుర్తు ఉందో మరి. ఇక మా మీడియా మిత్రుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది... మహాత్ముడు ప్రవచించిన అర్ధరాత్రి స్వాతంత్ర్యం నుండి అహింసా సిద్ధాంతం వరకూ ప్రతి ఏడాది చద్ది కంపు కొట్టే అవే కబుర్లు ప్రత్యేక కార్యక్రమాల్లో హోరెత్తిస్తారు గానీ వ్యవసాయాధారిత దేశమైన మనదేశానికి వెన్నముక అయిన రైతుని... అహో రాత్రాలూ అన్ని వాతావరణాలని తట్టుకుంటూ సరిహద్దుల్ని కళ్ళల్లో పెట్టుకుని కాపలా కాస్తున్న వీర సైనికులని ‘జై జవాన్ జై కిసాన్’ అంటూ ఒకే నినాదంలో నింపేసి అమరత్వం ఇచ్చిన అమృత మూర్తివని ఎందరికి తెలుసయ్యా...? అది ఈ తరానికి సరిగ్గా చేర వేసేవారెవరయ్యా? లక్షల కోట్ల స్కాములు బయట పడ్డా చీమకుట్టినట్లు అయినా లేకుండా కెమెరాల ముందు నవ్వులు విరబూస్తూ సచ్చీలురులా ప్రవర్తించే నేటి నాయకులే మాకు తెలుసు. కానీ ప్రధానమంత్రిగా చేసినా స్వంతఇల్లు కూడా లేని నాయకుడివని ఎందరికి తెలుసు. ఇప్పుడు చెప్పినా ఫిక్షన్ అనుకుంటారేమో. ఒకే ఒక్క రైలు ప్రమాదం జరగగానే నైతిక భాధ్యత వహించి కేంద్ర రైల్వే మంత్రి పదవినే తృణప్రాయంలా వదిలేసిన నిజమైన నాయకుడి నీవు... ఆహార సంక్షోభం చుట్టుముట్టిన తరుణంలో దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కుని మరో సారి అలాంటి సంక్షోభాలు దరి చేరనివ్వకుండా వ్యవసాయ విప్లవానికి (గ్రీన్ రివల్యూషన్), పాల విప్లవానికి (వైట్ రివల్యూషన్) దారులు పరచిన దార్శనికుడవు నీవు... కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి రాజధానికి అవసరమంటూ లక్షల ఎకరాల వ్యవసాయ భూములని కాంక్రీట్ జంగిల్స్ లా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయ్... ఒకరిని చూసి ఇంకొకరు అవసరాల పేరు మార్చుతారేమో కానీ సారవంతమైన భూముల్లోనే కాంక్రీట్ అడవులు మొదలు పెట్టరని నమ్మకం ఏమిటి. మరో సారి మన దేశం లో ఆహార సంక్షోభం రాదని చెప్పగలిగే పరిస్థితిలో ఇప్పుడు మేము లేము. జమ్మూ కాశ్మీరులోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నపాకిస్తాన్ సేనలని తరిమికొట్టడమే కాకుండా లాహోర్ని ఆక్రమించుకునే పథక రచనచేసి యుద్ధంలో పూర్తి విజయం సాధించిన తరుణంలో ప్రపంచదేశాల విజ్ఞప్తులకి విలువిచ్చి శాంతి స్తాపనకై తాష్కెంట్ ఒప్పందం చేసుకున్న మరునాడే అనుమాదాస్పద మృతి చెందిన మీ మరణం వెనక నిజాలు బయటకి వచ్చి అంతర్జాతీయ కుట్రలు బయట పడేలా ఉంటే భారతీయుడిగా నేను గర్విస్తా. దేశం నాకేమిచ్చింది అని కాదు దేశానికి నువ్వేమిచ్చావ్ అన్న మాటని అక్షరాలా చేతల్లో చూపించిన మహా నేత మీరు . ఇప్పుడు కావాల్సింది నీ లాంటి నేతల సిద్ధాంతపు వారసత్వాలే కానీ బానిస బతుకుల్ని నెత్తిన రుద్దే రాజకీయ వారసత్వాలు కాదు. అందుకే మీలాంటి మహా మనీషులు మళ్ళీ పుట్టాలి ఈ జాతిని జాగృతం చెయ్యటానికి. ఇట్లు ఓ భారతీయుడు


Saturday, 7 May 2016

మౌనం! ఓ మధువచనం


ఓ మౌనమా…

ఒక మరపు... మరో ఆటకి దారితియ్యాలనుకున్న ఆసక్తి లేనప్పుడూ
నావైన కొన్ని భరోసాలు అతలాకుతలమవ్వటం  చూసినప్పుడూ 
ఆత్మీయంగా నన్ను హత్తుకు పోతున్న నువ్వు ఇక నా జట్టు. 

ప్రతి నిత్యం నా పర్యాయపదానివై నువ్వు  కొనసాగుతూ అనుక్షణం నాలో శబ్దించే అంతరంగపు సంఘర్షణలన్నిటినీ అవలోకిస్తూ నన్నో నిశ్చల నిశ్శబ్దసాగరంగా గుర్తించావు. ఎక్కడికక్కడ నా గుండెని రీసైక్లింగ్ చేసుకుందామనుకున్నా,  తడీ... పొడీ...తనాలేమి లేనిది ఏ కొనసాగింపుకీ అర్హత పొందదని ఎప్పటికప్పుడు కొత్తగా మరో మారు తెలుస్తూనే ఉంది. 

ఈ నిశ్శబ్దం ఉంది చూశావూ… ఇది పలు శబ్దాలు చేస్తుంది. తనకున్న పలు వ్యాపకాలలో ఇప్పుడు నన్నో వ్యాపకం చేసుకుంది.  ఎంత  ఆనందంగా  ఉందో తెలుసా? ఇంతకూ నీకూ నిశ్శబ్దానికీ తేడా ఏమిటి? నువ్వో యోగ సాధనమేమో కదూ. ఏమో ఏమిటీ! నాకలానే  అనిపిస్తుంది. నిన్ను చేధించటం బహుకష్టం… మనసుతో ముడి పడతావు కాబట్టి. బహుశా నిశ్శబ్దానికి అది కుదరదేమో. ఎవరైనా తనని చేధించవచ్చనుకుంటా… భౌతికత్వంతో ముడిపడి ఉంటుంది కాబట్టి. ఏదో తోచింది చెప్తున్నాను కానీ… నిజంగా  నిశ్శబ్దానికీ  నీకూ తేడా  తెలుసుకోవాలని ఉంది. 

మనసొక నిశ్శబ్దమైదానమైనప్పుడు నువ్వొక జ్ఞానలోచనమై మనుషుల్ని పరికించటం... వారి దేహ భాషని అనువదించటం… ఇదంతా చూస్తుంటే నిజంగా నువ్వొక లిఖిత భాషవైతే నిన్నుఅనువదించడానికి యుగాల కొలమానమూ సరిపోదేమో కదూ. 

కంటి చివర ఒంటరితనపు ధార కురుస్తున్నప్పుడా?
ఘడియ ఘడియకూ గుండె సడి విషాదాన్ని శబ్దిస్తున్నప్పుడా?  
గజిబిజి ఊహల అలికిడితో  మనసుకి ఏకాంతపు దప్పికైనప్పుడా? 
ఎప్పుడు? అసలు నువ్వెప్పుడు పరిచయమయ్యావ్ మనుష్యులకీ… వారి మనసులకీ? 

నిశ్శబ్దంలోనుండి మౌనంలోకి నడవటం… మౌనం నుండి మనసుని చదవటం… కొత్తగా నాలో ఏదో అలికిడి తెలియటం… ఇప్పుడిలా నిత్యం నీతో ఊసులాడుతుంటే గానీ అర్ధం కాలేదు ఇన్నాళ్ళూ నాకు నేను పరిచయమే అవ్వలేదని.  ఇక నన్ను వదిలి వెళ్ళవు కదూ.

‘మౌనం సాన పట్టిన మాట… నిశ్శబ్దం తరువాత ప్రణవం…’ ఎంత విలువని దాచుకుంటాయో తెలిసాక ఆ విలువని సొంతం చేసుకోవటం నా అనుక్షణపు గమ్యమవటంలో వింతేమీ లేదు కదా. 

అందుకే… 

ఏయ్…  మౌనమా ! నువ్వొక లిపివై  నన్నొక అక్షరంగా రాయవూ… నీ లిపిలో అక్షరం వెనుక అక్షరంగా ఒదిగిపోతూ లోకాన్ని వీక్షించటం… ఓహ్… తలచుకుంటే 

ఎప్పటికప్పుడు నిన్ను మరింత దగ్గర చేసుకుంటుంటే… నాకు దూరంగా జరిగిపోతున్న మనుషుల గుస గుసల సడి…  ఇంకా  ఎన్నాళ్ళంటావ్…? 

ప్రతి మనసు సడి నిన్ను అద్దుకునే క్షణం ఒకటి వస్తుందని ఇప్పుడు తెలియదు… తెలిసే సరికి కళ్ళల్లో జలపాతాలు మొదలవుతాయ్. ఎందుకంటే ఇష్టంగా నిన్ను వరిస్తే నువ్వో వరం… బలవంతంగా నిన్ను రుద్దితే నువ్వో పెనుభారం. ఎందుకీ ద్వైదీభావం. 

‘మాటల దగ్గరితనం మనుషుల వరకే, మౌనం మెచ్చిందా ఆత్మైక్యాలకి తొలి బీజం పడ్డట్లే కదా?’ అనుకునే మనసుల పరిచయం ఎప్పుడూ మధురమే. నువ్వు నువ్వుగా చదివిన మనసొకటి చాలు నన్ను నన్నుగా తనకి అర్పించడానికి.

మాటలు నిద్దరోయినప్పుడు  వచ్చే మౌనానివై  కాదు… పెదవిపై అలికిడి చేసే పైపై పలుకులని  నిద్రపుచ్చే మౌనానివై మనుషుల్ని అల్లుకుపో… మనసులపై నిండిపో…?

ఏమంటావ్…

ఒకటైతే నిజం...

నువ్వు... నా  గుండె గరికనద్దుకుని సడిచేస్తున్న నులి వెచ్చని హేమంతానివి...!

నీ

స్నేహిత్...


Sunday, 17 April 2016

అసమర్ధుని ప్రేమలేఖ - 5



ఆత్మైషీ,
ఎంతకాలమయ్యిందో కదూ ఇలా లేఖ రాసి. అయినా రాసి ఏమి ప్రయోజనం లే. నా లేఖలూ నా రాతలూ నువ్వు అసలు చూడవు కదా అభిరుచులని కాదని అక్షరాల వెంట పరిగెట్టటం చాలా కష్టం కదూ.
అక్షరాలుగా రాయకపోతేనేం క్షణం క్షణం లోలకమై కొట్టుకుంటున్న గుండె చప్పుడుని వింటుంటే తెలియటం లేదూ క్షణానికో మారు నిన్ను నాలో ప్రతిధ్వనించుకుంటున్నానని. తెలిసినా ఏం చేస్తావులే, ఒక్క నవ్వు నవ్వుకుని మళ్ళీ నీ పనుల్లో నువ్వు ఉంటావ్ అంతే కదా. అదే నిజం కదా...

అందరికీ నేనోరాయినిరా రాయినిరా నీ దగ్గర మాత్రమే నేను తడిగా మారతాను. నీ వేదనలోకి ఒక మాధుర్యాన్నై ప్రవహించాలనుకుంటాను. ఎంత వడిగా నిన్ను చేరినా, ఎక్కడికక్కడ నువ్వేసిన ఆనకట్టలు నన్ను శిలగా మార్చేస్తాయేమో భయంగా ఉంది. చాలా భయంగా ఉంది. నాకు శిలగా మారాలని లేదు. నీలో లయం అవ్వాలని తప్ప.
మనసంతా సాంధ్యవర్ణాల ఆవరింతలో ఉన్నప్పుడు, ప్రియమైన వాళ్ళ ఆత్మీయ పలకరింపు ఒక్కటి చాలదూ కాంతి తీరమొకటి కాళ్ళ కిందకి నడచివచ్చినంత ఆనందంలోని త్రుళ్ళటానికి.
మనసులో ఉన్నదంతా అక్షరాల్లోకి ఒలికించేసాకా, లోనంతా ఖాళీ నాకు నేనుగా ఎప్పటికీ నింపుకోలేని ఖాళీ తనమది. నీ నిశ్శబ్దం వెలివేయబడ్డప్పుడే మళ్ళీ నిండే మంజూషమది. ఒక్క చీకటి చినుకు వేవేల కాటుక వర్ణాలద్దుకుని నిశికి నల్లరంగేసినట్లుగా, నీ ప్రతి మౌనం వేల విస్ఫోటనాల ధ్వనిగా నా హృదయాన్ని చిధ్రం చేస్తుంది.
గుండెలోని ప్రేమ వర్ణాలన్నీ వివర్ణమయ్యాయని తడుస్తున్న కనురెప్పల వాసన ఏ సాలీడుకో బాగా నచ్చినట్లుంది, నాలో ఒక సాలె గూటిని అల్లేస్తుంది నా అచేతనాన్ని గుర్తించిన తన చైతన్యం ఎంత గొప్పదో కదరా?
నిన్న కన్న కలలన్నీ మళ్ళీ కందాం అంటే ఎంతగా మొరాయిస్తున్నాయో నీకేం తెలుసు, నిన్నటి కలల్లో మత్తైన నీ మాట ఉంది, మనసైన అక్షరాలు ఉన్నాయ్. ఇప్పుడేమో కలలన్నిటిలో అర్ధం కాని మౌనమే. యుగాలు పయనం చేసి వచ్చిన ప్రేమ సవ్వడి ఒకటి కాసేపు సందడి చేసి మత్తుగా నిద్రపోతున్నట్లు ఉంది. నిజం రా...
మళ్ళీ మళ్ళీ నిన్నటి పేజీలన్నీ చదువుకుంటున్నా. అక్షరాలు ఎంత కమ్మగా నవ్వుతున్నాయో తెలుసా? ఇదిగో ఇపుడు ఖాళీగా పేరుకుపోతున్న ఈ కాగితాలని చూసి వాటికెంత ఎగతాళిగా ఉందో. మౌనరాట్నం పై నువ్వు వడుకుతున్న నిశ్శబ్దపు పోగులు ఇంతగా పేరుకు పోతుంటే మదిని వడకట్టడానికీ తలపులు మొరాయిస్తున్నాయి.
నా ఈ మనసంతా ఒక చకోరాంశరా నీ మాటల చినుకులనే తాగుదాం అనుకుంటూ నిన్నే తన ఏకైక స్వార్ధం చేసుకుని గడిపేస్తుంది. ఈ స్వార్ధం నిన్నెప్పటికి చేరుతుందో చూడాలి మరి.
రాసే కొద్దీ గుండె గద్గదమౌతుంది. చేయి ముందుకు కదలనని హఠాయిస్తుంది. శిథిలాల్లోనూ రావి మొక్క చిగురిస్తుందంటారు. ఈ రావికి వసంతం మాత్రం నీ చిరునవ్వులో విరబూస్తుంది. ఈ నిజం నీకు తెలుసు. నీకు మాత్రమే తెలుసు. మళ్ళీ నువ్వు రాక ముందు ఉన్న శూన్యాన్ని రచించుకునే ఓపిక ఐతే లేదు. ఈ సారి శూన్యమంటే ఇంకెప్పటికీ నేనుగా మిగలని ముక్తాయింపే.
ఒక్కసారి రచించబడ్డ క్షణాన్ని చెరిపెయ్యటం ఎంత అసాధ్యమో, చిధ్రమైన మనసుని అతికించడమూ అంతే అసాధ్యం. నిన్నటి పుస్తకంలోని పాత పేజీని నువ్వూ చదివి చూడు. ఎందుకు చెప్తున్నానో బాగా అర్ధం అవుతుంది.
ఇదంతా రాసింది నిన్ను బాధ పెట్టాలని మాత్రం కాదురా. నిన్నటి స్మృతుల్లోకి నిన్ను పయనం కట్టించాలని నీలో మళ్ళీ నన్ను చదువుకోవాలని...
ఆత్మైషికంటూ అయిదు నిమిషాలూ మిగలని కాలయంత్రాన్ని కౌగిలించుకున్న నా ప్రాణమా చివరగా ఒక్కటి చెప్పనా రా
నా ముగింపు వాక్యానికి నీ ఊపిరి చెమరింత తాకాలి
నీ
ఆత్మైషి

Sunday, 14 February 2016

ఒక అసంపూర్తి వచనంలో



తలుపులు తెరచుకున్న రాత్రి నిండా కూరబడ్డ ఒకానొక బానిసత్వాన్నై ఒక మిథ్యా సమయాన్ని కలగంటున్నప్పుడు మిథ్యని మిథ్య చేస్తూ ఒక ఊపిరి నాలోకి ప్రవహించింది.  కలని దాటేసాక నాలో ఇంకిన ఆ ఊపిరి భౌతిక శ్వాసల స్పర్శ  కోసం కొన్నాళ్లుగా… కొన్నేళ్లుగా  అవిశ్రాంతుడినై నే నిరీక్షించిన సమయాలంటే నాకెంత ఇష్టమో తెలుసా… అనుక్షణం నీ ఉనికిని ఊపిరిస్తూ నా ఊపిరిని భద్రంగా చూసుకున్నాయని…!

నిజం… కళ్ళకంటుకున్న ఉదయం మనసుకద్దుకునే క్షణం కోసం ఎన్ని రాత్రిళ్ళు వేచిచూస్తేనేమిరా ఒక నిజమైన ప్రభాతమెంత ప్రభావవంతమో నువ్వు ఎదురు పడిన వేళని స్పర్శించాకే తెలిసింది.

గాటు పడ్డ గుండెమీద వెన్న రాసినట్లుగా ఒక నిశ్శబ్దం మీద పరచుకుంటూ వస్తున్న శబ్దం నీదైనప్పుడు గుండె పొరల కింద గొంతు విప్పలేని ఉరకలెత్తే ఒక అలజడి చేసే సందడిని చెప్పగలిగేంత అక్షర జ్ఞానం  నాకు అబ్బలేదేమో,  కానీ అలలు అలలుగా ఆ పొరలని తడుముతున్న నీ అణువణువుకీ నా భావ జ్ఞానం అందుతున్న సడి నాకు తెలుస్తూనే ఉంది.

ఒక్క చేతి స్పర్శతో ఒకరిలోకి ఒకరం ప్రవహించిన సవ్వడి ఇంకా ఇంకా వినవస్తూనే ఉంది. నులి వెచ్చని స్పర్శతో నాలోకి నువ్వు పంపింది మైకాన్ని కాదు... నాకు నువ్వున్నావన్న సందేశాన్ని.  ఇంతకంటే  ఇంకేం కావాలిరా నాకు?

నా హృదయం పై నువ్వు చేసి వెళ్ళిన సంతకం ఒక్కటి చాలు వెలుగారని లిపి ఒక్కటి జీవితాంతం నా మీదుగా ప్రవహించటానికి.

నువ్వెళ్ళిపోయిన మైళ్ళ దూరాల కొలతల నిండా నా శ్వాసలు వెలిగించిన దివ్వెల వెలుగులు విరజమ్ముతూ ఉన్నాయ్ కదూ. అది చాలదూ ! మన శ్వాసల కుండ మార్పిడి జరిగిందని తెలియడానికి...

నీకూ నాకూ మధ్య ఎంత దూరం అని ఎవరైనా అడిగితే ఎంత నవ్వొస్తుందో తెలుసా…? ఎందుకురా మనుషుల్ని దూరాలతో కొలుద్దామని చూస్తూ ఉంటారు చాలా మంది. దూరాన్ని బట్టి మనుషులు, మనసులు దగ్గరైతే బహుశా ప్రపంచం ఈపాటికే దగ్ధమై ఉండేదేమో…!

నిజంగా భౌతికపు  దగ్గరితనాలూ… దూరాలు మనసుల్ని శాసిస్తాయా?
ఎంత దగ్గరైతేనేం ? మనసులు సమాంతరంగా కదిలిపోతుంటే…
ఎంత దూరమైతేనేం? ఆత్మలు ఒక్కటై పెనవేసుకుపోతే...

మనఃస్థల కాలాలు ఒక్కటయ్యాక  దూరాలెప్పుడూ భారం కాదు. ఇది నిజంగా నిజం…   ఒకటి చెప్పు… ఒక్క చిరునామా కోసం గతానికి వెళ్లి స్మృతుల వనంలో వెదకటం కన్నా పెద్ద దూరం ఏదైనా ఉందంటావా?

చీకటిని చిదిమేసిన కాంతివానవై నాలో నిండుగా నువ్వు కురిసేసాక, ఎన్ని ఏకాంతాలని సవరించుకుంటున్నా… అన్నిటికీ సరిహద్దులు గీస్తూ నువ్వే కనిపిస్తున్నావ్...

కొన్ని ఇష్టమైన పుటల్లో నే రచించుకున్న వేళల నిండా నిన్ను స్వార్ధం చేసుకున్నాక నన్ను రాసుకోవడానికి ఖాళీతనం అంటూ మిగలలేదు.


అయితేనేం... ఒక అసంపూర్తి వచనంలో తల్లడిల్లిపోతున్న తడియారని హృదయ లేఖపై కొన్ని నవ్వుల ముద్రలేసి నువ్వు పూరించిన చేవ్రాలు ఒక్కటి చాలు నీలో నన్ను చూసుకోవటానికి…!

Sunday, 24 January 2016

ఇమిటేషన్

హాయ్ రా..

పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ మనిషన్న వాడు మాయమైపోతున్నాడని కళ్ళ తడిని అద్దుకుంటూ నువ్వన్న దగ్గరినుండీ నాలో అలవిమాలిన ఆలోచనలురా… ఆ ఆలోచనలు ఎంతవరకూ సబబుగా ఉన్నాయో నాకూ తెలియదు కానీ అవి నీతో  పంచుకోకుండా ఉండలేక పోతున్నాను. 

ఎక్కడి కథలకో ఎవ్వరి వ్యధలకో మన కళ్ళు తడిదేరుతున్నాయంటే ఇంకా కొంచెం మనంగా మిగిలి ఉన్నామనే. 

నెమ్మదిగా అయినా నిండైన మనిషితనం తట్టకపోదు అన్న ఒక్క ఆశ చాలు ప్రపంచం మనిషి మీద నమ్మకం మిగుల్చుకోవడానికి. మనందరికీ సమకాలీకులుగా 800 కోట్లకు పైగా జనం ఉన్నారు. అందులో మనకి పరిచయస్తులెంతమంది? వాళ్ళలో మనకి సంపూర్ణంగా తెలిసింది ఎంతమంది? మహా సింధువులో ఓ చిన్ని బిందువంత. మన గురించే మనకి పూర్తిగా తెలియనప్పుడు ఏ లోతులని స్పృశిస్తూ మనం అందరినీ అంచనా వేయగలం? 

ఏదో అనుకుంటున్నాం కానీ లోకం ఇంకా అంతగా చెడిపోలేదురా. కొందరింకా ప్రకృతి లాగానే  ఉన్నారు. మనుషుల్లో మనుషులింకా కనపడుతూనే ఉన్నారు. ఎక్కడో ఎందుకు? 
మనిషి ఎక్కడ మనిషి ఎక్కడ అంటారే కానీ తమ ప్రశ్నకి తామే సమాధానంగా ఎందుకు మారరు? 

మనిషి అనబడే లక్షణాలేవో వాళ్ళకి బాగానే తెలిసి ఉండాలి కదా? మరెందుకు తమలో తామే ఆ లక్షణాలని పెంచుకునేలా చేసుకోరు. పక్కవాటి మీద ఉన్న ఆసక్తి తమ మీద తామెందుకు పెట్టుకోరు? 

నిజానికి మారాల్సింది మనం చూసే దృష్టి. మనం చేస్తే ఆచారం  మరొకడు చేస్తే అపచారం  అని అనుకున్న వాళ్ళు ఉన్నంత కాలం ప్రకృతి మీద వికృతి ముసుగే కనిపిస్తుంది. మనిషి నడకతోనే ప్రకృతి అయినా మరి వికృతి అయినా. కాలపు ప్రస్థానంలో ఆయా సామాజిక పరిస్థితులని బట్టి వచ్చిన విశ్వాసాలని నేటి పరిస్థితులకి తగ్గట్లుగా సంస్కరించుకోవటంలో విజ్ఞత చూపించటం మనిషితనం అవుతుందేమో కానీ ‘నేటి’ని  ‘నాటి’ రోజుల్లోకి తీసుకు వెళ్ళటం అంటే వాడు అక్కడ మనిషిగా ఆఖరు అయిపోయినట్లే. 

నిజానికి మనిషితనం గతి తప్పినప్పుడల్లా ప్రకృతి చిన్న చిన్నని హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది. ఎవరికి వారు తమదాకా వచ్చేదే ఉత్పాతం అనుకున్నన్నాళ్ళూ తమ అదృశ్యానికి తామే తెరతీస్తూ ఉన్నట్లే అని ఎరుక మాత్రం ఏ  కొందరిలోనో. ‘అదాటుగా ఒక్క సారిగా ఇప్పుడు మానవ జాతి అనబడుతున్న నా జాతికి కాస్త విచక్షణ వచ్చేస్తే ఎంత బాగుండు ‘. నిజమే,  ఇప్పుడు నిజంగా మనిషిలో కొరవడింది విచక్షణాజ్ఞానమే.  అదొక్కటి పెంచుకుంటే చాలు మనిషికి మనిషి దొరకటం మొదలవుతుంది. 

మనిషి మనసన్నది అంత తేలికగా  అర్ధం అయ్యేదే అయితే లోకమెప్పుడూ అపార్ధాల బాట పట్టదు కదా.  గమనించి చూడు, నిజానికి మన అభిప్రాయాలని ప్రభావితం చేసేదేమిటో తెలుస్తుంది.  నీ ఇంట్లోనో, వీధిలోనో, పత్రికల్లోనో & నాయకుల మాటల్లోనో కనిపించే  ఆ కొన్ని అభిప్రాయాలే మనం లోకాన్ని అర్ధం చేసుకునే ఉపకరణాలు. నిజానికి మనకి ఉండాల్సింది లోకమంటే భయం కాదు దాని మీద అపరిమితమైన ఇష్టం. 


కానీ నిజంగా నేటి మనిషిలో ఆ ఇష్టం ఎక్కడా లేదురా...

ఇలా ఉంటే నలుగురూ నవ్వుతారనో, అలా చేస్తే అందరూ ఏమంటారు అనో భయపడుతూ బతుకుతూ లోలోపల ప్రతి ఒక్కడూ ఒక ఒంటరితనంతో కుమిలి పోతున్నాడు. విన్నవీ, చదివినవీ మాత్రమే లోకం మొత్తం నిండిన ఆలోచనలుగా భ్రమ పడుతున్నాడు. తను ఆ అందరిలా లేనేమోనన్న ఆలోచనతో తానుకూడా అదే ముసుగేసుకునే మాట్లాడుతున్నాడు. ప్రవర్తిస్తున్నాడు. 

నిజం ఇప్పుడు ప్రపంచమంతా ఒక ఇమిటేషన్. ఒకరిని ఒకరు ఇమిటేట్ చేసుకుంటూ నకిలీ ఆనందాలని లోకంలో పరిచేస్తూ, నిండైన ఒంటరితనాన్ని తనలో కొనసాగించుకుంటూ… ప్రతి ఒక్కరూ మహా నటులై ఈ భూ ప్రపంచాన్నేవిశ్వంలోనే  అతి పెద్ద రంగ స్థలంగా మార్చేస్తున్నారు.

మాట్లాడుకుందాం గుండెలోతుల్లో నుండి, మనసుపై పేరుకు పోయిన అన్ని మాయాపొరలు కరిగి పోయేలా. పోయేదేముంది మహా ఐతే మనిషన్న వాడిమీద పేరుకుపోయిన మకిలి తప్ప?   

రోజుకి 24 గంటలూ మనిషితనం పూసుకుని ఎవ్వరూ కనిపించరు. స్పందించాల్సిన తీవ్రతని బట్టి ఆయా సందర్భాలలో అది వెలికి వస్తుంది. గమనించి చూస్తే వేదన అయినా. సంతోషం అయినా కూడా అంతే కదా? కాకపోతే మనిషిగా మనం గమనించుకోవాల్సింది ఒక్కటే భవిష్యత్తులోనూ మనిషిని కొనసాగించగలగటం, అందుకోసం ప్రకృతి మీద మరింత ప్రేమని పెంచుకోవటం.  

ఎవరికీ వారు తమకున్నదేదో ఇవ్వటం మొదలు పెట్టి చూస్తే, మనకి అవసరం అయినదేదో మరొకరి ద్వారా మనకు చేరక మానదు. ముందు మన ఆలోచనలను మార్చుకుందాం.  ఆపై వేచి చూద్దాం ఆ  తరువాత వచ్చే మార్పుల కోసం. మనిషి అన్నవాడు జ్ఞాని అనే అనుకుంటున్నాను. తను నడిచే దారి పొరపాటు అని అర్ధం అయిననాడు, అది మనసుకు చేరిన నాడు తను దారి మార్చుకోక ఉండడు కదా?

చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటేరా… 

‘ఈనాటికి కాకపోతే రేపటికైనా మనిషికి మనిషే మందు.’ 

ఈ విషయం లో వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదంతే…

ఏదైనా ఉంటే నాకు చెప్పటానికి నువ్వున్నావ్ గా  :)  

నీ

స్నేహితుడు  

Saturday, 19 December 2015

కాసిని నవ్వుల కోసమే


ఏరా

ఎందుకురా ఎప్పటికప్పుడు అంత కల్లోల పడిపోతూ ఉంటావ్? ఏవోవో విశ్లేషణ చేసుకుంటూ జీవితాన్ని మరింత సంక్లిష్టం చేసుకుంటూ…! ఎందుకిలా? తిండీ నిద్రా మానేస్తే సమస్యలు తీరిపోతాయి అనుకుంటే లోకంలో ఆకలి ఏమై పోవాలి? వేదనల వడిలో కాలాన్ని కొనసాగించటమే నిత్యకృత్యంగా మార్చుకోవటం ఎంత వరకూ సమంజసం?    వత్సరంలో ఆరు ఋతువులు ఎంత సహజమో జీవితంలో అన్ని పార్శ్వాలూ సహజాతి సహజం. 

తరచి చూడు…  బయట ఎంత లోకముందోలోపల అంతకు మించి ఉంటుంది. ఇది నీకు తెలియని సంగతి కాదు అనుకోమనలో చాలా మందికి పుస్తకాలు చదవటం చాలా ఇష్టం రా. అందులో మనసుకు పట్టేసేవీ కొన్ని ఉంటాయ్కానీ మనసుకు పట్టినవన్నీ ఆచరించటానికి ఆసక్తి పుట్టదు. ఎందుకంటే మన ఆసక్తి అనేది  విషయాలని మనసులోకి డంప్ చెయ్యటం వరకే. దాన్ని దాటి ముందుకు వెళ్ళటానికి మనకి సమయమూ అనుకూలించదూసమాజమూ సహకరించదు.  సమాజాన్ని దాటి ముందుకు నడవటం మనకెప్పుడూ భయమే. 

కనీసం సమాజాన్ని పక్కన పెట్టి లోపలి నడిచి చూస్తేమనకి మనమే కొత్తగాకొత్తగా ఒక అపరిచితం అప్పుడే పరిచితం అయినట్లుగాఅసలు మనం ఎలా ఉండగలమో  అలా లేము. ఏమి చెయ్యగలమో అదీ చెయ్యం. ఎందుకంటే మనమంతా సమాజపు అచ్చులలో పోతపోయబడ్డ మూస పాత్రలం. 

పరిగెత్తే పరుగులో మనం పోగొట్టుకుంటున్నది కేవలం సమయమే కాదు, క్షణంలో నిబిడీకృతమై ఉన్న జీవితపు సారాన్ని. ఏదో సాధించాలి, ఎక్కడో చేరాలి అన్న తాపత్రయం తప్ప, ఇక్కడ, ఈ క్షణంలో జీవించడంలో ఉన్న మాధుర్యాన్ని మనం కోల్పోతున్నాం. గతానికో, భవిష్యత్తుకో మనం అద్దెకు ఇచ్చిన మనస్సు, ప్రస్తుతాన్ని ఆస్వాదించలేక, ఏమైపోవాలో కూడా మర్చిపోతుంది.

ప్రపంచం  కొత్తగా అర్ధం అవుతుంటే ఏమిటో అనుకున్నా,  లోపలి లోకాన్ని చూడటం మొదలు పెట్టాకే మార్పుఅని తెలుస్తుంది.  నిజమేరా  అదో కొత్త లోకం, మనమేంటో మనకి అర్ధమయ్యే లోకం. అంతరంగాన అనంత ప్రస్థానం మొదలెట్టిన వాడికి ఒక్కొక్క చీకటి తెరా వీడి పోతూ తిమిరం మొత్తాన్ని ఖాళీచేస్తూ  ఉన్నప్పుడు తెలియ వస్తుంది నిజమైన ఆనందం ఎక్కడ ఉందో. 

బయటి మనుషుల కోసం మనం వేసుకున్న ముసుగు నెమ్మదిగా  అంతరంగాన్ని మసక బారుస్తుంటే ఆనందం  ఒక భ్రమలా తోచటంలో వింతేమీ లేదు కదూ.  మనల్ని మనం తెలుసుకోలేని చోట ఆనందంలో  శాశ్వతత్వం ఆశించటం ఎంతటి అవివేకం?   

బయటి ప్రపంచం మనపై రుద్దే అంచనాల భారాన్ని వదిలించుకుంటేనే కదా, మనం మన నిజమైన బాధ్యతను, అంటే మనకు మనం ఇచ్చుకోవాల్సిన స్వేచ్ఛను, గౌరవాన్ని గుర్తించేది? ఆ రోజు నుంచే, బాహ్య విమర్శలు మనల్ని శాసించలేవు. అంతరంగంలో ఉన్న అనంత  శక్తికి అప్పుడే నిజమైన పరిచయం జరుగుతుంది. 

తడబడే అడుగులైతేనేం, నడకంటూ మొదలెడితే ఎక్కడెక్కడి కాంతి రేణువులూ ఆకర్షితమై లోనున్న అంధకారాన్ని వికర్షిస్తూ మది చుట్టూ ఓ కాంతి వలయాన్ని పోతపొయ్యటం మన గ్రహింపుకి రాకపోతేనేం, ఒక స్వచ్ఛత తొలకరించటం మొదలయ్యింది కదా.  లోలోని స్వరాల చుట్టూ అల్లుకు పోయిన చీకటి కదలికలు నెమ్మదిగా నిష్క్రమించే సవ్వడి చిరు గేయమై స్వరిస్తుంటే మనసుకెంత   తాదాత్మ్యతో కదా 

మనం మొదటినుండీ ఆశపడేది,  గమ్యంగా పెట్టుకున్నదీ ఆనందాన్నే కదామరి జీవితంలో మజిలీలో దాన్ని అందుకుంటున్నామో  చెప్పగలమా? కష్టం కదూఎప్పటికప్పుడు తాత్కాలికంగా మనసుకు కలిగే ఊరటనే ఆనందం అనుకునేటంత అల్ప సంతోషులుగా జీవనవిధానం కొనసాగించేసుకుంటున్న ప్రాణయంత్రాలం. 

మనకి మనమే కిరణమాలులం. మన శోధనే మనకి ప్రభాతం. మనకి మనం తప్ప వేరే ప్రతీక లెందుకు. అంతరంగ శోధనలో మొదట దొరికే నిధి మనకి మనం. నిజంమూల మూలలా నిబిడీకృతమైన చిన్న చిన్న  కాంతి బిందువులు అన్నీ ఒక్క చోటకి చేరుతూ ఒక కాంతి మండలాన్నే సృష్టించటం స్పష్టంగా గోచరిస్తుంది. అది చాలదూ చిన్ని గుండెని గువ్వలా స్పృశింటానికి?   

నిజంగా మనం మొదలవ్వాలే గానీ అదొక అద్భుత ప్రపంచమే కదాఅక్కడ మనమే అన్నీఅక్కడ  అరవైనాలుగు కళలూ మన స్వంతమే. సంగీతమో, సాహిత్యమో, పోరాటమో, ఆరాటమోఏదైతేనేం అన్నీ మన సృష్టి. వాద ప్రతివాదాలు అన్నీమనకి మనమేవీటన్నిటినీ దాటి స్వచ్ఛంగా బయటకి వచ్చేది  ఏదీ మనల్ని  నిరాశ పరచదు. బహుశా మనల్ని బహిరంగ వాదాలకీ పురికొల్పదేమో కూడాఎందుకంటే అప్పటికే మనం అలౌకికులం కాబట్టి. 

అలౌకికత అంటూ ఒకటి మొదలయ్యాక మృత్యువూ మనకొక భృత్యుడే గానీ మరొకటి కాదు. మృతమూ అమృతమూ అల్పవిషయాలుగా తోచే తేలిక పాటి ప్రశాంతత అక్కడ గాక వేరెక్కడా సాధ్యం కాదేమోరా... మనం నిత్యం పోరాడేది బయటి పనులతోనో, పరిస్థితులతోనో కాదు. పనులనుండి మనకి వచ్చే ప్రతిఫలాలమీద మీద ఆశతో. అంతరంగంలో వెలుగు మొదలయ్యాక, మనం చేసే ప్రతి కర్మ ఒక  యజ్ఞంలా మారుతుంది. ఫలితం ఎలా ఉన్నా, ప్రయత్నం మాత్రం పవిత్రంగా ఉంటుంది. అప్పుడు వైరాగ్యం అనేది వదిలిపెట్టడం కాదు, సమయాన్ని, శక్తిని దేనిపై పెట్టాలో స్పష్టంగా తెలుసుకోవడం అవుతుంది. స్పష్టతే మనకు లోపలినుండి స్థిరమైన బలాన్నిస్తుంది. 

అన్ని భారాలూ తేలిక అవ్వాలనుకోవటంకన్నాఅన్నీ భారాలనీ తేలిక చేసుకోవటం ఎంత సులువో కదూనమ్మవా ఏం? ఒక్కసారి మనసు మీద నమ్మకం ఉంచి చూడు.  ఎలాంటి భారాన్నైనా ఎంత తేలిక చెయ్యగలదోదానికోసం నువ్వు చెయ్యవలసింది ఒక్కటే…  మరేం లేదు రా... దాన్ని నువ్వు పట్టించుకోవటమే. తరువాత చూడు అది చేసే అద్భుతాలని. 

పరులకి సాయం చెయ్యాలంటే గొప్పగా కష్టపడాల్సిన పనేమీ లేదు. ఎవరికీ వారు వారిని  సంస్కరించుకుంటే చాలు. అదే మనిషికి మనిషి చేసే గొప్ప సాయం. సంస్కారంలో నుండే అన్ని మంచితనాలూ లోకానికి పరిచయం అవుతాయి. 

మనకెన్ని నవ్వులు రానీ అవి కాసేపే, ఎన్ని బాధలు రానీ అవీ కాసేపే, కాలానికి ఎదురు నిలిచేవేలేవు. అందరూ అంటూ ఉంటారు కదా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే అని.. అదే నిజం. అన్ని దారులదీ ఒకటే  గమ్యం.  ఇదే సత్యాన్ని అన్ని చోట్లా అన్వయించి చూడు. 

కాసిని నవ్వుల కోసమే, జీవితాన్ని పరుగులు తీయిస్తాము కానీ నవ్వులు ఎక్కడ దొరుకుతాయో ఎప్పటికీ తెలుసుకోలేం. ఎందుకంటే  పరిగెత్తే తాపత్రయంలో అసలు పరుగు ఎందుకు మొదలు పెట్టామో మర్చి పోయాం(పోతాం)  కనుక. నిజానికి కొన్ని స్వచ్ఛమైన నవ్వులకోసం ఎంతగా తపిస్తాం? ఎంత  ఆరాటపడతాం?  దేనికోసం మొదలయ్యామో అది మరపుకొచ్చేసాక  , ఆఖరు క్షణాలలో జాగృతి వచ్చి ఏమి ప్రయోజనం?   

ఆ కొన్ని నవ్వుల రహస్యం మనమేనని తెలుసుకునేది ఎప్పుడోయ్మనలో తృష్ణ మొదలవ్వాలి...  అంతఃశోధనవైపుగా అది పరుగులు తీయించాలి. ఒకసారి  అది మొదలయ్యిందా ఇక మనకి మనమే  ఒక కొత్త ప్రపంచం. అటుపై బాహ్య ప్రపంచమూ ఆనందమయం...

ఈ ప్రయాణంలో గమ్యం గురించి అనవసరమైన ఆరాటం వదిలిపెట్టు. ప్రతిక్షణం ఒక కొత్త అవకాశం, ఒక కొత్త ప్రారంభం. మార్పు అనేది ఒక గొప్ప పోరాటంలా కాకుండా, సమర్పణ లా సులువుగా జరగాలి. మనలోని సందిగ్ధతను, అయిష్టతను మనసుకు సమర్పించేస్తే చాలు. నేను సంక్లిష్టంగా ఆలోచించను, నేను ప్రశాంతంగా ఉంటాను అని మనసుకు మెల్లగా చెప్పుకో. మనకు మనం ఇచ్చే ఈ చిన్న అనుమతే, మనల్ని అనవసరపు విశ్లేషణల వేదన నుండి బయట పడేస్తుంది. 

బయటి ప్రపంచంలో మనకి ఎదురయ్యే ప్రతి వైఫల్యం కూడా అంతరంగపు తలుపు తట్టమని ఇచ్చే ఒక సూచికే రా! ఆ వైఫల్యాన్ని భారాన్ని మోసే శిక్షగా కాకుండా, దిశానిర్దేశం చేసే గైడ్‌గా చూడగలిగితే, ఇంక ఏ చీకటీ మనల్ని భయపెట్టదు. మనం సాధించాల్సింది లక్ష్యాలు కాదు, ఈ అంతరంగ స్థిరత్వం. ఈ ప్రశాంతత ఒక్కటి ఉంటే చాలు, రేపటిపై కొత్త ఆశ చిగురిస్తుంది. ఎందుకంటే, ఆశ అనేది బయటి ప్రపంచం ఇచ్చే వరం కాదు, లోపలి లోకం నుండి వచ్చే నిజమైన భరోసా! 

మనల్ని మనం తెలుసుకోవడానికి చిన్న అడుగు వేసినా చాలు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాదు. ఎందుకంటే, ఆంతర్యం వెదజల్లే వెలుగు, మనం ఆశించిన శాశ్వతపు వెచ్చదనం లాంటిది. 

తరచి చూస్తే  అన్ని శాశ్వతాలూ అశాశ్వతమేఅన్ని అశాశ్వతాలూ  శాశ్వతమే. 

అదేమిటో కానీ ఇంతకన్నా మరో నిజం తలపుకు రావటం లేదేమిటో. 

రా మరిప్రయాణం మొదలు పెడదాం

 

నీ,


స్నేహితుడు