‘ఏయ్… ఏమిటలా చూస్తున్నావ్?’
‘నీ పుట్టుకని'
‘ఏముందట అందులో'
‘స్వచ్ఛత’
‘ఆహా… నిజమా?’
‘విత్తుని దాటి.. పుడమిని తొలచి.. నువ్వు బయటకు వస్తున్న వైనం.. ఎప్పుడూ అద్భుతమే’
‘అద్భుతాలన్నీ స్వచ్ఛమేనా?’
‘ఏమో… అది నాకు తెలియదు కానీ కొన్ని అనుభూతులు ఎప్పుడూ స్వచ్ఛమైన అద్భుతాలే అనిపిస్తాయ్'
‘ఏమిటా అనుభూతులు?’
‘మొదటి సారిగా ఆకుపచ్చని స్పర్శని అద్దుకుని.. నువ్వు విడిచిన తొలి ప్రాణవాయువు శ్వాసని ఒడిసిపట్టి నా ఊపిరిగా తాగే ఆనందం.. ఓ చిక్కని అనుభూతి'
‘ఆహా.. ఇంకా?’
‘నువ్వు ఇంకాస్త పెరిగాక.. నీ చిట్టిమొగ్గ ఒకటి ఒక్కొక్కరేకునూ అలా అలా విప్పుకుంటూ కుసుమిస్తున్న పరవశంలో నేను చిక్కుకున్న అనుభూతికి సాటి మరేం లేదు'
‘హేయ్.. ఎంత చక్కని అనుభూతులో.. ఇంతకూ అక్కడేదో కనిపిస్తుంది కదా అదేమిటి?’
‘మొన్నప్పుడో నరికేసిన చెట్టు మోడు'
‘ఎవరు నరికేశారు'
‘నేనే'
‘ఎందుకట?’
‘ఇంటికి అడ్డుగా ఉందని.. ఇంత చక్కగా కట్టుకున్న ఇంటి అందాన్ని అది కప్పేస్తుందని.. అందమైన పొదరిల్లు కట్టుకున్న అనుభూతిని దూరం చేస్తుందని ’
‘అందమైన పొదరిల్లు… నీ ఇల్లు ఎంత అందంగా ఉందో కదా! మరి ఆ చెట్టులో మాత్రం అందం లేదా?’
‘అలా అని నేను అనడం లేదుగా... అది ఎంత అందమైనదైనా నాకు అడ్డుగా ఉంది కదా? అయినా అది ఇప్పుడు కేవలం మోడు. దాని అవసరం తీరిపోయింది. దానికి బదులు నిన్ను తెచ్చి నాటాను కదా. చూడు, నీకు రోజూ నీరు పోస్తున్నాను. ‘
‘నన్ను నాటావా? అంటే… ఒక మరణానికి పరిహారం ఇంకో జననం అనుకుంటున్నావా? నాకు నువ్వు ఇచ్చిన పని, ఒక శిధిలాన్ని కప్పిపెట్టడమా? పోయిన చెట్టు తన ఆకుల్లో నిక్షిప్తం చేసిన గత జ్ఞాపకాలను, పక్షి గూళ్ళలోని మాతృ ప్రేమను నేను తిరిగివ్వగలనా?’
‘పరిహారం కాదు, ప్రయత్నం. నేను ప్రకృతిని ప్రేమించే మనిషిని. అందుకే పాతది తీసి కొత్తది పెడుతున్నాను. నాకిప్పుడు కొత్త శ్వాస కావాలి’
‘అవును. పాత ఊపిరి తీసి, కొత్త ఊపిరికి నీరాజనం పలుకుతున్నావు. నీ వెలుగు కోసం, నా తోబుట్టువుని చీకటిలోకి నెట్టేశావు. నా ప్రాణ వాయువు నీకు కావాలి... కానీ నా పూర్వ రూపం నీకు వద్దు. నువ్వు మోడుని చూస్తున్నావు... నేను మాత్రం నన్ను నాటిన నీ చేతిని ఇంకా వీడని ఆ గొడ్డలి వాసనని గమనిస్తున్నాను’
‘నువ్వు చెప్పింది నిజమేనని ఒప్పుకుంటున్నాను. జీవితంలో కొన్ని రాజీలు తప్పవు అయినా అదంతా గతం. నువ్వు వర్తమానం.’
‘వర్తమానమే... వర్తమానంలో కూడా, నన్ను నీ అవసరం మేరకే చూస్తున్నావు కదా.’
‘.....’
‘ఒక జననం.. మరో మరణం.. రెండిట్లోనూ అనుభూతి చూడగల ఓ మనిషీ నీకు వీడ్కోలిక’
‘వీడ్కోలా… అదేం?’
‘వీడ్కోలు మాత్రమే కాదు మిత్రమా.. మృత్యురహస్యంలోకి స్వాగతం కూడా..'
‘ఏమంటున్నావ్ నువ్వు?’
‘అర్ధం కాలేదా సోగ్గాడా? జననం మరణం నీ కనుసన్నల్లో జరగాలనుకుంటూ ప్రకృతిని నువ్వు శాసిద్దామనుకుంటున్నావ్ కదా.. నీ మీద నిరసన నాతోనే మొదలెడదామనీ.. ప్రాణవాయువు ఊపిరాపి.. మా మృత్యు ప్రయాణంలో నిన్నూ సహవాసిని చేసుకుందామని’
'.....'







0 comments:
Post a Comment