పక్షి నుండి ఎగరడం దోచుకోవడానికి
ఎన్ని రెక్కలు కత్తిరించబడాలి
తమ శక్తి సామర్థ్యాల దన్నుతో
వాటి స్వేఛ్చ ప్రతి రెక్కలోనూ కొట్టుకుంటుంది
రాత్రిని వెలిగిస్తున్న వేవేల నక్షత్రాల కాంతిని
నువ్వు వాటి రెక్కల మీద చిత్రించ గలిగితే
కాంతి వర్ణాల మేళవింపుతో
వాటి సౌందర్యం ఆకాశానికి ఎగసిపోతుంది
తామే ఆకాశానికి యజమానులై
తమ రెక్కలే స్వేఛ్చకి భావగీతాలనుకుంటూ
ఎప్పటికీ ఎండిపోని కుంచెల్లాంటి ఈకలతో
ఇంకా చెప్పబడని కథలని ఆకాశంలో చిత్రిస్తాయి
గాలిని ఇంధనం చేసుకుని
నిండు ప్రేమతో లోకాన్ని ఆశీర్వదిస్తున్నట్లుగా
రెక్కలతో విన్యాసాలు చేస్తూ
ప్రపంచానికి అడవిగాలిని కానుకగా ఇస్తాయి
పద్యం పరిమళించి రాజ్యం చేసిన కాలంలో
మంద్రమైన గాలిమీద విహరిస్తూ
ప్రతి ఈకనీ కళాఖండంగా అందించిన గగన శిల్పులై
యుగాల సాహిత్యాన్ని చరిత్రగా లిఖించాయి
పక్షులంటే ఆకాశపు కవులు కదా మరి
అందానికి పెద్ద పీట వేసే ఈ లోకంలో
హృదయపు స్వఛ్చతని గగనానికి అరువిస్తూ
వాటి రెక్కలు స్వేచ్ఛాయుత ఆత్మల శ్లోకాలు
ఆకాశాన్ని అనుగ్రహంతో చిత్రించే వాటి చిత్ర లేఖనానికి
తమ రెక్కలని మన స్వేఛ్చకి చిహ్నంగా ఇచ్చిన పాటవానికి
అంతేవాసులమై
ప్రేమ ఒక్కటే జాతిగా ఉన్న ప్రపంచమవుదామా!















.jpg)


