వెన్నెల తోటలో
విరబూసిన తారకలా, మణిమయ భవనాన నిలచిన
వరూధినిలా, ప్రాణం పోసుకొని వచ్చిన మొనాలిసా చిత్రంలా, కాళిదాసు తలపుల్లోని కావ్యనాయికలా, రవివర్మ కుంచెనుండి జాలువారిన ఊహాసుందరిలా
ఉన్న నీ ముగ్ధమనోహర రూపం...
ఓహ్! మండు వేసవిలో
నీడలేక తిరుగుతున్న పాంధుడికి వటవృక్షం నీడ చూపినట్లుంది. నీవు నన్ను చూసి
చిరునవ్వుల బాణాలు విసిరితే నీ సన్నిధే స్వర్గంలా, మధుస్రవంతిలా
వుంటుంది.
తెల్లని సూర్యకాంతి పడిన పాలరాతి
గచ్చులా నా హృదయంలో నీ రూపం ప్రతిఫలిస్తుంది.
భిక్షపాత్ర పట్టుకొని ప్రేమార్ధినై నీ
దగ్గరకు వస్తే నీవు చూపు ఆదరణ తలచుకుంటే ఓహ్! నా మనస్సు పులకరిస్తుంది.
నడి ఎడారిలో నీళ్ళు లేక దాహంతో
అలమటిస్తున్న బాటసారికి అమృతంతో గొంతు తడపినట్లుంది.
ప్రపంచం - ప్రకృతి - సృష్ఠి -
సూర్యచంద్రులు - ఆకాశం - మేఘాలు -వెన్నెల - నక్షత్రాలు - ఎండా వానా అన్నీ నీవే.
నీవులేని ఊహను కూడా నేను ఊహించలేను.
మలయ మారుతానికి రూపం వస్తే నీ రూపే
కావాలంటుందేమో.
మల్లెల పరిమళాలకు స్వరూపం వస్తే నీ
రూపే కోరతాయేమో.
ధవళకాంతులీనుతున్న నీ మోముచూసి
చంద్రుడైనా సిగ్గుతో తలవంచుకుంటాడేమో.
గులాబీల సున్నితత్వానికి ప్రాణంపోస్తే
నీ రూపు దాల్చిందేమో.
పాడుతాతీయగా అంటూ పాడే కోయిల సైతం నీ
గాన మాధుర్యానికి తన్మయం చెందుతుందేమో.
స్వాతిచినుకు నీ మేనిపై పడితే వెన్నెల
ముత్యంలా మెరుస్తుందేమో.
"రా ప్రియా త్వరగా వచ్చేయ్
ఎన్ని క్షణాలు, ఎన్ని నిమిషాలు,
ఎన్ని రోజులు, ఎన్ని యుగాలు
వ్యర్ధంగా నిస్సారంగా గడచిపోతున్నాయ్
ఎన్ని మల్లెలు, ఎన్ని జాజులు,
ఎన్ని రాత్రులు, ఎన్ని రాగాలు
ఇవన్నీ నీ కోసం నీవొచ్చాక మన కోసం
ఆశతో బేలగా, జాలిగా ఎదురుచూస్తున్నా ప్రియా
రా ఉన్నపళంగా
గాలి కంటే వేగంగా
మనస్సు కంటే త్వరితంగా
నిన్ను చుడక పోయినా
నీ సన్నిధి దూరమైనా
కనీసం నీ స్వరమైనా వినే అదృష్ఠం కోసం
చకోరంలా ఎదురు చూస్తూ చూస్తూ
చూస్తూ........"







0 comments:
Post a Comment