Monday, 4 March 2013

వెన్నెల కుసుమం - 4


`నీలి నీలి నీ వినీల కుంతలాలు చూసి అవి మేఘాలు కాబోలునని భ్రమించి అచ్చట చేరిన నక్షత్రాలు తెల్లబోయి తాము అరవిరిసిన మల్లియలయినాయట’ ఇది ఏ కవి భావనో కాని నిన్ను తలచి నేననుకున్న భావనలో నుండి ఉదయించిన పలుకులవి.
'నీ కళ్ళల్లో వెండిపన్నీరు వెన్నెలలా కురిసిన వేళ
 నా ఎదలో మరుమల్లెల మాల విచ్చిన వేళ
 మన జంట ప్రేమంటే లోకానికి చేప్పిన వేళ
 మన ఊహల్లోని ఊసులన్నీ సత్యాలై సందడి చేసిన వేళ
 అదే అదే కదా మన జంట ఒక్కటైన వేళా
ఆకాశరాజు భూదేవి కన్నియకు నక్షత్రాల అక్షరాల్ని కూర్చి ఉత్తరాన్ని రాయటానికి ఆయత్తమవుతున్నవేళ నీ వడిలో నా తల పెట్టుకుని నీ కళ్ళలో కళ్ళు కలిపి మౌనముగా కనులతోనే సంఙ్ఞలు చేసుకునే సమయాన జాబిల్లి కూడా నీ ముఖచ్చాయ ముందు వెలవెలబోయి మబ్బు చాటుకు తప్పుకుని మన ఇద్దరినీ ఏకాంతంగా వదిలి తాను తారలతో సరససల్లాపములకు వెళ్ళెనేమో! 
పువ్వులా విరిసే నీ నవ్వు చూసి పాటంటే తెలియని పామరుడు సైతం రాగాలు తీయగలడు. ఆటలు రాని అమాయకుడైనా నర్తించగలడు.
నీరెండ సంధ్యలో నీ మందార చెక్కిళ్ళ నునుపులు మెరసి అస్తమిస్తున్న సూర్యుని ఎరుపులో ప్రతిఫలిస్తున్నాయనుకుంటా కదూ...
రెపరెప లాడుతున్న నా కనురెప్పల మాటున దాగి ఉన్న నా కన్నులలో అనుక్షణం నీ రూపు ప్రతిఫలిస్తూ నన్ను కవ్విస్తూ ఉంది. నీ తలపులు లేకుండా ఒక్క క్షణమైనా నాకు గడవదే...
మరి నీ ఊహల జగతిలో నేను ఒక్క క్షణమైనా ఊగిసలాడేనా. నీలాల నీ కళ్ళల్లో ఒక్క క్షణమైనా నా రూపు ప్రతిఫలించేనా.
నీవు నా మదిలో అల్లరి చేస్తుంటే ఆకలి అంటే ఏమిటో తెలియదు. నిద్ర పట్టే రాత్రే లేదు. చదువుదామంటే పుస్తకంలో నీ రూపే.
నీ మరాళ కుంతలాలపై జాలువారిన మల్లె మొగ్గలు వినీలాకాశంలో మెరుస్తున్న నక్షత్రాల్లా ఉన్నాయి. నీలాంటి అందాల హరివిల్లుని వర్ణించాలంటే కాళిదాసుకైనా మాటలు దొరకవేమో. నీ లాంటి వన్నెల ఇంద్రధనస్సుని చిత్రించాలంటే రవివర్మ కుంచెకూడా వణుకుతుందేమో. 

2 comments:

Post a Comment