మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Tuesday, 30 June 2015

మట్టి కుదుళ్ళు

కంటికి కనబడేది మూడొంతుల సముద్రమే 
అసలంటూ... మొత్తం మట్టి కుదుళ్ళేగా...
సంద్రం నేను
మట్టి నువ్వు

Sunday, 28 June 2015

విజేత

నీదా?
వాడిదా?
ఝండా ఎవరిదోయ్…?
శాశ్వతంగా రెప రెపలాడుతున్నపతాకమెక్కడో  
ఆచూకి ఒక్కటి చూపించవూ

యుగాలుగా యుద్ధాలన్నీ మట్టికోసమేగా  
మరి ఏ మన్నుపై ఎవడు శాశ్వతమయ్యాడో 
ఆనవాలు ఒక్కటి తెచ్చివ్వవూ
జాతులు ఛిద్రమైన రణరంగాన 
ఏ దేహమెవ్వడిదో ఎరుకపరచగలవా

ప్రకృతి ప్రశాంతంగా ఉన్నంతవరకే 
సరిహద్దుల పద్దులన్నీ 
యుగాల రక్తం ఇంకిన మైదానాల
ఆక్రోశం బద్ధలై
ప్రళయంగా పిక్కటిల్లితే 
ఏ హద్దెవ్వడిదో లెక్కగట్టే 
స్వరమొక్కటి మిగిలుంటుందంటే చెప్పు
సరికొత్త యుగకర్తగా చరిత రాసేద్దువు

లేదంటే 

మట్టి కాగితంపై 
నరనరాల రణరంగంతో 
స్వేదమే సిరాగా 
శ్రమ సంతకం చేసేయ్ 
బంగారు పంటగా తలవంచుతూ 
మట్టి నీకు ప్రణమిల్లుతుంది 
నిన్ను విజేతగా నిలుపుతూ


Thursday, 25 June 2015

ప్రకృతి ధర్మం

ఒక చల్లదనాన్ని ఆస్వాదించాలంటే ఒక గ్రీష్మాన్ని భరించాలి. 
అదే ప్రకృతి ధర్మం
వేడెక్కిన గాలే నీటిని మోసుకుని వెళుతుంది 
చినుకై తొలకరించడానికి... 
మట్టికి తడిగా తోడవ్వటానికి.... 

Tuesday, 23 June 2015

కావలి


నవ్వుతూ తుళ్ళుతూ
కథ వింటూ కలగంటూ 
ఈ తీరుగా నా బతుకంటూ 
మనసు పొత్తిళ్ళపై 
నును వెచ్చని  గ్రీష్మంలా 
నాపై నిన్ను కప్పుకుంటూ 
కల్తీలేని ఊపిర్లు అరువిచ్చుకుంటూ 
పడిన చోటే పాన్పు వెదుక్కుంటూ 
ఇద్దరం ఒకటై 
ఓ మరణమా...
నాకు నువ్వు మరి నీకు నేను
అహరహం కావలిగా... 


Sunday, 21 June 2015

ఘోష

ఏయ్... 
తట్టుకోగలవా…
మౌనం మాట్లాడితే తట్టుకోగలవా…
గంభీరత గొంతు సవరించుకుంటే 
పెరిగే నీ గుండె వేగానికి కొలత కట్టగలవా? 
నేనో సముద్రాన్ని…
ఎంత ఒంటరినయితేనేం
ఆకాశమూ తన నిజాన్ని నాలో వెదుక్కోవాల్సిందే 
నా అగాధాల కింద తడి అంటిన మట్టే కాదు 
బడబాలనమై పెల్లుబికగలిగే అగ్నిపర్వతాలూ ఉన్నాయ్
సుడిగాలి నన్ను దాటితేనే 
మేఘమై మిమ్మల్ని తడిపేది
తీరంలో పడిలేచే నా అలల ఘోషకే బేజారిపోయే గుండెలు  
నాలోని గంభీరత అంతా పిక్కటిల్లితే ఏమవుతాయో…?
నాగరికత వేషాలు కాదోయ్
ప్రకృతి నీకోసం రాసి ఉంచిన పాఠాలు నేర్చుకో 
పంచభూతాలకీ ఇష్ట సఖుడివై 
జీవజాతికి ప్రియ మిత్రుడివై

Tuesday, 16 June 2015

నువ్వే...

'ఎప్పటికీ నాతోనే ఉంటావు కదూ' అంటున్నావ్...
నువ్వు తప్ప నా ఉనికెక్కడ ?
నాకు నన్ను ఇతరుణ్ణి చేసి
నీ అణువణువులో కణంగా చేసుకున్నాక...!

దైన్యంగా అర్ధిస్తున్నావ్...
ధైర్యపు స్పర్శ విలువ
నన్ను నీలో పోత పోసుకున్న
నీకన్నా ఎవరికి బాగా తెలుసని?  

అంతరాత్మలేని ఆడంబరపు ప్రపంచంపై
ఒంటరివై నువ్వు సాగిస్తున్న పోరాటంలో
ఆయుధంగా మారిన నన్ను గుర్తించక
భీతహరిణిగా మారిపోతే ఎలా?

నీ గుండె సవ్వడిగా మారిన నా ఊపిరిని గుర్తెరగకుండా
పలకరింపులకొక పెదవి లేదని అనుకుంటే ఎలా
నీ బేలతనం నా కళ్ళలో చెమరిస్తున్నప్పుడు
ఆ తడిస్పర్శ ఏ కొలమానినికి అందుతుందో చెప్పగలవా

ఆత్మీయ బంధమై నీ నిశ్శబ్దంలోనూ శబ్దం చేస్తూ
నువ్వు కోరుకునే ప్రతి ప్రపంచాన్నీ నేనే అవుతూ
ప్రపంచమంతా ఒక పక్క
నీ స్నేహమంతా మరో పక్కైన
తులాభారంలో
నువ్వే ఎక్కువ తూగుతావ్ ఎప్పుడూ కూడా...
నన్నో  స్వార్ధపరుడిని చేస్తూ  
నా స్వార్ధం మాత్రంనువ్వే...

-      

త్వమేవాహం

హనీ …


తీరాలూ... లోతులూ… హద్దులూ… తెలీని దుఃఖభూమిని నాలో పోతపోసుకుని దిమ్మరిగా తిరుగుతున్నప్పుడు ఒంటరి పచ్చిక బయళ్ళు అల్లరిగా అద్దుకున్న నీ చరణాల పరిమళాలు అనంతంగా ఆవరించి నీ అడుగుల్లోకి నన్ను అమాంతంగా లాగేసుకుంటుంటే నువ్వు చెరపట్టిన నా సమయాలు చెప్తున్నాయ్ అప్పుడప్పుడూ  చెరకూడా శాశ్వతమవ్వాలని కోరిక పుడుతుందని.


ఏ క్షణానికా క్షణం ఓ కొంగ్రొత్త మర్మం వెనుక దాగిపోతుంటే ఆ రహస్యానుభూతుల అమృతత్వంలో అంతం కావాలని అంతరంగం ఎంత ఆశగా ఎదురు చూస్తుందో… అప్పుడెప్పుడో తోవ తప్పిన కాలాశ్వాల కళ్ళాలు ఎప్పటికీ నా చేతుల్లోకి వచ్చేస్తే కనుపాపల తడిభాష ఆర్ద్రంగా మహదానందాన్ని మనసు నిండా అల్లెయ్యదూ.


ఎక్కడెక్కడి ప్రకృతినీ ఆరాధిస్తూ ఆకాశంగా నిర్వచించబడ్డ మహాశూన్యపు ప్రేమే నాకూ ఆదర్శమయ్యిందేమో.


నా మనసు పొత్తిళ్ళ నిండా కూరబడ్డ శూన్యం
నీతోనే మొదలయ్యింది…
నీతోనే నడిచింది…
నీతోనే అంతమయ్యింది...  
నన్ను నిడివంటూ లేని నిరంతర ప్రేమయాత్రకి సిద్ధం చేసి.


నిరంతరంగా వచ్చి పడే రేయింబవళ్ళు నన్ను నీ ఆలోచనాభిషిక్తుడిని చేస్తుంటే  ప్రతి లిప్త నిన్ను నాలో లిఖిస్తుంటే అర్ధం అయ్యింది నా రోజుకి నువ్వు యజమానివని… నీ శ్వాసకి నేనో కట్టుబానిసనని…


మొన్నెప్పుడో  నువ్వు గాలిలోకి విసిరేసిన శబ్దాలు అప్పుడప్పుడూ మౌనంగా  నన్ను ఏకాంతంలోనికి  లాక్కుని వెళ్ళినప్పుడు మనసు కింద పడి మెత్తగా నలుగుతున్న క్షణాలకి కాస్త ఊపిరద్దుతూ ఊసులాడదామంటే  ఓ ఆలింగనంతో ఆత్మైక్యమైయ్యావు.


మరి ’త్వమేవాహం’ అంటే ఇదేనా?

Saturday, 13 June 2015

మానసికశక్తి

ఎవరి వృత్తాలలో / పరిధులలో వాళ్ళు బతుకుతున్నప్పుడు ఎలాంటి సమస్యా ఉండదు కానీ పక్కవాడి పరిధుల్లోకి వెళ్లి కెలికితే అన్నీసమస్యలే. మానసికశక్తితో ఎన్నో రుగ్మతలు నయం అవుతాయని సైన్స్ పరంగానే ప్రూవ్ అయ్యింది. దేవుడున్నాడనో / లేడనో నమ్మకాన్ని ఒకరికొకరు గేలిచేసుకోవటంవల్ల ఆ నమ్మకం ఇచ్చే మానసికశక్తి దూరమై సమాజానికి చెరుపు తప్ప మంచి చెయ్యదు.

లిపి

మౌనమా 
మాటలని వెలిగించు
నిశ్శబ్దాల శబ్దాలని సుందరీకరిస్తూ 
లోకానికి మనసు లిపిని పరిచయిస్తూ

అవసరం

నేను చాలా త్వరపడి లోకంలోకి వచ్చానేమోనని  అనుకున్నానిన్నాళ్ళు...
నిన్ను చూశాక తెలిసింది చాలా ఆలస్యంగా వెళ్ళాల్సిన అవసరం ఉందని...!  


Thursday, 11 June 2015

శకలం

ఎక్కడెక్కడో తొణుకుతున్న స్వప్నశకలాలన్నీ 
ఒక్క చోట చేరి ఓ  సంపూర్ణ చిత్రాన్ని
నాకు సాకారం చేస్తాయనుకుంటున్నప్పుడు  
చివరి వరకూ 
నీకూ నాకు మధ్య నిలుచున్నసమయమొకటి 
అభావంగా మనవైపు చూస్తూ  
తనను భద్రంగా చూసుకునేదెవరూ అనగానే 
చప్పున మీటని నొక్కేసా 
సమయం నావైపు తూగింది 
నన్ను నీ నుండి నిలవరించుతూ   
స్మృతుల అక్షయాన్ని నాలో నింపేస్తూ

తానెక్కడ నీకు భారమౌతుందోనని 
అనుకున్న ఆ ఒక్క క్షణం 
నన్ను జీవితాంతం పరిహాసం చేస్తూ
శూన్యశకలాలని 
నా గుండెకి గుదిగుచ్చుతుంటే 
లోలోని వేదననంతా 
తొక్కిపట్టిన మహానటనని  చూసి 
కనుదోయికీ కన్ను కుట్టినట్లుంది 
చిన్నగా ఒక కన్నీటి తెరని 
లోకానికీ నాకూ మధ్య పరిచింది 


Friday, 5 June 2015

రాయి


రాములోరి గుళ్ళో ఉంది 
రాముడో రాయో తెలియదుగాని 
ఆకలున్నప్పుడు 
కాస్త ప్రసాదమన్నా దొరుకుతుంది 
గుండెలో రాయి పొదిగిన మనిషితో మాత్రం
ఉన్న బతుకూ పగిలిపోతుంది

ప్రమిద


ధాన్యపు గింజలా ఎక్కడో రాలి పడతావ్
ఏ తడి స్పర్శో తగలగానే మొలకెత్తుతావ్
ఎక్కడెక్కడి దుమ్మూ పేరుకుపోతుంటే 
అందరికీ ఓ పిచ్చిమొక్కలా కనపడుతూ 
నీ దారిన నువ్వు కాయలు కాస్తుంటావ్

ఆకలొకటి వత్సరాలుగా లోలోన దరువేస్తుంటే 
ప్రాణం కళ్ళలోకి వచ్చేసిన ఆగంతకుడొకడు
ఆగిపోబోతున్న ఓ బతుకుని సేద తీర్చుకుంటూ 
కడుపారా నిన్ను తింటాడు 
లోకంలో నిన్ను శాశ్వతం చేస్తూ 

ఎవరికెంత పిచ్చిగా అనిపిస్తేనేం
ఒక్క జీవితపు ప్రమిద వెలిగించగలగటం 
నీకు కాక మరెవ్వరికి సాధ్యం?
మనసు తడిలో మొలకెత్తినందుకు 
బతుకుని పొడిబారనివ్వని ఓ కవితా…!
Monday, 1 June 2015

ఆ కొన్ని...

అద్దాలన్నీ కొత్తముఖాలని 
పరిచయించటం మొదలు పెట్టేసాక 
పాతముఖాల ఆచూకి కోసం
చరిత్ర శకలాలని శోధించే వారికి 
చెక్కిళ్ళపై పారే చీకటి కాలువలే 
కొంగ్రొత్త మార్గాలవుతుంటే 
ఏ పగటిని చూసినా 
నల్లటి రాత్రుళ్ళనే వర్షించుకునేవారే 
ఎక్కువైన లోకంలో 
మెరుపుల్లో మునకలేసే 
ముఖాలు కొన్ని కావాలి 
వెలుగు అడుగిడే కాస్త చోటుకోసం 

నవనాగరికత కాలుష్యంలో
నిలకడలేని ఆశల అలికిళ్ళతో   
తమ అస్తిత్వం అదృశ్యమై 
తామసకోరికలే సదృశ్యమై 
మనసులు చిట్లిపోయిన 
మనుషులకి మాట్లువేసే 
మానవత్వపు లేపనమై 
మాటలు కొన్ని రాలాలి 
పేరాశలన్నీ శిశిరాలై 
చరిత పుటల్లో ఒదగడానికి  
జీవితాలు వసంతించటం 
మళ్ళీ మొదలవ్వడానికి

కళ్ళఅంచులలో తారాడుతున్న 
కలలన్నిటినీ కావలించుకోవటమే కాదు 
నెత్తురు ఉరకెత్తిన దేహాల పరిశ్రమతో  
తడి ముత్యాలుగా వీస్తున్న స్వేద పరిమళంతో 
వాస్తవంగా మలచుకోవటం మొదలు పెట్టాలి 
విజయ పతాకపై జీవితం రెపరెపలాడటానికి