మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Wednesday, 17 December 2025

మౌనం మాటైన చోట...


ప్రతి శనివారం సాయంత్రం , సిటీ కోలాహలం అంతా ఆ పాత హాలు గుమ్మం దగ్గర ఆగిపోయేది.   హాలులో కుర్చీలు వరుసగా అమర్చి ఉండేవి. మధ్యలో చిన్న వేదిక ఉండేది. అక్కడ మాట్లాడటం నిషేధం కాదు. కానీ ఎవరూ మాట్లాడేవారు కాదు.  మాటల అవసరం లేనట్టుగా మౌనం అక్కడ అలవాటైపోయింది.

నేను అక్కడికి మొదటిసారి వెళ్లినప్పుడు, రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద ఒక కాగితం ఇచ్చారు. దానిపై నా పేరు లేదు. వయసు లేదు. చిరునామా లేదు. ఒకే ఒక్క వాక్యం మాత్రమే ఉంది... మిమ్మల్ని ఎవరైనా వినాలనుకుంటే, మౌనంగా కూర్చోండి”.  ఒక క్షణం, నా అస్తిత్వాన్నంతా  ఆ వాక్యంలో నిలబెట్టినట్టు అనిపించింది.

ఇది ఉద్యోగ ఇంటర్వ్యూ కాదు. చికిత్స కేంద్రం కాదు. కోర్టు కూడా కాదు.  అలాగని ఏవో సమాధానాలు దొరికే చోటు కాదు. ఇది మన ప్రశ్నలను మాత్రమే ప్రతిధ్వనించే ఖాళీ. తమ జీవితాల్లో ఏదో ఒక కోణం నుండి నిరాకరించబడిన, వదిలేయబడిన మనుషులు... తమ అసంపూర్ణమైన అంతరాత్మలను  ఇతరుల ముందు ప్రదర్శించడానికి, ఆ బరువును తాత్కాలికంగా దించుకోవడానికి ఎంచుకున్న ఒక అంతర్గత తీర్థయాత్ర ఇది.

ప్రతి వారం పది మందిని మాత్రమే లోపలికి అనుమతించేవారు. పది కుర్చీలు... పది నిశ్శబ్దాలు... పది జీవితాలు ఒక్కొక్కరు వేదిక మీదికి వెళ్లి కూర్చోవాలి. వేదిక ఎక్కిన వాళ్ళు  మాట్లాడకూడదు. ఏమీ చేయకూడదు. కూర్చోవాలి... కేవలం కూర్చోవాలి. అంతే! అది ప్రపంచం పట్ల ఆ వ్యక్తి చివరి నిరసనలా ఉండేది.

కింద కూర్చున్న వాళ్లు సాధారణ ప్రేక్షకులు కాదు. వాళ్లు బంధాల బరువును చూసినవాళ్లు. మోసపోయినవాళ్లు, మోసం చేసినవాళ్లు. విని, విని చెవులు మూసుకుపోయినవాళ్లు.  భార్యను కోల్పోయినవాళ్లు, పిల్లలచే వదిలేయబడ్డ తల్లిదండ్రులు, తల్లిదండ్రుల నుంచి దూరమైన పిల్లలు, మాటలు వినీ వినీ అలసిపోయిన మనుషులు. వాళ్లు ఎవరి సమస్యలనూ పరిష్కరించడానికి రారు. వినడానికి మాత్రమే వస్తారు. కేవలం వినడానికి మాత్రమే!

నా వంతు వచ్చినప్పుడు, నేను వేదిక మీదికి నడిచాను. నా గుండె వేగంగా కొట్టుకుంది. పది అడుగులే... కానీ ప్రతి అడుగు భారంగా అనిపించింది. నా జీవితంలో నేను ఎప్పుడూ చెప్పలేకపోయిన మాటలు ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చాయి. చెప్పినా ఎవరూ వినని మాటలు... ఎవరికీ పట్టని మాటలు... చెప్పకుండానే మింగేసిన వాక్యాలు.  గొంతులోనే తొక్కేసిన పదాలు!

కూర్చున్నాను.  

కూర్చున్నాను అంతే...!.

ఏమీ జరగలేదు.

ఎవ్వరూ కదలలేదు.

ఎవ్వరూ స్పందించలేదు. 

చెక్క కుర్చీ చల్లదనం నా  నిశ్శబ్దాన్ని వెచ్చ బరుస్తుంది.  కానీ నా శరీరం మొత్తం గట్టిపడిపోయింది. నోరు  తెరవాలనిపించింది. కానీ నిబంధన గుర్తుకొచ్చింది. ఇక్కడ మాటలుకాదు...  మౌనం మాత్రమే నిజం! అంతరాత్మ కు అలవాటయిన భాష మౌనం మాత్రమె! 

ఆ నిశ్శబ్దంలో ప్రతి ఒక్క నిమిషం ఒక గంటలా సాగింది. 

ప్రేక్షకుల్లో ఒక వృద్ధుడు కనిపించాడు. కళ్లలో ఎప్పుడో ఏడ్చి అలసిపోయిన చూపు. పక్కన ఒక యువతి కూర్చుంది. ఆమె చేతిలో ఉన్న బొమ్మకు ఒక చేయి లేదు. వాళ్లు నన్నే చూస్తున్నారు. కానీ నా ముఖాన్ని కాదు. నా లోపల పగిలిపోయిన చోటుని చూస్తున్నారు.

ఎంత సేపు గడిచిందో తెలియదు. చివరికి ఒక గంట మోగింది. సమయమయిపోయిందని చెప్పడానికి కొట్టిన గంటలా లేదది...  ఒక ప్రశ్నకు మేలుకొలుపులా వినిపించింది.

అప్పుడే కింద నుంచి ఒక స్వరం వినిపించింది. నిన్ను ఎవరు వదిలేశారు?”

నేను మాట్లాడలేదు... మాట్లాడే అనుమతి లేదు. కానీ నా కళ్లు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాయి. ఆ వృద్ధుడు లేచి వేదిక దగ్గరకు వచ్చాడు. నన్ను తాకలేదు. పేరు అడగలేదు. నీ మౌనం నుండి... నేను నిన్ను వినగలిగానుఅన్నాడు.

ఆ రోజు బయటకు నడిచి వచ్చినప్పుడు, నేను ఏ బంధాలనూ వెతుక్కోలేదు. కానీ నాలోంచి ఒక ముఖ్యమైన భాగం బయటకు వెళ్లిపోయినట్టూ, ఆ ఖాళీలో కొద్దిపాటి వెలుగు నిండినట్టూ అనిపించింది. అప్పటి వరకు నా భుజాలపై ఉన్న గతం బరువు తొలిగిపోయిన భావన అది.

తరువాతి శనివారం నేను మళ్లీ వచ్చాను. అదే హాలు. అదే కాగితం. అదే వాక్యం. ఈసారి కూర్చుంటున్నప్పుడు మనసు మీద ఒత్తిడి తక్కువగా అనిపించింది.

అంతలో ఒక కొత్త వ్యక్తిని వేదిక మీదికి పంపించారు. అతడు కూర్చున్న వెంటనే ప్రేక్షకుల్లో ఒక మహిళ ఒక్కసారిగా లేచి నిలబడింది. ఆమె చేతులు కంపిస్తున్నాయి. ఇతడు నా కొడుకుఅని అరిచింది.

ఆమె అరుపు అక్కడ గడ్డకట్టిన నిశ్శబ్దాన్ని భగ్నం చేసింది. అందరూ ఆ మహిళ వైపు చూశారు. ఆ యువకుడు మాత్రం ఆమెను చూడలేదు. అతడి ముఖంలో ఏ మార్పూ లేదు. అతడి కళ్లల్లో ఉన్న తీవ్రమైన ఉదాసీనతను చూసి, ఆ మహిళ తల్లడిల్లిపోయింది. నిర్వాహకులు ఆమెను పక్కకు తీసుకుపోయారు.

అప్పుడే నాకు అర్థమైంది.

ఇది మౌనంగా ఒకరి బాధను మరొకరు అంగీకరించే స్థలం. మాత్రమె తప్ప, బంధాలను తిరిగి ఇవ్వదూ అని.  ఎందుకంటే, బంధాలు తెగిపోయిన చోట, కేవలం జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయి. గాయాలను నయం చేయదు. ఇది మన గాయాన్ని మనం ప్రేమించడం నేర్పుతుంది. ఇది వినిపించే స్థలం మాత్రమే. తిరిగి కలిపే స్థలం కాదు. ఇక్కడ ఎవరికీ కుటుంబాలు తిరిగి రావు. గాయాలు మాయం కావు. తప్పులు సరిదిద్దబడవు.

ఇక్కడ ఒక్కటే జరుగుతుంది... మనల్ని మనమే వినడం మొదలవుతుంది. ఈ ప్రదేశపు అంతిమ తాత్వికత ఇదే!

మనల్ని మనం ఎప్పుడు వినడం మొదలుపెడతామో, అప్పుడే మన లోపల ఉన్న 'నేను' మనల్ని వదిలి వెళ్లిపోదు.

ఆ రోజు నుంచి నేను అక్కడికి వెళ్లడం మానేశాను.

ఎందుకంటే, ఒకసారి నాలోని నేను తో మాటలు మొదలు పెట్టాక, తిరిగి ఆ నిశ్శబ్దానికి అలవాటు పడటం సాధ్యం కాదు. ఆ ఆరాటం నిరంతరం బయటపడటానికి ప్రయత్నిస్తుంది... ఆ మాటలు వినడానికి ఎవరూ లేకపోయినా సరే.!

ఆ క్షణం నుండి, నా మౌనం నా శిక్ష కాదు...

నా పోరాటం!