మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Wednesday, 6 May 2020

రాత్రి!

రాత్రి ఉన్నంతసేపూ
భయమనిపిస్తుంది
ఇలా ఒక భయమున్నంతసేపూ
ఒక ధైర్యం పుట్టుకొస్తూ ఉంటుంది

రాత్రిని జ్వలిస్తూ పగలొస్తుందనే
యుగయుగాల ధైర్యం ముందుకు నడిపిస్తుంటే
విడిచి రాగలిగినవేమున్నాయని
కాస్తంత భయామూ ఇంకాస్త నిర్వేదమూ తప్ప   

రాత్రి అన్నాక పగటిలోకి నడుస్తుందన్న
నిజమొక్కటి గుర్తించుకుంటే చాలదూ
నువ్వూ… నేనూ… తనూ…
ధైర్యానికి ప్రతిధ్వనులుగా మారటానికి

ఇప్పుడే…
రాత్రిగా మారాలని ఉంది

రేపు ఉదయంగా ప్రపంచాన్ని స్పర్శించడానికి


Friday, 1 May 2020

కాలానిదీ అదే వరసేమో!!!

నీ నిన్న లాగే 
నా నేడు 
తన రేపు 

అదే యుద్ధం 
అదే గాయం

వాళ్ళూ అంతే 
మాట మార్చని  నిజాయితీతో 
అవే  మాయనవ్వులు 
అవే వాగ్దానాలు 
లోకానికి మరోవైపుని 
ఒక రంగుల కలగా 
ఇక్కడ విరజిమ్ముతూ 

ఇదింతే… ఒక వలయం
నిన్న... నేడు... రేపు...
నువ్వు... నేను... తను... 
గాయాలుగా సిద్ధమవుతూ

వాళ్ళూ అంతే … 
నిన్న... నేడు... రేపు...
ఒకరి వెనుక మరొకరు 
గాయాలని సిద్ధం చేస్తూ 

కథలన్నీ ఒక్కలానే ఉంటాయ్ 
వేరు వేరుగా చెప్పబడుతూ 

లోకానికి మరో వైపునా
ఇదే కథ జరుగుతూ ఉంటుంది 
మరో పేరుతో 
ఇదే వలయాన్ని కొనసాగిస్తూ 

గతమింకా కొనసాగుతూనే ఉంది 
నిన్నటి నుండి నేటిలోకి
నేటి నుండి రేపటిలోకి  
భవిష్యతూ తనదేనన్న గర్వంతో

భూమెప్పుడూ గుండ్రంగానే చెప్పబడుతుంది 

కాలానిదీ అదే వరసేమో మరి