మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Wednesday, 28 October 2015

హృదయానికి బహువచనం .... నువ్వు

రేయ్ స్నేహితమా...
నీ గురించి నీకు ఓ పరిచయం చెయ్యాలనే తపనతో మొదలెట్టిన లేఖరా ఇది...
నిన్ను చదువుతుంటే ఒక మహర్షిని చదువుతున్నట్లు ఉంది. నిజం రా ! కొన్ని రాతలు ఏదో ఒక్కసారి చదివేసేలా ఉండవు. ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ దాచుకుని చదవాలి అనిపిస్తూ ఉంటాయి. అందులోనూ ఈ మధ్యవన్నీ ... నిన్ను నువ్వు ఆవిష్కరించుకున్న అక్షర సమూహం.
స్నేహితులనుకున్న నీ వారు నీ వెనక నిన్ను గురించి వంద మాట్లాడుకోనీ నీకేమి వెరపట? అది వారి వికృత మనఃస్థితిని నీకు పరిచయించింది కదా… మనమంటూ ఎన్ని చెప్పుకోనీ నేస్తం...మనసులంటూ ఉన్నాయి చూశావూ… వాటికి ఇష్టమైనవే గ్రహిస్తాయి… మిగిలిన అన్నీ వాటికి వికృతంగానే కనిపిస్తాయి. ఎవరికి వారు ఉన్నతమైన చోట ఇది మరీ ఎక్కువ.
నిన్ను నువ్వు గెలిచినంత కాలం… నిన్ను నువ్వు వలచినంత కాలం ఏ వగపులూ నిన్ను దరిచేరవు రా… నీ స్వీయ గౌరవం నువ్వు నిలుపుకుంటూ… నువ్వు నీలా ఉంటూ... నీలో నిన్ను పరికిస్తూ... నిన్ను నువ్వు అనుభూతిస్తూ ఉండటమే కదా నువ్వంటే.
మన స్నేహంలో ఎప్పటికీ అదే నువ్వు ఉండాలి. అలా ఉంచటానికి నాకు చేతనైనది చేస్తాను.
మనలో మనకు అన్నీ పరిచితమేనా? మనలో మనల్ని ఆమూలాగ్రం పరిచితం చేసుకునే నడకలో కొన్ని అలా అలా బయటకి తుళ్ళిపడుతూ అనుకోకుండా ఎక్కడో ఒక అపరిచితాన్ని పరిచయం చేసుకుని... అప్పుడప్పుడూ ఇలా... ఒక నీలా... మరో నాలా…
అసలంటూ ఎన్ని చిరునామాల లోకమో కదా ఇది. కానీ ఆనందపు చిరునామా తెలిసిన వారెందరు? పసితనం నుండి మన ప్రతి ప్రయత్నమూ ఆనందం కోసమే కదా... ఇంతవరకూ దాన్ని పరిపూర్ణంగా సంపాదించింది ఎవరని?
దేహగేహాల్లో తాత్కాలికంగా అద్దెకున్న ఆత్మలం మనం... ఇక మనం మన అస్తిత్వం అనుకునేది దేని గురించి? మనల్ని మనం తవ్వుకునే ప్రక్రియలో గత కాలపు శిధిలాలు ఎంత బరువుగా ఉంటాయో నీకు తెలియని సంగతేం కాదుగా? వాటన్నిటినీ తీసి పక్కన పడేస్తే నీకు నువ్వెప్పుడూ బరువు కాదుగా...
అప్పుడప్పుడూ ఒంటరితనాలూ... మరొకప్పుడు ఏకాంతాలు... ఈ రెండూ భయమున్నవారికే సమూహాలు. సమూహం అలవాటైన వారికి ఒంటరితనం ఒక మరణంతో సమానం. ఏకాంతం వరమైన వాడికి ఒంటరితనం ఒక శూన్యం.
ఒక్కొక్క సారి నువ్వెంతో అభావంగా అనిపిస్తావ్… మనసులో మాట చెప్పుకోవాలా వద్దా అనుకున్నట్లు. ఎప్పుడు ఏది చెప్పుకోవాలి అనిపిస్తే అప్పుడే చెప్పు. బలవంతపు మాటల మార్పిడిలో మనుషులు తెలుస్తారేమో కానీ మనసులు సేదతీరవుగా?
సాధారణంగా అన్ని పుస్తకాల్లోని పదాల్లో వినవచ్చే విముక్తి అనేదాన్ని ఎప్పుడైనా నువ్వు చూడగలిగావా? విముక్తి అంటే ఏమిటి? నీలో నుండి నువ్వు వెళ్ళిపోవటమా? నాలో నుండి నీలోకి / నీలోనుండి నాలోకి వలసరావటం ఉంటుంది చూశావూ అంతకు మించిన విముక్తి ఏమీ ఉండదు అనిపిస్తుంది నాకు. నాకంటూ విముక్తి అంటే ఇష్టం అయిన చోట లీనం అవ్వటమే.
జీవితాన్ని చూసి భయపడిపోతాం కానీ అదెంతో సరళం రా… నువ్వెప్పుడూ ప్రతి చర్యనూ ఒక తాపసితనమై అనుభూతిస్తావు చూడు… అంతకన్నా జీవితం అంటే నిర్వచనం ఏముంటుందిరా? నీకో సంగతి చెప్పనా నువ్వు పిలిచినప్పుడల్లా నాలో ఉత్తేజితమయ్యే చైతన్యం ఒక్కటి చాలు మురిగి పోయే నా ఆలోచనల్ని రగిలించటానికి…!
మనుషులుగా మనం మెలిగే సాధారణ స్థితిలో ఒక అసాధారణత నిబిడీకృతమై ఉంటుంది. నన్ను నువ్వు కనుగొనటం… నేను నిన్ను చేరుకోవటం… ఏమిటంటావ్… అసాధారణాలే కదూ…
మనిషికి ఎన్నో రీచార్జెస్ ఉండవచ్చు... మనసుకి రీచార్జ్ మాత్రం ఒక మంచి నేస్తం. మరి నా రీఛార్జ్ అయితే నువ్వే...

ఇట్లు,
ఎక్కడికక్కడ
ఎప్పటికప్పుడు
నిన్ను నిన్నుగా
అర్ధం చేసుకోగల
ఒకే ఒక్క
నేను
- 27.10.2015

Tuesday, 27 October 2015

ఇంద్రజాలిక

నన్ను నాలో కురిసిన శూన్య తొలకరి వాసన వీడక ముందే
జడివానవై నన్ను చిధ్రం చేసిన గడసరి భరోసాగా
నువ్వు స్పర్శిస్తుంటే
మెత్తని పుప్పొడిలారాలిపోతున్న ఒంటరితనం
గాలి వనాల గుండా నిన్ను శ్వాసించిన ఇంద్రజాలం
లిఖించింది
నన్ను నీలా నిన్ను నాలా


Thursday, 22 October 2015

మౌనానివని…


గడ్డి పువ్వొకటి పచ్చికని దాటి
నీ పాద ముద్రకింద మెత్తగా తల ఎగరేస్తుంటే
జాజుల రాసుల పరిమళం
నీపై గుప్పుమంటుంటే
సగంగా అరిగిపోయిన చంద్రుడు
నిండారా నీ వెన్నెలని తాగేస్తుంటే
వెదురు వృక్షమొకటి
చల్లగాల్ని భోంచేస్తూ
పచ్చగా నిన్ను గానం చేస్తుంటే
అప్పుడే కురుస్తున్న
హేమంతపు చినుకుల్లో
తడి తడిగా నువ్వు తడుముతుంటే
తెలిసింది నాకు
నువ్వొక వెలుగులద్దుకున్న
మౌనానివని…
మరి నా ప్రాణానివని…!


ఇలాగే వదిలేయ్

నువ్వు తీసుకొస్తున్న ఆ కొద్ది కాంతీ
నాకు వెలుగియ్యటం ఏమోకానీ
నన్ను కాల్చేయటం మాత్రం పచ్చి నిజమనిపిస్తుంది
నువ్వు దాటి వచ్చిన తోవలన్నీ
పూల వనాలై ఉండవచ్చుగాక
నన్ను తోడ్కొని వెళితే
ముళ్ళకంపలే ఎదురేగుతాయ్
అయినా
ఎవరో కొంచెంగా మిగిల్చివెళ్ళిన నాలో
ఇంకేం ఉందనీ నీకివ్వడానికి
నాకు నేను బాకీగా మారిన క్షణాలు తప్ప
అందుకే
వెనక్కి వెళ్లి పోవూ
ఎలా ఎదురు చూడాలో ఇప్పటికే అలవాటైన వాణ్ని
చెమ్మనెక్కడ దాచుకోవాలో తెలిసిన వాణ్ని
నా పక్కగా నన్ను ప్రవహింపచేసుకోవటమే నాకెంతో బాగుంది
ఈ కన్నీటి చప్పుడు వింటూ
నన్ను ఇలాగే వదిలేయ్… ఇలాగే...


మృత్యువు

దేహం కోసం
దాహంగా పొంచి ఉంది
ఓ మృత్యుపాశం


శూన్యమొకటి
పలకరించింది


మృత్యువుకి
మనసు
మనసయ్యిందిప్పుడుWednesday, 21 October 2015

కదలిక


బడలిక మొదలయ్యింది
సంధ్య అరుణించిన తరుణాన
తరువులు ఇచ్చగా బరువెక్కుతున్నాయి
బుల్లి పిట్టలకి చిన్ని గూళ్ళౌతూ
తలపులు వెచ్చగా కురుస్తున్నాయి
తడి ఊసులని వెదజల్లుతూ

నిన్నటి నల్లని కన్నీళ్ళన్నీ
చెక్కిళ్ళ చుక్కానితో దాటేస్తుంటే
రహస్యమనుకున్నదంతా వెల్లడయ్యిందని
మౌనంగా నిష్క్రమించిన మనసు సడులు
మళ్ళీ కొత్త చివుర్లేసుకుంటూ
రేయంతా ఎక్కడికి నిష్క్రమిస్తున్నానో
అంటున్న అంతరంగాన్ని అణిచేస్తూ
నిండారా నన్ను కమ్ముదామనుకుంటున్న తిమిర సేవధిని
రాత్రిపాటుగా దాట వేస్తూ
రెప్పలవాటుగా నిన్ను సేవించే
ప్రతి క్షణాన్నీ లెక్కగట్టి దాచుకునేంతగా
కదలిక ఒకటి మళ్ళీ  మొదలయ్యింది


నిశ్శేషం


ఉహూ...
ఇంకా తన సవ్వడవ్వలేదు
అసలు మొదలైందా… లేదా తెలియటం లేదు
పరిమళమూ వీయలేదు 
ఆనందమా… వ్యధా 
ఏదీ బయట పడటం లేదు
నిరీక్షించాలా
ఎదురేగాలా
ఏదీ తట్టటం లేదు 
మనసు కదా
అప్పుడప్పుడూ అంతే మరి
అక్కడక్కడా ఆగిపోవాలి 
నేనెక్కడో నాకే తెలియనంతగా  
కొన్ని క్షణాలని నిశ్శేషం చేసుకుంటూSunday, 18 October 2015

ఇలా ఉంటాయ్ కొన్ని…


సమూహంలో ఉన్నప్పుడల్లా  మనిషితనాన్ని మొలిపించుకుంటూ 
మానవత్వపు భారం మొత్తం తన భుజాల మీద మోసే 
పేటెంట్ ని  తనకి తాను ఇచ్చేసుకునే జీవ ఇరుసులకు 
నిజాలు బాగా తెలుసు నాటక రంగపు ఇజాలతో సహా 

****

భేతాళ ప్రశ్నలన్నీ మంది బుర్రల్లో తిరుగుతూనే ఉన్నా 
సమాధానం చెప్పటానికి ఏ విక్రమార్కుడూ ప్రయత్నించనందుకేమో 
ఊరవతలి మహాస్మశానాలు ఇంటింటిలో రాజ్యమేలుతున్నాయ్ 
వంటింటి చూర్లకి తలకిందులుగా వేళ్ళాడుతూ

****

ఏకాంతం వంటికి చుట్టుకున్నప్పుడల్లా 
ప్రపంచాన్ని వెలివేసిట్లుగా సంబరపడే వాడిని చూసి 
ప్రపంచం ఎప్పుడూ నవ్వుకుంటూనే ఉంటుంది 
ఇంతవరకూ అది ఎవ్వరినీ పట్టించుకోలేదట మరి  

****

ఏ చరిత్ర పుటని తిరగేసినా తెలిసేదొక్కటే
ప్రపంచంతో నడవని… గొడవ పడని… 
ఘర్షణ ఎప్పుడూ స్వచ్చంగా లేని 
ఏ జీవన సంపుటీ  సంపూర్ణం కాదు 


Saturday, 17 October 2015

కన్నా...

నీతో నిండుగా మొదలయ్యే నా ఉదయానికి తెలుసు
ఈ రాత్రికి కమ్మని నిద్రని దాచిపెట్టుకుంటానని
పగటి ప్రయాసలన్నిటికీ పరిష్కారంగా
సాయంత్రం మెడ చుట్టూ నువ్వద్దే
చేతి చెమ్మల మైమరుపొకటి చాలు
ఎప్పటికీ నన్ను నీతోనే ఆపేసుకుంటూ
జీవితం నిండా సుగంధాల కాంతిని నింపేస్తూ
శూన్యాల సడిని నీ మాటలతో తరిమేస్తూ
నా ఉనికిని నీ నవ్వులకి ముడి పెడుతూ
ముగిసి పోదామనుకున్న ప్రతిసారీ
నాన్నా అంటూ  నన్ను స్వేఛ్చగా  బంధిస్తున్నావ్
నా ఒంటరి తనం మొత్తాన్ని తుంటరిగా తుడిచేస్తూ

పరువం

చందమామకి ఆర్ఘ్యమిస్తూ 
చందనాలు పరిమళిస్తూ 
వెన్నలనే వాయనమిస్తే 
పరువపు ముత్తయిదువువై నువ్వు రావా 

తలపంతా ధూపమేసి 
తాంబూలం నోట పట్టి 
తనువు గారాలూ పోతుంటే 
వలపు ముద్దరలేస్తూ చేవ్రాలూ చేయనా

మంచేమో మంత్రమేస్తూ 
పూలన్నీ ఎర్రబడుతూ 
నిశ్శబ్దం కేకబెడుతుంటే 
ఝల్లుమన్న వన్నెలకి ముకుతాడు వెయ్యనా 

రేయంతా ఘల్లుమంటూ 
వయసంతా తుళ్ళి పడుతూ 
మనసంతా పండుతుంటే 
మాయదారి పగలుకి విడాకులివ్వనా :) 


Saturday, 3 October 2015

విజయం

కన్నానేను చేసిన పెద్ద తప్పేంటో తెలుసానీకా చిత్రం గురించి చెప్పక పోవటమే

ఏ చిత్రం నాన్నా?’

అదిగో అదేనువ్వు చిన్నప్పటి నుండి మన హాల్లో చూస్తున్న అదే చిత్రం

అందులో విశేషం ఏముంది? మామూలుగానే ఉందిగా

నిజమే చూసే వారికి మామూలుగా అనిపించవచ్చుకానీ అదే మన కుటుంబ జీవన చిత్రంఅని చెప్తుంటే కావ్య ట్రే లో కాఫీ కప్స్ తో వచ్చింది. తన కళ్ళతో ఒక్క సారి మాట్లాడుతూ కప్ అందుకున్నాను.

నువ్వూ తీసుకో కన్నాచెప్పింది కావ్య కాఫీ కప్ వాడి చేతికందిస్తూ

వాడు వాళ్ళ అమ్మ కళ్ళలోకి సూటిగా చూడలేక తలవంచుకుని కప్ అందుకున్నాడు. కావ్య అనునయంగా వాడి భుజం మీద చెయ్యి వేసి వాడి పక్కనే కూర్చుంది.

కప్ తీసుకున్నాడే కానీ కాఫీ తాగకుండా కప్ లోకి అలాగే చూస్తూ కూర్చున్నాడు మానస్. ప్రస్తుతం వాడి మనస్థితి అంచనా వేస్తూ నేనూ  కూడా మౌనంగా కాఫీ సిప్ చేస్తూ వాడివైపే చూస్తున్నాం.

వంచిన తల ఎత్తకుండానే కళ్ళు పైకెత్తి చూశాడు. ఒక్క క్షణం మా ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయ్.

నన్ను క్షమించండి నాన్నా' నీళ్ళు నిండిన కళ్ళతో చెప్పాడు.

ఆలోచనలన్నీ పక్కకి నెట్టేసి కాఫీ తాగు. కాస్త తెరిపిన పడతావ్'

ఏమనుకున్నాడో ఏమో నెమ్మదిగా కాఫీ తాగటం మొదలు పెట్టాడు.

***

పావుగంట క్రితం

పాదాల మీద ఏదో తడిగా తగిలితే చటుక్కున మెలకువ వచ్చింది. తలుపుని దాటుతూ కనిపించాడు మానస్. ఒక్క క్షణం నాకేమీ అర్ధం కాలేదు. ఈ టైంలో వాడు మా బెడ్రూమ్ లోకి వచ్చి వెళ్ళటంనా కాళ్ళ మీద తడిచూస్తుంటే నా మనసులో ఒక చిన్న ఆందోళన. నన్ను నేను సంభాళించుకుని బెడ్ మీద నుండి లేచి గబగబా వాడి వెనకే వెళ్లాను.

కన్నాఏమైందిరాఆగుఎక్కడికి అలా వెళ్ళిపోతున్నావ్?” నా మాటలు వినపడగానే వాడు వేగంగా బయటకి నడవబోయాడు. నేను మరింత వేగంగా వాడిని చేరుకొని వాడి జబ్బ పట్టుకుని ఆపేసాను.

నన్ను క్షమించండి నాన్నానన్ను వెళ్లిపోనివ్వండి.. ప్లీజ్' అంటూ వాడు పెద్దగా ఏడుస్తూ నా కాళ్ళ దగ్గర కుప్ప కూలిపోయాడు.

నేను వాడిని అక్కడే సోఫాలో కూర్చోబెట్టి కాసిని మంచి నీళ్ళు తాగించి ప్లీజ్ రిలాక్స్ మై బోయ్ఏమైనా ఉంటే నిదానంగా మాట్లాడుకుందాంఈ తెల్లవారు ఝామున అమ్మ చేతి కాఫీ రుచి చూడు. మనసులోని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కకు వెళ్లి కాస్తంత ప్రశాంతంగా ఉంటుంది' అంటూ కావ్యని పిలుద్దాం అనుకుంటూ బెడ్ రూమ్ వైపు వెళదాం అనుకునే లోపుగా తనే చేతిలో ఏదో లెటర్ తో ముఖంలో ఆందోళనతో బయటకి వస్తూ కనిపించింది.

అది చూడగానే అర్ధం అయ్యింది వీడేదో లెటర్ రాసి మా దగ్గర పెట్టి బయటకి వెళ్ళిపోవటానికి సిద్ధం అయ్యాడని.

ఏంట్రా కన్నాఈ పిచ్చి పనినువ్వు వెళ్ళిపోతే మేము ఉంటాం అనుకున్నావా…” అడిగింది కావ్య చెంపల నిండా కారుతున్న కన్నీళ్ళతో తన చేతిలోని కాగితాన్ని నాకు అందిస్తూ

'వీడితో నేను మాట్లాడుతూ ఉంటానుగానీ కొంచెం కాఫీ పెట్టరా…’ అంటూ వాడు రాసిన దాన్ని చదవటం మొదలు పెట్టాను.

అమ్మా నాన్నా

ఇలాంటి ఉత్తరం ఒకటి రాయాల్సి వస్తుందని నేను ఏనాడూ అనుకోలేదు.

ఏదో సాధిద్దాం అని సొంతకాళ్ళతో నడక మొదలు పెట్టాను. ఎంతో కష్టపడి తయారు చేసుకున్న నా ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ప్రాణ స్నేహితుడనుకున్నవాడే మరొకళ్ళకి అమ్మేసి నన్ను నట్టేట ముంచేసాడు. ఒక్క ఫెయిల్యూర్ తో ప్రాణంగా ప్రేమించాను అన్న అమ్మాయే మరొకళ్ల చెయ్యి అందుకుంది

ఇవన్నీ చూస్తుంటే లోకమంతా ద్వంద ప్రవృత్తితో నడుస్తున్నట్లుంది. మీరు తప్ప నాకీ లోకం అసలు నచ్చలేదమ్మా. అన్నీ ఓటములేఎటు చూసినా అవమానాలే

అయినా నిజంగా ఇది ఫెయిల్యూర్ అంటారా అమ్మాఇలాంటి నయవంచనలు నాలాంటి ఎందరినో బలి తీసుకుంటూ ఉండి ఉంటాయ్ కదూ?

నాన్నామీరు చిన్నప్పటి నుండి నన్ను చాలా ధైర్య వంతుడిగా పెంచారు. అయినా సరే చీకటి కమ్ముకొస్తున్నప్పుడు నాలోని ధైర్యం ఎటుపోయిందో తెలియదు. మాటల్లోఊహల్లో ముందుకు వచ్చే ధైర్యం ఆచరణకి వచ్చే సరికి ముఖం చాటేసిందెందుకో!

మీ చాటు బిడ్డగా కాకుండా మీరు గర్వించే బిడ్డగా ఎదగాలనుకున్నాఇప్పుడు అత్మవంచన చేసుకుని మీ వారసుడిగా భోగభాగ్యాలు అనుభవించటానికి నాకు మనస్కరించటం లేదు నాన్నా

అందుకే... మీరు నా మీద పెట్టుకున్న ఆశలని వమ్ము చేస్తూ శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను ఇంట్లో నుండీఈ లోకం నుండీ.

నన్ను క్షమించరూ!

మీ

కన్నా…’

చదవటం పూర్తి చేసిన నాకు వాడి బాధ అర్ధం అయ్యింది.

***

ప్రస్తుతానికీ వస్తే

వాడి మనసులో సవాలక్ష సందేహాలు ఉంది ఉంటాయని నాకు తెలుసు. ఏదో ఒక వాల్ పోస్టర్ ని చూపించి ఇది మన కుటుంబ జీవన చిత్రం అంటే ఎవరికైనా అంతే కదా మరి.

నాన్న చెప్పింది నిజమే కన్నాఆ చిత్రం వెనుక మా ఇద్దరి కథ ఉంది. అది నీకు అర్ధం కావాలంటే మా కథ పూర్తిగా నీకు చెప్పాలి' అంటూ మా గతాన్ని చెప్పటం మొదలు పెట్టింది కావ్య.

***

సూర్యాఅమ్మా నాన్నకి మన సంగతి చెప్పాను. వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకోవటం లేదుఅంతే కాదు నేను మన ప్రేమ విషయం చెప్పగానే నాకు వేరే అతనితో పెళ్లి ఫిక్స్ చేసారు. నాకు నువ్వు కావాలిరానువ్వు కావాలినువ్వు లేకుండా బతకలేను' మాటలు వినవస్తుంది ఫోన్ నుండి అయినా కావ్య గొంతులోని బాధ సూర్య గుండెని తాకింది

ఏయ్.. పిచ్చీనాకు మాత్రం నువ్వు కావొద్దా ఏమిటి? నిన్ను వదులుకుని నేను మాత్రం ఉండగలనా? నేను వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతానుగా

ఏమోరాఏమి మాట్లాడతావో ఏమిటో! మా వాళ్లకి ప్రేమ అంటే అసలు పడదు. అందులోనూ నేను ప్రేమించింది ఒక అనాధని అని తెలిసాక ఇంకా మండి పడుతున్నారు. నాకంతా అయోమయంగా ఉంది. నువ్వు త్వరగా వచ్చేయ్నన్ను తీసుకుని వెళ్ళిపో

వచ్చేస్తారా బంగారూఒక్క ఇంటర్వ్యూ ఉంది. అది అవ్వగానే వచ్చేస్తాను. ఒక్క రెండు రోజులు ఓపిక పట్టు

సరే

మాట్లాడటం అయిపోయాక సూర్య తీవ్రమైన ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు.

తానేమో ఒక అనాధ. అటు కావ్య చూస్తే కలవారి అమ్మాయి.

కావ్య, తను గత నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిదీ విశాఖపట్టణమే. కష్టపడి డిగ్రీ వరకూ చదవగలిగినా ఇంకా ఉద్యోగం దొరకలేదు. ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్ వచ్చాడు.

ప్రేమలో పడ్డప్పుడు భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో అలోచించి పడటం అంటూ ఉండదు. అలా ఆలోచించగలిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో ముందుగానే ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఏదోలా కావ్య పేరెంట్స్ ని ఒప్పించి ఆమెని పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు ఒప్పుకోకపోయినా కావ్య తనూ పెళ్లి చేసుకోవటం ఖాయమే. కానీ పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా బతకవచ్చు. ముందుగా రేపు ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని వైజాగ్ వెళ్లి కావ్య పేరెంట్స్ తో మాట్లాడాలిఆలోచనలు అలా సాగిపోతున్నాయ్.

మరునాడు ఇంటర్వ్యూ పూర్తి అయ్యింది. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ పద్ధతి చూస్తే ఈ జాబ్ కూడా ఎవరి కోసమో రిజర్వ్ చేయబడిందేమో అని అనిపిస్తుంది సూర్యకి. మరునాడు బయలు దేరి వైజాగ్ వెళ్లి కావ్య పేరెంట్స్ తో మాట్లాడాడు. వాళ్ళు చాలా అవమానకరంగాహీనంగా మాట్లాడారు. దాదాపుగా మెడపట్టి బయటకి గెంతినంత పని చేసారు.

ఇలాంటి సమయాల్లో స్నేహితుల తోడు చాలా ధైర్యాన్ని ఇస్తుంది కానీ సూర్యకు అండగా నిలిచేటంత స్నేహితులంటూ ఎవరూ లేరు.

ఏమి చెయ్యాలో తెలియని అయోమయంలో ఉండగా కావ్య సూర్య గదికి వచ్చింది.

సూర్యాఇంట్లోనుండి వచ్చేశాను

ఎందుకు వచ్చేసావ్ రానిన్ను పోషించటానికి ఉద్యోగమూ లేదువెనకటి వాళ్ళు ఇచ్చిన ఆస్తులూ లేవు. కనీసం నువ్వైనా మీ పేరెంట్స్ మాట విని పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండవచ్చురా'

ఏం మాట్లాడుతున్నావ్ సూర్యానిన్ను కాకుండా ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండగలను అని ఎలా అనుకున్నావ్. కలసి బతకలేనప్పుడుప్రేమికులుగా కలసి చచ్చిపోదాం. చావైనాబతుకైనా నీ తోడుగానే'

కాసేపు వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బతకటానికి దారి కనపడక ఇద్దరూ ఆత్మ హత్య చేసుకోవటానికి నిర్ణయించుకుని బీచ్ వెంట ఊరికి దూరంగా నిర్మానుష్యంగా ఉన్న చోటకి నడచారు.


సముద్రంలోకి వాలిపోతున్న ఎర్రటి సూర్యుడిని కాసేపలా తేరిపార చూస్తూ రేపటి సూర్యోదయం మనం లేకుండానే కదా అన్న భావనతో ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ సముద్రానికి దగ్గరగా వెళ్ళారుసముద్ర గర్భంలో లీనమై పోదామనిసాగరం మీదుగా ఎగురుతూ కనిపించాయి కొన్ని పక్షులుఅందులో ఒక పక్షి వాళ్లకి మరింత దగ్గరగా రెక్కలని టపటపలాడించుకుంటూ ఎగురుతుంది.

దాన్ని అలా చూస్తుంటే అకస్మాత్తుగా సూర్యలో ఏదో ఆలోచన.

ఒక చిన్న పక్షి, తన రెక్కలతో సాగారాన్నే దాటెయ్యగలననే నమ్మకంతో ఆ అనంత సాగరం మీదుగా ఎగురుతూ ఉంటే మనిషిగా నా మీద నాకెంత నమ్మకం ఉండాలి.

ఏ సమస్యకైనా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. ఇద్దరమూ చదువుకున్నాం. ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు లేనంత మాత్రాన అవి దొరకవు అని కాదుగాఅలాగే పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు ఒప్పుకోకపోయినంత మాత్రాన పిల్లలకి శత్రువులేం కాదుగా.

ఇప్పుడిక్కడ జీవితాలని ముగించేసుకుంటే ఎవరి మీద గెలచినట్లు?

మహా అయితే పేపర్లో జిల్లా ఎడిషన్లో ఏదో మూల వార్తగా మారతాం

కానీ కావ్య పేరెంట్స్ ఏమవుతారు? ఊపిరాగిపోయే ఆఖరి క్షణాలలో మళ్ళీ జీవితం మీద ఆశ పుట్టి మళ్ళీ మొదలవ్వాలంటే సాధ్యపడుతుందా?

ఇది కరెక్ట్ కాదుపిరికి వాళ్ళలా జీవితాన్ని ముగించటం సరి కాదు. మరణాన్ని కూడా విజేతలుగానే ఆహ్వానించాలి.

అంటే ఇప్పుడు చావకూడదుబతకాలిగెలవాలి…’ అనుకుంటూ అలలకి ఎదురుగా నడుస్తున్న కావ్య చేతిని గట్టిగా పట్టుకుని కావ్యామనం బతుకుతున్నాంపెళ్లి చేసుకుంటున్నాంజంటగా జీవితాన్ని గెలవబోతున్నాంఅని అన్నాడు సూర్య.

ఆ మాట విన్న కావ్య కళ్ళలో మెరుపుల తడిసూర్యకి అభిముఖంగా తిరిగి గుండెల మీద తల వాల్చి అతన్ని గట్టిగా హత్తుకుపోయింది.

***

ఆ మర్నాడే గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. రాదేమో అనుకున్న ఉద్యోగం మీ నాన్నకి వచ్చింది. నువ్వు పుట్టాక తాతయ్య అమ్మమ్మ కూడా మమ్మల్ని అర్ధం చేసుకుని దగ్గరకు తీసుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్ళకి నాన్న జాబ్ వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు.

ఆరోజు అలా మా జీవితాలని ఆఖరు చేసుకుని ఉంటే ఈ రోజు మేమూ ఉండేవాళ్ళం కాదు నువ్వూ ఉండేవాడివి కాదు.

పొద్దువాలే సంధ్యా సమయపు ఆ పడమటి చూపే ఆఖరవ్వాలనుకున్నాం

కానీ ఆ పడమటనే ఒక నవోదయపు పొద్దు పొడిచేలా చేసిందో పక్షి.

ఒక్క సారి గమనించి చూడరాగాలినే ఇంధనంగా తన రెక్కల శక్తితో సాగరాలనీ దిగంతాలనీ దాటేస్తూ ఉంటాయ్ పక్షులు.

తరచి చూడాలే కానీ నీ విజయాలకి ప్రకృతిని మించిన ఇంధనం ఏముంది?

ఎన్నో సార్లు చూసి ఉంటాం ఆకాశంలో పక్షులు అలా ఎగరటాన్నికానీ జీవితాన్ని మలుపు తిప్పే క్షణం ఒకటి వాటివల్లే వస్తుందని అనుకోలేదు. జీవితంలో ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడినుండైనా రావచ్చువస్తుంది కూడా

అందుకే మా జీవితంలో మేము నేర్చుకున్న పాఠాన్ని శాశ్వతం చేసుకోవాలని మీ నాన్న ఈ పెయింటింగ్ వేయించారు...

నువ్వాపితే ఆగిపోతుంది జీవితంకానీ ఆపాక మళ్ళీ మొదలవ్వాలంటే వీలవుతుందా?

ఓటములు ఉంటాయ్వాటి వెనకాలే విజయాలూ వస్తాయ్కావాల్సింది కాస్తంత సహనం.

నిజానికి నువ్వు ఓడి పోలేదు. ఒక పాఠం నేర్చుకున్నావ్. లోకంలో ఎలాంటి వాళ్ళున్నారో తెలుసుకున్నావ్. ఈ సారి పొరపాటు చెయ్యవ్. నీ అనుభవం నిన్ను పొరపాటు చెయ్యనివ్వదు

మా కన్నా సత్తా మాకు తెలుసు. నేలకి కొట్టిన బంతిలా పైకి ఎగురుతాడుమోసం చేసిన వాళ్ళ కన్నుకుట్టేలాతననా వదులుకుంది అని వాళ్ళు ఏడ్చేలా

అయినా నీకేంట్రా? నీ పక్కన మేమున్నాంఅన్నిటికీ సమాధానంగాఅది చాలదూ!

నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం అంటే మాట సహాయం కూడా తీసుకోక పోవటం కాదురామా అనుభవాల్లో నువ్వు మొదలవ్వాలినీ విజయాలతో పరిపూర్ణం అవ్వాలి.మంద్రమైన స్వరంతో మనసుకి నాటుకునేలా చెప్పి ముగించింది కావ్య.

మానస్ ముఖంలో ఓ కొత్త వెలుగు

కొత్త ప్రభాతం మొదలైన గుర్తుగా గుళ్ళో నుండి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి సుప్రభాతం అలలు అలలుగా మమ్మల్ని తాకుతూ


జీవితమొకటి ప్రభవించింది.