ఇక్కడి సూర్యుడు కూడా అక్కడిలాగానే
తూర్పు నుండి పడమరకే ప్రయాణం కడుతున్నాడు
కాకుంటే
పొద్దున్నే ఒక్క గోరు వెచ్చని స్పర్శని ఇవ్వలేక
మేడల కావలే తచ్చాడుతున్నాడు
ఇక్కడి నీరు కూడా అక్కడిలాగానే
పల్లం వైపే పరుగెడుతోంది…
కాకుంటే
గొంతు తడుపుదామనుకుంటే
ఆమ్లంలా పొగలు గ్రక్కుతుంది
ఇక్కడి గాలి కూడా అక్కడిలాగానే
ఊపిరికి శ్వాసనిస్తుంది
కాకుంటే
ఇక్కడి గాలి
చాలా రంగుల్నద్దుకుని వీస్తుంది
ఇక్కడి నేల కూడా
అక్కడిలాగానే సమతలంగానే ఉంది
కాకుంటే
ఇంత వరకూ ఇక్కడి మనిషికి
మట్టిస్పర్శ కూడా తెలియదు
***
పట్టణమో ప్రదర్శన శాల
పల్లేమో జీవధార






0 comments:
Post a Comment