మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Thursday, 11 February 2016

ఆవృతం



ఎక్కడెక్కడి శూన్యతలు నన్నావహించిన వేళల్లో
నీ ఉనికిని పరిచయిస్తూ
నా భయాలన్నిటినీ రద్దు చేసిన నీ యంత్రాగంలో
నా ఊపిర్లన్నీ నీలోకొచ్చేసాయ్

నా ఏకాంతంలో నీదైన స్పర్శ ఒక్కటి చాలు
ఆనందానికి నాదైన నిర్వచనం ఒకటి
నీ నిర్వచనా సింధువులో బిందువవుతుంది
నా ప్రపంచాన్ని నీలో లీనం చేస్తూ

ఎప్పటికప్పుడు నిన్ను చాటాలనిపిస్తుంది
నువ్వు తెలిసాక నిశ్శబ్దం మాట్లాడుతుందని
ఒక్క నీ సన్నిధిలోనే లోకం విశాలమవుతుందని
నీ ఔన్నత్యం తరగని గని అని చెప్పాలనిపిస్తుంది

నువ్వావృతమైన ప్రతి ఏకాంతాన్ని చాటి చెప్పాలి
మరి… ఒక్క సారి ఒకే ఒక్కసారి నా ఉనికిని నాకివ్వవూ
పొంగిపొరలుతున్న ఈ నిశ్శబ్దాన్ని
నీ శబ్దంగా గానవించే ఒకే ఒక్క క్షణాన్ని అరువియ్యవూ


అప్పుడప్పుడూ ఒక చినుకు - 7



‘వ్యర్థమైన అన్వేషణలో నడకెంత భారమో చూడు’ అందామె

‘అర్ధం అబద్ధం కానప్పుడు నడకలకు భారాలు మొలుస్తాయా
ఆనందపు ఆడంబరాలని మోసుకొస్తాయిగానీ’ బదులిచ్చాడతను

‘ఇప్పటికైనా తెలిసిందిగా నన్ను నేను వ్యర్థం చేసుకున్నా నీకో అర్థాన్నయ్యానని..!’ అందామె పూలవనమొకటి హేమంతాన్ని చిలకరించినట్లుగా

రా... ఇలా !




నిద్దురలో
మోహపరుస్తున్న కలలని సముదాయిస్తూ
నువ్వొక గాయాన్ని కౌగలిస్తున్న చోట
నువ్వెవరినీ నిలదియ్యలేవు
నిజానికి నువ్వు మూసింది
రెప్పలని కాదు మరి

రాత్రిని ఆబగా ఈదేసిన చీకటి
నీ జీవన తీరంలో లంగరు వేసి
నీ పగళ్ళన్నిటినీ పరికించి చూస్తున్నప్పుడు
నన్ను వెలిగించుకుని చూడు
కిరణమాలి వెలుగు కుండ పొంగి పొర్లుతుంది నీపై

నువ్వెన్నడూ ఎదురు చూడని యుద్ధంలో
గాయాల జడివాన మొదలైతేనేం
రా... ఇలా !
దోసిలి నిండా నమ్మకం తెస్తున్నా
తోడుగా నేనూ వస్తున్నా
నిశ్శబ్దంగా
లోకాన్ని జయించేద్దాం రా మిత్రమా

Sunday, 31 January 2016

అప్పుడప్పుడూ ఒక చినుకు - 6

ఆ భయాన్ని అలాగే తుంచేేసేయ్...

రేపెప్పుడో అది పుట్టించే నవ్వుని ఇప్పుడే ప్రాక్టీస్ చెయ్యటం పెద్ద కష్టమేం కాదు. కాస్తంత  నిన్ను నువ్వు నమ్మాలంతే. 

మన  భయాల్ని ఎవరో పోగొడతారని, మన సమస్యల్ని ఎవడో పరిష్కరించేస్తాడని.. అసలు పరిచయమంటూ లేని వ్యక్తుల్ని.. శక్తుల్ని నమ్మేసే మనం.. ఈ ఒక్క సారికి మనల్ని మనం ప్రయత్నించి చూద్దాం. పోతే భయం.. వస్తే విజయం.. 

ఏమంటావ్ మిత్రమా ?


Saturday, 30 January 2016

ఆత్మరేఖ

కరిగిపోతున్న నిన్నటి పరిమళపు తోటలో
రాలిన కుసుమాల జాడల్ని పరికిస్తూ
నీ అడుగుల వెనుక నడకగా
నా ఊపిరి చేస్తున్ననిశ్శబ్దం
బహుశా
నీ మీదుగా పరుచుకుంటున్న
నా ఆఖరి శబ్దం
తప్పేముంది?
నీలాగానే నేనూ
ఇద్దరమూ ఒకే ఏకాంతాన్ని పెనవేసుకున్న ఆత్మరేఖలం కదా మరి ! :)


ఆనవాలు

కమ్ముకొచ్చిన నిశిలో తోడుకోసం వెనకెనక్కి చూస్తున్నప్పుడల్లా
నువ్వొచ్చేసావన్న ఆనవాలుగా ఒకే ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలూ అనుకుంటా...

లోకమంత వెన్నెల నా చుట్టూ పరిభ్రమించటం మొదలవుతుంది !


Wednesday, 27 January 2016

మాయా దర్బారు


తరాల తప్పులన్నిటిని తరాజులో కొలవటమే పాపమన్న కొత్త నినాదంతో
కొంగ్రొత్త కుబుసాన్ని కప్పుకుంటూ కొందరు
నైతికసూత్రాల తక్కెడలో ప్రతి తూకమూ పాపమనే కార్పణ్యాలతో
ఇజాల మాటున సామాజిక చిత్రాన్ని చిధ్రం చేస్తూ మరి కొందరు
విభేదాలని విద్వేషాలుగా మార్చుకునేంతగా
మనిషితనపు విభజన జరిగిపోయాక
ఎంతగా విభజించబడినా చలించని శిలా ఫలకాల మౌనంలోకి జారిపోయిన
యాంత్రిక జీవజాతిగా అనేకానేక మస్తిష్కాలు నిద్రను కావలించుకుంటున్నాయ్

హద్దు హద్దుకూ మారుతున్న భావజాత్యపు పోకడల లోకంలో
చరిత్రనిండా రక్తాన్నే తాగిన నేలకీ ఆ నెత్తురే వ్యసనమయ్యిందేమో
నెత్తుటి తడి తప్ప అన్ని తడులనీ వెలివేసేస్తుంది కన్నీటి తడితో సహా
అప్పుడప్పుడూ తనని తానూ వెలివేసుకుంటూ
పచ్చని ఉరికొయ్యలకి ఆదరువుగా పరచుకుంటూ
ఎక్కడికక్కడ వధ్యశిలల పంట పండిస్తున్నట్లుంది

రాజకీయ క్రీడలకి సమయాన్ని మోసుకొస్తుంటాయేమో
కొన్ని మరణాలే సంచలనాలవుతాయ్
మేధావుల అసహనాలని పీల్చుకుంటాయేమో
కొన్ని ఊపిర్లకే విలువలు శ్వాసిస్తాయ్
బతుకులోనూ  మరణంలోనూ
కులమతాలే  సరిహద్దులైన చోట
కొన్ని మరణాలప్పుడూ రణరంగమే
మరి కొన్ని మరణాలదెప్పుడూ నీరవ నిశ్శబ్దమే

మరణమొక అంతిమరణమయ్యాక
అరేయ్ తమ్ముడూ
నీ దారెంత పదునుగా ఉందో
అక్కడ నడిచే నీ నగ్నపాదాలకే ఎరుక
నీకోసం యుద్ధరంగమూ లేదు
మేధాపరివారమూ లేదు  
అయితేనేం యుద్ధం తప్పదు నీకు

ఈ యుద్ధానికి ఎక్కడ ముగింపో
నీ కథ ఎక్కడికి చేరుతుందో..
పంచవర్ష కిరీట క్రీడారామంలో
అంతిమ విజేత మాయా దర్బారులో అడగాల్సిందే

Monday, 25 January 2016

రణం



మనసుకందని సమాధానాల వెల్లువలో 
ఒక నిశ్శబ్దం ఇంతగా శబ్దిస్తుందని 
ఎప్పుడూ అనుకోలేదురా 
అల్లుకుపోతున్నఒక  మౌనంలో 
చిక్కుకుపోవటమెంత నరకమో 
అక్షరాలకి అందటం లేదురా
అయితేనేం 
నీకందితే చాలులే  
ఇక ఇప్పుడైతే 
అలవాటైన ఖాళీతనాల వెంపర్లాటలో 
తళతళలాడుతున్న కన్నీటి జలపాతాలలో
గరళాలన్నీ గుండెల్లో వర్షిస్తుంటే
మళ్ళీ ఒక రణం పిలుస్తోందిక్కడ 
మళ్ళీ ఒక ' 'రణం పిలుస్తోందిక్కడ