హనీ...
ఏమని వర్ణించను నీ సోగకళ్ళ
సోయగాలని...? పేరుకి మాత్రం కళ్ళే కానీ నిజానికి అవి...
కలల పుప్పొడిని నింపుకున్న కలువ
రేకుల్లా ఉన్న వలపు వాకిళ్ళు
కృష్ణుని మేని వర్ణాన్ని కాటుకగా
అంచులలో అద్దుకున్న వన్నెల పొదరిళ్ళు
లోకంలో ఉన్న శాంతాన్నంతా పోత పోసినంత
ప్రశాంతంగా వెన్నెల నడయాడే లోగిళ్ళు
ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసి పడుతూ కులుకులాడే
కిన్నెరసాని కిల కిలల పరవళ్ళు
కోడె వయసు కుర్రాడి నుండి మూడు కాళ్ళ
ముదుసలిని కూడా కట్టివేసే సుతిమెత్తని సంకెళ్ళు
ప్రాణ సఖుని సడి కోసం నిదుర మరచి విరహాగ్నితో రగులుతున్న నెగళ్లు
పరువమంతా పరచిన పడతుల వైపూ చూపు
మరల్చనివ్వని మాయ లేళ్ళు
జాబిలిని ప్రమిదలలో నింపి వెన్నెలలో స్నానమాడుతున్న
సోయగాల సెలయేళ్ళు
నిజం చెప్పాలి అంటే నీ నయన సరాగాలని వర్ణించటం
కవి కాళిదాసుకైనా చాలా కష్టం రా... నేను కాళిదాసు కంటే గొప్ప వాడిని ఐతే కాదు కానీ నీ కను రెప్పల కౌగిలిలో కలలా చిక్కుకు
పోవాలని తపన పడుతున్న ప్రేమ పిపాసిని.
నీ కలల సుమాల దొంతరల పరిమళాలు
ఆఘ్రాణించటానికి ఆఘమేఘాల మీద వాలిపోవాలని
పిస్తుంది స్వప్న కావ్యాలంటిన నీ కళ్ళలో...
ప్రతి శబ్దాన్ని నిశ్శబ్దిస్తూ మౌనంలో
తడుస్తున్న నీ కళ్ళని చూస్తూ కన్నీటికి అర్ధం తెలియని తడి అంటని నీ రెప్పల
కుడ్యాల్లో కలగా నిరంతరం పయనిస్తూ ఉండాలని... నీ కన్నుల ఆవరణలే నా రూపానికి ఆట
మైదానాలుగా మారిపోవాలని ఆ కంటికి అంతులేని
నవ్వుల కిరణాల ఉషస్సునై నేనక్కడే నిలిచిపోవాలని ఆ భగవంతుని కోరుతూ తపస్సు
చెయ్యాలని అనిపిస్తుంది.
అందరూ పెదవులతో చెప్పే భాష్యాలన్నీ నీకైతే
కళ్ళలోనే పలుకుతున్నాయ్... ఇక నయన కావ్యాలకి శ్రీకారం చుట్టవచ్చేమో మరి...
కన్నె ఆశలన్నీ కళ్ళ ప్రమిదల్లో ఆశా
దీపాలుగా వెలుగుతూ కంటి పాపలు రెప్పలు దాచే ప్రణయ పత్రాల్లా పరిమళిస్తుంటే... కంటి
రెప్పల చివర ఉన్న నూగారు వెంట్రుకలు కలలను చిత్రించే కుంచెలా అన్నట్లుగా అనిపిస్తూ
రెప్పల వీణలు మోసే స్వర తంత్రుల్లా... అగుపిస్తూ.... తలచుకుంటుంటే ఓహ్.... మనసంతా అలౌకికానందమే...
... రేష్






0 comments:
Post a Comment