మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Friday, 4 July 2014

వెన్నెల కుసుమం - 10

నా హృదయ వనం లో విరబూసిన గులాబీ... 
అవును నువ్వు గులాబీవే...
అందమైన గులాబీ వెనకే ముల్లు ఉంటుందని తెలియని మరచిన నేను దాని కోసం ప్రయత్నించినప్పుడు నా చేతిలో దిగిన ముల్లులాంటి అడ్డు... నిన్ను వరించిన నాకు ఉందని తెలుసుకోలేక నీ కోసం నీ ప్రేమ కోసం తపించాను. రోజా వెనుక ముల్లు ఉండవచ్చు కానీ తన సోయగం మాత్రం ఎంత అద్భుతం... నీ మనసు కూడా అంతకన్నా అద్భుతమే కదూ...
ప్రియ సఖీ...
చెరగని నీ చిరునవ్వున విరిసిన అందం నా మనసుని దోచిన మకరందం.... వికసించే నీ అధారాల మెరపులు కలిగించెను నా మదిలో వలపు రాగాలు.
నీ అమృత హస్తాల స్పర్శ నా ఈ చిన్ని గుండెలో రేపెను ఎన్నడూ లేని అలజడి. నా సన్నిధిన నువ్వుంటే నా ఎదలో మొదలయ్యే సన్నాయి మేళాలు యుగాలు గడుస్తున్న్నా ఆగవేమో...
మారే ప్రతీ క్షణం నిన్నే జపిస్తూ... నా లోని ప్రతి అణువూ నిన్నే స్మరిస్తూ నాలో ప్రవహించే ప్రతి రక్త బిందువూ నిన్నే తలస్తూ ప్రేమ మత్తులో తమను తాము మరచి నీకోసమే తపించేలా చేస్తున్నాయి నా హృదయాన్ని.
ప్రియతమా... అందాల హృదయమా...
నీ మోమున చిరునవ్వు విరిసినప్పుడు నింగిలోని తారకలన్నీ నిన్ను అసూయగా చూస్తున్నాయి... నీ చెక్కిలి చిరు సిగ్గుతో కందినప్పుడు ఆ గులాబీలు నిన్ను చూసి వెలవెలబోతున్నాయి

నీ అందాన్ని ఆరాధించే హృదయం నాది
నీ నయనం విరిసిన నవ్వులు నావి
నీ చెక్కిలి మీటిన కాంతులు నావి
నీ అధరం పలికిన పలుకులు నావి
ఇన్ని ‘నావి’ లు ఉన్నా నువ్వెక్కడో... నీ ఉనికెక్కడో... ఏ రెక్కలతో ఎగసి రాను నీ చెంతకు? ఎక్కడ ఉందో నువ్వున్న నా ఊహా లోకం.
నీ ఊహలే ఊపిరిగా నను కమ్ముకుంటుంటే మదిలో ఏవో కొత్త రాగాలు, అవి ఏ మురళీ వినిపించని నవ్య రాగాలు. నీ శ్వాసలే రాగాలై నను చుట్టేస్తున్నాయ్ కదూ...
అణుమాత్రం చోటు లేకుండా నీ రూపునే నాలో నింపేశాక కూడా ఇంకా నీ కోసమే...
నీ కొత్త నవ్వుల కోసం
నీ కొత్త మాటల కోసం 
నీ కొత్త ఊహల కోసం
నీ కొత్త తలపుల కోసం
నన్ను నేను అక్షయ పాత్రగా మార్చుకుని వేచి చూస్తున్నా.
అనుకోకుండా నువ్వు ఎదురుగ వస్తే నా మాట మౌనం అయిపోదూ... నీ సన్నిధిన నా మది మూగదై పోదూ... అటుపై నీ మాటే మంత్రమై నను కమ్ముకు పోదూ...
నీ మాటల్లో సెలయేళ్ళు గలగలమంటుంటే వన విహారానికి వచ్చిన దుష్యంతుడు శకుంతలకి దాసోహం అయినట్లుగా నీ మాటల్లోకి ఇంకిపోతానేమో...
నువ్వు ఎదురుగా ఉన్నంత సేపు అనిమిషుడి గా మారి పోతాను. అందులో సందేహమే లేదు. రెప్పపాటు క్షణమైనా కనురెప్ప కదిలిస్తే తమని నీ వీక్షణకి దూరం చేశానని ఆ క్షణాలే నా మీద కత్తి కడతాయేమోనని భయం. నీ రూపం ఎదురుగా ఉన్నంత సేపూ మైకమే మరో ఆలోచనే దరి చేరనివ్వకుండా... మరో దృశ్యమే కంట బడనీకుండా...
ఆకాశంలో అల్లనల్లన కదులుతున్న మేఘాలు నీ అందం చూసి చందమామ నడిగి వెండి వెన్నెలని కలుపుకుని తుషార బిందువులని నీ మేనిపై కురిపించి నిన్ను వెన్నల రాణిగా తీర్చి దిద్దేనేమో.
నీవు తప్ప వేరే కోరిక ఉంటుందని కూడా మర్చిపోయింది నా మనసు.
ఎందరెందరి కళ్ళతోనో నిన్ను చూశాను. ఏ కంటితో చూసినా నీవో అందాల అప్సరసలానే కనిపించావు. ఎవరి కల్లో ఎందుకని నా కళ్ళ తోనే నిన్ను చూశాను. చాలా ఆశ్చర్యం. నా కళ్ళకి అప్సర కనిపించలేదు... నా మనసే అక్కడ కనిపించింది. ఎంతటి ప్రేయసివైనా నా మనసుని దొంగిలించేసి దాన్ని నీలోనే దాచుకోవటం భావ్యమా ప్రియా...!

ప్రతీ సాయంత్రం నిన్నో కొత్త ఊహతో పలకరిద్దామని అనిపిస్తూ ఉంటుంది. ఏ ఊహతో నిన్ను పలకరిద్దామని అనుకున్నా దానికన్నా మరో అందమైన ఊహ నా తలపుల్లో దోబూచులాడుతూ ఉంటే ఇక నా ఊహల ఊసులేమి చెప్పను నీకు?
ఓ వెన్నెల కన్యా... జాబిలి మీద జతగా విహరిస్తూ మృదు మధుర సంగీతాన్ని పలికిస్తూ ప్రేమ రాగాలని పలికిస్తూ చందమామ వడిలో ప్రణయ వనాన్ని సృష్టిద్దామా.

అందమైన వెన్నెల రాత్రిలో చందమామతో తారలు సరాగాలాడుతున్న సమయాన జాబిల్లి నుండి ఓ వెన్నెల కిరణం నీ మేనిపై పరావర్తనం చెందినప్పుడు మెరసిన నీ విద్యుల్లతా రూపం వెండి శిల్పంలా నా మదిలో తిష్ట వేసుకుని ఎడతెగని మధుర భావ ప్రపంచానికి నన్ను తోడ్కొని పోతున్నది.

వెన్నెల దీపమై నువ్వు నాలో కొచ్చాక ఆఖరి శ్వాసల్లో ఊగిసలాడుతున్న నా ఊపిరికి ప్రాణం పోసాను. శూన్య లోకంలోకి జారుకుంటున్న నా అంతరాత్మకి జీవం అయ్యావు. ఆరిపోతున్న ఓ మందహాసానికి నిత్యవాసంతాన్నే ఇచ్చావు.

ఓ బ్రహ్మ మానస పుత్రికా... బ్రహ్మ సరస్వతీ దేవితో సరససల్లపాలాడుతూ... రతీదేవి తనూ లావణ్యాన్ని, లక్ష్మీ దేవి పసిడిఛాయని, పార్వతీ దేవి ఆత్మ స్తైర్యాన్ని, సరస్వతీ దేవి జ్ఞానాన్ని రంగరించి నాలుగు యుగాల నిద్రను మరచి ఓ మెరపు తీగకు ప్రాణం పోసి భూలోకానికి పంపటానికి చాలా బాధ పడుతూ నీ లావణ్యాన్ని క్షణ క్షణమూ కంటికి రెప్పలా కాపాడుతూ నీ అందం యుగ యుగాలకీ కావ్యంలా నిలిచి పోవాలని నీ తోడుగా నన్ను పంపి నీ నీడగానే కనుమరుగవ్వమన్నాడు.

ఓ అభినవ అభిసారికా...

ఎన్ని యుగాలు నీకై వేచి ఉండను?  ఎన్ని ఇతిహాసాలు ఎదురు చూడను? ఎప్పటికీ నిన్ను ఆరాధిస్తూ... నీ మీద కావ్యాలు రాస్తూ... ఉండి పోవాల్సిందేనా...

జతగా చేరి నీలో ఐక్యం అవ్వటానికి ఇంకెన్ని యుగాలు చూడాలి... నీ వియోగం లో క్షణమే ఒక యుగం లా అనిపిస్తుందే... యుగాలుగా...  యుగాలకి యుగాలు నన్ను ఎదురు చూడమంటూనే ఉంటుంటే, ఆ ఎదురు చూపుల్లో నా కళ్ళ నుండి కారే రుధిరాశృవులు నీ కంట బడకుండా ఉండటానికి సహస్ర విధాలా ప్రయత్నిస్తూ ఒక వేళ నీ కంట బడినా అవి రుధిరాశృవులు కాదు కుంకుమధారలు అనే చెప్తాను.
ఎందుకంటే నా కన్నీటికి కరిగి కాదు నువ్వు నా చెంతకు రావాల్సింది... నిన్ను తడిమే నా ప్రేమ స్పర్శ తడితో నా మనసుని అర్ధం చేసుకుని..!

ఏదేమైనా కానీ ఎన్ని యుగాలు గడచినా కానీ నీపై నా ప్రేమ వాడదు. తరాలు మారినా నా తలపుల నెచ్చెలివి నీవే...  ఎన్నాళ్ళు ఆడుకుంటాడో ఆ బ్రహ్మ నాతో.. అదీ చూస్తాను.

షాజహాన్ కట్టించిన తాజ్ మహల్ గొప్ప ప్రేమ చిహ్నమట... నా దృష్టిలో మాత్రం అది వేలాది కార్మికుల రక్తంతో తడిసిన ఓ సమాధి మాత్రమే. అదే నా హృదయాన్నే చూడు... నా మనసులో నీకై నే నిర్మిస్తున్న మనోమందిరం చూడు... కోట్ల ఊహలని ఊపిరి ఉలులతో చెక్కుతూ నే నిర్మిస్తున్న ప్రేమ మందిరం అది. ఒక్క సారి చూస్తే అదే నీ శాశ్వత స్థావరం చేసుకోవటానికి ఉవ్విళ్ళూరతావు.

నువ్వో అందాల హరివిల్లువి అని కదూ నీ శరీరాన్ని విల్లుగా చేసి మన్మధుడు నా మీదకి పూల బాణాలు ఎక్కుపెడుతున్నాడు. సప్తవర్ణాలు మిళితమైన నీ మేని కాంతి నా మనసులో ప్రేమ దీపానికి  కొత్త మెరుగులు దిద్దుతూ ఉంది. నీ మేనిపై వెన్నల రజనులా మెరస్తున్న స్వేద బిందువులు నువ్వు పడుతున్న కష్టాన్ని తెలుపుతున్నాయ్...

వీలు కుదిరితే నీ ప్రతి పనినీ నేనే చేసి నీకు ఎలాంటి శ్రమ లేకుండా చేద్దును కదా... చంద్రబింబం వంటి నీ ముఖారవిందం ఎంతతో ప్రశాంతతని కలగజేస్తుందో అది అనుభవిస్తున్న నాకే తెలుసు. వెన్నలని పాంచజన్యంలో రంగరించి చేసినట్లు ఉన్న నీ కంఠం ఎంత సుందరం గా ఉంది... ఆ కంఠం నుండి జాలు వారే ప్రతి పదమో అద్భుత గానంలా నన్ను దేవతాలోకాల్లో విహరింప చేసేలా ఉంది.

సమున్నత శిఖరాలు లోతే తెలియని లోయలూ ఇసుక తిన్నెలూ... ఏమిటబ్బా ప్రకృతికీ నీకూ తేడా? నువ్వే ప్రకృతి కదూ...
కుబుసం విడిచిన ఎలనాగిని అంత నాజూకుదనం నీలో...  ఇంద్ర సభలో నాట్యమాడే నాట్య మయూరులైన రంభ , ఊర్వశి, మేనక, తిలోత్తమల అందం నీ సాటి వస్తుందా...

ఆ నాట్య మయూరే నిన్ను చూసి నాట్యం నేర్చుకుని ఉంటుందేమో కదా... రాజహంస మాత్రం ఏమి తక్కువ నీ నడక చూసి నడక నీర్చుకుని ఎన్నెన్ని హొయలు పోతుందని !

సీతమ్మ వారినే మాయ చేసిన మాయలేడికున్న బంగారు వన్నె మేని కన్నా... పసిడి కలసిన గులాబీ సోయగాల నీ తనూ లావణ్యమే ఎంతో అద్భుతం కదూ.

ఓ బంగారు వన్నె చిన్న దానా నీ వళ్ళంతా బంగారు తాపడం చేసినట్లే మెరుస్తూ ఉంటుందిగా... నువ్వే పరసువేదిగా మారి నా శరీరాన్ని కూడా స్వర్ణ మయం చేయవూ..!! 

ఓ ప్రియా! రెప్పపాటు క్షణపు విరామంలో కూడా నీ వియోగాన్ని నే భరించలేను.

ఓ ప్రియా..

నీ తనువూ ఒక తంత్రిగా 
నా హృదయం ఒక స్వరమై 
నీ మనసే ఒక పల్లవిగా 
నా ప్రాణమొక చరణమై 
ఒక నూతన సంగీత సామ్రాజ్యాన్ని ప్రపంచానికి అందిద్దామా... 

'సరిగమపదని' సప్త స్వరాల సంగీత సామ్రాజ్యంలో 'ప్రేమ' పదనిసలే ఒక సంగీతమై ఒక కొత్త రాగాన్ని సృష్టిస్తున్నాయి. ప్రేమశక్తి ముందు 'రోహిణీకార్తె' ఎండలైనా పున్నమిరేయి  వెన్నెలలు కావా...! 

వేడి గాలుల వడదెబ్బ  అయినా మల్లెచెండుల చిరుదెబ్బే కదా.. 

నీలాంటి అందాల హరివిల్లు నా పక్కన ఉంటే ప్రతి క్షణమూ ఎవరో  ఒకరు నిన్ను తమ స్వంతం చేసుకోవటానికి వస్తూ ఉంటారేమో. నిన్ను స్వంతం  చేసుకోవాలంటే నా అడ్డు తొలిగించుకోవాలని తెలిసీ సాహసించే పిచ్చి వాళ్ళు. వాళ్లకి తెలియని నిజం ఏమిటంటే నువ్వు నా పక్కన ఉంటే నాలో కోటి ఐరావతాల బలం నాలో వస్తుందని.

అమర ప్రేమ చరిత్రలో లిఖితమైన పార్వతి, అనార్కలి, లైలా, జూలియట్, ముంతాజ్, భాగమతి...ఇంకా రాధ... నువ్వు వీళ్ళందరి అంశతో జన్మించిన ప్రేమ మూర్తివి అని నా భావన. ఇంతటి అందాల ప్రేమ మూర్తివైన నీ సాన్నిహిత్యాన్ని  నాలోని అణువణువూ క్షణక్షణమూ  కోరుకుంటూనే ఉంటుంది.

నా భావనలో...
నీవు ఒక మోనాలిసా చిత్రం లాంటిదానివి కాదు... కానే కాదు... అది జీవం ఉట్టిపడే చలనం లేని బొమ్మ మాత్రమే... నీవు మాత్రం నెమలికి నాట్యం నేర్పే నటరాజ వరపుత్రికవి.

కాళిదాసు కావ్య కన్నియవా... కాదు కాదు... కాళిదాసు వర్ణించిన శకుంతల కన్నా కోటిరెట్ల తనూ లావణ్యంతో అద్భుతమైన అందంతో ప్రకాశిస్తున్నావు.

'లలిత సౌభాగ్య లావణ్యరాశి సుందర సుకుమార తేజో విలాసి పసిడి కలసిన ఒంపు సొంపుల రూపసి మధుర మందార చెక్కిళ్ళ నా ప్రేయసి'

రవివర్మ చిత్రానివో
బాపు బొమ్మవో కాదు.
అద్భుతమైన నా ప్రేమ తీరానివి
అచ్చ తెలుగు భావానివి
నా గుండెల్లో గూడు కట్టుకున్న అందమైన అనుభవానివి నీవు...

Sunday, 8 June 2014

నిశ్శబ్దంలో నీ అలికిడి




ఓయ్…


ఇదిగో ఇది నీకే... అచ్చంగా నీకే…


‘అందరిలా నేను కూడా నీతో పైకి నవ్వుతూ... లోపల తిట్టుకుంటూ’ భలే ఊహించావ్ కదూ... నిన్ను దాటి వెళ్ళే ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టుకుని నా మనఃకుటీరంలో దాచుకుంటూ మళ్ళీ మళ్ళీ ఆ క్షణాలని తడుముతూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ వాటి అమరత్వంలో అహరహం ఉండిపోవాలని, రాలి పడే నీ నవ్వుల్ని ఏరుకుంటూ... నా శుష్క మందహాసాలపై అతికించుకుంటూ నా నవ్వులకీ జీవం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉండే నా గురించి.


అయినా నన్ను చూస్తే నీకు ఇవన్నీ కనిపించవు. కనిపించకూడదనే నేనూ కోరుకుంటాను. ఎందుకంటే నా లోపలి అలజడిని నువ్వు గమనిస్తే, నిన్ను బాధపెట్టినవాడినవుతానేమో అన్న భయం నన్ను ఆపేస్తుంది. అందుకే నా బాధలకి మందుగా మౌనాన్ని ఆవాహన చేసుకుని, దాన్ని నవ్వు వెనక దాచడం నేర్చుకున్నాను. కొన్ని సార్లు నిజంగానే నవ్వుతున్నానేమో అని నేనే నన్ను మోసం చేసుకుంటాను కూడా. కానీ నువ్వు ఒక్క మాట అడిగినా, ఒక్కసారి అలా నిలబడి చూసినా…. నా లోపల కట్టలు తెగిపోతాయి. 


అప్పుడే తెలుస్తుంది… 

ఈ మౌనం బలం కాదు, నిన్ను కోల్పోకూడదనే భయంతో కట్టుకున్న ఒక నిశ్శబ్ద కవచం మాత్రమే అని.

నిన్ను కోల్పోవడమంటే నన్ను నేను కోల్పోవడమే కదా!  కొన్ని అనుబంధాలు పేర్లు కోరుకోవు. అవి ఎలా పుడతాయో తెలియదు ప్రాణాన్ని పట్టేసుకుంటాయి. మన మధ్య కూడా అలాంటి బంధమే ఉంది అనిపిస్తుంది. మాట్లాడినప్పుడే కాదు, మాట్లాడకుండా ఉన్నప్పుడూ నిలిచిపోయే బంధం! నీ నుండి నాకేదో కావాలనో, నువ్వు నాపక్కనే ఉండిపోవాలనో కాదు…

నీ ఉనికొక్కటి చాలు… నా ఊపిరి కొనసాగడానికి. అంత సున్నితంగా కదిలించే అనుభూతి ప్రేమలోనే ఉంటుందనుకుంటారు. కానీ అది అక్కడే ఆగిపోదు. దాన్ని మించి నిశ్శబ్దంగా, స్వార్థం లేకుండా నిలిచిపోయేది ఈ స్నేహమే….  మన స్నేహమే! 

నిన్ను చేరుకోవాలన్న తొందర లేదు, నిన్ను దూరం చేసుకునే ఆలోచన లేదు! నాకు తెలిసినదల్లా నీ పక్కనే నడుస్తూ, నీ నడకకి అడ్డు రాకుండా ఉండటమే! అందుకే నా మాటలు నిన్ను పట్టుకోవు, నా మౌనం నిన్ను వదలదు. ఇది ఆకర్షణ కాదు, అలవాటు కాదు… నువ్వు నాతోనే ఉన్నావన్న నిజానికి అలవాటుపడిపోయిన ఒక నిశ్శబ్ద స్నేహం.

మౌనంగా నువ్వు చేస్తున్న ఒక ఊపిరి సంతకం. 

మన అనుబంధం మాటలుగా తృళ్లిపడటానికి కాదు. అది నిశ్శబ్దంగా లోపలే నిలిచిపోయి, అవసరమైనప్పుడు మాత్రమే స్పందిస్తుంది. ఏ పరాకో, ఇంకే చిరాకో సతాయిస్తుంటే అప్పుడొచ్చాస్తావ్ నువ్వు… నువ్వంటే నువ్వు కాదులే!  నీ అలికిడి! ఆలోచనల్లోకి చేరి ఊరడిస్తున్న అలికిడది. నా ఊపిరి ఒక్కసారి తడబడితే అది పేరు చెప్పదు, కానీ నీ ఉనికిని గుర్తుచేస్తుంది. అందుకే నువ్వు దూరంగా ఉన్నప్పుడూ నాకు శూన్యంగా అనిపించదు. నువ్వు లేకపోయినా నేను కూలిపోను… ఎందుకంటే నువ్వు ఇచ్చిన స్నేహమే నన్ను నిలబెడుతుంది. అది ఒక్కసారిగా బాధగా మారదు, శబ్దం చేయదు. లోపల నెమ్మదిగా పనిచేస్తూ, అవసరమైనప్పుడు మాత్రమే కన్నీటిగా బయటపడుతుంది.

అందుకే కొన్ని స్నేహాలు చివరికి భావాలుగా కాదు… శరీరంగా స్పందిస్తాయి. మనదీ అంతే. 

గుండె కన్నీరవ్వటం ఎప్పుడైనా చూసావా?


నీ కళ్ళు చెమరించినప్పుడు ఒక్కసారి నా గుండెని తాకి చూడు… వరద గోదావరి ఉరవడిలా లోపలే ఉబికివచ్చే కన్నీటి తడి నీ వేళ్లకు అంటుతుంది. ఇంకా చెప్పాలంటే గుండె దాకా ఎందుకు… ఆ క్షణంలో ఒక్కసారి నా కళ్ళల్లోకి సూటిగా చూసినా చాలు…  నా చూపుల్లో సుళ్లు తిరుగుతున్న కన్నీటి సుడిగుండాల్లో నీ చూపులే చిక్కుకుపోతాయి.

ఆ క్షణాల్లో నాకు ఏడవాలనిపించదు. నీ కళ్లలో కనిపించే ఆ బాధే నన్ను కదిలిస్తుంది. అది నాలో కన్నీటిగా బయటకు రావాలనుకున్నా, ఎలా నిలబడాలో నీ దగ్గర నేర్చుకున్నవాడిని కదా… తట్టుకుంటాను. ఆ క్షణంలో నేను బాధలోకి జారను. బాధ్యతగా మారిపోతాను. నువ్వు అలా నిలిచిపోయినప్పుడు నిన్ను ఎలా నిలబెట్టాలి అన్న ఆలోచన తప్ప మరొకటి నాకు ఉండదు. అందుకే ఆ సమయంలో నా మనసు తనని తానే అదుపులో పెట్టుకుంటుంది.

కొన్ని సార్లు నీతో మాట్లాడటం కన్నా నీ దగ్గర కూర్చోవడమే చాలనిపిస్తుంది. ఆ నిశ్శబ్దంలోనే నా మాటలన్నీ కరిగిపోతాయి. చెప్పాల్సినవి మిగలవు, దాచాల్సినవీ ఉండవు. అలా ఏమీ జరగనట్టు గడిచే క్షణాలే  నన్ను నాకు ఇస్తూ ఉంటాయి. అప్పుడే నాకు తెలుస్తుంది… నా మనసు ఎక్కడ అలసిపోయినా, నిశ్చింతగా తలదాచుకునే చోటు నువ్వేనని.  

ఏదో రాస్తున్నాను కానీ నా మనస్సులో చెలరేగే ప్రతి ఘర్షణని నీతో పంచుకుంటున్నప్పుడు నువ్విచ్చే ఓదార్పు మంచు వరదలా నా మనసుని చుట్టి నన్ను చల్లబరుస్తుంది. అప్పుడు నేను అనుభవించే నీ మనఃస్పర్శని ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు తెలియరావటం లేదు. అంత అవ్యక్తానుభవాన్ని నాకిచ్చేది నువ్వే... అవును కేవలం నువ్వే. నీ ముఖంలో నువ్వు దాచే భావాలని వెలికి తీసి చదవటం నాకెంత ఇష్టం అయిన పనో... నీను చదివిన భావాలే నువ్వు దాచుకున్నవి కూడా అని తెలిసినప్పుడు నా మనసు పడే మిడిసిపాటు నీకు తెలియదు కదూ…


నేను చెప్తుంటే ఏదో అనుకుంటావ్ కానీ నీ నవ్వుల నజరానా నా మనసుకి సంజీవనియై కొత్త కొత్త ఊహా పరిమళాలని నాలో వికసింప చేస్తూ ఉంటుంది. అందుకేగా ఒక్క సారి నవ్వు మరో సారి నవ్వూ అంటూ నిన్ను బతిమలాడి నీ నవ్వులని ఏరుకునేది. నీకు తెలియదు కానీ నిన్ను గురించి నేను తలస్తున్న తలపులని పదాలుగా మారుస్తూ మది పలక మీద నేను దిద్దే అక్షరాలని చదవటానికి యుగాలు కూడా చాలతాయో లేదో…


రెప్పలు చీకటించినప్పుడల్లా వెలుగై కనుపాపల్లో నిలబడిపోతావ్ కదా నువ్వు.


ఆ సమయం లో కాస్త నా మనసులోకి తొంగి చూసి అక్కడ ఏముందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యవచ్చు కదా... మ్మ్ హు. అది మాత్రం చెయ్యవు. రెప్పల కవచాల్లో నులి వెచ్చగా ఒదిగి పోయి స్వప్న లోకాల్లోకి తీసుకుని వెళతావ్ కానీ నా కంటి భాష మాత్రం చదవవు కదా…


నువ్వు పరిచయం అయ్యాక నీతో పంచుకోని విషయాలు ఏమీ లేవు. అచ్చు నీకూ అంతే అని నాకు తెలిసినప్పుడు నా చిన్ని గుండెకు నేనిచ్చుకున్న భరోసా నువ్వు చూడలేదు. చూసి ఉంటే తెలిసేది నాలో నీకు నేనిచ్చుకున్న స్తానం ఏమిటో. కొంత మంది క్షణం మాట్లాడినా వినలేని నేను... నువ్వు ఉన్నప్పుడు ఓ క్షణం నువ్వు మౌనిస్తే నాకెందుకు ఊపిరాగిపోయిన అనుభూతి.


నేనో చిన్న పరిమళాన్నై వ్యాపించి నీ అంతరాలయంలో నిండి పోవాలని ప్రగాఢంగా కోరుకుంటున్నాను. నా మన:క్లేశాలన్నీ తెలిసిన ఒకే ఒక్క ఆత్మీయ స్నేహానివి నువ్వు... నీకు నేనూ అంతే కదూ... ఎన్ని గాయాలైనా కానీ నా మనసుకి... మందు మాత్రం నీ నవ్వే.


నా జీవిత పర్యంతం నీ స్నేహితుడిగా ఉండాలనే కోరికే నాకెప్పుడూ... 

నిన్ను తాకిన సమీరం నన్ను తాకేంత సమీపంలో
ఎలాంటి హామీలు లేకుండా,
జీవితాంతం ఉండాలని నా ఆశ.


చివరిగా ఓ కోరిక... కాసింత వెన్నెలివ్వరాదూ ఓ నవ్వు నవ్వి...


నీ…



స్నేహితుడు


Tuesday, 3 June 2014

నువ్వు పరిచయం చేసిన 'నేను’.

ఓ నా స్నేహమా... 

జీవితపు ప్రతి మలుపులోనూ ఎందరో పరిచయస్తులు... కొందరు హితులవుతారు... ఇంకొందరు స్నేహితులవుతారు... మరి కొందరు మన జీవితమే అయిపోతారు. 

అయితే ఈ తేడా వెంటనే అర్థమయ్యేది కాదు. కాలం తేల్చే విషయమది. సుఖంలో కాదు... కష్టంలో, దుఃఖంలో, అసహనంలో, అయోమయంలో, మనకు మనమే అర్థం కాకుండా పోయే క్షణాల్లో ఎవరు పక్కన నిలిచారో తేల్చేది కాలమే. అందుకే పరిచయాలు ఎక్కువగా ఉంటాయి... స్నేహం మాత్రం అరుదుగా దొరుకుతుంది. 

చాలామంది తమ పరిచయస్తులనే స్నేహితులని భావించేస్తూ ఉంటారు... కానీ పరిచయస్తులు అందరూ స్నేహితులు కాలేరు అన్న నిజం తెలుసుకున్న రోజున ఆ నిజాన్ని జీర్ణించుకోవడం వారికి సాధ్యం కాదు. ఎందుకంటే అప్పటిదాకా మనం నమ్మిన అనుబంధాలన్నీ ఒక్కసారిగా తేలికపాటి జ్ఞాపకాలుగా మారిపోతాయి. ఆ ఖాళీని అంగీకరించడమే కష్టం. 

అందుకే నా జీవితంలో చాలా మంది పరిచయస్తుల్లాగానే మిగిలిపోయారు. అతి కొద్ది మంది స్నేహితులయ్యారు. అయ్యారా? బహుశా లేదనుకుంటా... నాకంటూ స్నేహితులెవరున్నారని? సమాధానం వెతుకుతూనే ఉన్నాను. 

మరి ఇదేమిటో కొత్తగా... 

నీ పరిచయం నాకు నన్ను పరిచయం చేసింది...! నాలోని నిజమైన నన్ను వెలుపలికి తీసింది...! 

కేవలం పరిచయం మాత్రమే కదా ఎప్పుడూ పలకరింపులెందుకూ అనుకుంటూ ఉంటుంటే... మనసెందుకో ఊరుకోవటం లేదు... ఏదో అపూర్ణత నన్ను తిరిగి నీ వైపు నడిపిస్తుంది. అది అలవాటు కాదు... అవసరం కూడా కాదు... అయినా వదిలేయలేని ఒక స్పష్టతలేని బంధంలా అనిపించింది. 

నిన్ను నీకు పరిచయం చేసిన వ్యక్తితో నీకుంది కేవలం పరిచయమేనా? స్నేహం లేదా? అన్న ప్రశ్నలో చిక్కుకుపోయాను. సమాధానం కోసం ఎవర్ని అడగను? 

ఉన్నానుగా...

నువ్వు పరిచయం చేసిన 'నేను. 

సమాధానం బయటకొచ్చింది.... నాకున్న నిజమైన స్నేహం నువ్వేనని! 

ప్రేమలో ఎదురు చూపులుంటాయని తెలుసు కానీ... స్నేహితులతో మాట్లాడటానికి కూడా మనసు తహతహ లాడుతుంది అని నీ స్నేహం పొందాకే తెలిసింది. నీ పేరు తలచినప్పుడల్లా మనసు కాస్త తేలికపడటంరోజంతా భారంగా అనిపించిన ఆలోచనలు నీ మాట వినగానే సద్దుమణగటం... స్నేహమంటే ఇంతకంటే ఇంకేముంటుంది? 

నీతో మాట్లాడే ప్రతీక్షణం నా తప్పొప్పులు అన్నీ అద్దం లో కనిపించినంత స్పష్టంగా నాకు తెలుస్తూ ఉన్నాయి. నువ్వు తప్పు అంటున్నావని కాదు... నేనే నా తప్పుని ఒప్పుకునేంత నిజాయితీ నాలో మిగిలిందని తెలుస్తుంది. నేను ఏం చెయ్యగలనో... ఏమి చెయ్యాలో... ఎలా బతకాలో అన్నీ చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్లుగా అర్ధం అవుతుంది. ఎవరో చెప్పిన సలహాల్లా కాకుండా, నాలో నుంచే వచ్చిన నిర్ణయాల్లా అనిపిస్తాయి. 

మనం మాట్లాడుకున్న రోజులు కాదు,

మనం ఊరుకున్న క్షణాలే

ఎక్కువగా గుర్తుంటాయి.

 

అక్కడ

అవసరాలు లేవు,

అంచనాలూ లేవు

కేవలం ఉండటం మాత్రమే.

పిరికి మనసుని సమాధి చేసి మొమాటపు నవ్వుల్ని తుడిచేసి బతుకుతున్నానంటే అదంతా నీ స్నేహపు గొప్పతనమే... నువ్వు నన్ను మార్చలేదు... నన్ను నాకే తిరిగి నిజాయితీగా అప్పగించావు. కానీ ఆ నిజాయితీ ఎప్పుడూ మాటలుగా బయటకు రావాలని లేదు. కొన్ని భావాలు చెప్పలేనంత దగ్గరగా ఉన్నప్పుడు మాటలే వెనక్కి తగ్గుతాయి. 

మాటలు తగ్గిన చోట

మన స్నేహం మొదలైంది.

అక్కడ
ప్రశ్నలు లేవు,

సమాధానాల అవసరమూ లేదు. 

ఒక్కోసారి గలగలా మాట్లాడతావు... మరోసారి మాటలే అవసరం లేనంత దగ్గరగా ఉంటావు 

అలా అలా మాట్లాడుతూ అర్ధాంతరంగా ఆపేసిన నీ మాటల వెనక నిశ్శబ్ద అర్ధాలు ఏ నిఘంటువుల్లో వెదకాలి? 

ఎన్ని నిఘంటువులు వెదకినా నీ గురించి నేను చదవబోయే అర్ధం ఒక్కటే... నువ్వంటే స్నేహం అని. 

మాటలు చాలనప్పుడు
మౌనమే మిగిలింది,
అది ఖాళీ కాదు
అర్థవంతమైన నిశ్శబ్దం.
 

చెప్పాల్సినవన్నీ
మిగిలిపోతేనేం
నన్ను నేను

అర్థం చేసుకునే

ప్రయాణంలోకి నడిపించాక 

అందుకే
నువ్వు 

నా పక్కన ఉన్నప్పుడు

నేను
నాకంటే ఎక్కువగా
నేనవుతాను.
 


నీ

స్నేహితుడు.
  



Thursday, 29 May 2014

'మృతంజీవుడివే' తారక రామా





తారక రామా...
విశ్వ విఖ్యాత నట సార్వభౌమా...
నట రత్నా...
తెలుగు కళా వల్లభా...
అభినవ ఆంధ్రభోజా....
అన్నా...

ఎక్కడున్నావయ్యా నువ్వు...? అసలు ఎలా పిలవాలి నిన్ను? ఒక్కో గుండె ఒక్కోలా నిన్ను పలకరిస్తుందే. ఒక్కో నయనం ఒక్కోలా నిన్ను చూస్తుందే. మరెందుకయ్యా మా పిలుపులని వినకుండా చూపులకి అందకుండా అంత త్వరగా వెళ్లిపోయావ్.

చలన చిత్రాల్లో కథానాయకుడివి... జన క్షేత్రం లో ప్రజా నాయకుడివి...

తెలుగు జాతికి తారక మంత్రం వేసేసి నీ పాటికి నువ్వు దిగంతాలకి సాగిపోతే సదా నిన్నే స్మరించే సామాన్యుల సంగతి ఏమిటి? మీ ఇంట్లో వాళ్ళ సంగతి ఏమో గానీ మామూలు మనుషులు ‘ఎన్టీవోడు’ అంటూ ఎంత స్వంతం చేసేసుకున్నారు నిన్ను?

దిగంత లోకాలలోనూ తెలుగు ఖ్యాతిని ఇనుమడింప చేద్దామని వెళ్ళిపోయావ్ కదూ అంత త్వరగా...

తెలుగు వారి రాముడుగా, కృష్ణుడుగా, సినిమా దేవుడుగా ఎన్ని వేషాలు? ఎన్నెన్ని పాత్రలు... పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసే వాడివి కదా... చలన చిత్రాల్లో నువ్వు వేసిన పురాణ పాత్రలు చూసి నిజంగా దేవుడే దిగివచ్చినా తనలో నీ పోలికలు కనిపించక పోతే తనని దేవుడిగా అంగీకరించలేని జాతిగా మార్చేసావ్ కదా తెలుగు వాళ్ళని.

లోకం విడిచి 17 ఏళ్ళు గడిచినాక కూడా తెలుగు దేశమే కాదు మొత్తం భారతదేశం లోనే మహానటుడిగా పట్టం కట్టిన ప్రజలున్న దేశం లో ప్రభుత్వాల రాజకీయాలకి వట్టి పద్మశ్రీ గా మిగిలిపోయావ్...!

నువ్వు అలా సినిమాల్లోనే ఉండి పోయి ఉంటే మహా అయితే నీకు పద్మభూషణ్ లు... దాదా సాహెబ్ ఫాల్కేలు వచ్చేవేమో.

మరి మాకు ఏమి వచ్చేది మదరాసీలుగా ఉత్తర భారతం లో ఉన్న గుర్తింపుకి కొనసాగింపు తప్ప. నువ్వొచ్చావ్ కాబట్టే భారతదేశ చరిత్ర కొత్త పుంతలు తొక్కింది... అప్రతిహంగా సాగిపోతున్న కాంగ్రెస్స్ ని రాజకీయాల్లో నెలల బాలుడిగానే తెలుగు నాట మట్టి కరిపించటమే కాకుండా దేశం లో ఉన్న ప్రతిపక్షాలన్నిటినీ ఒక తాటి మీదకు తెచ్చి కాంగ్రెస్ చెక్ చెప్పావ్...

కుత్సిత రాజకీయులు నిన్నో కుల నాయకుడిగా తీర్మానించేస్తున్న సందర్భాలు చూస్తుంటే సమాజంలో స్వార్ధాలెంతగా అల్లుకుపోయాయో తెలుస్తుంది.

ఎవ్వరేమనుకోనీ... నువ్వు నాయకుడివి...

ఇన్నేళ్ళ తరువాత కూడా నీ దగ్గర పని చేసిన అయ్యేయస్ లు నీ క్రమ శిక్షణ గురించి... ప్రజలకి మంచి చెయ్యాలనే తపన గురించి అవినీతి అంటే నీకు గిట్టని పొడగురించి చెప్తుంటే... నువ్వంటే ఉన్న ఇష్టం అంతకంతకూ పెరిగి పోయింది.

మద్రాసీలుగా మగ్గిపోతున్న తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన పౌరుషాగ్ని జ్వాలవి నువ్వు.

నీకు తన పర భేదమే లేదు కదూ... ప్రత్యర్ధి పార్టీ అయినా తెలుగువాడు ప్రధాని అయ్యాడు అని తనే మీద పోటీ పెట్టకుండా సహకరించిన వైనం ఇంకా మరువలేదు. విశ్వాసం పొందాలని అదే వ్యక్తి నీ పార్టీ నాయకులని టోకుగా కొన్న సంగతీ మా మదిలో అలానే నిలిచి పోయింది.

నీ నిష్క్రమణానికి ముందు నువ్వు పడ్డ క్షోభ ఇంకా మా మనస్సుల్లో కదలాడుతూనే ఉంది. గెలుస్తూ బతికినా నువ్వు ఓడిపోలేక మరణించావ్ కదూ... నీ మాహాభినిష్క్రమణం చూసిన రోజు ఎన్ని గుండెలు ఆగాయో...

తరతరాల తెలుగు సినీ జగత్తులో గొప్ప గొప్ప నటులు ఎందరు వచ్చినా ’మహానటుడి’ స్థానం మాత్రం ఆచంద్రతారార్కం నీదే...

తరతరాల తెలుగు రాజకీయ రంగంలో ఒకే ఒక్క నాయకుడివి నువ్వే...

తెలుగుజాతిపై నువ్వేసిన సమ్మోహనమంత్రం... తారక రామ మంత్రం

తారక రామా...అజరామరం నీ కీర్తి... దిగంతాల్లోనూ నీతోనే తెలుగుకు ఖ్యాతి...!

రాజకీయమంత్రంగా మారిపోయిన ' భారతరత్న' నీకు రావచ్చు గాక. లేకపోవచ్చుగాక... నువ్వెప్పటికీ జాతి రత్నానివే.

తెలుగు జాతి గుండెల్లో నీ రూపం శాశ్వతం...

ఓ యుగ పురుషా... తెలుగు జాతి ఉన్నంత వరకూ నువ్వు ‘మృతంజీవుడివే’

మళ్ళీ నీ ఊపిరి చప్పుడు కావాలట తెలుగు జాతికి... తారక రామ తేజమై రా!

ఇట్లు


తెలుగోడు

Tuesday, 22 April 2014

జ్ణాపకం

ఏయ్... ఏమిటా సందేహం...?
నేనెప్పుడైనా గుర్తొచ్చానా అంటూ...!
నిజం చెప్పనా...
నువ్వెప్పుడూ గుర్తురాలేదు
అసలెందుకు గుర్తుకొస్తావ్ నువ్వు?
అసలంటూ మర్చిపోతేనే కదా...!
నీవే నేనైపోయిన నాలో
నేనెప్పుడూ నాకు గతమే
నువ్వెప్పుడూ నా వర్తమానమే
నిన్ను కోల్పోతున్న ప్రతి క్షణమూ
చిరంజీవమై నా లోకే ఇంకిపోతుంది

Thursday, 5 December 2013

ఇదీ బాల్యమే




అమ్మ వడిలో వికసించిన మొగ్గలు మీరైతే 

కుప్ప తొట్టెలో కుసుమించిన పుష్పం నేను


మీ ముద్దుచేష్టలతో మీవారు మురిసిపోతే 

ఏ తోడూ లేక బేల చూపులతో నేనవసి పోయా


గోరుముద్దలు వద్దంటూ నువ్వు మారాం చేస్తున్నప్పుడు  

ఆకలిబాధ తాళలేక వీధి పంపు నీళ్ళు త్రాగాను నేను 


బడి దారిలో పుస్తకాల సంచీ మీరు మోస్తుంటే 

బతుకు బడిలో మట్టి తట్టలు మోసాను నేను 


బామ్మ చెప్పే పేదరాసి పెద్దమ్మ కధలు మీరు వింటున్నప్పుడు  

బరువులు మోసి బొబ్బలెక్కిన అరచేతులని ఊదుకున్నా


తిరునాళ్ళకెళ్ళి రంగుల రాట్నంలో మీరు తిరిగితే 

గానుగ చక్రం చుట్టూ తిరుగుతూ సున్నాన్ని తీశాను నేను 


పిల్ల కాలువలో సరదాగా మీరు ఈతకొడుతున్నప్పుడు

పంటకాలువలో ఏతమేసి నీరు తోడాను నేను 


కోతికొమ్మచ్చి... కోలాటాలు మీరాడుతున్నప్పుడు

కొడవలి పట్టి కోతకోయడానికి చేనుకెళ్లాను నేను 


మీ మధురస్మృతుల అందమైన బాల్యం మళ్ళీ మీక్కావాలి

జీవితంతో పోటీపడుతూ మీరు అలసిపోతున్నారు కాబట్టి


అందమైన గతంలేని నా బాల్యమంటే నాకిష్టం 

జీవితంతో పోరాడటం నాకు నేర్పింది కాబట్టి…!

Tuesday, 3 December 2013

నా హృదయపు దారుల్లో



నడచి నడచి చూడు 
నా హృదయపు దారుల్లో
దారంతా నీ తలపుల చిత్తరువులే 

తరచి తరచి చూడు 
నా కనుపాపల అద్దాల్లో 
ఎప్పుడూ కనిపించేది నీరూపమే 

తడిమి తడిమి చూడు
నా మది భాండాగారంలో 
నీ జ్ఞాపకాల సువర్ణ నిధులే 

తడచి తడచి చూడు 
నా ఊహల సెలయేటిలో 
నీ నవ్వుల గలగలలే 

మనసు రెప్పలు తెరచి చూడు 
నా హృదయ రాగాల్లో
నీ నామమే ధ్వనిస్తుంది 

                                                                 ... సురేష్ రావి