చేజార్చుకోవటం కాదది
చేతనంతనైన సాయం చెయ్యటం
అవును
తనకదే తెలుసు
ప్రతి క్షణం
మనసారా
మట్టి స్పర్శని తాగుతున్న
కృతజ్ఞతలో
కాస్తంత నీడగానో
పచ్చాపచ్చని ఆకు పడకగానో
ఆకలి కడుపున రాలుతున్న పండుగానో
చరక సంహితకి జీవమిచ్చిన మందుగానో
చేరువయ్యే
చెలిమి మంత్రం చెట్టు
చేజార్చుకోవటం కాదది
చేతనంతనైన సాయం చెయ్యటం
అవును
తనకదే తెలుసు
ప్రతి క్షణం
మనసారా
మట్టి స్పర్శని తాగుతున్న
కృతజ్ఞతలో
కాస్తంత నీడగానో
పచ్చాపచ్చని ఆకు పడకగానో
ఆకలి కడుపున రాలుతున్న పండుగానో
చరక సంహితకి జీవమిచ్చిన మందుగానో
చేరువయ్యే
చెలిమి మంత్రం చెట్టు
సహజంగా పుస్తకాల పురుగుని అయిన నాకు ఏడూ ఎనిమిదేళ్ల క్రితం వరకూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎవరో నాకు తెలియదు. అందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను. విశ్వనాథ, చలం, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రిల గురించి చదివినంత విరివిగా వీరి గురించి చదవకపోవడం ఒక కారణం ఐతే, మధుబాబు పుస్తకాల మీదుగా యండమూరి మల్లాది సూర్యదేవర లాంటి పాపులర్ రచయితల ఫిక్షన్ నవలలో మాయలో పడి పుస్తకాలంటే పాపులర్ నవలలు మాత్రమే, పాత సాహిత్యం ఏదీ మనకి పనికి రాదు అన్నట్లుగా పట్టించుకోక పోవడం మరో కారణం. అలా అని పాత సాహిత్యం మీద ఎలాంటి చిన్న చూపూ లేదు. కాకపోతే మన పత్రికల్లో కొంతమంది రచయితలకు ఇస్తున్న ప్రాధాన్యం మరికొందరికి ఇవ్వకపోవడం వల్ల చాలా మంది ఉతృష్ట రచయితల గురించి తెలుసుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయి. యిపుడు సోషల్ మీడియా ప్రభావం వల్లనే మరే ఇతర కారణాల చేతనో మరుగున పడ్డ ఎందరో ప్రముఖుల రచనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ రచనలు చదివినప్పుడు కానీ అర్థం కావడం లేదు ఇన్నాళ్లుగా ఏమేం కోల్పోయామో!
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఉత్కృష్ట మైన రచనల్లో వడ్లగింజలు ఒకటి. ఇది పెద్దపురపు సంస్థానపు నేపధ్యంలో రాయబడింది. కథగా చెప్పుకోవాలంటే చాలా చిన్నది. కథనంగా అద్భుతమైనది. తంగిరాల శంకరప్ప అనే బీద బ్రాహ్మణుడు పెద్దాపురం మహారాజు గారితో చదరంగం ఆడటానికి ఎలా ప్రయత్నం చేసాడు, చివరికెలా మహారాజుగారితో చదరంగం ఆడాడు? ఆడిన తరువాత ఏం జరిగింది? అన్నదే ఇందులోని కథ.
తణుకు నుండి తంగిరాల శంకరప్ప అనే బీద బ్రాహ్మణుడు, పెద్దాపురం శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు చదరంగపు ఆటలో నిష్ణాతుడు అని తెలిసి వారితో ఒక్క ఆట ఆడే అవకాశం కోసం రాజుగారి కోట దగ్గరకు వచ్చి అక్కడ ఠానే దారు తోనూ, దివాన్జీ తోనూ అవమానపడి తాను బసచేసిన పేదరాశి పెద్దమ్మతో తన గోడు చెప్పు కుంటాడు. ఆమె రాజుగారి దర్శనం నీకు దొరకకపోతే రాజుగారే నీ దర్శనం కోసం వచ్చేలా చేసుకోవాలని సలహా ఇస్తుంది. దాంతో అతను ఊళ్ళో కాస్త చదరంగం ఆడగల పెద్దలందరితో చదరంగం ఆడి గెలుస్తూ తన ప్రజ్ఞని చాటుకుంటూ ఉంటాడు. అతని ప్రజ్ఞ మహారాజుగారి వరకూ చేరి మహారాజు శంకరప్పకి పల్లకీ పంపి కోటకు ఆహ్వానించి అతనితో చదరంగం ఆడతాడు. ఇద్దరూ సమఉజ్జీలుగా తలపడుతూ ఎత్తులూపై ఎత్తులూ వేసుకుంటూ ఉంటే సమయం గడిచిపోతుంది కానీ ఆట తెమలడం లేదు. చివరకు శంకరప్ప ఎత్తు వేశాక మహారాజు గారు ఎత్తు వెయ్యాల్సి ఉంటుంది. మహారాజు గారు ఆ ఎత్తు వేయడానికి చాలా సమయం తీసుకుంటారు. దాదాపు ఆరునెలలు. చివరకు తన ఓటమిని ఒప్పుకుని శంకరప్పని ఈ రాజ్యం లో మీకు కావాల్సింది కోరుకోమని చెప్తారు.
“నేను కోరుకున్నది మీతో చదరంగం ఆడటమే! ఆ కోరిక తీరింది కాబట్టి ఇక వేరే కోరికలేమీ లేవు” అని చెబుతాడు శంకరప్ప. అయినా మహారాజుగారు పట్టుబట్టేసరికి తనచాతుర్యంతో ఒక కోరిక కోరతాడు శంకరప్ప. అదేమిటంటే మొదటి గడి కి ఒక వడ్లగింజ, రెండవ గడిలో రెండు వడ్లగింజలు, మూడవగడిలో నాలుగు వడ్లగింజలు, నాలుగవ గడి లో ఎనిమిది వడ్లగింజలు… అలా చదరంగం లో ఉన్న 64 గళ్ళల్లో ప్రతి గడి కీ రెట్టింపు చేసుకుంటూ వడ్ల గింజల్ని కొలిపించమని కోరుకున్నాడు శంకరప్ప.
“ఒక్క పెద్దాపురపు సంస్థానంలోనే కాక మొత్తం త్రిలింగ దేశంలో రాబోయే వందేళ్ల పంట కలిపినా అన్ని వడ్లు ఇవ్వడం అసాధ్యం” అని షరాబు మహారాజుతో విన్నవించుకుంటాడు. “వడ్లగింజలతో కూడా నన్నోడించేసారు శంకరప్పగారూ” అంటూ మాహారాజు తానిచ్చిన మాటకోసం మొత్తం రాజ్యాన్నే శంకరప్పకి ఇవ్వజూపినా శంకరప్ప అందుకు ఒప్పుకోక పోవడంతో ఒక అగ్రహారాన్ని ఇచ్చి అతన్ని గజారోహణ చేయించడంతో కథ ముగుస్తుంది.
ఇంతకూ అలా అరవై నాలుగు గళ్ళలో వడ్లగింజలు వేసుకుంటూ పోతే ఎంత అవుతుందో తెలుసా? 18446744073709600000 (మామూలుగా మనం మాట్లాడుకునే లెక్కల్లో ఐతే ఒక కోటి 84 లక్షల, 46 వేల 74 కోట్ల 40 లక్షల, 73 వేల, 70 కోట్ల, 96 లక్షలు) అంటే దాదాపు పద్దెనిమిదిన్నర క్వింటిలియన్ ల (Quintillion = 1 x 1018) వడ్లగింజలు. నిజానికి ఈ లెక్కకి మూలం కన్నడ సీమకి చెందిన మహావీరాచార్య అనే గణితాచార్యుడు రాసిన ‘గణిత సార సంగ్రహం’ అనే గ్రంథం లోనిదట. ఈ గ్రంథాన్ని నన్నయ్యకి సమకాలికుడయిన పావులూరి మల్లన, ‘సార గణిత సంగ్రహము’గా తెలుగులోకి అనువదించారని ఒక చోట చదివాను.
ఒక చిన్న కథకు అద్భుతమైన కథనంతో దాని విస్తృతి పెంచి, కథలో వచ్చే ప్రతి పాత్రకూ సముచిత స్థానం ఇచ్చారు శ్రీపాద వారు. ఇందులో ప్రధాన పాత్ర తంగిరాల శంకరప్ప చదరంగంలో ఎంత నిష్ణాతుడైనా, ఒకసారి రాజోద్యోగుల చేత అవమానపడి ఏమి చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు కర్తవ్య బోధ చేసి తనకు తరుణోపాయం చెప్పిన పేదరాశి పెద్దమ్మ ముందు పసిపాపడు లానే అనిపిస్తాడు. విద్యలో ఎంతటి ఉద్దంఢుడైనా లౌక్యాన్ని కూడా ఉపయోగిస్తేనే ఆ విద్యని ఎవరైనా గుర్తించే అవకాశం ఉంటుంది అన్న నేటి సమాజపు పోకడ కనబడుతుంది శంకరప్ప… పెద్దమ్మ ల మధ్య సంభాషణ చదివాక.
అలాగే మొట్టమొదటగా తన ఆటతో శిష్యులుగా మారిపోయిన శాస్త్రి, యాజులు, మహారాజు గారి దివాణంలో చదరంగపు బల్లని సిద్ధం చేసే రంగనాయకి ఆయన సన్నిధిలో ఉండవలసిన నలుగురు వేశ్యల్లో ఒకటి, శంకరప్పగారి విద్వత్తువిని ఆయన మీద మరులుగొన్న రాజ నర్తకి అలివేణి, మహారాజు గారి ఆప్తులైన దాట్ల నరసింహ రాజు, విజయరామరాజు, ఠానే దారూ,దివాన్జీ, ఆటలో ఒకసారి శంకరప్ప చేతిలో పరాభవం పొందిన దూర్వాసుల ఆది వరాహ మూర్తి… ఏ పాత్రా కూడా ప్రాధాన్యత లేకుండా లేదు. దేని ప్రాధాన్యత దానిదే.
వీటిన్నిటికీ మించి ఇందులో మరో ప్రధాన పాత్ర ఉంది. అదేమిటంటే చదరంగం. చదరంగం చుట్టూనే కథ తిరుగుతుంది. అలా అని ఇందులో చదరంగం ఎలా ఆడాలి అని ఎక్కడా ఉండదు. ఇప్పుడైతే గూగుల్ లో, ఇంతకూ ముందు రోజుల్లో ఐతే ఎన్సైక్లోపీడియా పుస్తకాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తాన్నీ కథలో ఇరికించి ఆ మేరకు నిడివి పెంచుకునే బాపతు కథ కాదు ఇది. చదరంగపు ఆటలో ఎవరి స్థాయిని బట్టి వారి తరహాలో వారితో ఆడుతూ ఉండటం చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. చదరంగపు బల్లని చూడకుండానే గోడ అవతలనుంచి రెండు బలాల పావులూ ఏ ఏ గడులలో ఏవి ఉన్నాయో చెబితే గోడ ఇవతలి నుండి ఎత్తు చెప్పి రంగనాయకిని గెలిచేలా చేయడం చదివితే, శ్రీపాద వారి తరువాతి కాలంలో యండమూరి వీరేంద్రనాథ్ రాసిన వెన్నెల్లో ఆడపిల్ల నవలలో రేవంత్ ఆడే బ్లైండ్ ఫోల్డ్ చెస్ ని మించిన నైపుణ్యం కదా ఇది అనిపిస్తుంది.
ఒక చోట శంకరప్ప ఆంటాడు సత్యం ఎదుట ఎలాంటివాళ్ళూ ఒక్కఅంతస్తులోనే ఉంటారుఅని. మరో చోట అంటాడు నా విద్యలో నేను చక్రవర్తిని అని. ఇందులో ఎక్కడా కూడా శంకరప్ప రాజాశ్రయం కోసమో బహుమతుల కోసమో రాజుగారితో చదరంగం ఆడదామని చూడడు. మహారాజు చదరంగం ఆటలో ప్రవీణుడు అని ఎరిగి తన ఆత్మ తృప్తికోసం ఆయనతో ఆడాలనే చూస్తాడు. మొదటి నుండి చివరి వరకూ ఆయనది అదే వరస. గెలిచిన తరువాత కూడా అలానే అంటాడు తప్ప బహుమతుల కోసం పాకులాడడు.
మొత్తంగా చూస్తే మనకంటూ వినయంతో కూడిన విద్య ఉంటే ఎప్పటికైనా ఆదరం దక్కి తీరుతుంది అని చెప్పినట్లు అనిపిస్తుంది.
ప్రధానంగా ఈ పుస్తకంలో నాకు కనిపించిన ఒక విశేషం ఏమిటంటే ఇందులో ఎక్కడా కూడా ఒక్క ఇంగ్లిష్ పదం కూడా కనిపించదు. చదరంగంలో రాజుకి చెక్ చెప్పడాన్ని కూడా తెరచిరాజు, త్రోసిరాజు, వేసిరాజు అంటూ సందర్భాన్నిబట్టి తెలుగులోనే చెప్తారు ఇందులో. తెలుగు భాషలో ఎంత సరళత్వం ఉందో, వాక్యాలని ఎంత ఒడుపుగా రాయవచ్చో ఈ పుస్తకం చదివితే అర్థం అవుతుంది. ఇందులోని భాష, పాత్రల మధ్య సహజంగా కనిపించే సంభాషణా చాతుర్యం అద్భుతం అనిపిస్తాయి. నొప్పించక తానొవ్వక అన్నట్లు ఉన్న వ్యంగ్యం ఈ కథని మరో స్థాయిలో ఉంచుతుంది. ఈ కథలో అల్లిక చాలా బిగితో ఎంతో గొప్పగా ఉంది ఇంత చక్కటి భాషని చదవడానికి కూడా పెట్టి పుట్టాలి. అలా మొదలు పెట్టగానే ఇలా అయిపోయిందా అనిపిస్తుంది. ఎనభై ఏళ్ల క్రితపు రచన అయినా చక్కని వాడుక భాషలో ఉండటం వల్ల చదవడానికి కష్టపడాల్సిన అవసరమూ లేదు.
మనసుకి ఉత్సాహం, ఉల్లాసం కలిగించే ఇలాంటి కథలని చెప్పడానికి ఏంతో నేర్పు ఉంటే కానీ అద్భుతమైన రచనలుగా ఇవి వెలుగు చూడవు. ఏ కథ చదివాక అప్పటి వరకూ చదరంగం గురించి తెలియని వాళ్లకి చదరంగం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం తప్పకుండా కలుగుతుంది.
ఈ కథ 1941లో ఆంద్ర వారపత్రికలో ప్రచురించబడింది.
సిరా నీదే
కాగితమూ నీదే
అక్షరమూ నీదే
నిబంధనలన్నీ
నువ్వు చెప్పినట్లే నడచుకుంటాయ్
జీవసమతుల్యతలూ
స్వేచ్చా జీవనాలు
ఇక పై
నీ కృత్రిమత్వపు ప్రకృతి దృశ్యాలే
అంతేలే…
మనిషన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలిలే…
మరి ప్రకృతికీ కళాపోషణ ఎక్కువేననుకుంటా…
మనిషిని మరణానికి ప్రతీకని చేసి
కుంచెను సిద్ధం చేస్తుంది
నీలో నువ్వింత వరకూ చూడని అదృశ్య నీడలని
నువ్వు కనుగొన్నప్పుడు
మరో రోజు కోసం
మరో నీడ కోసం
నీ వెదుకులాట మొదలవుతుంది
మరో రోజు కోసం ఎదురు చూస్తున్నప్పుడల్లా
నీకు తెలుస్తూనే ఉంటుంది
మనసు నుండి ఏకధాటిగా స్రవిస్తున్న నిశ్శబ్దం
ఆ మరో రోజు లోనూ శబ్దం చేస్తుందని
శ్వాస తీసుకోవడం ఆపేసిన పగలు
ఇంకెన్నాళ్లు చీకటిలో కొనసాగుతూ ఉంటుందో...
ఖాళీతనాన్ని నింపుకున్న రాత్రి
ఎప్పటికి వెలుగుని రాజేసుకుంటుందో...
ఏ ఊహకీ అందక పోవటమన్నది
కొత్త కథేమీ కాదులే
నిన్నటి నీడల క్రింద చల్లగా నిదురించిన
కొన్ని క్షణాలకి మాత్రం
పాత కథలన్నీ కలలు కలలుగా
కళ్ళల్లోకి స్రవిస్తూ ఉంటాయి.
శతాబ్దాలుగా
తమ ఆచూకీని
భద్రపరచుకున్నామనేమో...
ఈ నీడలున్నాయే
వీటికి చాలా గర్వంగా ఉండేది
మిట్టమధ్యాహ్నపు
తెల్ల చీకట్లో దాక్కుని
తాము దాచిన రహస్యాల చిట్టాని
ఎండమావుల జాలంగా
మన కళ్ళ మీదకి విసురుతూ
దాగుడుమూతల ఆటలు ఆడుతూ
అరికాలి క్రింద
నల్లటి ఉద్యానవనాలై
చల్లదనాన్ని పూస్తాయి
కాసిని నీడలకి ఊతమిచ్చిన చక్రవర్తిని
అజరామరం చేసిన చరితని
చదివి కూడా
మధ్యాహ్నాన్ని
అనంతం చేసుకుంటున్న
మనిషి ఎదుట...
తనని తాను
అవనతం చేసుకుంటున్న
ఆలాపన తీసేదెవరు
ఆ దారి అంతే…
అలా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది
వచ్చేది రాజైనా… పేదైనా
అడుగులు ఎవరివైతేనేం
నాలుగు జతల అడుగులు
ఒక్కటిగా తాకటంతోనే
తానో రాదారిగా మారానన్న సంతోషం కాదది
వర్ణాలన్నీ మృగ్యమై
అంతస్తులన్నీ మిథ్యయై
అందరూ ఒక్కటిగా కలిసే చోటుకు
తానే బాటగా మారిన గర్వమది
సముద్రం
నుండి
దారి తప్పిందో
నీటి చుక్క
తాడూ బొంగరం లేని ఆటలా
మనిషి మనిషి
గుండె లోకీ కంటి లోకి దూకేస్తూ
కొన్ని సాయంత్రపు అడుగుల కింద
చెమ్మగిల్లిపోతూ ఊపిరి తీసుకుంటుంది
రెక్కలుడిగిన పావురంలా
ఎక్కడికక్కడ కూలబడిపోతూ
చీకటి కుంకుమతో
పేరంటం
పిలుస్తుంది.