గాలి పంజరంలో చిక్కుకున్న
నిశ్చల… నీరవ… నిశ్శబ్దం!
నగిషీలు చెక్కబడ్డ హిమ ధ్వనిలో
పేరుకుపోతున్న నిరీక్షణ
ఓ యాత్రికుడా...
ఇది నువ్వు రావాల్సిన సమయం
ఈ చిన్ని దీపాన్ని కాపు కాస్తున్న
చిక్కటి చీకటికి విశ్రాంతినిచ్చే
విద్యుత్తరంగమై
రూపాంతరం చెందే సకలానివై
ఓ యాత్రికుడా...
ఇది నువ్వు రావాల్సిన సమయం
మహా మౌన స్థితిలో గడ్డకట్టిపోతున్న
చల్లని ధ్వనిని
గోరు వెచ్చగా మేల్కొలిపే గ్రామీణానివై
కాలాన్ని ఆకుపచ్చగా శ్వాసించే
స్వచ్ఛతార్ణవమైన
మిత్రత్వాన్ని లిఖించాల్సిన పొద్దు ఇది
కంటి రెప్పపై వానబరువునంతా
సీతాకోకచిలుక రెక్కలపైకి
తేలికగా తర్జుమా చేసే
ఏకాంతపు కుంచె చివరి
నిర్దోషమైన రేఖవై
నిన్ను నిజం చేసుకోవాల్సిన తరుణం






3 comments:
ఆ పిక్ ఇంకా ఆ మొదటి లైన్ తోనే ఓ ప్లెజెంట్ ఫీల్ క్రియేట్ చేసారు... మొత్తం పొయెమ్ చాలా లవ్లీగా ఉంది.
మీ మాట యాత్రికుడు(వరుణుడు) విన్నాడేమో
పరుగున కుంచెకు పచ్చరంగు పులుముకొని
తెల్లవారక ముందే గ్రామాన్ని పలకరించాడు
" ఏకాంతపు కుంచె చివరి
నిర్దోషమైన రేఖవై " అటువంటి రేఖలన్నీ రూపు దిద్దుకున్నదేదో ఎదురైనా తరుణం ఇలా...
Post a Comment